Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 8


    జగన్నాథంగారు కాఫీ అందుకుంటూ ఆమెవంక పలకరింపుగా చూశాడు. ఆమె కొద్దిగా నవ్వి అక్కడినుండి వెళ్లిపోయింది. జగన్నాథంగారికి ఎందుకో గుండె కళుక్కుమంది.

 

    "చిన్నల్లుడు ఎప్పుడొస్తున్నాడో ఉత్తరం వచ్చిందా?" అని అన్నాడు.

 

    'ఇంకా రాలేదు" అన్నాడాయన ముక్తసరిగా.

 

    ఆ విషయం మాట్లాడటం ఆయనకు యిష్టంలేదని గ్రహించి జగన్నాథం గారు మాట మారుస్తూ "ఓహ్! ఏం దివ్యంగా వుందండీ కాఫీ. మా ఆవిడ కలిపితే అట్లా తగలడుతుందేమిటండీ?"

 

    "చేతి మహత్యంలెండి."

 

    "అవునుగానీ విశ్వనాథంగారూ! లోకంలో కొందరు శాంతమూర్తులు, కొందరు బ్రహ్మరాక్షసులూ ఎందుకుంటారంటారు? ఉదాహరణకి మీ ఆడవారికీ, మా ఇంటిదానికీ గల వ్యత్యాసం చూడండి."

 

    "దానిదేముందండీ జగన్నాథంగారు. మా ఆవిడపేరు లలితమ్మ. మీ ఆడవారి పేరు గంగానమ్మ."

 

    "గంగానమ్మ కాదండి మహాప్రభూ! గంగమ్మ."

 

    ఇద్దరూ ఇలా మాట్లాడకుంటూ వుండగా ఆశ మళ్ళీ మేడమీదకు వచ్చి "అమ్మ స్నానం చెయ్యమంటున్నది నాన్నా" అన్నది.

 

    "అరెరె. మీరింకా స్నానం చెయ్యలేదు కాబోలు, మరి నేను వస్తాను. మరి చదరంగం విషయం...?"

 

    "రేపటికి వాయిదా వేద్దాం లెండి!"

 

    ఆశ క్రిందికి వెళ్లిపోయింది.

 

    జగన్నాథం లేచి నిల్చున్నాడు.

 

    విశ్వనాథంగారు కూడా నిల్చుని ఇంతలో ఏదో స్ఫురించి మెల్లగా 'జగన్నాథంగారూ!' అన్నాడు.

 

    ఈ గొంతులో మార్పువిని చకితుడయి ఆయన అలాగే ఆగిపోయాడు.

 

    "మీకు యింట్లో రోజూ రణరంగంలా వుంటుంది కదా. శాంతిగా వుంటుందా?"

 

    ఆయన భారంగా నిట్టూర్చి "అయ్యో రామా! ఈ పిచ్చిక హృదయుడికి శాంతెక్కడ చచ్చిందండీ? గతిలేక బ్రతకటమేగాని" అన్నాడు.

 

    ఒక్క నిముషం విశ్వనాథంగారు మాట్లాడలేదు. తరువాత బరువుగా "నాకు యీ మధ్య సన్యాశ్రమంమీద మమకారం కలుగుతోందండీ" అన్నాడు.

 

    కొద్దిరోజులుగా యిద్దరూ దైవ మీమాంసలో పడినమాట నిజమే. ఎన్నో అనుభవాల తర్వాత ఆ వయసులో అలాంటి పరిణామం సహజం. ఇదివరకెన్నడూ విశ్వనాథంగారు దైవసంబంధమైన సభలకూ, సమావేశాలకూ వెళ్లి ఎరగడు. ఇటీవల ఊళ్ళో జరిగే భాష్యాలకూ, స్వామివారి సమావేశాలకూ హాజరవుతున్నారు.

 

    ఏకాగ్రత కుదరట్లేదుగాని మనసు యిప్పుడు ఈశ్వరుడ్ని గురించి తరుచూ ఆలోచిస్తోంది.

 

    జగన్నాథం ఆశ్చర్యంగా "నాకూ అంతేసుమండీ" అన్నాడు.

 

    విశ్వనాథంగారు వున్నట్లుండి పెద్దగా నవ్వుతూ "మనమిద్దరం ఉమ్మడిగా సన్యసిద్దామేమిటి?" అన్నాడు.

 

    "నేను రెడీయేనండోయ్! ప్రక్కన మీ అండ ఎలానూ వుంటుంది. మా గయ్యాళి పీడ విరగడయితే నాకంతే చాలు. మరి ఈ పిచ్చిక హృదయునికి సెలవిప్పిస్తారా?"

 

    జగన్నాథం వెళ్ళిపోయాడు.

 

    పెద్దకూతురు సుభద్ర పైకివచ్చి "అమ్మ స్నానానికి రమ్మంటూంది నాన్నగారూ" అంది.

 

    "వస్తున్నానమ్మా."

 

    కూతురు సుభద్రవంక ఓసారి భావశూన్యంగా చూసి మెల్లిగా క్రిందికి దిగి వెళ్ళాడు జగన్నాథంగారు.


                                                                       3


    విశ్వనాథంగారు!

 

    "నాకే డబ్బుంటేనా?" అనుకున్నాడు ఎన్నో సంవత్సరాలక్రితం తన చిన్నతనాన.

