"నాకు తెలుసులెండి ! నన్ను పెళ్ళిచేసుకోవటం తేలిక పనికాదు. ఇకముందు నా దగ్గిర ప్రేమ ప్రస్తావన తేకండి. లేనిపోని ఉద్రేకాలకు లొంగి బ్రతుకు అల్లరి చేసుకోవాలని నాకు లేదు."
చిరునవ్వుతోనే చేతులు జోడించింది సుమతి ... ఏమి సౌందర్యం ! ఏమి సంస్కారం ! ఎన్ని జన్మలు తపసు చేయాలి ఇలాంటి స్త్రీ భార్యగా దొరకటానికి?
"సుమతీ ! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను..."
సుమతి నవ్వింది. ఆ నవ్వులో మెరుపులు... ఆ కళ్ళలో మెరుపులు... మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా పదిమంది పెద్దల ఎదుట పచ్చని మాంగల్యాన్ని అంతకంటె పచ్చని సుమతి మెడలో ...
అదిరిపడి లేచి కూచున్నాడు రాజారావు.
ఏమిటిది ? కలేనా ? అయ్యో ! అవును. కలే ! తను అంత సాహసం చెయ్యగలడా ? సుమతి అందమైనదే ! మంచిదే ! కానీ చూస్తూ చూస్తూ కొన్నాళ్ళు మొగుడితో కాపురంచేసి ఆ మొగుడొదిలేసిన దాన్ని ఎలా చేసుకోవటం? అబ్నర్ !
కానీ, ఆ కలే నిజమయితే, సుమతి తన ఇల్లాలయితే ఎంత కమ్మగా ఉంటుంది బ్రతుకు !
కళ్ళుమూసుకుని మానసికంగా సుమతితో సంసారం చేస్తూ పడుకున్నాడు రాజారావు.
లక్ష్మీపతి కాశీపతి మేనమామ...ఆయన ఒక్కగానొక్క కూతురు జ్ఞానాంబిక ... కాశీపతి కోసమే ఆ పేరు పెట్టారట. ఆ పిల్లకి జ్ఞానాంబికకి రూపం లేదు, చదువబ్బలేదు. మాటలో... నవ్వులో... కదలికలో... చవటతనంతో ఊగిసలాడుతూ ఉంటుంది. లక్ష్మీపతికి బాగా డబ్బుంది... 'నా కూతుర్ని చేసుకుంటావా? బాగా ఆలోచించి చెప్పు. ఆహారం పట్లా, వ్యవహారంపట్లా మొహమాటం పనికిరాదు.... దర్జాగా అడిగాడు లక్ష్మీపతి కాశీపతిని.
"అదేంమాట మామయ్యా ! నీ మాట ఎప్పుడు కాదన్నానూ ! ఇందులో ఆలోచించేందుకు ఏముందీ ?" వినయంగా అన్నాడు కాశీపతి.
ఆ వినయానికి ముగ్ధుడవలేదు లక్ష్మీపతి. గుర్రుమన్నాడు.
"నా మాట కాదనలేక నువ్వు జ్ఞానను చేసుకోనక్కరలేదు. దానికి లక్ష సంబంధాలొస్తున్నాయి. మేనల్లుడివి కదా, అని నిన్నడిగాను. నీ కిష్టమయితేనే..."
మేనమామ కంఠంలో విసురుకు కంగారు పడిపోయాడు కాశీపతి.
"భలేవాడివి మావయ్యా ! ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకోవటానికి నేను పసిపాపాయినా? జ్ఞాన అంటే నాకిష్టం కనుకనే..."
"సరేలే" ఉద్ధరిస్తున్నట్లు అన్నాడు లక్ష్మీపతి.
జ్ఞానాంబికకూ కాశీపతికీ వివాహ ముహూర్తం నిశ్చయమయి పోయింది. జ్ఞానాంబికను తలుచుకుంటే మనసులో ఏ కోశానా ఎలాంటి ఉత్సాహము కలగటం లేదు సరికదా, ఏదో విరక్తి కలుగుతోంది కాశీపతికి.
