Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 10


    ఈ మాదిరి ఆలోచించి నేను ఖిన్నుడ్ని అవటం దేనికి? నేను ఇక్కడ పుట్టి పెరిగాను. ఇదంతా ఈ కాలానికి సహజంలే, అని ఎందుకు సంభాళించుకో కూడదు?    
    అలా చేయలేకుండా వున్నాను.    
    ఆ సాయంత్రం మామూలుగా దేవాలయానికి వెళ్ళాను. ఆ రోజు శనివారం రోజూకంటే జనం ఎక్కువ వచ్చారు. శనివారంనాడు బిచ్చగాళ్ళు కూడా గుంపులు గుంపులుగా, ముఠాలుగా బయల్దేరతారు. యిక్కడ మన పరువు దక్కించుకోవటానికి చేయవలసిన పనుల్లో అడిగిన వెంటనే ధర్మం చేయటం ఒకటి. లేకపోతే నలుగురి నోళ్లలో పడక తప్పదు.   
    మామూలుగా చెప్పులకోసం పిల్లలు ఎగబడ్డారు. 'ఈ బాబుగారి జోళ్ళు నిన్న నువ్వు పట్టుకొన్నావు కదురా, ఇయాల నేను' అంటూ ఒక చొక్కా లాగు లేని కుర్రాడు కాళ్ళమీదపడి వూడబెరుకుతున్నాడు చిరుగు పరికిణీ వేసుకుని చొక్కాలేకుండా మకిలిగా వున్న ఓ పిల్ల జాలిగా 'అయ్యా, నన్ను చూడనియ్యరా నీ జోళ్ళు?' అని అడుగుతోంది. నేనేం చేయగలను? ఎవరికి ఒప్పగించానో కూడా చూడకుండా చెప్పులక్కడ వదిలేసి లోపలకు వెళ్ళి పోయాను.
        లోపల ప్రజలు కిటకిటలాడుతున్నారు. నేను ప్రదక్షిణలు చేస్తున్నాగాని ఎంత ప్రయత్నించినా ధ్యానం అటు నిమగ్నం కావటంలేదు. అనసూయ యేమైనా వచ్చిందేమోనని నా కళ్ళు వెతుకుతున్నాయి. ఆఖరికి 'శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామరామ వరాననే' అని ప్రార్ధిస్తూ కూడా మనసు అటు కేంద్రీకరించలేక చుట్టుప్రక్కల చూస్తూనే వున్నాను. మళ్ళీ చేస్తున్నపనికి కుచించుకుపోతూనే వున్నాను. యెలాగో ప్రసాదం పుచ్చుకొని యివతలకు వచ్చాను. ఆమె రాలేదు. నాకు కళ్ళవెంట నీళ్ళు గిర్రున తిరిగాయి. నాకు దగ్గరైన వారిని ఎవరో దూరం చేసినట్లు భోరున ఏడవాలనిపించింది.    
    అరుగుమీదకు వచ్చి కూర్చున్నాను. ఇవ్వాళ ప్రతి స్త్రీకూడా అనసూయలా కన్పిస్తోంది. ఆమె యీ మధ్య తరచు రావటంలేదు, ఇహ ముందు రాదేమో "నేను శుద్దనాస్తికురాలిని" అని ఆమె అనటం చెవుల్లో వినిపించి త్రుళ్ళిపడ్డాను.    
    చాలామంది పిల్లలు, స్త్రీలు అక్కడ మూల అమ్ముతున్న పులిహార, గారెలు కొనుక్కొని తింటూ సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నారా? కష్టాలు లేకుండానే ఏడ్చి మొత్తుకొనే దౌర్భాగ్యులలో నేనొకడినా?    
    నేను యిక లేచి వెళ్ళిపోవాలనుకొని ద్వారంవరకూ వచ్చాను. ఒంగి చెప్పుల్లో దూరబోతూ ఎవరో స్త్రీ వస్తూండటం గమనించి ఆగి ప్రక్కకు వత్తిగిలాను. ఆమె లోపలకు ప్రవేశించి చటుక్కున తలయెత్తి నావంక చూసి చిరునవ్వు నవ్వుతూ నిలబడిపోయింది. నేను నిర్విన్నున్నయి తెల్లబోతూ చూశాను. అనసూయ! పట్టుచీర కట్టుకుంది. ఫలాన పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుంది. చేతిలో పళ్ళెం, అందులో పూజాద్రవ్యాలు, కొబ్బరికాయ.    
    నేను ప్రతిగా నవ్వుదామని చాలాప్రయత్నం చేశాను. సాధ్యంకాలేదు. చప్పున అక్కడినుండి వెళ్ళిపోదామని ముందుకు ఒక్క అడుగువేశాను.    
