మాలాగా మారిపోవద్దు
గూడెంలో చిన్నా పెద్దా అందరూ రచ్చబండ దగ్గిర మూగారు. ఏదో గలాటా జరుగుతోంది .గట్టిగా గొంతుకలూ, కేకలూ వినిపిస్తున్నాయి, ఆడవాళ్లలో కొందరు వాదిస్తున్నారు.
'మళ్లీ ఏదో గొడవ' అనుకుంది సరోజిని వాళ్ళలో వాళ్లకు అప్పుడప్పుడు ఏదో తగాదా రావటము, రచ్చబండ దగ్గిర చేరి పెద్దలద్వారా తగవు పరిష్కరించుకోవటమూ వాళ్లకు మామూలే! ఈ సారి సరోజినీని ఆశ్చర్యపరచింది రచ్చబండ దగ్గిర చేరిన జన సమూహం - గూడెం గూడెం అంతా అక్కడే ఉంది, ఆడవాళ్లు పిల్లలూ కూడా వున్నారు. సాధారణంగా తగవుకు సంబంధించిన వాళ్లు మరికొందరు పెద్ద మనుష్యులూ మాత్రమే ఉంటారు.
కొంచెం దగ్గరగా వెళ్ళి అంతమంది మధ్య దోషిలా తల వాల్చుకుని నిలబడ్డ వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయింది సరోజిని - అతడు అగ్గిదొర __
అగ్గిదొర అతని అసలుపేరు కాదు- గూడెం అంతా కలిసి అతని స్వభావాన్ని బట్టి భయ గౌరవాలతో పెట్టుకున్న పేరు.
గూడెం పెద్ద అగ్గిదొర- గూడెంలో వాళ్ళది అదొక కట్టు. వాళ్లకు పెద్ద అంటే మహారాజే! మామూలు మురికి ధోవతి, పైన చొక్కా, ఆకు చెప్పులు అవతారం ఇదే అయినా అధికారం మాత్రం రాజాధిరాజుదే ! అతని మాటకు అడ్డులేదు- అతని తీర్పుకు ఎదురులేదు- అతని మాట కాదని ఆ గూడెంలో ఎవరూ బ్రతకలేరు. అతని శాసనం అలాంటి చండశాసనం- అందుకే అగ్గిదొర అయ్యాడు __
అలాంటి అగ్గిదొర ఈనాడు నలుగురిముందు తలవంచుకు నిలబడ్డాడు- కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు - కానీ అసలు విషయం అర్ధం కావటం లేదు - అంతలో సరోజిని దృష్టి అక్కడున్న మరో వ్యక్తిమీద పడింది. ఆవిడ సుమారు ఇరవైయేళ్ళలోపు యువతి... గూడెం మనిషిలా లేదు_ వేషంలో కొద్దిపాటి నాగరికత వుంది_గూడెం మనిషిలా చీర పైకి కట్టుకోలేదు _ నడుంమీద వెండి వడ్డాణం లేదు _ జుట్టు ముడి వేసుకోలేదు _ పరికిణీ ఓణీ వేసుకుంది. రెండు జడలు_ మెడలో ఏదో పూసలదండ ... వేషంలో వున్న నాగరికత మొహంలో కనపడటం లేదు. పనిపాటలు చేసుకునే కూలిజనానికి చెందిన మనిషని స్పష్టంగా తెలుస్తోంది.
సరోజినికి గూడెంలో ఆడవాళ్ళందరూ తెలుసు - అక్కడ టీచర్ గా ఆవిడ పసిపిల్లలకు పాఠాలు చెప్పటం మాత్రమే కాదు - ఇంటింటికీ వెళ్ళి పిల్లలను బడికి పిలుచుకు రావడం కూడా ఆవిడ కార్యక్రమంలో ఒక భాగం. ఆ సందర్భంలో పాపం ఆవిడ చచ్చినట్లు గూడెంలో ఆడవాళ్ళను బ్రతిమాలి బ్రతిమాలి వాళ్ళ పిల్లలను బడికి తీసుకెళ్ళవలసి వచ్చేది.
ఆ గుంపులో ఒకావిడిని పిలిచి "ఏయ్ ! మహాలక్ష్మీ! ఏం జరిగిందే? మీ పెద్దనే విచారణ చేస్తున్నారెందుకూ?" అని అడిగింది.
ఆ మహాలక్ష్మి ముఖం వికారంగా చేసుకుని కాండ్రించి ఉమ్మి "ఇంకా ఆడేం పెద్ద? బోడిపెద్ద" అంది.
పెద్ద పేరు చెపితేనే గజగజ వణుకుతారు పెద్ద పెద్ద మొగవాళ్ళు కూడా...అలాంటిది ఒక ఆడమనిషి ఇలా మాట్లాడుతోంది.
"ఏం చేసాడు వివరంగా చెప్పు."
