పాపం వెంకడు సహజంగా సాత్వికుడు. దానికి తోడు చిన్నతనంలోనే తననూ, తల్లినీ వదిలేసి మారుమనువు చేసుకున్న తండ్రి తనను ఆదరిస్తాడో లేదోనని భయపడుతూ వచ్చాడు. ఈ మాత్రం ఆశ్రయం దొరికితే ఎంత చారికీ చెయ్యటానికయినా అతడు సిద్ధమే!
ఆ మరునాడే వెంకణ్ని తనతోపాటు వెంటబెట్టుకెళ్ళింది నాగమ్మ.
వరదాచారికి దణ్నంపెట్టి "అయ్యగారూ! ఈడూ మావోడే! చవురు రాసి వొళ్ళు బాగా మాలిష్ నేస్తాడు, నెప్పులన్నీ తగ్గిపోతాయి. ఏదో మీ కాళ్ళకాడ పడి వుండనీయండి" అంది.
వరదాచారి ఘటికుడు. మహా లౌకికుడు. కొన్ని సంవత్సరాలుగా దేవుడికి అర్చకుడుగా వుంటున్నందుకు దివ్యత్వం ఏమాత్రమూ అందుకోకపోయినా, ఘటనా ఘటనా చాతుర్యం మాత్రం అబ్బింది. అంచేత అతడు వెంకణ్ని వెంటనే అనుగ్రహించలేదు.
"ఇవాళ ఒకసారి తోమించుకొని చూస్తాను. నాకు నచ్చితే నెలజీతం మీద పెట్టుకుంటాను" అన్నాడు.
"అట్టాగే అయ్యగారూ" అని వరదాచారికి దణ్నంపెట్టి, వెంకణ్ని పక్కకు పిలిచి.
"ఒరే యెంకా! ఇయ్యాలొక్కనాటికి బాగా తోమరా! పనిలో కుదిరినాక అప్పుడప్పుడు బాగా తోమకపోయినా బాధలేదులే" అని సలహా ఇచ్చింది.
వెంకడు తలూపాడు. ప్రతిదానికీ తలూపటం వాడికి బాగా అలవాటయిపోయింది.
ఆ రోజు వెంకటు వరదాచారి ఒంటికంతా బాగా నూనె రాసి మాలిష్ చేశాడు. వరదాచారి వెంకడ్ని మనసులో బాగా మెచ్చుకున్నాడు. పైకి మెచ్చుకోకూడదని అతనికి తెలుసు. తను మామూలుగా మాలిష్ చేసేవాణ్ని పిలిపించుకుంటే చచ్చినట్టు రోజుకు రెండు మూడు యిచ్చుకోవాలి. వీడినే నెలజీతానికి కుదుర్చుకుంటే మంచిది.
"ఆఁ ఏదో చేశాడు ఎంత యియ్యమంటావ్ నెలకి"
"మీరే సెప్పాలి! మేమేవడుగుతాం అయ్యగోరూ"
"నెలకి పదిరూపాయలిస్తాను"
"అదేంటయ్యగోరూ! ఈ రోజుల్లో పదిరూపాయలకేమొస్తంది. పదిరూపాయలకోసం పనిలోకెవరొస్తారండీ"
"ఎంతియ్యమంటావో చెప్పు"
"పాతిక రూపాయలిప్పించండి"
"అమ్మో! ఇరవయి అయిదు రూపాయలా? ఆశకి అంతుండాలే? ఎవడిస్తాడే నీకు పాతిక రూపాయలు, ఒక గంటపనికి?"
"పనిగంటే కానియ్యండి అయ్యగోరూ! అందరికీ రాదు కదండీ! కుదరదంటే సెప్పండి. మరోకాడ చూసుకుంటాడు" వరదాచారి మెత్తబడుతున్నాడని గ్రహించింన నాగమ్మ గట్టిగా బేరానికి దిగింది.
వెంకడు ఒళ్ళు తోమినప్పటి హాయి మరచిపోలేకపోతున్నాడు వరదాచారి. నాగమ్మ గయ్యాళితనం అతనికి తెలుసు. నిజంగానే వెంకణ్ని మరోచోట కుదురుస్తుందేమోనని భయపడ్డాడు.
"సరేరా! ఇరవయి యిస్తాను. అంతకంటే యియ్యను" అన్నాడు తను బెదిరిస్తూ.
