Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 9


    అవకాశం దొరగ్గానే లలిత కుతూహలం అణచుకోలేక మణిమాలని "శ్యామలాంబగారంటే ఎవరు?" అని అడిగేసింది.
    "అరె! శ్యామలాంబగారు తెలియదూ? చాలా ప్రముఖురాలు!"
    "ప్రముఖురాలంటే ఎలా?"
    "ఆవిడకు ఊళ్ళో గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలున్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళలో చాలామందికి తెలుసు. ఎవరికైనా ఏ పనినైనా సాధించి పెట్టగలదు. మూడు మేడలూ, నాలుగు కారులూ."
    "ఎలా సాధిస్తుంది ఆవిడ ఏపనినైనా?"
    "అదా! ఆవిడ ఒక సేవాసదనం నడుపుతోంది. ఆ సేవాసదనంలో ఉండేది అనాథ స్త్రీలు కాదు. సీతాకోక చిలుకలు! మన్మథ బాణాలు! వాళ్ళు సాధించి పెడతారు అన్ని పనులూ! ఇతరత్రా కూడా లావాదేవీలు ఉన్నాయనుకో."
    లలిత శరీరం చల్లబడిపోయింది. ఆ శ్యామలాంబే, ఈ శ్యామలాంబ! అంతేకాదు! ఇక్కడ అందరికీ ఈ శ్యామలాంబ నడుపుతోన్న సేవాసదనం గురించి తెలుసు! అయినా అహ, కాదు, అందుకనే, ఆవిడనంతగా గౌరవిస్తున్నారు.
    శ్యామలాంబ గౌరవార్థం టీపార్టీ ఏర్పాటుచేశారు. పార్టీ అయిపోగానే శ్యామలాంబ లేచి "నాకు పనుంది వెళ్తాను. క్షమించాలి!" అంది.
    లలితను బలవంతపెట్టి తమ మహిళామండలి వార్షికోత్సవానికి వీణ వాయించడానికాహ్వానించిన మణిమాల "రండి! నా కారులో డ్రాప్ చేస్తాను." అని శ్యామలాంబను వెంటపెట్టుకుని వెళ్ళిపోయింది. లలిత వీణ పూర్తిచేసిన అరగంటకి తిరిగొచ్చి "అయామ్ సారీ లలితా! నీ పాట వినలేకపోయాను. మరొక్కసారి ఇంటికి పిలిపించుకుంటాను." అంది నవ్వుతూ.
    అంత దర్జాగా మణిమాల "నిన్ను ఇంటికి పిలిపించుకుంటాను." అన్నందుకు లలిత ఆశ్చర్యపోలేదు. అప్పటికే మణిమాల ఎవరో తెలుసుకుంది లలిత. ఆవిడ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మాధవరావుగారి భార్య!
    తన చుట్టూ ఎందరు మూగినా శ్యామలాంబ ప్రత్యేకించి మణిమాలను అడగటంలో అర్థం లేకపోలేదు! మాధవరావు! ఏదో హుందా తనమూ, గాంభీర్యమూ ఉట్టిపడే నిండైన విగ్రహం! 'లోకంలో అంతటా అన్యాయమే ఉండదు!' అని ఆదలిస్తోనే అభయమిస్తున్నట్లు మాట్లాడగలిగిన వ్యక్తి.
    తన తమ్ముడు మోహన్ జాడ తెలుసుకోవటానికి సహాయపడగలడా? తన తమ్ముడు ఏ అన్యాయమూ చెయ్యలేదని అర్థంచేసుకో గలిగితే అతన్నొక దారికి తేవటానికి ప్రయత్నించగలడా?
    మోహన్ విషయంలో తనదే తప్పేమోనని ఆరాటపడే లలిత మనసు మణిమాల ప్రదర్శించే కొద్దిపాటి అహంకారాన్ని అతి తేలిగ్గా సహించగలిగింది.
    మహిళామండలి సభ్యులంతా కులాసా కబుర్లలో పడిపోయారు. రకరకాల 'నాగరిక' విషయాలు సంభాషణలలో దొర్లిపోతున్నాయి.
    "విన్నారా? తిరుపతి వెంకటేశ్వరస్వామి రథం కిందపడి ఎందఱో చచ్చిపోయారట!"
    "ఏవైనా అంటే మహత్మ్యమంటారు! ఇదంతా ఆ స్వామి మహత్మ్యమే కాబోలు!"
    "పూజించే మూర్ఖులున్నంతవరకు అందరూ దేవుళ్ళే! ప్రతీదీ మహత్మ్యమే!"
    "నో! నో! నాకిలాంటి మహాత్మ్యాలలో నమ్మకం లేదు!"
