Previous Page Next Page 
గోరింటాకు పేజి 9


    కాని ఈ విషయం బ్రహ్మానందానికి చెప్పేముందు అతనికి ఎందుకో భయం వేసింది. ఒకవేళ బ్రహ్మానందం ఏమైనా అన్నా ఫర్వాలేదు. చివాట్లు తిందాంలే అనే మనఃస్థితికి వచ్చాడు. మెల్లిగా మాటల మధ్యలో ఈ విషయం బయటపెట్టి అతని ముఖంలోకి తొట్రుపడుతూ చూశాడు.

 

    కాని అతని ముఖంలో ఏభావం ద్యోతకం కాలేదు. చిన్నగా నవ్వి "నీ ఇష్టం" అన్నాడు.

 

    అతననుకున్న సమాధానం రాలేదు. అందుకని కొంచెం ఆగి, బాధగా "అదికాదు, నీకేమైనా కష్టమా?" అని అన్నాడు.

 

    "కష్టమా?" అని బ్రహ్మానందం నిర్లక్ష్యంగా నవ్వాడు. "ఇవన్నీ నాకు యథాలాపమైన సంగతులు. వీటికి నేనట్టే ప్రాధాన్య మివ్వలేను" అన్నాడు.  

 

    చక్రపాణికి తృప్తి కలిగిందికాని, బ్రహ్మానందం మాటల్లో ఏదో మనసుకు ఆరాటం కలిగించే భావం మెదిలినట్లు స్ఫురించింది.

 

    మరునాడు ముకుందం వాళ్ళగదికి వచ్చేశాడు.  

 

                                               3

 

    కాలేజీ ఎలక్షన్ల రోజులవి. ఎప్పటిలాగానే విద్యార్థుల్లో కలకలం బయలుదేరింది. దెబ్బలాటల్లోకి దిగాలన్నా, చదువు యెగేసి ఉత్సాహకరమైన కార్యక్రమాల్లో తిరగాలన్నా, వాళ్ళకు అదే అవకాశం. ఈ అధ్యాయం కోసమే ఎదురుచూసేవాళ్ళు, కలలుగనేవాళ్ళు పెక్కుమంది.

 

    ఉన్నట్లుండి తాను వచ్చి ఈ ఎన్నికల గొడవల్లో అమాంతం ఇరుక్కుంటానని రాజారావు అనుకోలేదు. అతను పూర్తి ఏకాంతజీవితం గడుపుతున్నాడని చెప్పొచ్చు. బుద్ధిపుట్టినరోజున కాలేజీకి వెళ్ళటం, లేనిరోజున కాలేజీ ఎగ్గొట్టి గదిలో హాయిగా నిద్రపోవటం, ఇదీ దినచర్య. ఈ క్రొత్తగది సుఖంగానే వుంది. చుట్టుప్రక్కల అన్నీ ఆఫీసర్ల ఇళ్ళు. మేడమీద విశాలమైన గది. క్రింది భాగంలోనే ఆఫీసరుగారి కాపురం. సాయంత్రంకూడా బయటకు పోవటం మానేశాడు. డాబామీద అటూ ఇటూ పచార్లు చేసేవాడు. హిగిన్ బాదమ్స్ కి వెళ్ళి కొన్ని కొత్తపుస్తకాలు కొనుక్కొచ్చాడు.

 

    ఆఫీసరుగారికి ముప్ఫయి అయిదేళ్ళకు మించవు. ఆయన తరచూ క్యాంపుల్లో వుండేవాడు. ఎప్పుడయినా ఊళ్ళో వున్నప్పుడు వచ్చి రాజారావుతో లోకాభిరామాయణం వేసేవాడు.

 

    లేకపోతే ఎదురింటిపిల్లలు వస్తూవుండేవారు. వాళ్ళతో చిలిపి కబుర్లతో కాలం ఆనందంగా గడిచేది. చక్రపాణికి ఉత్తరం వ్రాయటం ఒక అనుభవం.

