"రాజూ! అలాంటి ఆశతో ఈ డబ్బు నీ కియ్యటంలేదు. మన మధ్య రుణాలేమిటని అన్నాను."
"పోవోయ్! నిన్ను ఆఫీసర్ భార్యని చెయ్యటానికైనా సెలెక్టయి తీరుతాను!"
నవ్వుతూ అన్నాడు రాజు. రాజు చాలా తెలివైనవాడు. లలిత ప్రోత్సహించిందీ అందుకే. రిజల్ట్స్ వచ్చి సెలెక్టయినట్లు తెలిసిన రోజున రాజు మొట్టమొదట లలిత దగ్గిరకే వచ్చాడు.
"ఈ డిగ్రీ నాదికాదు లలితా! నీది!" అన్నాడు అనురాగంతో.
"నీ డిగ్రీ ఎవడిక్కావాలి? నువ్వే నా వాడివి!" అంది లలిత సంతోషంతో. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా ముందుకు వంగి బల్లమీద రాజుపెట్టిన నోట్లని అందుకుంది లలిత.
రాజు ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటన ఇంత సామాన్యంగా జరుగుతుందని అతననుకోలేదు. లలిత వెయ్యబోయే నిష్టూరాలు ఎదుర్కోవటానికి ఎంతో సిద్ధపడి వచ్చాడు. అలాంటిది... ఉండబట్టలేక అనేసాడు. "నువ్వీ డబ్బు తీసుకోవనుకున్నాను..."
లలిత ఆశ్చర్యం నటించింది.
"అదేం? ఎందుకు తీసుకోననుకున్నావ్? నేనిచ్చింది అయిదువందలు. నువ్వు తెచ్చింది అయిదువందలు. లెక్క సరిపోయిందిగా!"
"లెక్క కాదు."
లెక్కల కందనిదేమిటో రాజు చెప్పలేకపోయాడు.
మాట్లాడకుండా కూర్చున్న లలిత ముందు రాజు మనసు మరింత ముడుచుకుపోసాగింది. ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
"నేను రాగిణిని..."
ఏదో చెప్పబోతున్న రాజును చెయ్యెత్తి వారించింది లలిత.
"నేను సంజాయిషీలు అడగటంలేదు రాజూ! నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు."
"రాగిణిని నువ్వర్థం చేసుకోవటం లేదు. తను చాలా మంచిది."
"కావచ్చు!"
"తనకి నువ్వంటే చాలా యిష్టం?"
"అలాగా?"
"ఒక్కసారి నీతో ఎలాగైనా మాట్లాడాలని తపించిపోయింది. నీ ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమన్నాను."
"మాట్లాడింది!"
"నీ బుద్ధి చూపించుకున్నావు. రాగిణిని అవమానించి నీ కసి తీర్చుకున్నావు!"
"రాగిణిని అవమానించానా?"
"పాపం, నా దగ్గిర ఎంత ఏడ్చిందో తెలుసా? జాలేసింది!"
"ఒకవేళ ఏడిస్తే ఆశ్చర్యపడక్కర్లేదు. రాగిణితో మాట్లాడాక నాకు రాగిణిమీద జాలి కలిగింది."
లలిత మాటలు తన ధోరణిలోనే అర్థం చేసుకున్నాడు రాజు. అతనికి లలిత మీద చాలా కోపం వచ్చింది. "రాగిణిని అవమానించే అధికారం నీకేముంది? ఒకప్పుడు నువ్వు ప్రేమించినట్లే ఇప్పుడు రాగిణి కూడా నన్ను ప్రేమిస్తోంది. రాగిణి కంటే నువ్వేవిధంగా అధికురాలివి?"
రాజు మాటలకు మ్రాన్పడిపోయింది లలిత. అంతలో పకాలున నవ్వింది.
"రాగిణి కంటే నేను అధికురాలినని ఎవరు చెప్పారు రాజూ! నీమీది ప్రేమకు సంబంధించినంతవరకు రాగిణి కంటే నేనే అల్పురాలిని! ముమ్మాటికీ నిజం!"
ఆ అవమానం అర్థమయింది రాజుకి. రగులుతోన్న ముఖంతో విసురుగా వెళ్ళిపోయాడు.
తన చేతిలో నోట్లవంక చూసుకుంది లలిత. అవే నోట్లు! ఒకప్పుడు అవే! ఇప్పుడు అవే! ఆనాటి వాటి విలువ వేరు, ఈనాటి విలువ వేరు. విలువలు విషయాల మీద ఆధారపడి ఉండవు. సందర్భాలమీద ఆధారపడి ఉంటాయి.
