Previous Page Next Page 
రక్షరేకు పేజి 9


                                        5
    ఎప్పటిలా జబర్దస్తీగా పెట్టెలో బట్టలన్నీ ఇవతలకు లాగిపారేసి డబ్బులకోసం వెతకసాగాడు కోటయ్య.
    ఎప్పటిలా అన్నమ్మ కోటయ్యతో కలియబడి అతని ప్రయత్నాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నించలేదు. చూస్తూ కూచుంది.
    వెతికి వెతికి విసిగిపోయాడు కోటయ్య. అతనికి నయా పైసా దొరకలేదు.
    ఎప్పటిలా తనతో పోట్లాడకుండా మూల కూచుని తనను గుర్రుగా చూస్తున్న అన్నమ్మను చూస్తే అతనికేదో అనుమానం తోచింది. డబ్బులేయ్యే!" అని అరిచాడు.
    "డబ్బులు! నువ్వు సంపాదించి పోగేసినయి మూలుగుతున్నయిగ! ఇంటినిండా....."
    "దొంగ లంజా! నోరు మూసుకొని యిస్తావా? యియ్యవా?"
    "యెతుక్కుంటున్నావుగా! యెతుక్కో! దొరికినయ్యన్నీ పట్టుకుపో! ఏదీ దొరక్కపోతే నన్నమ్ముకో!"
    విరగబడి నవ్వాడు కోటయ్య.
    "నిన్నమ్ముకుంటే యేటొస్తాదే! యేటుంది నీలోని నాలుగు బొముకలూ, ఆటిపైన తోలూ....."
    కుతకుతలాడింది అన్నమ్మ.....
    "ముదనష్టపోడా! నీమూలంగానే కాదంట్రా నేనిట్లా తగలడింది. బంగారంలాంటి బతుకుని తాగుబోతు ముండాకొడుకువై బుగ్గిసేస్తున్నావు!"
    "నోరుముయ్యే! డబ్బెక్కడ దాచిపెట్టావే? మీ యమ్మగారి దగ్గరా?"
    "డబ్బూలేదు. యేమీలేదు"
    "యిస్తావా? లేదా?"
    "లేదంటా ఉంటే నీక్కాదూ?"
    కోటయ్య అన్నమ్మ జుట్టుపట్టుకుని వంగదీసి గుద్దుతూ "ఆ డబ్బు అట్టుకురా! లేకపోతే చంపేస్తాను" అని అరవసాగాడు.
    "ఓరి సచ్చినోడా! నీ సేతులు కాలిపోను!" అని రాగాలు తీస్తూ అన్నమ్మ తప్పించుకోటానికి ప్రయత్నించసాగింది.
    పిల్లలు ముగ్గురూ భయబ్రాంతులై చూడసాగారు.
    జైహింద్ బాబు ఇంక భరించలేక తండ్రి చెయ్యి పట్టుకుని "అమ్మని కొట్టావంటే ఊరుకోను. కొట్టకు" అన్నాడు కోపంగా.
    "నిర్ఘాంతపోయాడు కోటయ్య. తన కొడుకు తనకు ఎదురు తిరుగటమా?
    "యేంటిరా! వాగు మళ్ళీ...." అని అన్నమ్మను వదిలి జైహింద్ బాబుని చూచి లెంపకాయ కొట్టాడు.
    బాధ భరించలేక "అమ్మా!" అని కెవ్వున కేకపెట్టాడు జైహింద్ బాబు.
    అన్నమ్మ రివ్వున పోయి పొయ్యిలో మండుతున్న కోరకంచు చేత్తో పట్టుకుని నిలబడి.
    "సచ్చినోడా! ఎవరి ఒంటిమీదనయినా మళ్ళీ చెయ్యేసినా వంటే ఇదెట్టి కాల్చేస్తా!" అంది.
    భయపడిపోయాడు కోటయ్య అప్పటి అన్నమ్మ ముఖం చూస్తోంటే నిజంగా కాల్చేసేలాగానే ఉంది పిల్లిలా బయటకు పోయాడు.
    ఈ పరిణామానికి జైహింద్ బాబు చాలా ఆశ్చర్యపోయాడు. తన తల్లి ఇలా తన తండ్రి ఎదిరించగలదని అతనెన్నడూ అనుకోలేదు.
    "భలే అమ్మా! భలే చేశావు" అన్నాడు సంబరంగా.
