"చాలామంది చూపులేనివారికి కళ్ళు డొనేట్ చేస్తామంటారు. కళ్ళుతీసి అమరుస్తున్నామంటారు."
"కొన్ని కొన్ని ఐ డిసీజెస్ వల్ల చూపు పోగొట్టుకున్న వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది జగన్మోహనరావుగారూ! కార్నియాకి సంబంధించిన డిసీజెస్ వుండి చూపుపోయిన వారికి ఆరోగ్యంగా వుండి డొనేట్ చేసిన వారి కళ్ళలోంచి కార్నియా తీసి కార్నియల్ ట్రాన్ ప్లాన్ టేషన్ చేస్తాము. దీన్ని మామూలు వాళ్ళు ఓ ట్రాన్స్ ప్లాన్టేషన్ అనుకొంటారు. ప్రపంచ చరిత్రలో పూర్తిగా కళ్ళు తీసివేయబడ్డ వారికి కళ్ళు తిరిగి పెట్టబడిన సంఘటన లేదు. బహుశా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అది జరగటం అసంభవం."
"అంతేనా" అన్నాడు జగన్మోహనరావు నిరాశగా.
* * *
ఎంత గోప్యంగా వుంచుదామనుకున్నా ఈ సంఘటనని దాచి వుంచటానికి సాధ్యం కాకపోయింది. పత్రికలన్నీ ఈ వార్తకి అమిత ప్రాచుర్యాన్ని ప్రచురించాయి. తెలుగులోనే కాకుండా దేశంలోని ఇతర పత్రికలన్నీ కూడా మందాకిని ఫొటోలతోబాటు చాలా వివరంగా, ఈ వార్తను చాలా హృదయ విదారకంగా చిత్రిస్తూ ప్రచురించాయి. మందాకిని కళ్ళు పెరిగివెయ్యబడ్డ ముందున్న ఫోటోకూడా ప్రచురింపబడింది.
ఒక రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఈ వార్త కలవరపరిచింది. ప్రజలంతా చాలా వింతగా చెప్పుకున్నారు.
ఎస్.పి. జయచంద్ర ఎ.ఎస్.పి.లతోనూ, గూఢచారి విభాగానికి చెందిన పోలీస్ ఆఫీసర్లతోనూ సమావేశం జరిపాడు.
"మందాకిని ఓ కోటీశ్వరుని ఏకైక కుమార్తె. ఆమె గురించి అన్ని వివరాలూ మన డిపార్టుమెంట్ వాళ్ళు సేకరించారు. ఏవిధంగా చూసినా ఈ సంఘటనకు కారణం ఊహించటం కష్టంగా ఉంది" అన్నాడు జయచంద్ర.
గూఢచారి విభాగానికి చెందినా ఒక అధికారిణి కొన్ని ప్రశ్నలు వేసింది. ఆవిడా ప్రాంతానికి కొత్తగా వచ్చింది. ఇంకా కేసు స్వయంగా ఇన్ వెస్టిగేట్ చెయ్యడానికి ప్రారంభించలేదు. ఆమె పేరు మిస్ రంజిత. వయసు పాతికేళ్ళకు మించి వుండవు.
మందాకిని కళ్ళు తీసివెయ్యడం మినహా ఆమెను ఇతరత్రా ఉపయోగించుకోడానికి ప్రయత్నించటం- అంటే..."
"రేప్ చెయ్యడానికి ప్రయత్నించలేదా అని మీ ఉద్దేశం. లేదు."
"ఎలా చెప్పగలరు? ఆమె ఈ విషయాన్ని దాచివుంచవచ్చు కదా."
"మందాకినిని గ్రుచ్చి గ్రుచ్చి స్వయంగా ఎన్నో ప్రశ్నలు వేశాను. ఆమె ఒక్క విషయం కూడా దాచకుండా నిజం చెప్పినట్లు స్పష్టంగా తెలిసింది."
"అయినా మెడికల్ చెకప్ చేయించి వుండాల్సింది?"
"అవసరంలేదు. ఈ సంఘటన జరగటానికి, ఐ మీన్ అతడామెను కిడ్నాప్ చెయ్యటానికి ఓ గంట ముందువరకూ ఆమె అశ్వనీకుమార్ అనే యువకునితో గడిపింది."
"అశ్వనీ కుమార్ ఎవరు?"