 

    రోజులు ఇలా గడుస్తుండగా, ఒక సాయంత్రం కొంతమంది విద్యార్థులు గదిలోకి వచ్చారు. వస్తూనే రాజారావుని పొగడటం మొదలు పెట్టారు. మీ నిజాయితీ, మీ సమర్థత, మీ అనుభవం, మీ పలుకుబడి, వీటి తాత్పర్యమంతా ఏమిటయ్యా అంటే, వస్తూన్న కాలేజీ ఎన్నికల్లో వీళ్ళ పార్టీ తరపున రాజారావు స్టూడెంట్సు యూనియన్ ప్రెసిడెంటుగా నిలబడాలి. రాజారావు చికాకుపడ్డాడు. తను ఉన్నన్నిరోజులు ఈ రాజకీయాలు ఎలానూ తప్పవు. ఒకటి రెండు సందర్భాలలో తన అన్నలకూ, తనకు కూడా తగాదా వచ్చింది. వాటినుండి విముక్తుడు అవుదామన్నా సాధ్యం కాని స్థితి. ఇక్కడ అలాంటి వాతావరణమూ, పార్టీలు, కక్షలు, వైషమ్యాలు అతను ఒప్పుకోలేదు. కాని ఒక్కసారి మనిషి యొక్క ఒప్పుదలకు సంబంధంలేకుండానే అతనో మనోపన్నాగంతో ఇరుక్కోవలసి వస్తోంది. ఆ విద్యార్థులు రోజూ వచ్చి వేధించటం ఆరంభించేసరికి చివరిక్షణాన 'ఊఁ'అనక తప్పిందికాదు.  

 

    అతను అలా అనటమేమిటి! ఇక కోలాహలం చెలరేగిపోయింది. మొదట ప్రతిపక్షసభ్యులు అతనివద్దకు రాయబారానికివచ్చి రాజీ వప్పందానికి ప్రయత్నాలు చేశారు. అతని స్వంత విషయం కాదుగా, ఏ సంగతీ తేల్చి చెప్పడానికి? రాయభారం విఫలం పొందేసరికి బెదిరింపులు రాసాగాయి. ఇతన్ని బలపరచే పార్టీ సభ్యులు ఈ బెదిరింపులు విని రెచ్చిపోయి, ఎదురు సవాళ్ళు చేశారు. ఇహ సమావేశాలకు మితిలేకుండా పోయింది. రాజారావు వుంటున్నగది హెడ్ క్వార్టర్స్. ఇంకా మిగతా ఇద్దరి విద్యార్థులు గదులు బ్రాంచి ఆఫీసులు. రాత్రింబవళ్ళు ఇదే గొడవ, ఇవే సమస్యలు. ఒకరికొకరు ఎదురైనప్పుడు హెడ్ క్వార్టర్స్ కా? బ్రాంచీకా? అని ప్రశ్నించుకొనేవాళ్ళు. సమావేశాలు తీవ్రంగావుండేవి. అందులో అనేకరకాల తర్జనభర్జనలు జరిగేవి ఎత్తుకు పై యెత్తులు ఉండేవి. కొంతమంది విద్యార్థులు గూఢాచారులుగా వ్యవహరిస్తూండేవారు. ఈ గూఢచారులు అందించే వార్తలతో అవతల పార్టీవాళ్ళు గంభీరంగా ముఖాలుపెట్టి ఈ కొత్త విఘాతాన్ని ఎదుర్కోవటం ఎట్లాగా అని తెగ ఆలోచించేవాళ్ళు. అవతలివాళ్ళు అతితెలివైన వాళ్ళు. వీళ్ళని ఓడించటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ వాడసాగారు. వాటిలో మొదటిది కులబేధం. పైగా అవన్నీ నోటికొచ్చినట్లుగా ప్రచారం చేయబడుతూ వుండేవి. అతని పార్టీలోంచి సాయశక్తులా ప్రయత్నించి, ఇద్దరినీ చీల్చి, ప్రెసిడెంట్ పదవికి నిల్చోబెట్టారు ప్రతిపక్షంవాళ్ళు. వీళ్ళలో వీళ్ళను చీల్చి ఓట్లు చెల్లాచెదరయేటట్లు చేద్దామని వాళ్ళ యెత్తు. ప్రెసిడెంటుతో కూడా ఇంకా మిగతాశాఖలకు చెందిన పదవులుకూడా వుంటాయి కదా! వీళ్ళ వ్యక్తిగత విలువలనుబట్టి మిగతా అభ్యర్ధులకు పడే ఓట్లుకూడా ఆధారపడి ఉన్నాయి.

