"ఇంకా తెలుసుకోలేదు. మిస్ రంజితా! మా డిపార్టుమెంట్ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ వుంటారు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ కేసు పరిశోధన గురించి నియమిస్తున్నాను. మీకు ఎలాంటి సహాయం కావల్సినా మా దగ్గర్నుంచి నిముషాలమీద లభిస్తుంది. మినీ వైర్ లెస్ సెట్, ప్రమాదం ముంచుకొస్తే ప్రాణం కాపాడుకునేందుకు, ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు రివాల్వర్ వగైరాలు మీకు సమకూర్చబడతాయి. ఇది మన పోలీస్ డిపార్ట్ మెంట్ కు ప్రెస్టేజ్ ఇష్యుగా తీసుకోండి. మీరు చాలా వ్యయప్రయాసలకోర్చి పనిచెయ్యాలి."
జయచంద్ర ముఖంలో చాలా ఆందోళన కనిపిస్తోంది. అతను చాలా సమర్థుడయిన, నిజాయితీపరుడయిన ఆఫీసరు. ఈ అర్బన్ డిస్ట్రిక్ట్ ను ఎస్.పి.గా వచ్చాక నగరంలోని రౌడీయిజం చాలావరకూ తగ్గిపోయింది. అతని పేరు చెబితే నగరంలోని రౌడీలూ, గూండాలూ, దొంగతనాలు చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. అతని పేరు చెబితే అతను వచ్చాక ఎంత కొమ్ములు తిరిగిన రౌడీ అయినా గడగడలాడిపోయేవాడు. నగరంలోఫ్ నేరాలసమాఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏదన్నా నేరం జరిగినప్పుడు ఆ నేరస్థుడు పట్టుబడకపోయినా, శిక్షించబడక పోయినా ఆయనకి నిద్రపట్టేదికాదు.
రంజిత ఎస్.పి. దగ్గర సెలవు తీసుకుని బయటికి వచ్చి తన ఎర్రరంగు మారుతీ కారులో ఎక్కింది. ఆ కారు ఆమె స్వయంగా ఊరినుంచి తెచ్చుకుంది.
స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్టు చేసింది.
రంజిత చాలా అందంగా వుంటుంది. ముఖ్యంగా ఆమె కళ్ళు... విశాలంగా విప్పారి, నల్లగా మెరుస్తూ, చేపల్లా కదులుతూ ఎంతో మనోహరంగా వుంటాయి.
* * *
రంజిత పద్మనేత్రాలయకు వెళ్ళి డాక్టర్ కృష్ణచైతన్యను కలుసుకుంది.
"కార్నియాకి సంబంధించిన డిసీజెస్ వచ్చి అంధులైనవారికి డొనేట్ చెయ్యబడినవారి ఐబాల్ లోంచి కార్నియా తీసి, దాన్ని ట్రాన్స్ ప్లాంట్ చెయ్యటం వల్ల చూపు వస్తుందని తెలుసుకున్నాను. అసలు ఐ బాల్స్ మనకెలా లభిస్తూ వుంటాయి?" అనడిగింది.
"ఇదివరకు ఎక్కువగా మనదేశానికి శ్రీలంక నుంచి వస్తూ వుండేవి. ఆ దేశానికి, మన దేశానికి మధ్య ఇప్పుడు గొడవలు చెలరేగుతూ వుండటంతో అక్కడ్నుంచి ఐబాల్స్ రావటం ఆగిపోయాయి. ఇప్పుడెక్కువగా అహ్మదాబాద్ నుంచి దేశం నలువైపులకూ వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి సరఫరా చేయబడుతున్నాయి."
"ఒక్క అహ్మదాబాద్ నుంచే ఎక్కువగా సరఫరా చేయబడటానికి కారణమేమిటి?"
"గుజరాత్ లో ప్రజలు ఐడిసీజెస్ వల్ల చూపు పోగొట్టుకున్నవారి గురించి ఎక్కువగా స్పందించి వుంటారు. అందుకని వారిలో ఎక్కువ మంది తమ కళ్ళను డొనేట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల వారిలో, ముఖ్యంగా మన దక్షిణాది వారిలో ఈ కళ్ళు డొనేట్ చెయ్యటం తక్కువగా ఉంది. బహుశా ఇతరుల బాధల్ని గురించి ఎక్కువగా ఆలోచించలేకపోవటం, సెంటిమెంట్ల పరిధిలోంచి బయటకు రాలేకుండా వుండటం, చనిపోయాక మన శరీరం బూడిదపాలో, మట్టిపాలో కాకతప్పదని తెలిసికూడా అవయవాలమీద మమకారాన్ని చంపుకోలేకపోవటం, జీవించి ఉన్నప్పటిలాగే, మరణించాక ఏం జరుగుతుందోనన్న భయం కారణాలు కావచ్చు."
