మణిమాల కారు హారన్ వింటూనే లోపలినుండి ఒక యువకుడు గబగబ కారు దగ్గరకు వచ్చాడు. మణిమాల సంభ్రమంగా "వినోద్!" అని పలుకరించడాన్నిబట్టి అతడే డాక్టర్ వినోద్ అనుకుంది లలిత. వినోద్ మణిమాలను చెయ్యిపట్టుకుని లోపలకు తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ లలిత అక్కడ ఉన్నట్లు ఏమాత్రం లక్ష్యపెట్టకుండా మాట్లాడుకోసాగారు.
వాళ్ళ నవ్వులూ, వేళాకోళాలూ, వెక్కిరింతలూ లలిత భరించలేకపోయింది. మణిమాల గారాబం పోవటమూ, వినోద్ మణిమాల భుజంమీద చెయ్యి వేసి బుజ్జగిస్తున్నట్లు బ్రతిమాలటమూ, చాలా ఎబ్బెట్టుగా తోచింది. మణిమాలనీ, మణిమాల కారును వదిలి పారిపోవాలనిపించింది. ఏం చెయ్యలేక కూలబడింది. దగ్గిరదగ్గిర ఒక గంట గడిచిన తరువాత వదలలేక వదలలేక వినోద్ ను వదిలి బయలుదేరింది మణిమాల.
ఆ రోజు మహిళామండలిలో అడుగుపెట్టిన దగ్గిరనుండీ ఏదో అద్భుతలోకంలో ఉన్నట్లే ఉంది లలితకి. ఏవిటీలోకం? ఇక్కడున్నదంతా నిజంగా ఆనందమేనా? లలితను ఇంటికి దగ్గిర దింపి "మరోసారి మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు. మా వారికి కూడా సంగీతమంటే ఇష్టం" అంది మణిమాల. లలిత తల ఊపింది.
6
"రాగిణీ! బాపినీడుగారు ట్రంకాల్ చేశారు. నువ్వు వెంటనే విమానంలో ఢిల్లీ వెళ్ళాలి!" అంది శ్యామలాంబగారు.
సేవాసదనంలో అందరూ రాగిణిని ఈర్ష్యగా చూశారు. ఇలాంటి 'ఛాన్స్'లు సాధారణంగా రాగిణికే వస్తాయి. ఆ చూపులకు సగర్వంగా నవ్వుకుంది రాగిణి.
వెంటనే ఎందుకో లలిత గుర్తొచ్చింది. ఇంతమంది కళ్ళలో తనను చూసి ఈర్ష్య... కానీ లలిత కళ్ళలో మాత్రం తనను చూసి జాలి! ఎందుకు? చూడాలి. లలిత కళ్ళలోను తనపట్ల ఈర్ష్య చూడాలి! తన సౌభాగ్యం చూసి, తన అదృష్టం చూసి... లలిత విస్తుపోవాలి! 'నేనే పొరపడ్డాను. రాగిణి హాయిగా జీవిస్తోంది!' అనుకోవాలి! 'ఈ ఐశ్వర్యం నాకు కావాలనుకున్నా రాద'ని నిట్టూర్చాలి!
కారులో వెళ్ళి, విమానంలో కూర్చుంది రాగిణి.
"ఈ కారు, ఈ విమానం... లలిత ఈ జన్మలో అనుభవించగలదా ఇలాంటనుభవాన్ని?"
ప్రతిక్షణమూ లలిత తనకెందుకు గుర్తొస్తుందో అర్థంకాదు రాగిణికి.
ఢిల్లీ విమానాశ్రయానికి బాపినీడుగారు కారు పంపారు.
బాపినీడుగారు రాగిణిని పరిశీలనగా చూస్తూ "నువ్వు కొంచెం లావయ్యావు!" అన్నాడు.
రాగిణి చిన్నబోయింది. తనను తాను చూసుకుంది. తనకేమీ తెలియటంలేదు. బాపినీడుగారు విసుగ్గా "సరేలే! అవన్నీ తరువాత. ఇవాళ నువ్వు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని ఎంటర్ టైన్ చెయ్యాలి. జాగ్రత్త! ఆయన స్పెషల్ పోలీస్ ఆఫీసర్!" అన్నాడు.