 

    ఒకరోజున ప్రిన్సిపాల్ గారు అభ్యర్ధులందరూ "విద్యార్ధుల బాధ్యత" అన్న అంశంపై స్టేజీఎక్కి మాట్లాడమని నోటీసు పంపారు. కొంతమంది అభ్యర్ధులు గుండెల్లో రాయిపడింది. వాళ్ళు ఇంతవరకు ఎన్నడూ స్టేజీ ఎక్కిన పాపానపోలేదు. ఇంగ్లీషు కాదుగదా, తెలుగు మాటలు కూడా నాలుగుముక్కలు తప్పులేకుండా మాట్లాడటం చేతకాదయ్యె. వాళ్ళంతా గబగబా లెక్చరర్ల వద్దకు బయలుదేరి ఉపన్యాస భాగాలు వ్రాయించుకొని కంఠతాపట్టారు. రాజారావుకు చిన్నప్పటినుంచి నలుగురి ఎదుట దబాయించి మాట్లాడే అలవాటుంది. తప్పయినా ఒప్పయినా జంకకుండా గడగడ మాట్లాడటం అబ్బింది. అందుకని అతనికి తంటాలేకపోయింది. తీరా స్టేజిమీదకు వచ్చేసరికి కంఠతాపట్టినవాళ్ళు మధ్యలోనే మరిచిపోయి తెల్లమొహం వేశారు. రాజారావు ఇంగ్లీషులోనే మాట్లాడి, అందంగా అయిదు నిమిషాల్లో ముగించాడు. అతని ప్రత్యర్థి తెలుగులో లేని ఉద్రేకం తెచ్చుకొని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆరోజు పేరు రాజారావుకే దక్కింది. ఇంకా అసలైన కన్వాసింగ్ బయలుదేరింది. ఒకరిమీద ఒకరు విసుర్లు, ఒకర్ని ఒకరు గేలిచేసుకోవడాలు, ఒకరి లోపాన్ని ఒకరు వెక్కిరించుకోవడాలు ప్రయత్నించారు. ఇదివరకు రాజారావుకూ, ఉషారాణికీ జరిగిన రభస ఎవరో పసిగట్టినట్లున్నారు. దాన్ని వెలికితీసి అతను దుశ్శీలుడని ప్రచారం సాగించారు. రాజారావుకు కడుపులో దేవినట్లయింది. ఆ రోజంతా బాధపడ్డాడు. ఇతని పార్టీవాళ్ళు ఇతన్ని ఓదార్చి అతని ప్రత్యర్థి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలుతీసి తేదీలతోసహా ప్రచురించారు. దాంతో పెద్దగొడవ చెలరేగింది. ప్రిన్సిపాల్ గారు అందర్నీపిలిచి చివాట్లుపెట్టి పంపించారు. కరపత్రాలలోకి కవిత్వం, ప్రాసలు, విచిత్ర సంభాషణలు ఎక్కసాగాయి. తరువాత రంగురంగుల కార్డులు, జేబురుమాళ్ళు సెంటువాసనలతో కలిపి ముద్రించబడసాగాయి. ఊళ్ళోని గోడలనిండా, రోడ్లనిండా పోస్టర్లు అంటించబడసాగాయి. కాలేజీకి బయట భారీయెత్తున బేనర్లు తగిలించబడ్డాయి. సినిమాహాల్సులో స్లయిడ్సు ప్రదర్శించబడ్డాయి.

 Previous Page Next Page