Previous Page Next Page 
దశావతారాలు పేజి 8


    "బాగానే ఉంది. నువ్వు ఆవిడని తిట్టి, కొట్టి, బాధించే దుర్మార్గుడివి కాదే !"
    "బాధ కలగాలంటే పురాణాల్లోలాటి రాక్షసులయి ఉండాలా ? మన బ్రతుకు మన మనసుకు నచ్చినట్టుగా లేకపోతే అదికూడా బాధే !"
    "అంతమాత్రానికే విడిపోతారా ? సర్దుకోవచ్చుగా !" జగన్ మాటలు అసలు కొరుకుడుపడక అడిగేసింది మిసెస్ సోమశేఖరం...
    "విడిపోయి సుఖపడగలిగే అవకాశాలున్నప్పుడు సర్దుకుని అవస్థపడవలసిన అవసరమేముందీ ?"
    "ఇంత అన్యాయమా ?" పరమేశ్వరశాస్త్రి ఆవేదన ...
    "ఇందులో అన్యాయమేముందీ ? మన బ్రతుకు మన చేతుల్లో ఉంది. నేను సుఖపడాలని నిర్ణయించుకున్నాను? సుఖపడుతున్నాను !"
    అక్కడున్న అందరికీ ఈ మాటలు అతి దారుణంగా వినిపించాయి. 'నేను హత్య చేస్తున్నాను-' అన్నప్పటికంటె ఘోరంగా వినిపించాయి...
    "అసలేం జరిగిందో చెప్పు !"
    కుండపగలకొట్టినట్లు అడిగేసాడు కాశీపతి.
    "ఏముంది చెప్పటానికి ! ముగింపు ఇది కాదేమో కాని కథమాత్రం ఇంచుమించు అందరి కథే ! ప్రస్తుతం మనం ఉంటున్న సాంఘిక వ్యవస్థలో పెళ్ళి కాకముందే అమ్మాయీ, అబ్బాయీ కలుసుకుని ఒకరినొకరు పూర్తిగా అర్ధంచేసుకోవటానికి లేదు. నాబోటి వాళ్ళెవరైనా అందుకు ప్రయత్నిస్తే అర్ధం మాట దేవుడెరుగు ! అభాండా లెదురవుతాయి. రాధా నేనూ ఒకరి నొకరం పూర్తిగా అర్ధంచేసుకోకుండానే పెళ్ళి చేసుకున్నాం ! కొన్నాళ్ళు బాగా గడిచినా రాను రాను మా భావాలు అనేక విషయాల్లో పరస్పర విరుద్ధం అని గ్రహించాం ! రాధకు విసుగొచ్చి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఇంతలో నాకు మాలతితో పరిచయమయింది... మాలతి నన్ను పెళ్ళి చేసుకుంటానన్నది. రాధ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాను ..."
    "చిక్కగా పేడనీళ్ళు కలిపి ముఖాన జల్లి ఉంటుంది..."
    మధ్యలో అడ్డుకుని అంది మిస్ వనజాక్షి ...
    వనజాక్షికి గుండెలు ఝల్లుమనిపిస్తోనే ఒళ్ళు మండించేలాగ అల్లంగా నవ్వాడు జగన్ ...
    రాధ మనసు పన్నీరులాంటిది. పేడనీళ్ళు జల్లలేదు. పరిస్థితి అర్ధం చేసుకుంది ..."
    "ఆడది ? ఏం చేస్తుందీ ?" నిట్టూరుస్తూ అంది మిసెస్ సోమశేఖరం.
    "అవును. రాధ కూడా అదే అంది ! నేను ఆడదాన్ని, విడిపోవాలనే ఆలోచన నాకెప్పుడో వచ్చింది. అయినా ఏం చెయ్యలేకపోయాను. అలా చేస్తే నన్ను సంఘం బ్రతకనివ్వదు. ఇప్పుడు మీరే దారితీసారు. ఇంక నాకు బోలెడు సానుభూతి ! మెనీ థాంక్స్ ! అంది..."
    "విడిపోయి ఏం చేద్దామని" మిన్ను విరిగి మీదపడినంత దిగ్భ్రాంతితో అడిగింది మిసెస్ సోమశేఖరం...
    "కొన్నాళ్ళు, మీ అందరినీ సానుభూతి చూపించనిస్తుందట !... ఆ సానుభూతితో తన శీలం పెంపొందించుకుని ఆ తరువాత తనూ తనకు తగినవాణ్ని పెళ్ళి చేసుకుంటుందట !"
    "పెళ్ళి చేసుకుంటుందా ? ఒకసారి పెళ్ళయి మొగుడొదిలేసిన ఆడదాన్ని ఎవరు చేసుకుంటారు !"
    ఆత్రంతా అడిగింది మిస్ వనజాక్షి.
    రాధ అందమైనది. చదువుకుంది. డబ్బు కూడా ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్స్ ముందు ... మొగుడొదిలేసిన ఆడదనే డిస్ క్వాలిఫికేషన్ కరిగిపోవచ్చు ! లేదా సంఘం చూపే సానుభూతితో అదికూడా మరో క్వాలిఫికేషన్ కావచ్చు ! ఏం చెప్పగలం ?"
    ఏమీ చెప్పలేక పోయారు ... మళ్ళీ జగన్ అన్నాడు ...
