Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 9


    నా అలికిడిగమనించి, నన్ను చూసి "చూడరా బాబూ! తిండిలేక చచ్చిపోవటానికైనా ఒప్పుకుంటుంది గాని వాళ్ళ నాయననడిగి ఒక్కపైసా అయినా తీసుకోవటానికి ఒప్పుకోదు. దీని వల్లకాటి అభిమానంతో చచ్చిపోతున్నాను. ఆ తండ్రి ముండాకొడుక్కి దీనిమీద పిసరంతయినా ప్రేమ వున్నట్టు కనపడదు. చూస్తే నే చచ్చాక దీన్ని దగ్గరకు చేరనిస్తాడో, నీకూ నాకూ సంబంధమేమిటి పొమ్మంటాడో! దా రా, బాబూ దా నా చెయ్యిచూసి యింకా యెన్ని రోజులు బ్రతుకుతానో చెప్పు హే పరాత్పరా, నాకెప్పటికీ విముక్తి?" అంటూ పడుకుని బాధతో ఇటూ అటూ పొర్లుతూ రొప్పుతున్నాడు.    
    "నా జీవితకాలంలో నేను చేసినవన్నీ పాపాలే ఆఖరికి పెళ్ళికూడా చేసుకొని మహాపాపం జోడించాను. నేను వయసు మీరినవాన్ని. చిన్నది, సుకుమారి దీన్నెందుకు పెళ్ళి చేసుకోవాలి చెప్పు" అని కళ్ళుమూసుకొని "అన్నీ పాడుపనులే ఒక విధవముండని చేసుకున్నా సరిపోయేది. కాస్త లోకోపకారం చేసిన పుణ్యమైనా దక్కేది" అంటూ విచారించసాగాడు.    
    నాకు సిగ్గుతో చచ్చినంతపనైంది. ఏంచేయాలో తోచక తడబడి కుర్చీలో కూర్చుంటూ అనసూయ ముఖంలోకి చూశాను. ఆమె బాధనంతా యిముడ్చుకుంటున్నట్లుగా చిన్న నవ్వు నవ్వింది. "ఎంత చెప్పినా వారికి ఏ నిమిషంలోనో హఠాత్తుగా ప్రాణం పోతుందని భయం. ఇది జరిగేపని కాదని చెప్పండి" అంది.    
    నేను మామూలుగా యింజక్షన్ యివ్వటానికి సన్నాహం చేసుకుంటున్నాను. వాళ్ళ ముఖాల్లోకి చూడకుండా వుండటానికి యింతకంటే మంచి సమయం లేదని యెంచి మందును సిరంజిలోకి తీసుకుంటూ "డబ్బేమైనా అవసరమా?" అన్నాను.    
    "మనిషికి డబ్బుతో యెప్పుడు అవసరం వుండదు? అవసరమే" అంది.    
    ఇంజక్షన్ పూర్తి అయాక ఆయన నా చెయ్యి పట్టుకొని "నాయనా, రోజూ పెద్దాసుపత్రికి పోయి నీరు తీయించుకుని వస్తున్నాను. చచ్చిపోయాక ఎలాగూ అక్కడ నరకం అనుభవించక తప్పదు. మళ్ళా యిక్కడ మరో నరకం ఎందుకూ? న ఆపని అయిపోయిందని నేను గ్రహించాను. ప్రాణి గాలిలో కలిసిపోయేటట్లు ఒక్క ఇంజక్షన్ యిద్దూ!" అన్నాడు డగ్గుత్తికతో.    
    నాకు మాటలు తడబడినాయి. "మీకేమీ పరవాలేదు."    
    ఆయన మళ్ళీ రుద్దకంఠంతో "బాబూ! నీవు నా అన్నకొడుకువి. నిన్ను మించిన బంధువు నాకెవరూ లేరు. నేను చచ్చిపోయాక ఇది అథోగతిపాలు గాకుండా మీ యింటికి తీసుకుపోయి కాపాడు. నీకు ఎలాగూ తల్లిలేదు.    
    నా కంటివెంట జలజలమని నీరు కారాయి. "మా ఇంటికి వచ్చేయండి. వెళదాం. నాకు తల్లియేమిటి, తండ్రి కూడా లేడు" అన్నాను.    
    "చాల్లెండి" అంటుంది అనసూయ.    
    "అదే నేనూ అన్నాను నాయనా! అది వింటేగా? 'ఇప్పటికే మనం ఆయన్ని చాలా శ్రమ పెడుతున్నాం చాలదా? పైగా ఇదికూడానా' అంటుంది."    
    ఆమెను ఒప్పించటం అసాధ్యమని నాకు తెలుసు. ఇంతలో "ఇది అయ్యే పని కాదులెండి" అంటూ ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది.    