"సర్లెండి! యిరవయి యిచ్చి ఓ పూట అన్నం పెట్టండి. మీ కాడే వుండి ఆ పనీ ఈపనీ సేస్తాడు"
"ఈ యేర్పాటు వరదాచార్యులకి బ్రహ్మాండంగా నచ్చింది. దేవుడి ప్రసాదం దండిగా లభించే ఆ ఇంట్లో తిండికేం తక్కువ?
వరదాచార్యులకి ఇద్దరు కూతుళ్ళున్నారు. ఇద్దరినీ కాన్వెంట్ లో చేర్పించాడు. వాళ్ళిద్దరినీ కాన్వెంట్ లో దింపి తిరిగి తీసుకురావటానికి ఒక మనిషిని పెట్టుకోవాలని అనుకుంటున్నారు. వీడుంటే అందుకు పనికొస్తాడు? ఇంకా ఆ పనీ ఈ పనీ చేయించుకోవచ్చును.
ఇవాళ నుంచే పనిలో వుండనియ్యి. నమ్మకం వుండాలి సుమా! నేను చాలా నిక్కచ్చి మనిషిని. యేదయినా హెచ్చుతగ్గులు వస్తే ఊరుకోను"
"అదేంటండీ! మేమటువంటివాళ్ళం కాము. మావోడి నమ్మకం మీకే తెలుస్తాది" అంది నాగమ్మ.
ఆ రకంగా ఆ రోజునుంచే వెంకడు వరదాచార్యులుగారింటిలో పనికి కుదిరిపోయాడు. నాదముని బయటకు వచ్చి వెంకణ్ని చూసి ఒళ్ళు తోముతావా? ఇహిహి; నాకు తోముతావా?" అన్నాడు.
వరదాచార్యులు గట్టిగా నవ్వి "పోరా వెర్రివెధవా? నీకు ఒళ్ళు తోమటానికి నౌకరు దేనికి? మీ ఆవిడ తోముతుందిలే" అన్నాడు.
"ఇహిహి? నేనే వెర్రివెధవని కదూ? అవును. నాకెందుకూ వళ్లు తోమటం?" అని వెర్రినవ్వు నవ్వాడు నాదముని....
సొంత అన్నగారేతమ్ముణ్ణి వెర్రివెధవ అని ఈసడిస్తున్నాడు. పరాయివాళ్ళు అవహేళన చేస్తే ఆదుకోవలసిన వ్యక్తి తనే అపహసిస్తున్నాడు. పాపం! ఆ అభాగ్యుడు మరింత మతిపోయి వెర్రిగా నవ్వుకుంటున్నాడు.
పొయ్యిముందు కూర్చుని వంటచేస్తున్న సరళ ఈ మాటలన్నీవింది. పొయ్యిమీద ఉన్న అన్నంలాగే ఉడికిపోయింది సరళమనసు! ఎంత ఎన్నిసార్లు విన్నా, ఈ రకమైన మాటలు సరళ మనసును చిత్రవధ చెయ్యమానవు.
"అక్కా! ఇవిగోకూరలు!" అంటూ కూరలసంచితో వచ్చిన పార్థసారధి అక్క ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాడు.
అక్క కళ్ళనుండి ధారలుగా కారుతోంది కన్నీరు. ఆకన్నీరు పొగవల్ల వచ్చినది కాదు. పొయ్యి భగభగ మండుతోంది..... అక్క కంటనీరు పెడుతుండగా చూడటానికి ఎంతగా అలవాటుపడినా, ఎప్పటికప్పుడే ఆ ముఖం సారధిని నిలువునా కాల్చేస్తుంది. ఏం చెయ్యగలదు? ఆకన్నీటిని తుడవగలిగే శక్తి తనకులేదు.
తనకోసమే.... తన బ్రతుకు చక్కబడుతున్న వృధాభ్రమతోనే తన అక్క ఈ నరకంలోకి అడుగుపెట్టిందని సారధికి తెలుసు. ఎలాగైనా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చూసుకోగలిగితే అక్కని ఆగుకోగలడు- కానీ, ఎలా సాధ్యం అది?
ఒక వంక వయసు మించిపోయింది. మరొక చదువుకునే అవకాశాలు ఏమాత్రం లేవు. తనంతట తను ఎలాగో సంపాదించి రాత్రిళ్ళు చదువుకునే పుస్తకాలవల్ల విజ్ఞానం వస్తుందేమో కాని, డిగ్రీ రాదుగా? జీవితంలో ఈ ఆర్ధిక సమస్య ఎంత భయంకరమైనది.