Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 8


    "పరిస్థితులు ఎలా వున్నప్పటికీ కొన్ని సత్యాలకు తిరుగులేదని మీరు ఒప్పుకుంటారా? తాగడం అనేది తప్పు. అలాగే స్త్రీ పురుషులు నీతితప్పి చరించటం తప్పు పరిస్థితులకూ వీటికీ ముడివేయవద్దు దయ, సానుభూతి అవన్నీ మరో విషయాలు కాని ఇవి ఖండించలేని సత్యాలు."    
    ఆమె నిరసనగా నవ్వింది. "సత్యం, సిద్దాంతం వీటిని గురించి ఆలోచించను డాక్టర్! బాధకూడా పడను. నాకు కావలసింది వేరేవుంది. సౌఖ్యాన్వేషణకోసం మనిషి ఆరాటపడటం దోషం కాదుగా?"    
    "మరి నీతి, అవినీతి - వీటిమాట ఏమిటి? వీటికేమీ విలువలేదా?"    
    "లోకంలో న్యాయం, అన్యాయం అంటూ లేకపోలేదుగా! అన్యాయం విచ్చలవిడిగా తన వికృత పదఘట్టనలతో నృత్యం చేస్తున్నంతకాలం అవినీతి ప్రబలకుండా ఎవరూ వారించలేరు. అంతేకాదు, దాని అవసరంకూడా వుందనిపిస్తుంది."    
    నేను తలబాదుకొని అన్నాను. "అబ్బ! ఈ దారుణమైనమాటలు మీ నోటి నుంచి యెలా వస్తున్నాయి? మీది సున్నితహృదయం కాదా!"    
    ఇందాకటి భాగవతపుస్తకం తెరిచే వున్నది యింకా. అనసూయ చటుక్కున మూసివేసి తల యెత్తి "ఏనాటికైనా సున్నిత హృదయం కఠినంగా మాట్లాడితేనే అందరూ ఆశ్చర్యపడేది. దానికో ప్రత్యేకత ఆపాదించేదీనూ అప్పుడు ఒకళ్ళు సున్నితంగా ఎందుకువుంటారో బోధపడుతుంది" అన్నది.    
    "అంటే... అది ఓ కవచమన్న మాట పై మెరుగన్నమాట."    
    "కాదు డాక్టర్, కానేకాదు" అంటూ అనసూయ తల అడ్డంగా వూపింది.    
    "అయితే కృత్రిమమన్నమాట మోసం అన్నమాట."    
    "అదీ కాదు."    
    "ఇంకా నటన కావాలి."    
    "అదీ మీరు అనవలసింది. ఇప్పుడు మనం సత్యానికి చేరువగా వచ్చాం. చూడండి డాక్టర్! నటన యెంత ఉపకారం చేస్తుందో తెలుసా? మన తృప్తికోసం మనం నటిస్తాం, ఒకరి తృప్తికోసం మనం నటిస్తాం. జీవించటంకోసం నటిస్తాం. మంచివాళ్ళు అనిపించుకోవటం నటిస్తాం."    
    "అలా నటించేవాళ్ళను లోకం ఆమోదించదుగా!"  
    "అది 'నటన' అని తెలిసినప్పుడుగా ఆమోదించడం, కాకపోవటమూనూ" అని ఆమె పకపకా నవ్వింది. "నేన్నవ్వుతున్నానని కోపం వద్దు. ఇంతవరకూ మీరు నన్ను మంచిదానిక్రింద, పవిత్రురాలిక్రింద ఆమోదించారా, "లేదా?"    
    నేను నివ్వెరపోయి, తొట్రుపాటుతో "అంటే...? నాకర్ధంకాలేదు" అన్నాను.    
    ఆమెలో నవ్వు అంతరించింది. ముఖం చాలా గంభీరంగా వుంది. హఠాత్తుగా ఆమె చూపులు క్రౌర్యం వెదజల్లుతున్నట్లుగా మారాయి. కటువుగా అంది. "సమయం వస్తే అనసూయ యెప్పుడూ దాచదు. నేను శుద్ద నాస్తికురాల నని మీకు చెబితే తెల్లబోతారు."    
    ఏమిటిది? నేను లోలోన ఒక్క కేకవేసి నిలబడ్డాను. ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. తనువు అణువు అణువుగా ఒణికిపోతోంది. గొంతు విప్పి, ఏదో చెబుదామని విశ్వప్రయత్నం చేశాను. కాని తడారిపోయినట్లుగా వుంది. ఒక్క ఉదుటున బయటకు వచ్చి చరచరా నడవసాగాను.    
