Previous Page Next Page 
తదనంతరం పేజి 9


    ఇద్దరికీ వంటరిగా గడిపే క్షణాలే దొరకటం లేదు.


    తన భర్త బాధపడుతోన్న సంగతి అరుంధతికి తెలుసు. అయినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వుంది.


    అక్కడున్న వారం రోజులూ అక్కా బావల సేవలతో_వీళ్ళకి నిరర్థకంగా గడిచిపోయింది.


    వదినగారికి సుస్తీ అని సుదర్శనం మొదట తండ్రికి అబద్ధం చెప్పాడు. కాని అది నిజమై నిప్పులా వెంటాడింది.


    తర్వాత యింకో అక్కగారు సావిత్రి యింటికెళ్ళారు.


    సావిత్రి యింట్లోకి రాకూడదు. వాళ్ళాయనకు వెర్రి ఆచారం. ఆ మూడురోజులూ వంట తానే చేసుకుంటాడు. ప్రొద్దుటే కూరలు తరగటం మొదలుపెడుతూ రిక్షాలో భర్తతో సహా దిగుతోన్న మరదల్ని చూసి మొహం చేటంత చేసుకున్నాడు.


    "ఇంకేం? మా అరు వచ్చేసిందిగా. ఈ మూడురోజులూ నేను చెయ్యి కాల్చుకోవాల్సిన అవసరం లేదు" అంటూ యిహ తన బాధ్యతేమీ లేనట్లు వంటింట్లోంచి బయటకు నడిచాడు.


    "మా అరు పనితీరే వేరు. అందులో పాకశాస్త్ర ప్రవీణురాలు కూడా. గుత్తివంకాయ కూర వండిందంటే అద్భుతం. పనసపొట్టు కూర వండిందంటే అమోఘం. ఇహ బొబ్బట్లూ, దోసకాయ పచ్చడి చేసిందంటే అపురూపం అని ఆ మూడురోజులూ తన జిహ్వచాపల్యాన్ని తీర్చుకొని ఆనందపడిపోయాడు.


    ఆ యిల్లు యిరుకు.


    "రండి సుదర్శనంగారూ! మనమిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం" అని అతను సుదర్శనాన్ని తన ప్రక్కనే పడుకోబెట్టుకొని అర్థరాత్రి వరకూ యితనికి అభిరుచి లేని ఆఫీసు కబుర్లతో చావగొట్టి చిత్రహింస చేసేవాడు.


    చీటికీ మాటికీ "అలా బయటకు వెళ్ళొద్దాం రండి" అని తీసుకెళ్ళి అయినదానికి కాని దానికీ డబ్బు ఖర్చు పెట్టిస్తూ "అరె! పర్సు మరిచిపోయి వచ్చానే. మీరివ్వండి సుదర్శనంగారూ తర్వాత నేనిస్తాను" అని తర్వాత ఆ ప్రస్తావనే గుర్తులేనట్లు నటించేవాడు.


    సుదర్శనానికి కళ్ళనీళ్ళ పర్యంతమై బాధనూ, దుఃఖాన్నీ, కోపాన్నీ బయటకు క్రక్కలేక కుమిలిపోయేవాడు.


    భార్యాభర్తల మధ్య మూగవేదనతో ఆ మూడు నాలుగు రోజులూ గడిచిపోయింది.


    అరుంధతి భర్త దగ్గరకొచ్చింది. "తాడేపల్లి గూడెంలో మా మేనత్త వుంది. చాలా మంచి మనిషి. కష్టం, సుఖం తెలుసుకోగలిగిన మనస్తత్వం" అంది మృదువుగా.


    "ఇంక ఎక్కడికీ వద్దు. యింటికి తిరిగి వెళ్ళిపోదాం" అన్నాడు సుదర్శనం నిర్లిప్తంగా.


    "పోనీ తిరుపతి వెడదాం. దేవుడ్ని చూసినట్లు వుంటుంది. కాటేజి తీసుకుంటే ఏకాంతంగానూ వుంటుంది" అంది అరుంధతి సిగ్గును పారద్రోలుకుని.


    "డబ్బులయిపోయినాయి. సెలవులు కూడా అయిపోయినాయి.


    ఆ మాటల్లోని యదార్థం తెలుసుకున్న అరుంధతి ఏమీ మాట్లాడలేకపోయింది.


                                  *    *    *    *


    ఎనిమిదయేసరికి పిల్లలందరూ ఒక్కొక్కరుగా నిద్రలేచారు.


    అందరిలోకి పెద్దవాడు అభిలాష్. ఇరవై అయిదేళ్ళుంటాయి. ఇంకా పెళ్ళి కాలేదు. యం.ఏ. పూర్తిచేసి గత రెండు మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కలసిరావటం లేదు.


    తర్వాత ఇద్దరూ ఆడపిల్లలు నీరజ, సుగుణ.


    ఆఖరివాడు అరవింద్. పద్దెనిమిదేళ్ళుంటాయి. బి.కాం ఫస్టియర్ చదువుతున్నాడు.


    నలుగురూ కొన్ని క్షణాలపాటు ఆప్యాయంగా ఉన్నట్లే కనిపిస్తారు. అంతలోనే బద్ధశత్రువుల్లా ఘోరంగా దెబ్బలాడుకుంటారు...అలా దెబ్బలాడుకునే సమయాల్లో ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారా అన్నట్లు వాళ్ళ మొహాలు కూడా భయంకరంగా ఉంటాయి. 

 Previous Page Next Page