ఇలా కొంతకాలం గడిచేసరికి అతనికి సంబంధాలు రాసాగాయి. పెళ్ళి చేసుకొమ్మని వదినగారు పోరు పెట్టసాగింది.
ఆ పోరుకు ఫలితం లలితమ్మ యింట్లో కాలుపెట్టింది.
ఈలోగా మూడోవాడి చదువు సమస్య అయికూర్చుంది. విశ్వనాథరావు పట్టుదల వలన అతనప్పటికే ఇంటర్మీడియెట్ వరకూ చదివాడు. ఇహ చాలు ఆపమంటుంది పెద్ద వదినగారు. తనకు ఎలాగూ చదువు లేకుండా పోయింది. తమ్ముడు కనీసం బి.ఏ.వరకైనా చదవాలని విశ్వనాథరావు పట్టుబట్టాడు. మరి ఇప్పుడితను కూడా సంపాదన పరుడయ్యె. మాట తోసివెయ్యటం కష్టమైంది. చివరకు అతనిమాటే నెగ్గింది. ఎప్పటిలా రోజూ రైలుమీద బందరు పోయి రాసాగాడు.
* * *
క్రమేణా ఫారెస్టు రైటరయ్యాడు విశ్వనాథరావు. చీటికీ మాటికీ బదిలీ అయి ఊళ్లు మారవలసి వస్తూండేది. వీలయినప్పుడు భార్యను తీసుకుపోతూండేవాడు. లేనప్పుడు వంటరిగానే గడిపేవాడు.
డబ్బు సంపాదించాలన్న రంధి ఆరోజుల్లోనే కలిగింది. గార్డ్ గా వున్నప్పుడు పై సంపాదనకు ఎన్నో అవకాశాలు వచ్చినా ఎప్పుడూ కక్కుర్తిపడలేదు. ఇప్పుడు ఆ అవకాశాలకు తోడు తనక్రింద పనిచేసే గురువులి ప్రోత్సాహం ఎక్కువైంది. గురువులు అప్పటికి నూనూగుమీసాల యువకుడు. అతనికి తల్లీదండ్రి ఎవరూ లేరు. మేనమామ ఇంట్లో అదుపాజ్ఞలు లేకుండా పెరిగి, ఇష్టంవచ్చినప్పుడల్లా జులాయికోరుగా తిరిగి చివరకు మేనమామ విసిగి ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టేసరికి, కడుపుకోసం నౌఖరీలో చేరాడుకాని జీతంరాళ్ళమీద వచ్చేది వాడి కాఫీ, సిగరెట్లకు చాలదు. అందుకని అడవిలో కట్టెలు కొట్టుకోవటానికి వచ్చేవాళ్ళని బెదిరించి డబ్బు లాగుతూ వుండేవాడు. చిన్న యజమాని నిక్కచ్చిగా వుండటం వాడికి నచ్చలేదు. అదీగాక ఆయన ముక్కుసూటిగా పోయే రకమయితే వాడికెప్పటికయినా ముప్పే. అందుకని మెల్లిగా చనువు చేసుకుని తర్వాత 'నీతి'బోధలు సాగించాడు. విశ్వనాథరావుకి కూడా సంపాదించేది సుఖంగా జీవించడానికి సరిపోవటల్లేదు. ఏదో ఒక ముహూర్తంలో తనకు తెలియకుండానే లొంగిపోయాడు. అతని జేబులు నిండసాగాయి.
* * *
లలితమ్మగారు సద్గుణవతి.
కాని ఆమె చాలా పేదకుటుంబంనుండి వచ్చిందవటంవలన సంపదళమీద సహజంగా మమకారం వుంది. ఒకరిద్దరు పిల్లలుపుట్టి భర్త సంపాదించేది చాలకపోయేసరికి ఆమె మనసులో సౌభాగ్యాన్ని కాంక్షించేది. పెనిమిటిముందు ఎప్పుడూ బయటపడకపోవచ్చు. కాని ఆమె తీవ్రంగా కాంక్షించేది. తన కుటుంబం... అన్నలూ, తమ్ములూ అందరూ ఎంతో హీనస్థితిలో వున్నారు. తమకు మంచిస్థితి కలగాలనీ, తనవారందరికీ సాయపడాలని మహా ఇదై పోతూండేది.
ఓరోజు భర్త చిన్న నోట్లకట్టను తీసుకురావటం చూసింది.
క్రమంగా ఇంట్లోకి ఫర్నీచర్, అలంకారాలూ, ఖరీదైన సామానులూ రాసాగినాయి. వున్నట్లుండి ఆమెకో చంద్రహారం చేయించిపెట్టాడు విశ్వనాథరావు.
ఈ అనుభూతి మరుపురానిది. కన్నకలలు నిజమవటంకంటే ఆనందదాయకం లేదు.
"ఎక్కడిదండి" అనడిగింది గోముగా. అప్పటికి యవ్వనవతి లలితమ్మ.
భర్త జవాబు చెప్పకుండా గంభీరంగా ఊరుకొన్నాడు.
"చెప్పరూ?"
"ఏమిటి?"
"ఇంత డబ్బు ఎలా...?"
విశ్వనాథరావు ఆగ్రహంగా "నువ్వు ఆడదానివి, ఈ విషయాలు నీకనవసరం?' అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
తను ఇహమీదట ఎప్పుడూ అలాంటి విషయాలు అడక్కూడదనుకుంది లలితమ్మ.
* * *
గురువులి ప్రభావం అంతటితో ఆగలేదు. ఓసారి డేరాలో ఇద్దరే వున్నారు. బయట చినుకులు పడనారంభించి, కొద్దిసేపట్లోనే కుంభవృష్టిగా పరిణమించింది.
చిన్న యజమానీ, గురువులూ దగ్గర దగ్గరగా కూర్చుని సిగరెట్లు కాల్చుకొంటున్నారు. ఆ రాత్రివేళ...
"బా...గా... చలి వేస్తోంది. గు...రు...వు...లూ" అన్నాడు చిన్న యజమాని.
గురువులు ఓ వక్రచాలనం చేసి "మందు పడాలి సార్" అన్నాడు.
"మందా?"
"అవును సార్, నాటుసరుకు కాదు, పెద్ద దొరగారు వాడే బాటిల్స్ తీసుకువస్తాను తమరు ఊఁ అనాలిగాని" అన్నాడు గురువులు.
"తప్పు గురువులూ, మా వంశం నిప్పులాంటిది. మా వాళ్ళెవరూ ఇలాంటి పనిచేసి ఎరుగరు. ఎంత అసహ్యం?"