జ్ఞానాంబికతో సంసారం ఊహించుకుంటున్న కొద్దీ ఎక్కడలేని తెగింపూ వచ్చేసింది. ధైర్యంగా లక్ష్మీపతి దగ్గరకొచ్చేసాడు.
"నీ కూతుర్ని నేను చేసుకోలేను !..."
"ఇప్పుడెలారా ! ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక ..."
"నీకేం మావయ్యా ! డబ్బున్నవాడివి .ఏదైనా సాధించగలవు"
"సరేలే ! వెళ్ళు !"
జ్ఞానాంబిక తనకు భార్యకాదు. గుండెలమీది నుంచి ఏదో పెద్ద బండ తీసినట్లు ఎంత రిలీఫ్ !
కానీ మావయ్య డబ్బు తనకు రాదు ! తనూ తన గుమాస్తా ఉద్యోగమూ... ఏదో ఒక పెళ్ళాంతో బ్రతకవచ్చు. కానీ ఏదో ఒక ఉద్యోగంతో ఎలా బ్రతకటం ?
గబాలున లేచి కూచున్నాడు కాశీపతి.
తన కల నిజమయితే తనకు మంచిదా ? చెడ్డదా ? ఏమో ? తనకే అర్ధం కావటం లేదు. ఎవరైనా దేవతలు అడ్డుపడి ఈ పెళ్ళి కాకుండా చెయ్యాలే తప్ప తనకు తానై మావయ్యతో ఏమీ చెప్పలేడు. కానియ్యి ! ఏదెలా జరగాలో అలా జరుగుతుంది. అశాంతితో అటునుంచి ఇటు దోరాడు కాశీపతి...
కారు డ్రైవర్ సూర్యం ! ఎంతో చక్కని రూపం .డిగ్రీలు లేకపోయినా జనరల్ బుక్స్ బాగా చదువుతాడు. ఆ విజ్ఞానం అతని తీరులో కనిపిస్తూ ఉంటుంది. మనసు కూడా ఎంతో మంచిది. ఎందుకోమరి నలభై దాటినా పెళ్ళిచేసుకోలేదు.
"సూర్యం ! నన్ను పెళ్ళి చేసుకుంటావా ?" ధైర్యం చేసి అడిగేసింది మిస్ వనజాక్షి.
"నా మనసులోనూ ఈ కోరిక ఉంది. ధైర్యంచేసి అడగలేకపోయాను..." చిరునవ్వుతో అన్నాడు సూర్యం.
"ఏమని పిలవాలి నేను మిమ్మల్ని ? 'మేడమ్ !' అనాలా ? 'వనజాక్షి !' అనాలా ! చిలిపిగా నవ్వాడు.
గుండె జల్లుమంది వనజాక్షికి... నరనరంలోనూ ఏదో తీయని ప్రకంపనం... వణికిపోతూ లేచికూర్చుంది మిస్ వనజాక్షి.
కల ! ఒట్టి కల ! అంతేనే ! లేకపోతే సూర్యం తనకు మొగుడేమిటి ? నలుగురూ తనను మిస్ వనజాక్షి అన్నా ఫరవాలేదు కాని మిసెస్ డ్రైవర్ సూర్యం అంటే ఎలా భరించటం ? ఛ! ఛ! సిగ్గుచేటు !
మళ్ళీ పక్కమీద వాలిపోయింది వనజాక్షి ... ఎందుకో కడుపులోంచి పొంగివచ్చింది దుఃఖం ... కారే కన్నీళ్ళను తుడుచుకునే ప్రయత్నం చెయ్యకుండా అలాగే పడుకుంది.