5
మహిళా సమాజాలకు కాని, లేడీస్ క్లబ్స్ కి కాని వెళ్ళటం లలితకు అలవాటులేదు. ఒక విధంగా మణిమాల బలవంతం మీదే మహిళామండలి వార్షికోత్సవాలలో వీణ వాయించడానికి ఒప్పుకుంది లలిత. మణిమాల లలితను స్వయంగా తన కారులో వెంటబెట్టుకుని తీసుకొచ్చింది. అక్కడ సమావేశమయిన వారిలో చాలామంది ధనిక కుటుంబాలకు చెందినా స్త్రీలే! ఆ కారణం చేత కాలేజీ డిగ్రీల మాట ఎలా ఉన్నా, వారందరూ నాగరికతలో ఒకరికొకరు తీసిపోరు. అందుకు నిదర్శనం ఏ నోట విన్నా లేటెస్ట్ ఫ్యాషన్స్ గురించి వినిపించటం!ఎవరిని చూసినా మరొకరి చీరల, నగల విలువలను అంచనా వేస్తూ కనిపించటం! తమకంటే ఏ కాస్త ఎక్కువగా కనిపించినా ఈర్ష్యతో భగ్గుమనే అంతరంగాలను చిరునవ్వు ముసుగులతో కప్పుకుని, లోపల ఇమడలేక ఉక్కిరిబిక్కిరయ్యే ఈర్ష్యను లేనిపోని నిందారోపణల కట్టుకథల రూపంతో ఆవిష్కరించటం! తాము ఎంత ధనవంతులో ఇతరులు గ్రహించేలా చెయ్యాలని తాపత్రయ పడటం! గొప్పవారిగా కనిపించినవారిని. ధనంలో గొప్పవారిని పోటీలు పడుతూ ఇచ్చకాలాడటం.
మహిళామండలి భవనంముందు ఏదో కారు ఆగింది. ఎవరో అన్నారు "శ్యామలాంబగారు వచ్చార"ని. ఆ మాటతో ఎక్కడ లేని సంచలనమూ కలిగింది సభలో. దేవతా దర్శనాని కన్నట్లు ఒకరినొకరు తోసుకుంటూ కారు దగ్గిరకి పరుగెట్టారు. కాని, కారులోంచి దిగిన ఆ శ్యామలాంబను సగౌరవంగా ఆహ్వానించే అదృష్టం మూడు పట్టుచీరలకు, రెండు షిఫాన్ చీరలకు మాత్రమే దక్కింది. మిగిలిన వారు కుళ్ళుగా మొహాలు ముడుచుకుని చవిటి చిరునవ్వులు చిలకరిస్తున్నారు.
"మణిమాలగారు రాలేదా?" అడిగింది శ్యామలాంబ.
అప్పుడు వెళ్ళింది మణిమాల సగర్వంగా శ్యామలాంబ దగ్గిరకి. తీయని చిరునవ్వుతో "మీకోసమే ఎదురుచూస్తున్నాం! రండి!" అని చెయ్యిపట్టుకుని లోపలకు తీసుకొచ్చింది.
ఇంతమంది ఆదరానికి పాత్రురాలైన ఆ శ్యామలాంబను కుతూహలంగా చూసింది లలిత.
దగ్గిర దగ్గిర యాభైయేళ్ళు పైగానే ఉంటాయి. పెద్దగా కాదు కాని ఆధునికంగానే అలంకరించుకుంది. వయసులో రూపవంతురాలే అయి ఉండాలి! చిరునవ్వు గడుసుగా ఉంది. చూపులు తీక్షణంగా ఉన్నాయి. కంఠస్వరం పరుషంగా లేదుగాని పదునుగా ఉంది.
'శ్యామలాంబ'. ఆ పేరు ఎక్కడో వింది. గుర్తొచ్చింది! రాగిణి, ఇంకా రాగిణిలాంటి వాళ్ళు మరికొందరు ఉండే సేవాసదనం నడిపే వ్యక్తి పేరు అదే! ఆ శ్యామలాంబ ఈ శ్యామలాంబ ఒకరేనా? ఛ! అయి ఉండదు! ఆ శ్యామలాంబ ఇందరి గౌరవాదరాలకు పాత్రురాలు కాగలదా?
మణిమాల శ్యామలాంబతో లలిత దగ్గిరకొచ్చింది. "ఈవిడ మిస్ లలిత. మంచి వైణికురాలు!" అని పరిచయం చేసింది.
శ్యామలాంబ చూపులలో నిర్లక్ష్యం చిందిస్తూ చిరునవ్వులో సంస్కారం సూచిస్తూ తల ఊపులో ఆధిక్యం ప్రకటిస్తూ లలిత చేసిన నమస్కారం అందుకుంది.
మహిళా మండలి కార్యదర్శి అతి వినయంగా శ్యామలాంబ దగ్గిరకొచ్చి "మా చేతి పనుల ప్రదర్శన చూడరూ?" అని ప్రార్థిస్తున్నట్లుగా మాట్లాడి తన బ్రతుకు ధన్యమవుతున్నట్టు అడుగులేస్తూ శ్యామలాంబను తనవెంట తీసికెళ్ళింది.