రాగిణి కెందుకో భయంవేసింది. అంతకంటే వివరాలు రాగిణికి తెలియవు. తెలియనివ్వరు! ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఎలాంటి ఆఫీసర్? అతనికీ, బాపినీడుకీ ఉండే లావాదేవీ లేమిటి? ఇవన్నీ రాగిణికి ప్రశ్నలే! సమాధానం కోసం రాగిణి కూడా పెద్దగా ఆలోచించని ప్రశ్నలు.
ఆ పోలీస్ ఆఫీసర్ ని చూడగానే రాగిణి వంట్లో జవసత్వాలొక్కసారిగా నశించిపోయినట్లయింది. అతని ప్రక్కనే ఒక ఆల్సేషియన్ డాగ్. అహర్నిశమూ అది అతని ప్రక్కన ఉండవలసిందే! ఆ కుక్కకు అతనికి పెద్ద తేడా కనిపించలేదు రాగిణికి. యాభైపైనే ఉంటుంది వయసు.
మత్తెక్కిన కళ్ళతో రాగిణిని చూస్తూ "బాపినీడు గొప్పగా చెప్తే ఏమో అనుకున్నాను. జస్ట్ ఏవరేజ్!" అన్నాడు.
రాగిణి ముఖం మాడ్చుకోలేదు. అభిమానపడలేదు. చిరునవ్వుతో దగ్గిరకు నడిచింది.
ఇప్పుడు చూపించాలి తన ప్రభావాన్ని! 'ఎవరేజ్!' అన్న నోటితో 'ఎక్సెలెంట్' అనిపించాలి! అందుకే ప్రత్యేకించి బాపినీడుగారు తనను పిలిపించింది!
రెండు నిమిషాల్లోనే అసలు విషయం అర్థమయిపోయింది రాగిణికి. ఆ ఆఫీసర్ కి మనసులో పట్టరాని లాలస. శరీరానికి ఆ శక్తి లేదు. శక్తి లేని శరీరం ఊరుకోదు. మనసు ఊరుకోనియ్యదు. పర్వర్షన్స్ భరించాలి!
ప్రేమ! 36" -28" -36" అంగుళాలలో కొలుచుకునే ప్రేమ! కృత్రిమపు కులుకుల్లో తొణికిసలాడే ప్రేమ! పచ్చి అబద్ధాల ప్రణయ సల్లాపాల్లో పవిత్రమయ్యే ప్రేమ! పాశవిక ప్రవృత్తుల తీరాన్నంటే ప్రేమ! ఆ ప్రేమ జలధిలో ఓలలాడి ఓలలాడి ఆపాదమస్తకమూ భగ్గుమనిపించే జుగుప్సలాంటి భావాన్ని బలవంతాన అణచిపెట్టి చిరునవ్వుతో బాపినీడుగారి దగ్గరికొచ్చింది రాగిణి.
"వెల్ డన్! ఆ ముసలి పీనుగుని బాగానే మురిపించావు."
దగ్గిర దగ్గిర అరవై ఏళ్ళుంటాయి బాపినీడుకి! ఆఫీసర్ని ముసలి పీనుగంటున్నాడు. తనకు అరవై ఏళ్ళున్నా తాను నవయువకుడిలా ఉంటాడని బాపినీడు నమ్మకం. అతడు డబ్బిచ్చి పిలిపించుకునే స్త్రీలూ, అతని క్రింద డబ్బు తీసుకుని పనిచేసే రాగిణిలాంటి వాళ్ళూ అతనికా నమ్మకం కలిగించారు. ఇంట్లో అతని భార్య ఏమీ మాట్లాడదు! ముసలి రూపు పడిపోయిన ఆవిడను చూడాలంటే బాపినీడుకి భయం.
రాగిణిని చూస్తూ ఆదరంగా చెయ్యిజాపాడు బాపినీడు. చిరునవ్వులు చిందిస్తూ సిగ్గుపడుతూ ఆ చేతుల్లోకి వచ్చింది రాగిణి. అతి ప్రేమగా ముడతలు పడ్డ చెక్కిళ్ళు నిమిరింది.