ఇంచుమించు పది సంవత్సరాల తరువాత కనిపించాడు రామం ! అతడిని చూస్తూనే నిలువునా వణికింది మిసెస్ సోమశేఖరం నిలబడలేకపోతుంది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. రామం పరిస్థితి కూడా అలాగే ఉంది. తూలిపోబోతున్న మిసెస్ సోమశేఖరాన్ని పొదివి పట్టుకున్నాడు. అతడి గుండెల మీద వాలిపోయింది మిసెస్ సోమశేఖరం ! ఎంత శాంతి ! ఎంత తృప్తి ! ఇలాంటి అమర సుఖానికి తనకు తానుగా దూరమయింది. ఆనాడు తన కులంకాని రామాన్ని చేసుకోవటానికి పెద్దవాళ్ళను ఎదిరించలేకపోయింది. ఈనాటి వరకూ గుండెల్లో ఆరని మంటతో బ్రతుకుతోంది.
"రామం ! నిన్ను వదలి బ్రతకలేను !_ నీతో వచ్చేస్తాను !"
"రాగలవా ?"
"రాగలను ! ఈ పదేళ్ళగా నిన్ను మరచిపోవాలని ఎంతగా ప్రయత్నించానో చూడు ! ఇప్పటికీ ఈ గాయం ఎంత పచ్చిగా ఉందో? నువ్వు నాకోసం ఇంతవరకూ పెళ్ళి చేసుకోకుండానే ఉన్నావుగా ! ఇన్ని రోజులుగా దొంగ బ్రతుకు బ్రతికాను. ఇప్పుడు నాకోసం నేను, ఒక్క సంవత్సరం... ఒక్క రోజు... పోనీ, ఒక్కక్షణం బ్రతుకుతాను..."
"నీ భర్త... పిల్లలు..."
"ఏదీ లెక్కచెయ్యను. ఎవరూ అక్కర్లేదు ! నువ్వు మాత్రమే కావాలి !"
"ఆల్ రైట్ ! మనం దొంగతనంగా వెళ్ళిపోనక్కర్లేదు. లీగల్ గా నీ భర్తకు విడాకులిచ్చేయి. మనం పెళ్ళి చేసుకుందాం !"
విడాకులు ! మళ్ళీ పెళ్లి ....
ఒక్క ఉదుటున లేచికూచుంది మిసెస్ సోమశేఖరం ! ఒళ్ళంతా ఇంకా కంపిస్తోంది. ఏం కల ఇది! ఇంకా నయం ! దేవుడిలాంటి భర్త! రత్నాల్లాంటి పిల్లలు! తనకిదేం రోగం! పోనీలే ! కలే ఇది !
కళ్ళు మూసుకోగానే చిరునవ్వుతో రామం రూపం ప్రత్యక్షమయింది. అలా ఎప్పుడూ ప్రత్యక్ష మావుతూనే ఉంటుంది.
"వద్దు రామం! రావద్దు-వెళ్లిపో ! నా కళ్ళముందు నుంచి వెళ్లిపో!" తన చుట్టుప్రక్కల ఆమడ దూరంలో ఎక్కడాలేని రామాన్ని ఉద్దేశించి ఆక్రోశించింది మిసెస్ సోమశేఖరం.
జగన్ పార్టీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాడు. జగన్, మాలతి ప్రక్కప్రక్కన నిలుచుని అతిధుల్ని ఆహ్వానించారు. కళ్ల పండువగా ఉన్న ఆ జంటను చూడగానే అందరికీ కళ్లు కుట్టాయి.
"ఎంతపని జరిగింది !" అనుకుని మరోసారి గుండె బాదుకున్నారు అందరూ...
అవును ! ఘోరం జరిగిపోయింది....ఇద్దరు మనష్యులు మనమధ్య బ్రతుకుతున్న మనుష్యులు ... మనకు మనమై ఆపాదించుకున్న సాంఘిక శృంఖాలను చేధించుకుని సుఖపడిపోతున్నారు ! హమ్మ బాబోయ్! సుఖపడిపోతున్నారు! ఓరి దేవుడోయ్ సుఖపడిపోతున్నారు !
* * *