4
డాక్టర్ కృష్ణచైతన్య అప్పుడే ఓ ఆపరేషన్ పూర్తిచేసి అలసటగా తన గదిలోకి వచ్చాడు. క్రికెట్ బాల్ తగిలి ఓ పన్నెండేళ్ళ కుర్రాడికి ఐ బాల్ లోని ఇంచుమించు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. రెటీనా డిటాచ్ అయింది. తన శక్తినంతా ఉపయోగించి, దానికి మేధస్సును జోడించి రిపేర్ చేశాడు. అయినా చూపు ఎంతవరకూ వస్తుందో అనుమానంగా వుంది.
స్ప్రింగ్ డోర్ తెరుచుకుని అతని అసిస్టెంటు ఒకరు లోపలకు వచ్చాడు.
"సార్!" అన్నాడు వినయంగా.
కృష్ణచైతన్య "ఏమిటి?" అన్నట్లు చూశాడు.
"జగన్మోహనరావుగారని ఊళ్ళోని వి.ఐ.పి.లలో ఒకరు. మిమ్మల్ని అర్జంటుగా చూడగోరుతున్నారు.
"అపాయింట్ మెంట్ వుందా?"
"లేదుసార్. కాని చాలా ముఖ్యమైన విషయమట. ప్రక్కనే ఆయన కూతురనుకుంటాను వుంది- కళ్ళకి బ్యాండేజెస్ తో."
"కాని ఈవేళ చేయాల్సిన ఆపరేషన్స్."
"చెప్పాను సార్. ఒక్కసారి మిమ్మల్ని అర్జంటుగా చూడాలని రిక్వెస్టు చేస్తున్నాడు. కూడా యస్.పి. వున్నాడు. ఆయన కూడా ఆతురత చూపిస్తున్నాడు.
"ఎస్.పి.నా?" అన్నాడు సాలోచనగా కృష్ణచైతన్య. ఎస్.పి. అనగానే కలవరపడ్డాడని అర్ధంకాదు. ఏదో అతిముఖ్యమైన విశేషమన్నట్లు అతని మనస్సు స్పందించింది.
"సరే. లోపలకు పంపించండి" అన్నాడు మళ్ళీ.
అసిస్టెంటు బయటకు వెళ్లిన అర నిమిషానికి జగన్మోహనరావు, ఆయన చెయ్యి పట్టుకుని తడుముకుంటూ మందాకిని నడుస్తూ లోపలకు వచ్చారు. కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వున్నాడు.
"కూర్చోండి" అన్నాడు కృష్ణచైతన్య మర్యాదగా.
మందాకిని రెండు కళ్ళకూ బ్యాండేజెస్ ఉన్నాయి. ఆమె తండ్రి చెయ్యి పట్టుకుని తడుముకుంటూ తడుముకుంటూ ఓ కుర్చీలో కూర్చున్నది.
కృష్ణచైతన్య ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు, ఎందుకో అస్వాభావికమైనదేదో జరిగి వుంటుందనిపించింది.
"చెప్పండి" అన్నాడు.
"నా అనుభవంలో కనీవినీ ఎరగని భయంకరమైన సంఘటన జరిగింది డాక్టర్" అని మొదలుపెట్టాడు ఎస్.పి. దారుణంగా హత్యలు చేసిన వాళ్ళని చూశాను. రేప్స్ చూశాను, మాస్ రేప్స్ చూశాను. ఇలా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి రెండు కళ్ళు పెరిగివెయ్యటం చూడలేదు!"
"ఏమిటి? రెండు కళ్ళూ..." అన్నాడు కృష్ణచైతన్య.
"అవును డాక్టర్. ఈ అమ్మాయిని ఎవరో యువకుడు వెంటాడి, ఏదో ఇంటికి తీసికెళ్ళి సరిగ్గా ఓ డాక్టర్ చేసినట్లు ఆపరేషన్ చేసి రెండు కళ్ళూ పెరికి పారేశాడు."
"రియల్లీ హారిబుల్."
ఒకక్షణం నిశ్శబ్దంగా గడిచింది. జగన్మోహనరావు మొహంలో నెత్తురుచుక్క లేకుండా. చాలా దిగులుగా కూర్చుని వున్నాడు.