"నువ్వు లావయిపోతున్నావు. డైటింగ్ చెయ్యాలి!" గుండ్రంగా ఉన్న చేతివంక నిరసనగా చూస్తూ మందలిస్తున్నట్లు అన్నాడు.
చిరునవ్వుతోనే తల ఊపింది రాగిణి.
అద్దంలో తనను తను చూసుకుంటూ చిరునవ్వుతో "నాకు కొంచెం బొజ్జ వచ్చినట్లుంది" అన్నాడు బాపినీడు.
"ఏం రాలేదు! మీరు ఏ అమృతం తాగుతున్నారో? నాకంటే చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నారు.
అతణ్ని ముగ్ధురాలై చూస్తూ అంది రాగిణి.
"అహ్హహ్హ!" అంటూ గట్టిగా నవ్వాడు బాపినీడు. విమానం దిగి, కారులో తిరిగి సేవాసదనానికి వస్తున్నప్పుడు కొత్తగా తన మెడలోకి వచ్చి చేరిన పచ్చల నెక్లెస్ ని సంతృప్తిగా తడిమి చూసుకుంది రాగిణి. లోలోపల ఏదో బరువుగా చీదరగా సలుపుతోంది! అదంతా లోపల మగ్గిపోవలసిందే! పైకి కనపడదుగా! పైకి కనపడేది పచ్చల నెక్లెస్!
లలితకు వైణికురాలిగా పేరు ప్రఖ్యాతు లొస్తున్నాయి. ఒక ఆఫీసర్స్ క్లబ్ లో లలిత వీణ కచేరి ఏర్పాటు చేశారు. ఆ సంగతి తెలుసుకున్న రాగిణి తనూ బయలుదేరింది. అతి శ్రద్ధగా అలంకరించుకుంది. ఏ సరసుణ్ని రంజింప చేయటానికీ రాగిణి అంత శ్రద్ధగా అలంకరించుకోలేదు.
"ఈ చీర ఎంత బాగుందో? ఎక్కడ కొన్నావ్?"
"ఈ జరీ వర్క్ నువ్వే చేశావా? చేయించావా?
"నెక్లెస్, దుద్దులు, గాజులు, రింగ్ అన్నీ చక్కగా సూట్ అయ్యాయి. ఎక్కడ చేయించావు? చాలా ఖరీదు ఉంటుంది కదూ!"
చుట్టూ జేరిన యువతీ బృందం ఈర్ష్యతో, దాహంతో, తనను ఇలా ప్రశ్నిస్తోంటే సంతృప్తిగా తనను తను చూసుకుంది రాగిణి.
హాల్లో కూర్చున్నాక కూడా చుట్టుప్రక్కల చాలామంది ఆడవాళ్ళు తన చీరవంకా, నగలవంకా, అలంకరణ వంకా, ఒకటికి రెండుసార్లు పరిశీలనగా చూడడం ఎంతో హాయినిచ్చింది రాగిణికి.
లలిత వీణ కచేరి మొదలయింది. ఆ హాల్లో రాగిణికి "పరిచయం" ఉన్న ఆఫీసర్లు అయిదారుగురున్నారు. వాళ్ళంతా రాగిణి తమను ఎక్కడ పలకరిస్తుందో నన్నట్లు భయపడుతూ బిగుసుకుపోయి ముఖాలు తిప్పుకోవటం గమనించి తనలో తను నవ్వుకుంది రాగిణి. ఆవిడ మనసు లలిత వీణానాదంలో లీనమయి పరవశించటం లేదు. కళ్ళు లలితనే పరిశీలనగా చూస్తున్నాయి. వెంకటగిరి జరీచీర కట్టుకుంది. మెడలో సన్నని ఒంటి పేట గొలుసు, బొట్టు, కాటుకను మించి మరే అలంకరణా లేదు. మనిషి అందమా చెప్పటానికి లేదు. ముఖంలో ఏదో విషాదం దోబూచులాడుతోంది.