"అరుంధతీ" అన్నాడు ఆ పిలుపామెకు ఎంతో మధురంగా వినిపించింది.
"చెప్పండి."
"అయిదారు రోజులపాటు ఎక్కడికైనా మనం తిరిగొద్దాం"
"అయిదారేళ్ళ బట్టి మనం ఇలా అనుకుంటూనే వున్నాం. అయినా కుదరక ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూనే వున్నాం."
వాళ్ళిద్దరికీ పెళ్ళయిన కొత్తలో ఇంట్లో ఎప్పుడూ చుట్టాలతో, కార్యకలాపాలతో, ఊపిరి తిరగని పనితో ఇద్దరూ ఏకాంతంగా ఉండటానికి క్షణం కూడా వీలయ్యేది కాదు. ఇద్దరూ ఎక్కడికన్నా కలసి బయటకు వెళ్ళాలన్నా, సరదాగా మాట్లాడుకుందామన్నా కుదిరేది కాదు. వారంరోజులదాకా తిరిగి రావటానికి సుదర్శనం పథకం వేశాడు.
ఆ సంగతి తండ్రితో చెప్పడానికి రెండురోజులు రిహార్సల్స్ వేసుకున్నాడు. అతను తండ్రితో ధైర్యంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
ప్రయత్నించి ప్రయత్నించి చివరికెలాగో చెప్పాడు.
"ఎక్కడికి?" అన్నాడు నరసింహంగారు.
"అదే..."
"అదే అంటే?"
అరుంధతి వాళ్ళ అక్కయ్యగారికి వొంట్లో సుస్తీగా వుంటుంది. ఒకసారి చూడటానికి వెళ్ళాలని..."
"వాళ్ళ అక్కయ్యకి సుస్తీగా వుంటే చూట్టానికి వెళ్ళాలని వుందా?"
"లేదు...వాళ్ళు రమ్మని రాశారు"
"ఏమిటి సుస్తి? టి. బియా? కేన్సరా? హార్టు ఎటాకా?"
సుదర్శనం ఏ జవాబూ చెప్పలేక తప్పు చేసినట్టు మొహం పెట్టాడు.
తండ్రి మాటతో మనసు విరిగి, మూడ్ చెదిరిపోయి ప్రయాణం మానుకుందామన్న నిర్ణయానికి వచ్చేస్తున్నాడు.
"మీ యిష్టం" అన్నాడు.
"జబ్బేమిటి అంటే మీ యిష్టమంటావేమిటి?"
"జబ్బేమిటో తెలీదు"
నరసింహంగారు కొంచంసేపు ఆలోచించి "సరే వెళ్ళిరా. వారం రోజుల్లో వచ్చెయ్యి"
ఏ ఊరయినా వెళ్ళేటప్పుడు "ఎప్పుడొస్తావు?" అని మొదటే అడుగుతుంటే వెళ్ళేవారికి మూడ్ మాయమైపోతుంది. సుదర్శనం ప్రయాణం మానివేద్దామనుకున్నాడు. కాని అలా చేస్తే మళ్ళీ తండ్రికి కోపమొస్తుందని వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.
సుదర్శనం, అరుంధతి ఊరికి బయల్దేరారు.
హోటల్స్ లో దిగటానికి సుదర్శనానికి భయం. అదేదో పెద్ద పెద్దవాళ్ళు చేసేపని అని అతని ఉద్దేశం. పైగా అతని దగ్గర డబ్బు లేదు కూడా.
డబ్బు చాలీ చాలనంత లేకుండా కొత్తగా పెళ్ళయిన స్థితిలో ఊళ్ళకి బయలుదేరటం_చాలా దారుణమైన అనుభవం.
అయినా చాలామంది మనుషులకు తప్పని పరిస్థితి.
మొదట అరుంధతి అక్కగారు సుమతి యింటికెళ్ళారు.
సుమతి అప్పటికి వారం రోజులబట్టి మంచానపడి తీసుకుంటోంది. చాలా నీరసంగా వుండి కళ్ళలో వున్నాయి ప్రాణాలు.
చెల్లెల్ని చూసి దిగులుగా నవ్వింది. ఆ నవ్వులో ప్రాణం లేచి వచ్చినంత జీవం వుంది.
"ఇంకేం? అరుంధతి వచ్చేసిందిగా. మనకు సాయంగా వుంటుంది" అన్నారు బావగారు సంతోషపడుతూ.
అరుంధతి చాకిరీలో పడిపోయింది. ఒక్కోసారి తను భర్త సంగతి ఆలోచించటానిక్కూడా వ్యవధి వుండటం లేదు.
ఈ వాతావరణం సుదర్శనానికి చాలా బాధ కలిగించింది. ఒక దశలో అక్కగారితోబాటు, తనకన్నా ఎక్కువగా బావగారికే సపర్యలు చేస్తోన్నట్టు కనిపించింది. ఈ అంశం చాలా అసూయ కలిగించింది కూడా.