    "రేపు ఆదివారం, నేనూ మాలతీ మీకందరికీ పార్టీ ఇస్తున్నాం మీరంతా తప్పకుండా రావాలి..."
    అందరూ తలలూపారు. అది అంగీకారంగా తీసుకుని వెళ్ళిపోయాడు జగన్.
    అతడలా తిరగగానే "ఇంతోటి పెళ్ళికి పార్టీ ఒకటి ! ఎంత ఘోరం !" అన్నాడు పరమేశ్వరశాస్త్రి.
    అది ఘోరమనే సంగతి అందరూ ఒప్పుకున్నారు. అందుకే ఆ రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు. కలత నిద్రలో రకరకాల కలలు...
    నాగవేణి వేశ్యలకుంటుంబంలో పుట్టింది. ప్రొహిబిషన్ ఏక్ట్ వచ్చాక పోలీసుల బాధ పడలేక ఒక మంచివాణ్ని చూసి లక్షణంగా పెళ్ళిచేసుకుంది. వాడి సహాయంతో మరొకర్ని నోరెత్తనివ్వకుండా తన వ్యాపారం దర్జాగా చేసుకుంటోంది ... పరమేశ్వరశాస్త్రి నాగవేణి దగ్గిరకు వెళ్ళాడు. నాగవేణి చిరునవ్వుతో ఆదరించింది...
    "వేణీ! నా భార్య ఒట్టి రోగిష్టిది. నువ్వు నా దగ్గరే ఉండిపోరాదూ ! నీకే లోటూ రాకుండా చూస్తాను." అన్నాడు శాస్త్రి.
    నాగవేణి వయ్యారంగా కళ్ళూ, ముక్కూ తిప్పుకుని "అంతకంటేనా పంతులుగారూ ! కాని...నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీ పరువేం కావాలి !" అంది.
    "పోనిస్తూ వెధవ పరువు ! మానవజీవితమంతా కలిసి నిండా నూరేళ్ళు లేదు. ఇందులో వాళ్ళకోసం, వీళ్ళకోసం ఎంతని తగలబెట్టుకోనూ ! వచ్చెయ్యి"
    తప్పకుండా వస్తాను పంతులుగారూ ! ఒక్కణ్ని నమ్ముకుని బ్రతకటం నాకు మాత్రం సుఖం కాదా !"
    పరమానందంతో అంది నాగవేణి.
    అదిరిపడి లేచాడు పరమేశ్వరశాస్త్రి. గుండె ఇంకా దడ దడ లాడుతోంది ! అమ్మయ్య ! ఇదంతా కలే కదా ! నాగవేణితో పబ్లిక్ గా తను సంసారం సాగిస్తే ఇంకేమైనా ఉందా? నలుగురిలో మళ్ళీ తను తలెత్తుకోగలడా ? పరువు ప్రతిష్టలు పోయాక ఎందుకొచ్చిన బ్రతుకిది ! ఛీ ! ఛీ ! పాడుకల ! పీడకల !
    లేచి కాళ్ళూ చేతులూ కడుక్కుని మంచినీళ్ళు తాగి రామనామం జపిస్తూ పడుకున్నాడు శాస్త్రి. మళ్ళీ నిద్రరాక.
    సుమతి ఒక విధంగా సార్ధక నామధేయురాలే ! ఆవిడ భర్త వేశ్యాలోలుడు. ఈవిడ బుట్టలో మొగుణ్ని మొయ్యటం మినహాగా అచ్చు సుమతిలాగే బ్రతికింది. సుమతి భర్తకు కుష్ఠురోగమూ లేదు. ఏ రోగమూలేదు. ఒక్కటే పెద్ద రోగం....పొగరుమోతు రోగం. సుమతి శాంతంగా అన్నీ సహించటానికి సిద్ధపడ్డా సుమతి అన్న శంకరం మాత్రం సహించలేకపోయాడు. "వెధవ కాపురం లేకపోతేనేం ?" అని సుమతిని తీసుకొచ్చేసాడు... కాలేజీలో చేర్పించాడు. సుమతి బి.ఏ. పాసయింది. మొదట్లో కొంచెం దిగులుగా ఉండేది కాని, ఇప్పుడు ఎదురు తిరిగి బ్రతకటం నేర్చేసుకుని చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడుతూ ఉంటుంది. సుమతి ఎప్పుడు కనిపించినా చూపులు తిప్పుకోలేదు రాజారావు ... సుమతి చిరునవ్వు నవ్వి తల వంచుకుని వెళ్ళిపోతుంది.
    "సుమతీ ! నిన్ను ప్రేమిస్తున్నాను_" అన్నాడు రాజారావు తెగించి.
    సుమతి తడబడలేదు. పారిపోలేదు. వెకిలిగా నవ్వలేదు. నిదానంగా స్థిరంగా సమాధానం చెప్పింది...
    "నాకు మీరంటే దురభిప్రాయం లేదు. మీరు నన్ను పెళ్ళి చేసుకోగలిగితే మిమ్మల్ని సుఖపెట్టి నేను సుఖపడగలను...."
    "పెళ్ళి...పెళ్ళి" తడబడ్డాడు రాజారావు.
    సుమతి ఆరిందాలా అర్ధంచేసుకున్న దానిలా నవ్వింది.

 Previous Page Next Page