మందాకిని క్రింద పెదవి నొక్కుకుంటూ, లోపల దావాగ్నిని దాచుకుంటున్నట్లుగా మౌనంగా వుంది.
"నా దగ్గర్నుంచి మీ కెటువంటి సాయం కావాలి?" అనడిగాడు కృష్ణచైతన్య.
"ఈ అమ్మాయిని ఒకసారి ఎగ్జామిన్ చెయ్యాలి."
"ఆల్ రైట్" అంటూ బజర్ నొక్కి సిస్టర్ని పిలిచాడు. ఆమెతో మందాకినిని ప్రక్కనే ఉన్న ఎగ్జామినేషన్ రూంలోకి తీసుకు వెళ్ళమని చెప్పాడు. తర్వాత తాను అనుసరించాడు.
సిస్టర్ రెండు కళ్ళకూవున్న బ్యాండేజెస్ ఊడదీసింది.
"ఫెంటాస్టిక్. ఎంతో అనుభవమున్న డాక్టర్ చేసినట్లుగా రెండు ఐ బాల్సూ ఎన్యోక్లియేట్ చెయ్యబడి వున్నాయి. చాలా నీటుగా ఒక్క రక్తపు చుక్కయినా లేకుండా ఎసెస్టిక్ గా వుంది. నిజంగా అతనికి దిగ్భ్రాంతి కలిగింది. ఆ రెండు కళ్ళూ వుంటే ఈ అమ్మాయి అపూర్వమైన అందగత్తె అయి వుండాలనిపిస్తోంది. ఇప్పుడామె పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ఆమెను ఏవో ప్రశ్నలు వెయ్యాలనుకున్నాడు. కాని సమంజసం కాదనిపించింది. సిస్టర్ని వేరే బ్యాండేజెస్ వెయ్యమని చెప్పి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు.
"డాక్టర్! ఆమెని ఎగ్జామిన్ చేశారా?" అనడిగాడు ఎస్.పి.
"చేశాను."
"ఆపరేషన్ చేసి తీసినట్లుగా వుందా? లేక ఇష్టమొచ్చినట్లు కనుగుడ్లు పెరికి వేసినట్లుందా?"
"ఆపరేషన్ చేసి తీసినట్లుగానే వుంది. అంతేకాదు. ఎంతో అనుభవమున్న డాక్టర్ ఆపరేషన్ చేసినట్లుగా వుంది."
"కాబట్టి ఓ డాక్టర్ ఈ పని చేసి వుంటాడనుకోవచ్చా?"
కృష్ణచైతన్య ఆలోచనలో పడ్డాడు.
"చెప్పండి డాక్టర్."
"వైద్యవృత్తి చాలా పవిత్రమైనది. ఈ వృత్తిలో వుండి అటువంటి దుర్మార్గానికి ఒడికట్టేవారుంటారనుకోను."
ఎస్.పి. జయచంద్ర కృష్ణచైతన్య ముఖంలోకి చూశాడు. అందులో వర్చస్సు, కళ్ళలోని కాంతి, వాటిల్లోంచి ఉట్టిపడే సౌమ్యత-వైద్య వృత్తిని గురించి చెడుగా అలాంటి మహానుభావునితో తర్కించాలనిపించలేదు.
అంతవరకూ నిశ్శబ్దంగా కూర్చునివున్న జగన్మోహనరావు వున్నట్లుండి బరస్ట్ అయ్యాడు.
"డాక్టర్! మందాకిని నాకు ఒక్కగానొక్క కూతురు. కోట్లకొద్దీ ఆస్తికి వారసురాలు. ఎన్ని లక్షలరూపాయలైనా డబ్బు ఖర్చు పెడతాను. నా కూతురికి తిరిగి చూపు రావాలి. మీరు ప్రపంచంలో గొప్ప కంటి డాక్టర్లలో ఒకరు. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. ఎవరి కళ్ళయినా సరే అమర్చి నా కూతురికి చూపు వచ్చేలా చెయ్యండి డాక్టర్."
కృష్ణచైతన్య అతనివంక సానుభూతిగా చూశాడు.
"ఐయామ్ సారీ జగన్మోహనరావుగారూ! అది సాధ్యంకాదు" అన్నాడు.