 

    ముగ్గురు అన్నదమ్ములతో రెండవవాడు ఆయన. పెద్దాయన, ఓ కంట్రాక్టరు దగ్గర గుమాస్తాగా పనిచేస్తూ వుండేవాడు. తమ్ముళ్ళంటే వల్లమాలిన అభిమానం ఆయనకు. తండ్రి చిన్నతనాన్నే గతించినా. తమకేం ఆస్థిపాస్తులు లేకపోయినా, వున్నది తినడానికీ సరిగ్గా చాలకపోయినా, భార్య పెదవి విరుస్తున్నా ఏమీ లోటు చెయ్యకుండా పెంచాడు వాళ్ళని. చెల్లెలు వరలక్ష్మి అన్నా అమితానురాగం ఆయనకు. ఆమె పధ్నాలుగో ఏట ఓ మంచి సంబంధం చూసి పెళ్ళిచేసి "అమ్మా నీ కోరిక చెల్లించా"నన్నాడు తల్లిదగ్గరకొచ్చి. ఆనందాశ్రువులు రాల్చిన ఆ వృద్ధప్రాణం కొన్నిరోజులు తిరిగాక తనువు చాలించింది.

 

    అప్పటికి విశ్వనాథరావు పదిహేనేళ్ళవాడు. ఓరోజు అన్నదగ్గరకొచ్చి 'అన్నయ్యా! నేను స్కూల్ ఫైనల్ ప్యాసయ్యాను" అన్నాడు సంతోషంగా.

 

    అన్న రామనాథంగారు మనసులోనే ఆశీర్వదించి "మరి యింటర్మీడియట్ చదువుతావా తమ్ముడూ?" అనడిగాడు.

 

    విశ్వనాథంగారు తలవంచుకొని "నువ్వు చెప్పిస్తే తప్పకుండా చదువుతా నన్నయ్యా" అన్నాడు వినయంగా.

 

    వంటింట్లో వున్న వదినగారు యీ మాటల్ని విని బయటికొచ్చి "అది మన ఊళ్ళో లేదుకదూ నాయనా. ఏ బందరో పోవాలి. నెలనెలా నీకెత్తి పంపటానికి మాకు యినప్పెట్టేల్లేవ్?" అన్నది.

 

    "మీ యిష్టం వదినా. మీకు కష్టంగా వుంటే చదవను" అన్నాడు విశ్వనాథరావు బాధగా.

 

    "కష్టం సంగతి కాదు బాబూ. మరి శక్తిమాటో?"

 

    ఫలితామేమంటే రెండుమూడు రోజులు తర్జనభర్జన జరిగిన మీదట అతని చదువుకి ఉద్వాసన చెప్పటానికి నిర్ణయం జరిగింది. అన్నగారు మనసులో బాధపడుతున్నా తన అశక్తత గమనించి వూరుకున్నాడు. అప్పటికి మూడోవాడు రంగనాథరావు ఫోర్త్ ఫారం చదువుతున్నాడు. ఇంట్లో స్థితి చాలా అతలా కుతలంగా వుండేసరికి విశ్వనాథరావు ఉద్యోగప్రయత్నానికీ పూనుకున్నాడు. మొదట్లో గుమస్తాగిరిలాంటివి రెండుమూడు చిన్న ఉద్యోగాలు లభించాయి. కాని వాటిమీద మనసు నిలవక కొన్నిరోజులు చేసి వదిలిపెట్టేసేవాడు. అలా చేసినప్పుడల్లా యింట్లో వదినగారి ధూంధాంలు ఎక్కువయ్యేవి. ఇట్లా రెండు మూడేళ్ళు నిలకడలేని ఉద్యోగాలు చేశాక అటవీశాఖలో ఫారెస్టు గార్డ్ గా ప్రవేశించాడు. బాల్యంనుండీ అతనిలో అజ్ఞాతంగా ప్రకృతి సౌందర్యం పట్ల ఎనలేని ఆసక్తివుంది. సందర్భం యిలా కలసివచ్చేసరికి అది నాలికలు జాపుతూ బయటపడింది. వచ్చేజీతం పాతిక రూపాయలే అయినా, చెయ్యవలసిన పనికూడా అంత మృదువయింది కాకపోయినా ఆ కొండల్లో, అడవుల్లో తిరుగుతూంటే అతని మనసు సంతోషంతో పరవశించేది. ఆఫీసరుగారు లేనప్పుడు ఆయన గుర్రంమీద ఎక్కి చేతిలో తుపాకి పట్టుకొని పొదలమధ్య నుంచీ, ఆ పెనవేసుకుని వున్న చెట్లలోంచి ఉల్లాసంగా సాగిపోతూండేవాడు. అన్నదమ్ములు ముగ్గురిలోకీ తను మంచి దృఢకాయుడు, దేహసౌష్ఠవం కలవాడు. రాత్రింబవళ్ళు ఎండకూ, వానకూ, చలికీ లెక్కచేయకుండా ఎంతతిరిగినా కాస్తయినా అలిసిపోయినట్టు కనిపించేవాడు కాదు. పదిహేను రోజులకూ, యిరవైరోజులకూ, యింటికి వచ్చినప్పుడు యిల్లు చెరసాలలా కనిపించేది.

 Previous Page Next Page