"అతను ఓ ఆర్టిస్టు. కమర్షియల్ ఆర్టిస్టు. ఒక్కడే వుంటున్నాడు అపార్టుమెంట్ తీసుకుని. అతని అడ్రస్ వివరాలు విడిగా ఉన్నాయి. అశ్వనీకుమార్ ని మందాకిని ప్రేమించింది. వాళ్ళిద్దరికీ శారీరకంగా కూడా సంబంధం వుంది. ఆమె కిడ్నాప్ చెయ్యబడినరోజు కూడా ఇద్దరూ అర్థరాత్రి వరకూ అతని ఇంట్లో గడిపారు."
"వాళ్ళిద్దరి విషయం జగన్మోహనరావుకు తెలీదా?"
"ఇప్పుడు తెలిసింది. ఆమె కిడ్నాప్ చెయ్యబడేవరకూ తెలీదు. ఆమెకోసం అతడు గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాడు. అశ్వనీకుమార్ సామాన్యుడు కాబట్టి అతన్ని చేసుకునేందుకు జగన్మోహనరావుగారు ఒక పట్టాన ఒప్పుకోడు. అందుకోసం అదును చూసుకుని కన్విన్స్ చేద్దామని మందాకిని సమయం కోసం వెయిట్ చేస్తోంది. అశ్వనీకుమార్ తో తనకున్న సెక్సు సంబంధాన్ని గురించి ఆమె దాపరికం లేకుండా చెప్పింది. నేరస్థుడు తన కళ్ళు పెరికి వెయ్యబోయేముందు, ఆ పని చేయవద్దనీ, కావాలంటే తనని తాను అర్పించుకుంటాననీ ఆమె ప్రాధేయపడింది. అతడామె ఒంటిమీద చెయ్యి వెయ్యలేదు."
"అశ్వనీకుమార్ ఎలాంటివాడు?"
"అప్పుడప్పుడూ లిక్కర్ తీసుకోవటం, పేకాడటంలాంటి చిన్న చిన్న దురలవాట్లు వున్నాయిగానీ- ఒక్క మందాకినితో సంబంధం తప్ప అతని కేరక్టర్ లో చెడు ఉన్నట్లు ఎక్కడా రిపోర్టులు లభించలేదు."
"మందాకిని చాలా అందగత్తె. ఆమెను ప్రేమించినవాళ్ళు గానీ, కామించిన వాళ్ళుగానీ చాలామంది వుండి వుండవచ్చు గదా."
"ఉండవచ్చు."
"ఆమె ఎవరినయినా నిరాకరించి వుంటే- కక్షగట్టి వాళ్ళీపని చేసి వుండవచ్చు కదా."
"ఉండవచ్చు. కాని మందాకిని అతన్ని చూసింది. జీవితంలో ఇదివరకెన్నడూ తారసపడని వ్యక్తి అతను."
"ఆమె మీద ఆశలు పెంచుకుని నిరాకరించబడినవాళ్ళు డైరెక్టుగా తామే కక్ష సాధించకుండా ఇంకొకరి ద్వారా ఆ పని చేయించవచ్చు కదా."
"అవకాశముంది."
"మందాకిని ఆ వ్యక్తిని చూసింది కదా. పూర్తిగా వివరాలు ఇవ్వగలిగిందా?"
"ఇచ్చింది- ఇంచుమించు ఆరడుగుల పొడవుంటాడు. చాలా దృఢంగా ఉంటాడు. ఇరవై ఏడు, ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. ఆ వివరాలన్నీ ఈ బుక్ లో వున్నాయి. కావాలంటే ఆమెనింకోసారి ప్రశ్నించి మీరు తెలుసుకోవచ్చు."
"డబ్బుకోసం ఒక వ్యక్తి ఈ పని చెయ్యటానికి అవకాశముందా?"
"అంటే?"
"ఐ డొనేషన్స్ గురించి ఇప్పుడు ప్రచారం విరివిగా జరుగుతోంది. చాలామంది తమ కళ్ళు డొనేట్ చెయ్యటానికి ముందుకొస్తున్నారు కూడా. అయినా అవి సరిపోవటంలేదు. అందుకని ఆరోగ్యవంతులయిన వారి కళ్ళు పెరికివేసి అవసరమైన వారికి అమ్ముకోవటానికి అవకాశముంది కదా?"
"అవకాశముంది."
"ఈ ఊళ్ళో మందాకిని కళ్ళు తీసివెయ్యబడటం జరిగాక- ఎవరికయినా కార్నియల్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ చెయ్యటం జరిగిందా?"