వీళ్ళు అర్థంచేసుకున్నారు. ఆ ఇంటివైపు వున్న గోడనున్న కిటికీ తలుపులు తెరవకూడదు. ఆయన భార్య మా చెడ్డమనిషీ, అంటే గయ్యాళన్నమాట. సరే ఒప్పుకున్నారు.
మరునాడే అందులోకి వచ్చి చేరారు. గదులు సౌకర్యంగానే వున్నాయి. హుస్సేన్ సాయిబుగారి భార్యకు ఘోషా ఏమీలేదు. ఒకసారి వచ్చి చెప్పవలసినవన్నీ టకటక చెప్పివెళ్ళింది. ఆమెకు తెలుగు బాగా వచ్చు. నిన్ననే వచ్చినట్లయితే తమకా తిప్పలు వుండకపోయేవికదా అనుకున్నారు వాళ్ళు.
సాయిబుగారికి బోలెడు గేదెలు, ఆవులు ఉన్నాయి. ఆయనది పాలవ్యాపారమన్నమాట. పనిచేసేవాళ్ళతో యజమానురాలు ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉండేది. గఁయ్ గఁయ్ మనే ఆవిడ అరుపులు నిరంతరం వీళ్ళకి వినిపిస్తూనే వుండేవి. ఆవిడ ధాటికి తట్టుకోలేక పనివాళ్ళు తరుచు మానేస్తూ వుండేవారు. అటువంటి సమయాల్లో వాళ్ళ అబ్బాయిలే వెళ్ళి ఇళ్ళలో పాలుపోసి వచ్చేస్తూ వుండేవాళ్ళు.
చక్రపాణికి జీవితం హాయిగానే వుంది. కాని యేదో అసంతృప్తిగా వుంది. ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఎటో తిరుగుతూ వుండేవారు. దగ్గర్లోవున్న సుందర దృశ్యాలన్నీ చూసివచ్చారు. బ్రహ్మానందం అంటే ఒకరకం భయంగా, గౌరవంగా వుండేది. కాని అభిమానం వుండేదికాదు. అతని నిజరూపం ఇది కాదనిపించేది. చాలాకాలం నుంచి కలిసి వుంటూన్న మిత్రులుగా సంచరించసాగారు. బ్రహ్మానందం చాలా చనువు తీసుకుని మాట్లాడుతూ వుండేవాడు.
ఇంటినుండి రెండురోజులకో ఉత్తరమైనా వస్తూండేది చక్రపాణికి. మొట్టమొదటిరోజుల్లో వాటికి ఓపిగ్గా జవాబు వ్రాసేవాడు. కాని రానురాను అలా చీటికిమాటికి ఉత్తరాలు రాయటం చిన్నతనంగా, నామోషిగా వుండేది. బంధాలనుంచి దూరంగా వుండాలనీ, గంభీరంగా వుండటం నేర్చుకోవాలనీ అనుకుంటూ వుండేవాడు. తన జీవితంలో ఎప్పుడో ఏదో జరుగుతుందనీ అది సామాన్యంగా వుంటుందనీ అతనికి తోస్తూవుండేది. అతనిలో ఏదో సంఘర్షణ జరుగుతూవుండేది. తను వ్యర్థంగా రోజులు గడుపుతున్నాడనీ, అసలు గడపవలసిన విధానం అదిగాదనీ అనిపించేది.
ఇలావుండగా హఠాత్తుగా ముకుందం కలిశాడు. అంటే ముకుందరావు. మొదట చక్రపాణి అతన్ని గుర్తుపట్టలేదు. ఆరోజు బ్రహ్మానందం ఎక్కడో పనివున్నదనిపోయాడు. తను ఏమీతోచక పబ్లిక్ గార్డెన్ వైపు నడిచాడు. అక్కడ ఎవరూలేని ఏకాంతప్రదేశం చూసుకుని చతికిలబడి, చుట్టూ పరిమళాలను వెదజల్లుతున్న పువ్వులని పరిశీలిస్తూ, పువ్వులని స్త్రీల మనస్సుతో పోల్చవచ్చునా లేదా అని ఆలోచించసాగాడు. పువ్వులనున్న రేఖలాంటిది స్త్రీల మనస్సు పువ్వులు కనబడతాయి. స్త్రీల మనస్సు కనబడదు. తెలిసీ, తెలియని ఊహ. అతనికి నవ్వు వచ్చింది. తన కర్థంకావు కొన్ని సంగతులు. జీవితం చివరివరకు అంతే. ఒక అరగంట గడిచాక భుజంమీద పలుచని చెయ్యి పడితే తల ఎత్తి చూచాడు. చామనచాయగా దిగులుగా, మాసినగడ్డంతో వున్న మనిషి. "నన్ను గుర్తుపట్టలేదా?" అన్నాడు.
