ఎక్కడో నూటికొక్కడు యిలాటివాడు కనిపిస్తే అందరూ మారిపోతారనుకుంటున్నావు నవ్వు. ఈ సమాజం మారటానికి నీబోటివాళ్ళు యింకా ఎంతెంత తపస్సు చెయ్యాలో!" అన్నాడు.
ఆ సంభాషణ పూర్తిగా అర్థంకాలేదు జైహింద్ బాబుకి. కానీ, తన అదృష్టవశాత్తు మంచివాళ్ళ దగ్గరకే వచ్చాననీ, వాళ్ళిద్దరూ కూడా తమబోటివాళ్ళని ఆదుకునే సహృదయులేనని అర్థమయింది.
"సారీ! నా దగ్గిరేం పనిలేదోయ్!" అన్నాడు దేవానంద్.
ఈ సమాధానంతో నీరు కారిపోయాడు జైహింద్ బాబు.
కానీ అవతల పెద్దమనిషి "నా దగ్గిర పనిచేస్తావా?" అన్నాడు.
జైహింద్ బాబు ఉత్సాహంగా "చేస్తానండీ" అన్నాడు.
"మా ఇల్లు యిక్కడికి కొంచెం దూరం!"
"పరవాలేదండీ! ఎంతదూరమయినా నడువగలను."
"నీకు బూట్ పాలిష్ చెయ్యడం వచ్చునా? తోటపని వచ్చునా?"
"ఏ పనయినా నేర్చుకోగలనండీ!"
"సరే! అయితే యివాళ నాతో రా! మా యిల్లు చూపిస్తాను, నా బూట్స్ పాలిష్ చెయ్యి. మా యింటి ముందున్న తోటపని చూసుకో! నెలకి యిరవైకంటే ఎక్కువయియ్యలేను.
పొంగిపోయాడు జైహింద్ బాబు. నెలకు ఇరవై. ఒక పదిహేను దాచుకున్నా తను కాలేజీలో చేరిపోగలడు.
"థేంక్యూ సర్! థేంక్యూ!" అని అతని పాదాలకు నమస్కారం చెయ్యబోయాడు.
ఆయన మెరుపులా వెనక్కుతగ్గి "ఛా! ఛా! ఇలాటి పనులు చెయ్యకు. నీ అంతవాడవి నువ్వు! కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు. నా కెందుకు నమస్కారం చెయ్యాలి?" అన్నాడు.
తెల్లబోయి నిలబడ్డాడు జైహింద్ బాబు. "నీ అంత వాడవు నువ్వు" ఈ మాటయెంతో కొత్తగా వినిపించింది జైహింద్ బాబుకి. ఈ రకంగా తనతో పెద్దింటి వాళ్లెవరూ యింతకుముందు మాట్లాడలేదు. ఆ మాటలు తలచుకొంటున్న కొద్దీ తనలో యేదో క్రొత్తబలం, క్రొత్త ఆశలు ప్రవేశించినట్లు అనిపించసాగింది....
"రా! నా కారులో కూచో" అన్నాడు ఆయన కారులో డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటూ....
"వద్దులెండి! ఎక్కడో చెప్పండి. నడుచుకుంటూ వస్తాను" అన్నాడు జైహింద్ బాబు.
ఆయన నవ్వి "నడిచే సమయంలో నడవాలి కారెక్క గలిగినప్పుడు ఎక్కాలి. నీ గొప్పతనం నడిచి రావడంలో లేదు. నడిచి వచ్చినా, కారెక్కినా రెండూ ఒకటేననుకోగలగటంలో ఉంది. కారెక్కు" అన్నాడాయన తలుపుతెరిచి.
జైహింద్ బాబు మరేం మాట్లాడకుండా కారెక్కి కూచున్నాడు.
కారులోకూచోవడం ఒక కొత్త అనుభవం జైహింద్ బాబుకి. అంతకంటె కొత్త అనుభవం ఆయన మాటలు వినగలగటం.
ఆయన దగ్గిర పనిలో కుదిరాక చాలా విషయాలు తెలిశాయి జైహింద్ బాబుకి.
తననంత ఆదరించి పని ఇచ్చిన వ్యక్తి పేరుపొందిన లాయర్. క్రిమినల్ లాయర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన పేరు న్యాయమూర్తి. అందరూ వ్యాస్ అని పిలుస్తారు.
