Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 9


    అతను మనస్సు పెట్టి ఒక వ్యూహానికి రూపకల్పన చేస్తే, ప్రపంచంలోని ఏ వ్యక్తీ ఆ వ్యూహాన్ని ఛేదించలేదు.
    
    ఏది ఏమైనా రేపు మన ప్లాన్ నెంబరు వన్ ని అమలుపరిచి చూద్దాం. మన ప్లాన్ సక్సెస్ అయితే మాస్టర్ మరణం- మనకు కోతి లేదా.... కనీసం అనుభవమయినా మిగులుతుంది.
    
    విక్రోలి టూ జుహూ రూట్ మేప్ ని బయటకు తీయ్...." అన్నాడు మొదటి వ్యక్తి.
    
    రెండో వ్యక్తి తన ప్రక్కనే ఉన్న బ్రీఫ్ లోంచి గుండ్రంగా చుట్టి ఉన్న ఒక మేప్ ని బయటకు తీశాడు.
    
    మేప్ ని టీపాయ్ మీద పరిచాడా వ్యక్తి.
    
    రెండో వ్యక్తి పెన్సిల్ తీసుకొని విక్రోలి నుంచి జుహుకి వెళ్ళే మెయిన్ రూట్ ని మార్కు చేసుకుంటూ పోసాగాడు.
    
    "విక్రోలి నుంచి జుహూకి వెళ్ళేందుకు నాలుగు రూట్స్ వున్నాయి. ఏ రూట్ ని మిల్లర్ ఎన్నుకుంటాడన్నది ఎలా తెలుసుకోవటం?" మొదటి వ్యక్తి అడిగాడు.
    
    "మనకొచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం మాస్టర్ విక్రోలి ఎస్టేట్ లో ఆరున్నరకి బయలుదేరతాడు. ఏడుగంటలకి ఇస్కాన్ చేసుకుంటాడు. అంటే.... విక్రోలి నుంచి జుహు ఇస్కాన్ కి అరగంటలో వెళ్ళేందుకు వీలు కల్పించే రూట్ ని మనం ఎన్నుకుంటే చాలు."
    
    "అయితే వయా అంధేరి."
    
    "ఎస్. అంధేరి నుంచే వెళ్తాడు."
    
    "అయితే మనం వెంటనే ఆ రూట్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి."
    
    "అక్కర్లేదు."
    
    "ఏం....?"
    
    "నేను ఆల్ రడీ ఆ రూట్ ని స్టడీ చేసాను."
    
    "స్పాట్ ఎక్కడ?"
    
    "దేవానంద్ ఇల్లు, ఆపైనా చందనా థియేటర్."
    
    "దేవానంద్ ఇల్లా? హిందీ సినిమా ఆర్టిస్ట్?"
    
    "ఎస్."
    
    "ఎలా సాధ్యం?"
    
    "దేవానంద్ ఇప్పుడు కుటుంబంతో సహా ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఆ ఇంటి సెక్యూరిటీ గార్డుకి కొంత డబ్బిస్తే చాలు."
    
    "అది సరయిన స్థలమేనా?"
    
    "ఎస్ దేవానంద్ ఇల్లు కార్నర్ లో ఉంది. పెద్ద ప్రహరీ గోడ ఆ ఇంటి చుట్టూ ఉంది. ఆ ఇంటి చుట్టూ ఎత్తయిన చెట్లు, పొదలు బాగా పెరిగిఉన్నాయి."
    
    "అంటే... ఏదైన చెట్టు ఎక్కి..."
    
    "అవును, మాస్టర్ రోల్స్ రాయిస్ లో వస్తాడు. ఆ కార్లో మాస్టర్ బ్యాక్ సీట్లో కూర్చుంటాడు ఆ కారుకి ముందు ఫైలట్ గా వెళ్ళే అంబాసిడర్ లో ఎల్. ఆర్. ఎఫ్.బి. సెక్యూరిటీ కమెండోస్ ఉంటారు. దానికి ముందుగా వెళ్ళే మరో కారులో- అంటే ఫస్ట్ ఫైలట్ కారులో ఆరుగురు మాస్టర్ కమెండోస్ ఉంటారు. రోల్స్ రాయిస్ వెనుక ఫాలో అయ్యే ఎమర్జెన్సీ మెడికల్ వ్యాన్ లో మరో నలుగురు మాస్టర్ కమెండోస్ ఉండారు. దాని వెనుక వెళ్ళే సెక్యూరిటీ కారులో మరో నలుగురు మాస్టర్ కమెండోస్ ఉండారు. దాని వెనుక వెళ్ళే సెక్యూరిటీ కారులో మరో నలుగురు మాస్టర్ కమెండోస్ ఉంటారు. వారిలో కొందరి దగ్గర 303 కాలిబర్ రివాల్వర్సు ఉంటాయి. కొందరి దగ్గర డబుల్ బ్యారల్ గన్స్ ఉంటాయి. ముఖ్యంగా సెక్యూరిటీ కమెండోస్ దగ్గర మాత్రం మెషిన్ గన్స్ ఉంటాయి.

