Previous Page Next Page 
గోరింటాకు పేజి 10


    రాజారావుకు మనశ్శాంతి లేకుండాపోయింది. తానీ పద్మవ్యూహంలో అనవసరంగా చిక్కుకున్నట్లు అనిపించింది. కాని ఇప్పుడేం చేసేటట్లు? అతన్లో పౌరుషం కూడా చెలరేగింది. ఇప్పుడు తాను ఓడిపోతే నలుగురిలో నగుబాటు. ఎలాగూ రంగంలోకి వురికాడు, ఇక శక్తివంచన లేకుండా గెలుపుకోసం ప్రయత్నించడమే కర్తవ్యం.  

 

    ఒకరోజు అతను యెక్కడెక్కడో తిరిగి గదికి వస్తున్నాడు, ఇంతలో అతని మామయ్య కలిశాడు.

 

    "ఏమోయ్! ఎక్కడా కనబడటం మానేశావూ?" అని పలకరించాడు.

 

    ఆయన్ని చూడగానే రాజారావు ముఖం ముడుచుకున్నాడు. "ఏమీ లేదు. కొంచెం పన్లలో" అన్నాడు.

 

    "ఏమిటోయ్ ఆ వల్లమాలిన పనులు, ఎన్నికలేనా?"

 

    రాజారావు జవాబు చెప్పలేదు. ముఖం ప్రక్కకి త్రిప్పుకున్నాడు.

 

    ఆయన వాలకం చూస్తే ఇతన్ని అప్పుడే వదలదలుచుకున్నట్టు కనబడలేదు. "రావయ్యా ఇంటికి. ఇంట్లో అంతా నీకోసం కలవరిస్తున్నారు. నీ గురించి రాత్రి మీ అత్తయ్య నాతో పోట్లాట వేసుకుంది. పద" అన్నాడు.

 

    "ఇవ్వాల్టికి వదిలెయ్యి మామయ్యా... రేపెప్పుడైనా తప్పకవస్తాను" అన్నాడు.

 

    "ఈ కబుర్లన్నీ నా ముందు చెప్పకు. నిన్ను ఇవాళ వదిలేశానంటే ఇహ మళ్ళీ కలియడం వచ్చే జన్మలోనే. ఈ ఊళ్ళో నీకు ఎంతో అయినవాళ్ళు వున్నారన్న సంగతి నువ్వు మర్చిపోయినా ఈ బొందిలో ప్రాణం వుండగా అలా మేము అనుకోలేము. ఏమిటిది రాజా? ఎవరిదగ్గర నీకు ఈ మొహమాటం, సంకోచం? నీ సొంత మామయ్య దగ్గరా? నువ్వు నెలల తరబడి మా కళ్ళబడటం లేదంటే మీ అమ్మ యెంత బాధపడుతుందో తెలుసా? ఎవరికన్నా తెలిస్తే నవ్వుతారుకూడాను."

 

    ఆయన అతని జబ్బ పట్టుకుని లాక్కుపోసాగాడు. ఆ సమయంలో రాజారావుకి కూడా ఒక అనిర్వచనీయమైన బాధ కలిగింది. "పద" అని మనసులో అనుకుని మెదలకుండా నడవసాగాడు.

 

    రెండు ఫర్లాంగులు నడిచి ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. దారిలో ఆయన తన కుటుంబ విషయాలు ఏవో చాలా చెప్పాడు. అవన్నీ రాజారావు వినలేదుగాని వూరికినే ఊఁ కొట్టసాగాడు.

 

    ఇంట్లోకి పోయేసరికి అంతా గఁయ్ గఁయ్ మని తగులుకున్నారు. అత్తయ్య, ముసలమ్మగారు, బావ వీళ్ళంతా కలిసికట్టుగా సూటీపోటీ మాటలనసాగారు.

 

    "ఏమయ్యోయ్, అల్లుడా! ఇన్నాళ్ళకు కనిపించామా? ఏమిటీ అత్యాచారం? మాకు కనిపించకూడదని ఏమయినా శపథం పట్టావా?" అంటున్నది అత్తయ్య.

 

    "ఏం నాయనా! ఈ ముసల్ది ఇంకా చచ్చిపోలేదు కదా, ఒకనాడు తొంగి చూచిపోవటానికయినా భారమైపోయిందా? మీ అన్నయ్యలు మా వూరు వచ్చారంటే నన్ను చూడకుండా ఒక్కక్షణమైనా వుండగలరా? నువ్వేమిటి? ఇలా" అంటూ ముసలమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంది.   

 

    "నిన్ను కలుసుకుందామని నీ రూమ్ కి కాళ్లకు బలపాలుకట్టుకుని తిరిగాను బావా! ప్రెసిడెంటువిగా! నీ దర్శనం కాలేదు" అంటూ అతగాడు.