                                                        * * *    
    ఆ రాత్రి చాలా భయంకరంగా గడిచింది. నేను ఈ లోకంలో బ్రతకటానికి గల అర్హతలలో మరొకటి పోగొట్టుకొన్నాననిపించింది. తిరిగి తెల్లవారుతుందేమోనని భయం వేసింది. అబ్బ నేను యేం చూసుకోని బ్రతికేది? అమ్మ చిన్నప్పుడు యెప్పుడో నన్ను విడిచి వెళ్ళిపోయింది. నాన్నచేతుల్లో పెరిగాను. నన్ను ప్రయోజకుడ్ని చేసి ఆయనా పరమపదించారు. నా మనస్తత్వం సరిపడని స్నేహితులు. కాని నా ఆదర్శంమీద నాకున్న అభిమానంతో నా ప్రవర్తనవల్ల కలుగుతున్న ఆనందంతో రోజులు నెట్టుకు వస్తున్నాను. యెవరైనా క్రొత్తవారిని చూస్తే భయం, సంకోచం నేను డాక్టర్ని అందువల్ల ఆలోచించటానికి యెక్కువ వ్యవధి లేనందువల్ల బ్రతికిపోతున్నాను. జీవితంలో భాగస్వామిని లేదు. లేదన్న చింత అప్పుడప్పుడు వేధిస్తూ వుండేది. అవును, నన్నుగురించి సంతోషించే వాళ్ళూ, విలపించేవాళ్ళు యెవరున్నారు? వచ్చాయి - అనేక సంబంధాలు కొంతమంది పిల్లల్ని యింటికి గూడా తీసుకువచ్చారు. ఈ లోకంలోని ఆడపిల్లల్ని చూస్తూంటే భయంవేసింది. పెళ్ళి చేసుకున్న మరుక్షణంనుంచి నా జీవితం దుఃఖభాజనమైపోతుంది. నేను చిల్లిగవ్వకుకూడా విలువలేకుండా పోతాను. ఈ డాక్టరీ, ఈ ప్రపంచం వదలి మనుషులు లేని జాగాకు, ప్రేమికులు లేని జాగాకు పారిపోతాను. నాలో ఏమీ ఆవేదన లేదనుకొంటారేం అందరూ! నా జీవితం సుఖపూరితమైందని అనుకుంటారేం? ఈ ఏకాంతం యెంత విషాదపూరితం!    
    నేను ప్రేమించబడాలి.    
    నా తపనంతా ప్రక్కన ఒకర్ని కూర్చోపెట్టుకొని చెప్పుకోవాలి.    
    ఈ సమయంలో నేను అనసూయను కలుసుకోవటం జరిగింది. ఆమె నాకు పిన్ని ఆమె స్నేహంలో, ఆమె సాహచర్యంలో నేనెంతో ఓదార్చబడ్డాను. నేను మార్గదర్శిని కనుక్కున్నాను. నా వేదనా భూయిష్టమైన మనస్సును ఆమెకు విప్పిచెప్పాలని తహతాహలాడాను. కాని నేను ప్రారంభించీ ప్రారంభించక ముందే సిద్దవిఘాతం సంభవించింది. నేను అధఃపాతాళలోకానికి క్రుంగి పోయాను.    
                                                    * * *    
    తెల్లవారింది. నిద్రలేచి ముందుగా చేసిన పని అద్దంలోకి చూసుకోవటం. నేను డాక్టర్నిలా లేను. నెల్లాళ్ళబట్టి రోగంతో బాధపడుతున్న పేషెంటులా వున్నాను కనులు ఎరుపుకంటే యెర్రగా వున్నాయి. టైమింకా ఆరున్నర దాటలేదు. ఎనిమిదింటికల్లా అనసూయ యింటికి పోయిరావటం ఈమధ్య ఏర్పడిన రివాజు. అక్కడనుండి మధ్యాహ్నం పన్నెండింటివరకూ, తిరిగి మూడు నుంచీ ఏడింటివరకూ డిస్పెన్సరీలో వుంటాను. ఇవాళ వాళ్ళయింటికి పోవాలనే తలపు వచ్చేసైర్కి ఉలికిపడ్డాను.    
    నేను పోయేసరికి ఆయన ఆమెను ఏదో తిడుతున్నాడు."జెష్టా, నీ పుట్టింటికి ఉత్తరం రాసి డబ్బులు తెప్పించమని యెన్నిసార్లు అడిగినా తెప్పించవేం? మీ నాయన లేక చస్తున్నాడా? నే బ్రతికున్న రోజుల్లో నే పారేసిన డబ్బులు ఏరుకునేవాడు. వీళ్ళంతా నన్ను దోచుకుతిన్నారు. ఈ మధ్య మేడ కట్టించాడంటనె" అంటూ విరుచుకుపడుతున్నాడు.

 Previous Page Next Page