    కొంతసేపయిన తర్వాత నేను వెళ్ళటానికి లేచి "నిన్న రాత్రికూడా నేను వచ్చాను. మీరు నిద్రపోతున్నారు" అన్నాను.    
    "అలాగా! రోజూ రెండుపూట్లా వచ్చి చూచిపోతూ వుండు బాబూ నిన్ను చూసినప్పుడైనా కొంచెం ధైర్యంగా వుంటోంది"    
    ఎప్పటిలాగానే ఆమె నీళ్ళగిన్నె, సబ్బుతో బయట సిద్దంగా నిలబడివుంది. "నేను కడుక్కుంటానులే, యిట్లా యివ్వండి" అన్నాను ఇవాళ సిగ్గుతో.    
    "ఈ కొత్త ఆచారం యెప్పట్నుంచి? ఇదిగో సబ్బు చేతులు కడుక్కోండి, నీరు పోస్తాను."    
    అయినాక తువ్వాల యిచ్చి, చేతులు తుడుచుకుంటుండగా "ఇవాళ రాత్రికికూడా వస్తారుగా వారి స్థితి చూస్తే భయంగా వుంది" అన్నది.    
    "వస్తాను" అని తలవంచుకొని చెప్పి బైటకు వచ్చాను నెమ్మదిగా.    
    నిన్న యిరువురం అంత చిత్రమైన పరిస్థితిలో పడిపోయామా? మళ్ళీ ఈ ఉదయం నా మనసులో ఆ విషయం యెంత మెదులుతున్నాగాని ఆమెమాత్రం ఆ ప్రసక్తే తీసుకురాలేదు. పై పెచ్చు ఏమీ జరగనట్లు సర్వసాధారణంగా వుంది. ఆమె అద్భుతంగా నవ్వగలదు. ఆ నవ్వులో వెన్నెలే కాక, విషాదాన్ని కూడా కురిపించగలదు.    
    ఇంటికి వచ్చి డిస్పెన్సరీ పనిలో పడిపోయి రోగులమధ్య ఆ సంగతిని మరిచిపోవటానికి ప్రయత్నించాను. వచ్చే రాబడి అంత ఎక్కువ కాకపోయినా జనం మాత్రం బాగానే వస్తారు. కాని నా పేషెంట్లలో ఎక్కువమంది తెలుగు వాళ్ళు కారు. మహారాష్ట్రులు, గుజరాతీలూ, తరువాత మహమ్మదీయులూ యెక్కువ. చాలామంది స్త్రీలు లేడీడాక్టర్ల దగ్గరకు పోయె అవసరమున్నా కూడా యిక్కడికే రావటం చికాకుగా వుండేది. వాళ్ళు ఏమీ బిడియపడేవాళ్ళు కాదు. ఒక్కోసారి నవ్వుతూ సరదాగా కబుర్లు చెబుతూ, నా పెళ్ళిపెటాకుల విషయం ఎత్తేవారు, ఎత్తిపొడిచేవాళ్ళు కటువైన సమాధానం యివ్వకపోవటం నా స్వభావంలో ఒకటిగా! గంభీరంగా నవ్వి ఊరుకునేవాడ్ని. వాళ్ళ వేషం, అలంకరణ చూసికూడా నేను చాలా సిగ్గుపడుతూ వుండేవాడిని. నాగరికతకూ స్త్రీకి దగ్గర సంబంధమనిపిస్తుంది. మొదట ఒకరు చేసిన అలంకరణను చూసి నివ్వెరపోయి చూస్తారు తరువాత నవ్వుతారు, గేలిచేస్తారు, ఆ తఃరువాత మామూలుగా చూసి తలపంకించి వూరుకుంటారు. తదనంతరం కళ్ళు పెద్దవి చేసి అభినందించుకొంటూ చూస్తారు! ఆ పైన ఆ యా వస్తువులు శుభ్రంగా మామూలు వాటిమల్లేనే నాలుగు షాపుల్లోనూ చూచుకొని యింటికి తీసుకుపోయి తమ తమ వాళ్ళచేత ధరింపజేసి, అలా నలుగురూ చూస్తుండగా నడిపించో, రిక్షాలమీదో, మోటార్ సైకిల్ మీదో, కారులోనో షికారు తీసుకువెడతారు! భేష్! అదింక నాగరికత అయిపోతుంది. ఆ రకం ఫేషన్ కోసం ఒకరిమీద ఒకరు పోటీగా ఎగబడతారు. ఇహ వ్యాపారస్థులు, స్త్రీల కళాశాలల ఎదుటకూడా వాటిని గురించి ప్రకటనలు చేయటానికి సంకోచించదు.

 Previous Page Next Page