Previous Page Next Page 
తదనంతరం పేజి 10


    వాళ్ళు నలుగురూ విడివిడిగానూ, ఉమ్మడిగానూ కాఫీలు త్రాగేస్తూ మధ్య మధ్య మాట్లాడుకుంటున్నారు.


    "కార్తీకమాస మొచ్చేసిందిగా. ఇహ వనభోజనాలూ వగైరాలూ మొదలయినాయి అన్నాడు అభిలాష్.


    అవునవును. మా ఫ్రెండ్సందరమూ కూడా వెడదామనుకుంటున్నాము అంది మానస.


    "మీ ఫ్రెండ్సంటే? ఆడవాళ్ళా? బాయిస్ కూడానా?" అనడిగాడు అరవింద్.


    "ఏం బాయిస్ రాకూడదా?"


    "రావచ్చు. కాని వచ్చినప్పట్నుంచీ అడ్డమైన వెధవవేషాలన్నీ వేస్తారు."


    "అడ్డమైన వెధవ వేషాలంటే? నువ్వు మాత్రం బాయ్ వి కావా?"


    "బాయ్ నే కాని నా లిమిట్స్ దాటి ఎప్పుడూ ప్రవర్తించను" నాకు చాలా సెల్ఫ్ క్రిటిసినిజముంది.


    "ఈ రోజుల్లో ప్రతివాడూ తనని గురించి తనలాగే అనుకుంటాడు.


    "ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్తీక సమారాధనలూ అవీ చాలా అసహ్యంగా తయారయాయి అంది నీరజ. నలుగురిలోనూ ఆ అమ్మాయే కొంతవరకూ సరళంగా ఉంటుంది.


    ఎందుకని?" మనిషికి ఆ మాత్రం రిలాక్సేషన్ వుండకూడదంటావా?" అన్నది మానస.


    "రిలాక్సేషన్ అవసరమే. కాని వికృతంగా వాటిని ప్రవర్తించకూడదు."


    "ఇప్పుడు ఏమిటో వికృతంగా ప్రవర్తిస్తున్నారు?"


    "కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ సామరాధన వనభోజనాలూ, ఉసిరిచెట్టు క్రింద కూర్చుని అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఆరగించటం ఏదో గొప్ప గొప్ప నైవేద్యాలతో ఆరగించబడి వుంటాయి. కాని ఇప్పుడు అవి కేవలం పిక్ నిక్ లుగా, వేడుకలుగా మారిపోయాయి. కార్తీక మాసమంటే పేకాటలూ, విస్కీలూ, బ్రాందీలూ తాగడం, మాంసాలు తినడం, కొన్నిచోట్లయితే కాల్ గరల్స్ ని తెచ్చుకుని వ్యభిచారం...."


    ఇంతలో బయట రిక్షా ఆగిన చప్పుడయింది.


    అరవింద్ బయటకు తొంగిచూసి "చచ్చాం" అన్నాడు.


    "ఏమిటి?" అన్నాడు అభిలాష్.


    "బొండాం మావయ్య, తన సతీమణితో సహా బోలెడు లగేజితో దిగుతున్నాడు.


    అందరికీ గుండె ఆగినంత పనయింది.


                                          3


    బొండాం మామయ్య పద్మనాభరావు అంటే పిల్లలందరికీ చచ్చే భయం. ఆయన రావటం చూస్తూనే అందరూ గదుల్లో చేరి పనుల్లో వున్నట్టు తలుపులు బిడాయించేసుకుంటారు.


    ఆయన విశాఖపట్నంలో ఆయిల్ కంపెనీలో ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. ఆర్నెల్లకూ, ఏడు నెల్లకూ ఒక్కో అప్ప చెల్లెంటికి మెరుపుడాడి చేస్తూ వుంటాడు. అతన్ని ఐదారు రోజులకంటే ఎక్కువగా భరించలేరు. ఓర్పుగల మనిషి అవటంచేత అరుంధతి తన మనసులోని భావాలు బయట చెప్పకుండా నిగ్రహంగా వుంటుంది. అతను ఎవరింటికి వెళ్ళినా వారం తిరక్కముందే ఏదో పేచీ పెట్టుకొని అక్కడ్నించి మొహం మాడ్చుకుని చెప్పా పెట్టకుండా వున్నట్లుండి వెళ్ళిపోతూ ఉంటాడు.


    ఒకరి ఇంట్లో కాలుపెట్టినప్పట్నుంచీ తను మిగతా ఇళ్ళల్లో పొందిన అనుభవాలు, మేనర్స్ లేకుండా ఆ చుట్టాలు తనని ఎలా అవమానము చేసిందీ, వాళ్ళంటే తనకెలాంటి అసహ్య మేసింది ఏకరువు పెడుతూ వుంటాడు. ప్రపంచంలో తనకి తప్ప యింకెవరికీ మేనర్స్ తెలీవని అనుకుంటూ ఉంటాడు.


    ఇంట్లోకి అడుగుపెట్టగానే తనకు అనువుగా వున్న ఓ గది...అది ఎవరిదోనన్న ధ్యాస లేకుండా జాతీయం చేసేసుకుంటాడు. తన పెట్టె బిఛాణా అన్నీ అక్కడ సరిచేసుకుంటాడు.

 Previous Page Next Page