    "నాకసలు దేవుడంటేనే నమ్మకం లేదు!"
    "బైదిబై మళ్ళీ సుధామయి సీరియల్ వస్తోంది చూశావా?"
    "చూసాను. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది కదూ!"
    "ఏమిటండీ, ఒరి పగటికలలు! బ్రిలియంట్ గా ఉండవు. రచనలంటే రాధామణివి. ఆవిడ నిజంగా జీనియస్. ఒరిజనాలిటీ ఉన్న రచన..."
    "అవునవును. నాకు రాధారాణి రచనలంటేనే ఎడ్మిరేషన్. సుధామయీ వగైరా, వగైరా అంతా కాలక్షేపం బఠాణీలు..."
    "సినిమా స్టార్ తారాదేవి తన రెండో మొగుడికి విడాకులిచ్చిందట తెలుసా?"
    "ఏమిటేమిటి? ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని..."
    "ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు మొదటి మొగుడి కొడుకట!"
    "ఏ మొగుడి కొడుకయితేనేంలే! ఎవరి కొడుకులో ఎవరు చెప్పగలరు?"
    ఆ అత్యద్భుతమయిన జోక్ కి అందరూ పరమానందంగా పొంగి పొంగి నవ్వారు.
    లలిత లేచి "నేను వెళ్తాను" అంది.
    శ్యామలాంబను కారులో దింపటానికి పోటీలు పడ్డ ఆ మహిళామణుల్లో ఏ ఒక్కరూ లలితను దింపటానికి ముందుకు రాలేదు. కార్యదర్శి "కూర్చోండి! టాక్సీని పిలిపిస్తాను" అంది కొద్దిపాటి విసుగుతో.
    మణిమాల కెందుకో లలితమీద ఆదరం కలిగింది.
    "నేను డ్రాప్ చేస్తాను. రండి!" అని లలితను తన కారులో ఎక్కించుకుంది. ఆ కారులో ఇంకా మణిమాల స్నేహితులిద్దరు కూడా ఉన్నారు.
    కారు కదలగానే లలితను పూర్తిగా మరిచిపోయి వాళ్ళు కబుర్లలో పడిపోయారు.
    "ఏయ్ మణీ! ఏమిటోయ్! తిరుపతి వెంకన్నంటే నమ్మకం లేదనేసావ్? నిజంగా నమ్మకం పోయిందా?"
    మణిమాల నవ్వింది. మణిమాల నవ్వు అందంగానే ఉంటుంది కానీ అందులో ఏదో నిర్లక్ష్యపు ధోరణి.
    "అదేంకాదు కానీ..."
    "మరి, అలా వాదించావ్."
    "ఏం చెయ్యను? ఈ రోజుల్లో దేవుడంటే నమ్మకం లేదనటమే కల్చర్! నాకు భక్తంటే నవ్వుతారు! ఏం చెయ్యను? నమ్మకం లేదనేసాను!"
    లలిత ఆశ్చర్యంగా విని "ఇంతకూ మీకు నమ్మకం ఉందా? లేదా?" అని అడిగేసింది.
    మణిమాల మళ్ళీ ఎప్పటిలాగే నవ్వింది.
    "ఏమో పోనీలే! ఎందుకయినా మంచిది, తిరుపతికి ఒక ట్రిప్ కొట్టివస్తే సరిపోతుంది."
    "నేను వస్తాను. ట్రెయిన్ లో వెళ్దాం!" అంది స్నేహితురాలు.
    "ఓ.కె. స్పెషల్ అర్చనలో ఏవో ఉంటాయిగా! అవేవో చేయిస్తే త్వరగా బయటపడతాం! చకచక దర్శనం ముగించుకుని అక్కడ్నుంచి మద్రాస్ కెళ్ళి సరదాగా వారంరోజులు గడిపివద్దాం!"
    ఆ సంభాషణంతా వింటూ మ్రాన్పడిపోయి కూర్చుంది లలిత.
    తన స్నేహితులను వారివారి ఇళ్ళదగ్గర దింపాక "మిస్ లలితా! డాక్టర్ వినోద్ ని ఒకసారి కలుసుకోవాలి! ఆ తరువాత మీ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాను. అభ్యంతరం లేదుగా!" అంది మణిమాల.
    త్వరగా ఇంటికి వెళ్ళాలని ఉన్నా, ఆ మాట అనలేకపోయింది లలిత. డాక్టర్ వినోద్ పేరుపొందిన సర్జన్. సర్జన్ తో మణిమాలకేం అవసరమో!
    మణిమాల కారు వినోద్ భవనం ముందు ఆగింది. మూడంతస్థుల మేడ.

 Previous Page Next Page