 

    రాజారావుకు ఉక్కిరిబిక్కిరి అయింది. ముభావంగా నవ్వి వూరుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చుని అంతా పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. రాత్రి ఎనిమిది దాటి వుంటుంది. రాజారావుకి సంకటావస్థ వచ్చిపడింది. భోజనాలవేళ, ఎలానూ బలవంతం చేసి తీరతాను. ఎలా నిరాకరిస్తాడు? కొన్నాళ్ళ క్రిందట పండుగో, ఏదో వచ్చి తనను ఒకసారి భోజనానికి పిలిచారు పగటిపూట. ఎవరో మిత్రులు కనిపిస్తే వాళ్ళతో హడావిడిగా పన్నెండు దాటిపోయింది. అప్పుడు వాళ్ళను ఒదిలించుకొని ఆదరా బాదరాగా మామయ్యగారింటికి వెళ్ళేసరికి వాళ్ళంతా అప్పుడే భోజనాలు చేసి కూర్చున్నారు. చేస్తే చేశారు. తాను భోజనానికి వచ్చినట్లు అయినా గుర్తించక, చేసే వచ్చానన్న భావాన్ని ప్రకటిస్తూ ఏదో సంభాషణలోదింపి, సాయంత్రందాకా అక్కడే కూర్చోబెట్టేశారు. అలాంటివాళ్ళు...! కాని ఈరోజు ఆ మామయ్య ఆప్యాయత ఒలకబోస్తున్నాడు. మాటిమాటికీ భుజంమీద చేయివేసి నిమురుతున్నాడు. "లంకంత ఇల్లుందిగదా మనకు, నీకు ఇందులో ఒకగది లేకపోయిందా చెప్పు? ఎంత మొత్తుకున్నా నీ పంతం నీదేగానీ, మా గొడవ పట్టించుకోవుగదా" అంటున్నాడు. "ఏమిటో చెల్లాయి, దాని కుటుంబం చూస్తున్నప్పుడల్లా గుండె తరుక్కుపోతూ వుంటుంది. బావ పోయినప్పట్నుంచీ అన్నీ కష్టాలే. మిమ్మల్ని చూసుకుంటూ, మీమీద ఆశలన్నీ పెట్టుకుని గడుపుతోంది" అంటూ సానుభూతి ప్రదర్శిస్తున్నాడు. చివరకు భోజనానికి లే అంటే లే అన్నారు. బలవంతంగా లేవతీసి కాళ్ళు కడుక్కోవటానికి పంపించారు.   

 

    రాజారావు పెరట్లోకిపోయాడు నీళ్ళకోసమని. చీకటిలో ఒక మనిషి ఎదురుగా నడిచివస్తోంది. ఇతన్ని చూసి చప్పున ఆగి, వెనుదిరిగి పోబోయింది.

 

    అతను ఇరుకునపడి "ఫరవాలేదు వెళ్ళు సత్యవతీ!" అన్నాడు.

 

    పాపం ఆ అమ్మాయి సంకోచిస్తూ నిలబడింది.

 

    "కులాసాగా వున్నావా?" అన్నాడు రాజారావు.

 

    సత్యవతి తల ఊపింది.

 

    "కొంచెం చిక్కినట్లుగా వున్నావే" అన్నాడు రాజారావు.

 

    ఆ అమ్మాయి దిగులుగా నవ్వి "చిక్కానా? లేదే" అన్నది.

 

    "ఇంకా ఎవరికీ చిక్కలేదా?"

 

    "ఫో."

 

    "పోతున్నాను. కాని నువ్వు అడ్డు..." అంటూ ఆమెను తొలగించుకుని ముందుకు పోబోయాడు.

 

    "మాట" అని ఆమె అతన్ని ఆపి "బొత్తిగా కనిపించటం మానేశావేం?" అంది సిగ్గుపడుతూ.

 

    "అంత మరీ ట్రాన్స్ప్ రెంట్ గా వున్నానా?" అన్నాడు రాజారావు.

 

    "అంటే?" అన్నది సత్యవతి.

 

    "అంటే దానికి తెలుగు తెలియదేం కర్మం. అయినా నీకు ఇంగ్లీషు."

 

    "నేను చదువుకోలేదనేగా నీకు వెటకారం? ఎవరో వస్తున్నట్లున్నారు. వెడతాను" అంటూ ఆమె ఆ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోయింది.

 

    రాజారావు మనసు చివుక్కుమన్నది. ఏమిటిది... చివరిమాట అలా అంది? "ఎవరో వస్తున్నట్లున్నారు. వెడతాను" వస్తే ఏం? తామిద్దరూ మాట్లాడుకొంటూండగా ఎవరూ చూడకూడదా? అంత చూడకూడనటువంటి భావాలు ఏమీ లేవే? ఈ అమ్మాయిలు...!

 Previous Page Next Page