చక్రపాణి అతనివంక నిశితంగా చూచాడు. ఇతన్ని కాదుగానీ, ఇలాంటివాణ్ణి ఎక్కడో చూచినట్లు తోచింది. సంకోచంలోపడి "లేదండీ మీరు... మరి క్షమించాలి" అన్నాడు నసుగుతూ.
"నేను ముకుందాన్ని!"
ఏ ముకుందం? చిన్నప్పుడు చినిగిన చొక్కాతో, డ్రాయర్ తో బడికివచ్చే పిల్లవాడు. హైస్కూల్లో ఇంట్లోపనుల ఒత్తిడివల్ల క్లాసులోకి ఆలస్యంగా వస్తూ మేష్టార్లచేత తిట్లుతిన్న అబ్బాయి. స్కూల్ ఫైనల్ పరీక్షలకు బాగా చదివి తీరా పరీక్షఫీజు కట్టేందుకు డబ్బులేక పరీక్షకూ, చదువుకూ ఉద్వాసన చెప్పిన అభాగ్యుడు, ఆ ముకుందమేనా ఇతను?
అవును. ఆ ముకుందమే ఇతను. తరువాత ఏమయినాడో తనకు తెలియదు. ఒకప్పుడు పెద్ద చెప్పుకోతగ్గ స్నేహితుడు కాదుకాని, మొదటినుండీ అతనంటే ఒక సానుభూతి, సదభిప్రాయం వుండేది.
"నువ్వా?" అన్నాడు.
"నేనే" అన్నట్లుగా అతను నవ్వి గడ్డిలో కూచున్నాడు.
"ఇక్కడ ఏం చేస్తున్నావు?"
"జీవితాన్ని మలామా చేస్తున్నాను."
"అంటే?"
"అంటే...." అన్నాడు ముకుందం.
"అది ఒక అందమైన వెదుకులాట బ్రతుకుకోసం."
అతని కుటుంబ విషయాలు తనకు తెలుసు. అన్ని సమస్యల్లో తనయితే మన్నయిపోవచ్చు.
"నువ్వేం చేస్తున్నావ్?"
"పువ్వులని చూస్తున్నాను" అని జవాబు చెప్పాడు చక్రపాణి.
"అదృష్టవంతుడివి. కాని సౌందర్యోపాసన అందరికీ కష్టం సుమా!"
చక్రపాణి సిగ్గుపడి నోరుజారి ఏదో అనేశాడు. "నేను బి.ఏ చదువుతున్నాను" అన్నాడు.
"మా నాన్న..." అన్నాడు విచారంగా ముకుందం. "నేను బి.ఏ. అయితే చూడాలని కలలు గన్నాడు.
చక్రపాణి ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.
స్నేహితులిద్దరూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. ముకుందం తన బాధలు చెప్పాడు. తన దేవులాట, తను ప్రయివేటు చెప్పిన పిల్లలు తన చినిగిన బట్టలను చూచి నవ్వటం, అర్ధాకలి, వుండటానికి చోటులేక అలమటించడం ఇత్యాదులు.
అప్పుడెందుకో చక్రపాణికి ఒకవిధమైన ఉద్రేకం కలిగింది. ఈ వ్యక్తిని విడిచిపెట్టకుండా తనతో వుంచుకోవాలనుకున్నాడు.
"నీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకులే" అని ముకుందం మొహమాటపడ్డాడు.
చక్రపాణికి ఉన్నట్టుండి ఆశ్చర్యంవేసింది. తనకు ఇప్పుడే తెలియవస్తూంది. తనకు చాలా స్వేచ్ఛవుంది. తను చాలాపనులు చేయగలడు. తన జాలికి ఒకవిధమంటూ వుంటుంది. వెంటనే పెంకిగా "వీల్లేదు ముకుందం! నువ్వు నాతోపాటు వచ్చి తీరాలి" అన్నాడు.
చివరకు ముకుందం ఒప్పుకున్నాడు. మరునాడు తన పెట్టే, బేడతో సహా అతని గదికి వచ్చివేయడానికి ఒప్పందం అయింది. చీకటిపడేదాకా ఆ కబురూ, ఈ కబురూ చెప్పుకొని తరువాత మైసూర్ కేఫ్ దాకా నడిచివెళ్ళి అక్కడ భోజనం చేశాక ముకుందాన్ని సాగనంపి, రిక్షాలో ఇంటికి బయల్దేరాడు చక్రపాణి. తను మంచిపని చేశాడా అనిపించింది. మంచిపనిలానే వుంది. బ్రహ్మానందం ఏమయినా అంటాడా? తనమీద అతనికి ఏమధికారం వుంది?