    "ఆగండి డాక్టర్" అంది ఆమె మృదువుగా "వెళ్ళిపోకండి. నేను పోయి స్వామి దర్శనం చేసుకువస్తాను. కలసి వెడదాం వుండండి" అంటూ నా జవాబుకొరకు నిరీక్షించకుండా చకచకా లోపలకు వెళ్ళిపోయింది.    
    నేను మంత్రముగ్దుడిలా అచేతనుడినై నిలబడిపోయాను. మనుషుల మాటలన్నీ ఒక్క నిముషం వినిపించటం మాని మళ్ళీ వినిపించినట్లయింది. గాలి ఒక్క నిముషం వీచటం ఆగి మళ్ళీ వీచినట్లయింది. నేను ఒక్కనిముషం మరణించి, మళ్ళీ జీవించినట్లయింది. ఇది అనసూయ నాతో మొదటిసారి మాట్లాడటం దేవాలయంలో.    
    ఈలోగా ఆమె ఒక ప్రదక్షిణ పూర్తిచేసి వచ్చి ఇటుకేసి నవ్వింది. ఇవ్వాళ ఆమె అందం, పవిత్రం విరగబడిపోతున్నాయి. నేను చూపు త్రిప్పుకొన్నాను.    
    ఇంతలో నా చెవిలో ఏదో కంఠం కర్కశంగా క్రూరంగా అరవసాగింది. 'నేను శుద్ధ నాస్తికురాలిని, నేను శుద్ద నాస్తికురాలిని.'    
    బలహీనంగా స్తంభానికి ఆనుకొని కనులు మూసుకున్నాను.    
    కనులు తెరిచేసరికి అనసూయ మూడో ప్రదక్షిణ గావును పూర్తి చేసివచ్చి, ఇటుచూసి మందహాసంచేసి, మెట్లు ఎక్కి దేముడికెదురుగా జనంలోకి పోయింది.    
    ఒక్క పదినిముషాలు గడిచాయి. ఇంతలో "రండి" అని వినిపించింది. తలత్రిప్పి చూసేసరికి చేతిలో పళ్ళెంతో అనసూయ, ఎప్పటిలా ఆమె పెదవుల మీద నిర్మల మందహాసం.    
    కాని ఆమె బయటకు త్రోవ తియ్యటంలేదు. "ఎక్కడకు?" అని గొణిగాను.    
    "మీతో కొంచెం మాట్లాడాలి. ఆ ప్రక్కకు పోయి కూర్చుందాం రండి డాక్టర్! నేను మీ పిన్నిని సంకోచం దేనికీ?"
    ఈ చివరిమాట ఆమె అనకుండా వుంటే బాగుండేది. బదులు పలకకుండా ఆమెను అనుసరించాను. గర్భగుడికి వెనుకవైపు కొంచెం ఏకాంతంగా వున్నచోట అరుగుమీద ఆమె కూర్చుంది. "దేముడ్ని దర్శించిన తర్వాత కొంతసేపు కూర్చోవాలిట" అన్నది నవ్వుతూ. నేను ఏమీ మాట్లాడకుండా మెదలకుండా నిల్చునేసైర్కి నవ్వాపి నా ముఖంలోకి చూసింది. ఒక్కక్షణం ఆగి మళ్ళీ గట్టిగా నవ్వి "కూర్చోండి డాక్టర్ లేకపోతే మీ పుణ్యంలో కొంత భాగం తగ్గిపోతుంది" అంటూ చప్పున చెయ్యిపట్టుకుని "ఇక్కడ ఇలా కూర్చోండి బుద్దిమంతుడిలా" అంది.    
    నా ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమెప్రక్కనే చతికిలబడ్డాను. జనుల మాటలు యిక్కడకు తక్కువగా వినబడుతున్నాయి. గుడిగంటలు కూడా ఆమె తన మృదువైన హస్తంతో కొబ్బరిచిప్పను నేలకుకొట్టి బ్రద్దలు కొడదామణి ప్రయత్నిస్తోంది. ఆమె స్వచ్చమైన పుష్పంలా యిప్పుడే వెలసిన దేవతలా వుంది. చివరకు ముఖమెత్తి కొబ్బరిముక్కను నాకందించి, స్నిగ్ధమూ, స్వచ్చమూ అయిన మందహాసం ఒకటిచేసి ప్రసాదాన్ని మూడుసార్లు కళ్ళకు అద్దుకొంది.    
    నా హృదయం విదీర్ణమయింది. కంపితస్వరంతో "మీరు నిన్న అబద్దమెందుకాడారు? చెప్పండి. నిన్న మీరు అన్నదంతా అబద్దమేనని చెప్పండి. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు" అని బయటకు వెళ్ళగ్రక్కేసుకున్నాను.

 Previous Page Next Page