"ఇంకా ఏటి సెయ్యాలమ్మా! కట్టుదప్పినాడు __దాన్నెవతెనో తీసుకొచ్చి యింట్లో బెడతాడంట! ఏమయిపోవాల రత్తాలమ్మ?"
అవా సంగతి! బస్తీపిల్లలా కనపడుతోన్న ఆ మనిషిని అగ్గిదొర తీసుకొచ్చాడన్నమాట !
ఆ పిల్లని అగ్గిదొర తీసుకురావటంలో విచిత్రమేమీ కనపడలేదు సరోజినికి_ ఆ విషయాన్ని గూడెమంతా ఇంత తీవ్రంగా నిరసించటం_పెద్దనే దోషిగా నిలబెట్టటం మాత్రమే విచిత్రంగా తోచాయి.
రత్తాలమ్మ అగ్గిదొర భార్య అని సరోజినికి తెలుసు - ఎప్పుడూ మూలుగుతూ మంచంలో పడుకునే రత్తాలమ్మతో సరోజిని ఎక్కువగా ఏది మాట్లాడలేదు. రత్తాలమ్మకి ఆరుగులు పిల్లలు_ ఏడో కాన్పులో జబ్బుచేసి మంచమెక్కింది. ఇంటిపనంతా పెద్దకూతురు చూస్తూ వుంటుంది. మూడొంతులు మంచంలోనే మూలుగుతూ పడివుంటుంది రత్తాలమ్మ. ఒకప్పుడు అందంగా ఉండేదామే! కానీ ఈనాడు అస్థిపంజరంలా తయారయింది. కళ్ళు లోతుకుపోయి గుంటలుపడ్డాయి. దవడలు కొద్దిగా వేలాడుతున్నాయి. స్నానపానాదులు సరిగ్గాలేకపోవటంతోపాటు అనారోగ్యంతో మనిషి దగ్గిర దుర్గంధం __
అగ్గిదొర పూలరంగడిలా ఉంటాడు_ కాయకష్టం చేసే శరీరం బలిష్టంగా ఉంది. వయసు ఎంతో కాని సడలని యవ్వనంలో కనిపిస్తాడు_ ఈ సందర్భంలో అగ్గిదొర మరొకదాన్ని తెచ్చుకోవటంలో ఆశ్చర్యమేముందీ ?
అయితే ఈ విషయం గూడెం ఇంతగా నిరసిస్తోందా? నీతి నియమాలు ఇంత ధృడంగా ఉన్నాయా, ఈ వెనుకబడిన వర్గంలో __ కుతూహలంగా పెద్దల మాటలు వినసాగింది __
"అదెవర్తి ! దాన్ని మనమద్దిన పెడతావేంటి? పెళ్లామయితాది అది? గూడెం బయట గుడిసేసి ఉంచుకో! ఒకళ్ళనేటి? పదిమందిని ఉంచుకో! ఎవడొద్దన్నాడు? నువ్వూ యెల్లిరా! నీలాగా అందరూ యెల్తారు ఆడికీ. ఊరి సొత్తు ఇల్లాంటి ఆడాళ్ళు__అంతేగాని పెళ్ళాంతోపాటు ఇంట ఉంచుతావు? సిగ్గింత లేదయ్యా! థూ...!"
ఈ మాట విన్న ఆ పిల్ల రోషంతో బుసలు కొట్టింది. మొహం చినబుచ్చుకొని అగ్గిదొరవేపు చూసి "నేను పోతున్నా!" అంది.
అంతటి అగ్గిదొర మాట్లాడలేదు. గూడెంలో ఆడంగులు మాత్రం కోపంగా "పోయే లంజ" అన్నారు కసిగా_ కొందరు గొల్లున నవ్వారు. మరి కొందరు ఈలలు వేసారు.
ఆ పిల్ల కన్నీళ్ళతో అక్కడినుంచి కదిలిపోయింది. విస్తుపోయింది సరోజిని. వీళ్ళు పాప పుణ్యాలు, నీతి నియమాలు, మంచి చెడ్డలు, ఇలాంటి మాటలే మాట్లాడలేదు. కానీ ఎంత చక్కగా తీర్పు చెప్పారు? అగ్గిదొర చేస్తున్నది తప్పని అనలేదు. కానీ ఆ పిల్లని భార్యతో సమానంగా ఉండనియ్యలేదు. అది ఆచారం కాదు. తను కట్టుకు విరుద్ధం... అంతే తెలుసు వీళ్ళకి! భార్యకాని మనిషి ఊరిబయట ఉండవలసిందే.
వ్యభిచారం తప్పనటంలేదు_ తమ సంఘపుకట్టుబాటు దాటడానికి వీల్లేదంటున్నారు_ రోగిష్టి రత్తాలు నిశ్చింతగా మంచంలో పడుకుంది మూలుగుతూ... ...