    వాతావరణంలో ఏమాత్రం మార్పు గమనించినా, ముందుగా రియాక్ట్ అయ్యేది సెక్యూరిటీ కమెండోస్, వాళ్ళకు దయా దాక్షిణ్యాలుండవు. ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్ధాక్షిణ్యంగా పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపడేస్తారు. సీన్ లో అతి ప్రమదకరమైన వాళ్ళు వీళ్ళే."
    
    "అది సరే... సరీగ్గా మాస్టర్ నే ఎలా గురిచూసి కాల్చటం?"
    
    "గురి చూసి కావాల్సిన వ్యక్తిని కాల్చలేనప్పుడు ఎందుకు మనమీ వృత్తిలో కొనసాగటం?" చిరాకు పడ్డాడా వ్యక్తి.
    
    "ఓ.కె... ఓకె... బట్.... రోడ్ కి కనీసం ముఫ్ఫై అడుగుల ఎత్తులో, చెట్టుపై కూర్చుని ఎలా షూట్ చేయటం? ఏమాత్రం గురి తప్పినా క్షణాల్లో సెక్యూరిటీ కమెండోస్, మాస్టర్ కమెండోస్ రోల్స్ రాయిస్ కి రక్షణ వలయాన్ని సృష్టిస్తారు. ఆ మరుక్షణం తమకు ఆపోజిట్ డైరెక్షన్స్ లో బుల్లెట్స్ వర్షం కురిపిస్తారు. అప్పుడు మనం చావటం, మాస్టర్ సేవ్ అవటం ఖాయం. ఛాన్స్ తీసుకొనే అవకాశం మనకు లేదు. మాస్టర్ ని అసాసినేట్ చేయమని మనల్ని పురమాయించింది మధ్యవర్తులు కాదు- డైరెక్ట్ పార్టీనే.
    
    మాస్టర్ ని చంపకుండానే మనం చస్తే మన ప్రయత్నం వృధా ప్రయాసే అవుతుంది. మాస్టర్ ని చంపినా, ఆపైన మనం ఆ స్పాట్ నుంచి క్షేమంగా తప్పించుకోగలిగితేనే మనం జీవితాన్ని అనుభవించేది. అలా కాకుండా మాస్టర్ ని చంపి, మాస్టర్ సెక్యూరిటీ సిబబంది చేతుల్లో పడి మనం ప్రాణాలు పోగొట్టుకుంటే మనల్ని హైర్ చేసుకున్నవాళ్ళకే రెండు విధాల లాభం కనుక ఆత్మాహుతి దళాల సభ్యులు కాకుండా, మిగతా వాళ్ళెవరయినా ఒక హత్య చేసేందుకు సిద్దపడితే వాళ్ళు ఎయిమ్ చేసిన వ్యక్తి చావు ఎంత ముఖ్యమో, వీళ్ళ లైఫ్ అంత ముఖ్యం ఇవన్నీ ఆలోచించావా...?"
    
    ఇదంతా శ్రద్దగా విన్న వ్యక్తి తలపంకించాడు. "ఆలోచించాను, ఇది మనకి మొదటిసారికాదు. కొత్త అంతకంటే కాదు. ఇప్పటికి నేను ఒంటరిగా మూడు అసాసినేషన్ ఆపరేషన్స్ ని దిగ్విజయంగా పూర్తిచేసి క్షేమంగా బయటపడ్డాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వూ రెండు పూర్తి చేసావు. ఇప్పుడు కొత్తగా ఆలోచించవలసింది వాటి గురించి కాదు. ఖరీదైన ప్రయివేట్ వ్యక్తుల ప్రాణరక్షణకు అనితర సాధ్యమైన రక్షణ వలయాన్ని, పద్మవ్యూహం కంటే దుర్భేద్యంగా నిర్మించగల మిల్లర్ గురించి నాకో ప్రక్క ఖచ్చితంగా మాస్టర్ ని అసాసినేట్ చేయగలమని పిస్తోంది. ఆ నమ్మకం ఉంది- ఉండాలి కూడా మరో ప్రక్క మిల్లర్ లాంటి క్రిమినల్ వరల్డ్ కింగ్ వ్యూహాన్ని ఛేదించటం సాధ్యమైన పనేనా అని సందేహం పీడిస్తోంది. మనలాగే మరో ఇద్దరు కూడా కలసి కోటిరూపాయల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ..... ఐ మీన్ ఈ తరహా ప్రయత్నాలు జరుగుతాయని మిల్లర్ కి తెలీకుండా ఉంటుందా?"
    
    "నువ్వు చెప్పినవన్నీ కరక్టే.... బట్ ఎంత తెలివికలవాడైనా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట పొరపాటు చేయకపోడు. అదే మనకు లభించే గొప్ప అవకాశమవుతుంది. ఏది ఏమైనా అన్నిటికి సిద్దపడే ఇందులోకి దిగాం. ఇప్పుడిక మీనవేషాలు లెక్కించటం ఫూలిష్ నెస్ అవుతుంది. లెటజ్ డిస్ కస్ ఎబౌట్ అవర్ ప్లాన్" అన్నాడు మేప్ కేసి చూస్తూ.
    
                                                       *    *    *    *    *

 Previous Page Next Page