"ఒక వ్యక్తి చనిపోయాక ఎంతసేపులోపల ఇతరుల కుపయోగపడటానికి అతని కళ్ళు పనికివస్తాయి?"
"ఎంతత్వరగా వీలయితే అంత తొందరగా- ఐబాల్సు తీసి భద్రపరచటం నంచిది. మేక్సిమమ్ ఆరుగంటలలోగా తీసివెయ్యటం. తర్వాత ఆ కనుగుడ్లు పనికిరావు."
"కనుగుడ్లు తీసివేశాక వాటిని అదే- వాటిలోని కార్నియాను వెంటనే ఉపయోగించాలా? లేకపోతే కొంతకాలంపాటు ప్రిజర్వ్ చేసి వుంచవచ్చా?"
"ఐబాల్సు-కార్నియావున్న భాగం పైకి వచ్చేలా చిన్నబాటిల్ లో సెలైన్ లో వుంచి, డీప్ ఫ్రిజ్ లో పెట్టినట్లయితే వారంరోజులపాటు ప్రిజర్వ్ చేసి వుంచవచ్చు. ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నెలరోజులపాటు ప్రిజర్వ్ చెయ్యవచ్చు. కాని అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ నిల్వకుమించి డిమాండ్ వుంటూ వుంది కాబట్టి."
"కళ్ళలో ఆడవారిని మొగవారికీ, మొగవారివి ఆడవారికీ పనికివస్తాయా?" అనడిగింది రంజిత.
"పనికివస్తాయి. అలాంటి తారతమ్యం ఏమీ లేదు."
"ఇంకో సందేహం, ఐ డొనేషన్ కోసం ఏర్పాటు చెయ్యబడిన ఇన్ స్టిట్యూట్ ద్వారా కాకుండా, ప్రైవేట్ గా డొనేట్ చేసిన వ్యక్తుల ద్వారా అంటే- ఉదాహరణకి నా కళ్ళను నేను డొనేట్ చేశాననుకోండి. అవి సరాసరి మీ హాస్పటలు నుంచి స్పెషలిస్ట్ ఎవరయినా వచ్చి తీసుకునేందుకు అవకాశముందా?"
కృష్ణచైతన్య ఉలికిపడినట్లు ఆమె ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
"ఏమిటలా చూస్తున్నారు?" అనడిగింది రంజిత.
"మీ కళ్ళు..."
"ఆగిపోయారేం, చెప్పండి?"
"చాలా అందంగా, ప్రపంచంలోని రెండు అద్భుతాల్లా వున్నాయి."
రంజిత నవ్వింది. "నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు."
"మీరు... ఐమీన్... అంటే డొనేట్ చేసిన వ్యక్తి అంతకుముందు వ్రాసి ఇచ్చిన పర్మిషన్ లెటరు పోలీసు డిపార్టుమెంటుకి చూపించి, వారిచ్చిన పర్మిషన్ కూడా తీసుకొని డెడ్ బాడీ నుంచి ఐ బాల్స్ తీసుకోవచ్చా?"
"తీసుకోవచ్చు."
"మీ హాస్పటల్ నుంచి అలా తీసుకోవటం జరుగుతూ వుంటుందా?"
"జరుగుతూ వుంటుంది."
"ఈ వారం పదిరోజుల్లో మీ హాస్పటల్ లో కార్నియల్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ ఏమయినా జరిగిందా?"
"లేదు."
"అంటే ట్రాన్స్ ప్లాన్ టేషన్ కోసం వేచివున్న కేసులేం లేవా?"
"దేశవ్యాప్తంగా ప్రఖ్యాతమైన పద్మనేత్రాలయలో కార్నియల్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ కోసం వెయిట్ చేసే కేసులు లేకుండా ఎలా వుంటాయి? ఐ బాల్సు సిద్ధంగా లేకుండా చాలా కేసులు పెండింగ్ లో వున్నాయి."
"అలా వెయిట్ చేసే కేసుల్లో అతి ముఖ్యమైన పేషెంట్సు ఎవరయినా వున్నారా?"