"మీ వాళ్ళు ఇలాంటి ఉద్యోగం చేసి వుండకపోవచ్చు బాబుగారూ! ఈ అడవుల్లో తిరుగుళ్ళూ... వానల్లో, చల్లో మందు పడకపోతే బండి నడవదు. మీరు ఊ అనండి సార్. ఎంత మజాగా వుంటుందో మీకే తెలుస్తుంది."
"నువ్వు ఎప్పుడూ తాగుతావా?" అనడిగాడు చిన్న యజమాని వణికే కంఠంతో.
"ఆహా! అయితే నాటుసరుకు బాబూ! అది పడకపోతే ఒక్కరోజు గడవదు."
సహజంగా కొందరు మానసిక బలహీనులుంటారు. వాళ్లకు బయటనుంచి ఏమాత్రం వత్తిడి వచ్చినా సులభంగా లొంగిపోతారు.
మండే మనసుతో, మండే గుండెతో ఒక్కో గుక్క చొప్పున ఆయన సేవించి మంచంమీద పడుకుని మత్తుగా "అబ్బ! జీవితం ఎంత మధురం!" అన్నాడు.
"ఒక్క మందు పడగానే అయిందా? దానికితోడు ఓ పాపకూడా వుంటే?" అన్నాడు గురువులు.
"ఏ...మి...టి... అం...టున్నావు?" అనడిగాడు చిన్న యజమాని మైకంలో.
"పా...ప!"
ఎక్కడినుంచో, ఏ కొండలచాటునుంచో వచ్చిన కంఠంలా వినిపించింది అతనికి.
"గర్ల్! ఓ యస్! వెరీ నైస్! కాని ఇప్పుడు వద్దులే! మరోసారి" అంటూ ఆయన నిద్రలో పడిపోయాడు.
* * *
ఓ పద్ధెనిదేళ్ళ పడుచు కట్టెలమోపు నెత్తిన పెట్టుకుని జవ జవలాడే శరీరంతో నడిచిపోతోంది.
"ఎవరది?" అన్నాడు విశ్వనాథరావు ఆ పడుచువంకే కాంక్షగా చూస్తూ ప్రక్కనున్న గురువులతో.
"అదా బాబూ! దాని పేరు రూత."
అతనట్లాగే కోరికలూరే కళ్ళతో చూడసాగాడు. ఆ బిగువయిన లావణ్యం, తనకు దక్కవని భ్రాంతి కలిగించే శరీరపు వంపులూ, అర్థనగ్న సౌందర్యమూ, యవ్వనపు పొంగూ అతని నరనరాలూ కదిలించినాయి.
"ఓహో!" అని ఊరుకున్నాడు మనసులో సతమతమవుతూ.
డేరాలోకి వచ్చి దిగులుగా కూర్చున్నాడు. వెనకనుంచి గురువులు మెల్లగా వచ్చి "అలా వున్నారేం బాబూ" అనడిగాడు.
"ఏమీ లేదు."
ఓ నిముషం నిదానించి వాడు "రూతను తీసుకురానా?" అన్నాడు.
విశ్వనాథరావుకు చటుక్కున భార్య గుర్తుకొచ్చింది. 'అయ్యో!' అనుకున్నాడు.
గురువులు ఏమనుకున్నాడో మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయాడు. వీడి దుంపతెగ! బలవంతం చెయ్యడేం?" అనుకున్నాడు చిన్నయజమాని. "ఛీఛీ! ఏమిటో ఆలోచిస్తున్నాను? అబ్బ! దానిమీదకు పోతూందేం మనసు?"
"గురువులూ! గురువులూ!"
"వాట్ సార్?" అంటూ లోపలకు వచ్చాడు.
"అసలెవరా రూత?"
"కాపుది బాబూ!"
"అది..."
"మీకెందుకు బాబూ! మీరు ఊ అనండి."
వాడు ఎంత సమర్థుడోగాని రాత్రి దూత డేరాకు రానే వచ్చింది. విశ్వనాథరావుకి భార్య గుర్తుకు వస్తోంది. "పాపం" అన్పిస్తోంది. ఒక సుగుణవతి పెనిమిటి తను. ఇద్దరుపిల్లల తండ్రి తను.
"పోనీ పంపించెయ్యి గురువులూ! ఏమిటోగా వుంది నాకు... పోనీ రేపు రమ్మను."
గురువులు జవాబు చెప్పకుండా ఓగ్లాసు నింపి "తాగండి" అన్నాడు.
అది గబగబ త్రాగేసి "ఇంకోటి తే" అన్నాడు తృష్ణగా.
గురువులు పోసి యిచ్చాడు.
అదికూడా పూర్తిచేసి "నువ్వు బయటకు వెళ్ళు గురువులూ! అబ్బ!... దక్కుతుందా అనిపించే బిగువు నీది. రూతా! ఇలా వచ్చెయ్ దగ్గరకురా! అబ్బ!" అన్నాడు చిన్న యజమాని మత్తుగా పరుపుమీద పడుకుంటూ.
* * *
కొన్నాళ్ళకు లలితమ్మ పసిగట్టింది.
కాని వెంటనే ధైర్యంచేసి అడగలేకపోయింది.
మరీ శృతిమించేసరికి తెగించి అడిగింది.
"అవును" అన్నాడు.
"ఇలా ఎందుకు చేస్తున్నారంటే..."
"నేను మగవాడ్ని. నా యిష్టం" అన్నాడు.
లలితమ్మ గట్టిగా దెబ్బలాడదామనుకుంది. ఎదిరిద్దామనుకుంది. కాని ఏడుస్తూ ఊరుకుంది.
మరోసారి కాస్త గోలచేసింది.
రెండు తగిలించాడు.
భర్తల్ని ఎదిరించి గెల్చుకొచ్చిన స్త్రీలను చాలామందిని చూసింది లలితమ్మ. వాళ్ళంతా అది ఎలా సాధించారో ఆమెకు అర్థంకాలేదు.
* * *
ఫారెస్టు రేంజరయినాడు విశ్వనాథరావు.
గురువులు అతని కుడిభుజమైనాడు.
రూతతో మొదలైన అతని ప్రణయావేషం పరిధులు లేక ఎత్తుపల్లాలలోకి పొంగి పొరలింది.
రూత తర్వాత ఎందరో!
ఊరుకున్నవాడు ఊరుకోక గురువులు ఓ శాశ్వతబంధాన్ని ముడిపెట్టాడు.
ఆ శాశ్వతబంధం కనకవల్లి.
ఎక్కడిదో, ఎలాంటిదో కనకవల్లి వితంతువుగా, తల్లితోసహా ఆ వూరు వచ్చింది. ఆమెతల్లి వంటచేసి ఇద్దరి జీవితాలనూ నెట్టుకొస్తూ వుండేది. ఒకనాడు గురువులికి ఆమెతో పరిచయం కలిగింది. ఓనాడు ఆమె అతనితో "మా వల్లిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కోడెకారు గుంపుగా ఎగబడుతున్నారు దానికోసం. చివరకు దాని జీవితం ఏమవుతుందోనని బెంగగా వుంది. మా అమ్మాయి ఎక్కడన్నా శాశ్వతంగా సుఖంగా వుండే వసతి కలిగించు" అని వాపోయింది.