ఆయనకు క్రిమినల్ లాయర్ గా ఎంత పేరుకదో, బీదసాదలను ఆదుకునే వ్యక్తిగా అంతపేరు ఉంది. డబ్బుకోసం ఏ మాత్రం ఆశ పడకుండా కూలిజనంలో ఎవరికి అన్యాయం జరిగినా ఆదుకుని న్యాయం చేకూర్చటానికి సిద్ధంగా ఉంటాడు. అతని పేరు చెబితే, మిల్లు యజమానులకూ, భూకామందులకూ సింహస్వప్నం-
ఆయనకు తగిన మిత్రుడు మిలటరీ ఆఫీసర్ దయానంద్ గారు సార్ధక నామధేయుడే గాని వ్యాస్ లో ఉన్నంత తీవ్రత ఆయనలో లేదు. బీదలంటే సానుభూతి ఉంది. కానీ ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొని న్యాయానికి కట్టుబడి వాళ్ళకు అండగా నిలబడే నిబ్బరం లేదు. లోలోపల మధన పడితే పరిస్థితులతో రాజీపడిపోతుంటాడు.
వ్యాస్ గారి దగ్గిర పనిదొరకటం తన పెద్ద అదృష్టం అనుకున్నాడు జైహింద్ బాబు-
తనపై కొరకంచు ఎత్తిన అన్నమ్మను కోటయ్య క్షమించలేదు. ప్రతీకారంగా ఆ మరునాటికే ఎవతెనో ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఎదిగిన పిల్లలు ముగ్గురూ బిత్తరపోయి చూసినా లక్ష్యపెట్టలేదు-
అన్నమ్మ ఏం మాట్లాడలేదు. కానీ ఆ ముఖం చూడలేకపోయారు పిల్లలు. ముఖ్యంగా జైహింద్ బాబుకు తన మనసుని ఎవరోకత్తితో ముక్కలు ముక్కులుగా తరుగుతున్నట్లే అనిపించింది.
తన చెల్లెళ్ళిద్దరికి సైగచేసి బయటికి పిలిచి, చంద్రినీ వెంకడినీ కూడా పిలిచి, ఏం చెయ్యాలా అని ఆలోచించాడు వాళ్ళతో..... అందరిలో వెంకడు బాగా పెద్దవాడు-
"మా అయ్యొదిలేసినపుడు మా అమ్మగూడా ఇట్టా ఏడిసింది" అని చెంద్రిని చూసి "చెల్లాయి మంచిది." ఆ కొంచెంసేపాగి "పిన్ని కూడా మంచిది." అని మళ్ళీ "అమ్మ ఏడిసేది- తలకొట్టుకుని ఏడిసేది-" అన్నాడు.
చంద్రి ఏం మాట్లాడకుండా వెంకడి భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా నొక్కింది..... తడికళ్ళతో చూపులతో తన అభిమానం ప్రకటించుకున్నాడు వెంకడు-
"అమ్మ ఏడిస్తే నాకూ ఏడుపొస్తాది....." అయితే సుందరీబాయి అప్పుడే ఏడుపు ప్రారంభిస్తూ-
"దిష్టముండ! యింటికే వొచ్చింది." అని మెటికిలు విడిచింది రత్నమ్మ....
"ఇలా తిట్టుకోవడం కాదు. బెదరగొట్టి వెళ్ళగొట్టాలి వెంకా! నువ్వు సాయం చేస్తావా?" అన్నాడు జైహింద్ బాబు.
"ఓ!" అన్నాడు వెంకడు.
"నువ్వు మాతోరా! నీకు మంత్రాలొచ్చని చెప్పు. అది పోకపోతే మంత్రం పెడతానని చెప్పు - "
"ఓర్నాయినా! నాకేటి మంత్రాలొచ్చు!"
"అట్టా చెప్పరా?" కసిరింది రత్నమ్మ-
"సెప్తా! నమ్మొద్దా?"
"నమ్మేలా మేం నాటక మాడతాంలే! చంద్రీ! నువ్వు నాతోరా! మనమంతా దాని నమ్మిద్దాం! ఒరేయ్ వెంకా! నువ్వు రెండు గంటలాగిరా! పోకపోతే మంత్రం పెడతానని హడలగొట్టు....."
సరేనన్నాడు వెంకడు - పిల్లలంతా కోటయ్య తెచ్చిన దాని చుట్టూ చేరారు - అది ముఖం చిట్లించి.
"నాకాడికెందుకొచ్చారు? పొండి." అంది.
"అట్టాకాదు పిన్నీ! ఒక ఊసు సెప్దారని వచ్చాం. మొన్న ఆపక్క గుడిసెలో నరసయ్య సచ్చిపోనాడు, తెలుసా?"