    కానీ ఈ పొగడ్తలకి అన్నమ్మ ఆనందించలేదు. కొరకంచు కిందపదేసి కుమిలి కుమిలి ఏడ్చింది.
    తెల్లబోయాడు జైహింద్ బాబు. అతనికి మరొక విషయం అర్థమయింది. తలుచుకుంటే తన తండ్రిని ఎదిరించగలడు.... కాని ఎదిరించలేదు. ఇన్నాళ్ళకు తనను కొడుతుంటే చూడలేక ఎదిరించింది. అలా ఎదిరించినందుకు కుమిలిపోతుంది.
    జైహింద్ బాబు పదోక్లాసులోకి వచ్చాడు. అతనికి లోకజ్ఞానం బాగా పెరిగింది. వయసుకు మించి అన్ని విషయాలూ అర్ధం చేసుకోగలుగుతున్నాడు.
    పదోక్లాసుతో మంచి ఉద్యోగమేదీ దొరకదు. కాలేజిలో చదవాలి. కాలేజిలో స్కాలర్ షిప్ వస్తుందో? రాదో? ఒకవేళ వచ్చినా ముందు చేరి అప్లయ్ చెయ్యాలికదా అందుకు డబ్బు కావాలి, ఎలా పోగుచెయ్యడం?
    పాపం! తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తోంది. రత్నమ్మ కూడా మరో యిల్లు చూసుకుంది. సుందరీబాయి చిన్నదయినా చాకచక్యంగా బల్లదుకాణం నడిపికొంత సంపాదిస్తోంది. అయినా ఈ సంపాదనలు యే మూలకి?
    మిలిటరీ ఆఫీసర్లెవరయినా తనకేదైనా పనిస్తే బాగుండును. స్కూల్ కి వెళ్ళివస్తోనే చెయ్యగలిగేపని యేదయినా సరే! తను చేస్తాడు.
    ఆఫీసర్స్ క్వార్టర్స్ దగ్గిరకు వెళ్ళి ఒక బంగళా ముందు నిలబడ్డాడు. "భౌ" అంటూ మీదకు ఉరకబోయింది పులిలాంటి కుక్క.
    అంతలో లోపలనుంచి ఆఫీసర్ గారు వచ్చి కుక్కని పట్టుకుని "ఎవరు నువ్వు? ఏం కావాలి?" అని అడిగారు.
    జైహింద్ బాబు చేతులు కట్టుకుని "నేను పదోక్లాసు చదువుతున్నానండీ! కాలేజీలో చదువుకోవాలని ఉంది. డబ్బు లేదు. ఇప్పటినుంచీ యేదయినా పనిచేసి డబ్బు కూడబెట్టుకోవాలని ఉంది. మీరు ఏదయినా పనియిప్పిస్తే....." అన్నాడు వినయంగా.
    ఆ ఆఫీసర్ గాలితో పాటు మరొకాయన కూడా ఉన్నారు. ఆయన కుతూహలంగా "మీ అమ్మా, నాన్నా యేం చేస్తుంటారు?" అన్నాడు.
    జైహింద్ బాబు ఎక్కడికి వెళ్ళినా యెదురయ్యే ప్రశ్న యిదే! ఈ ప్రశ్నకు సమాధానం వినగానే అందరూ తనను చిన్నచూపు చూడటం కూడా జైహింద్ బాబుకి కూడా బాగా అలవాటే! అయినా చేసేదేముందీ? చెప్పాడు. కానీ ఆయన మిగిలిన వాళ్ళలాగ యీసడింపుగా చూడలేదు.
    ఉత్సాహంతో ఆఫీసర్ గారితో "చూశావా దయానంద్! రోజులు ఎలా మారుతున్నాయో! చూడు, మనకళ్ళముందు ఈ కూలివాళ్ళ అబ్బాయి చదువుకోసం ఎంత కష్టపడుతున్నాడో! పై చదువులకోసం ఎంతగా ఆరాటపడిపోతున్నాడో! తప్పులేదోయ్. చూస్తూ ఉండు! కొద్దిరోజులలో మన సంఘమంతా మారిపోకపోతే అడుగు" అన్నాడు.
    దయానంద్ నవ్వి "నీ బోటివాళ్ళంతా నడుంకట్టుకుని కృషి చేస్తున్నారుగా! ఏ మాత్రం మారుస్తారో చూశానులే!"

 Previous Page Next Page