Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 8


    అలాంటి భాగ్యవంతుడు హాంగ్ కాంగ్ నుంచి వచ్చి బొంబాయిలో స్థిరపడతానని హోమ్ శాఖకు అర్జీ పెట్టుకుంటే 24 గంటలలో అంగీకారం ఇవ్వటం జరిగింది. కోట్లాది హాంగ్ కాంగ్, అమెరికన్ డాలర్సు, విదేశీ కరెన్సీ రూపంలో ఇండియాకి తెస్తానంటే ఎందుకు కాదంటారు"?
    
    మాస్టర్ ని కలవటం ఒక కేంద్ర మంత్రికయినా ఒకింత కష్టమయిన పనే.
    
    ఎవరు మాస్టరుని కలవాలన్నా దానికి సంబంధించిన ఫైల్లో ఎన్నో వివరాలతో ముందుగా మిల్లర్ కి రావాల్సిందే.
    
    మిల్లరు దుర్భిణి వేసి మరీ ఆ అప్లికేషన్ ని శోధిస్తాడు.
    
    మాస్టరుని కలవాలనుకుంటున్న వ్యక్తి ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఏ ఉద్దేశంతో కలవాలనుకుంటున్నాడు? అతను మాస్టరుకి ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉందా? ఉంటే.... అలాంటి ఛాన్సెస్ ఎన్ని రకాలు? ఏ విధంగా ఉంటాయనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు మిల్లర్.
    
    ఒక్కోసారి మాస్టర్ ఓకే అన్న వ్యక్తులు కూడా మిల్లర్ వెలిబుచ్చే అభ్యంతరాల మూలంగా ఆయన్ని కలవలేక పోతుంటారు.
    
    విక్రోలి మాస్టర్ బంగ్లా ముందు నుంచి వెళ్ళే వ్యక్తులు, ఆ బంగ్లాని చూసేందుకు ఒక్కక్షణం ఆగినా, సెక్యూరిటీ గార్డ్సు జాగిలాల్లా మీదకు వచ్చి కళ్ళెర్రజేస్తూ చూడటం కోసం ఆగకండి. వెళుతూ చూడండి అని హెచ్చరిస్తారు.
    
    దాంతో బొంబాయి ప్రజలలో మాస్టర్ అన్నా, అతని బంగ్లా అన్నా మరింత ఆసక్తి పెరిగింది.
    
    (మాస్టర్ స్టెన్ ల్లీ గురించి ఇప్పటి వరకు ఇచ్చిన వివరాలు కేవలం అతని లైఫ్ స్కెచ్ ని కొంతవరకే తెలియపరుస్తాయి. సీరియల్ నడుస్తున్న కొద్ది ఇన్ డెప్తు అతను క్రమంగా బయటకొస్తాడు - రచయిత)
    
    "ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలోనే తెలుసుకుంటాం" మిల్లర్ ఏదో ఆలోచిస్తూ గంభీరంగా అన్నాడు.
    
    "మాస్టర్ మరొకరి జోలికి వెళ్ళేవారు కాదు కదా?" బి అడిగాడు.
    
    మిల్లర్ సమాధానమివ్వలేదు.
    
    "ఇక్కడంత ప్రొఫెషనల్ కిల్లర్సు ఉన్నారా?" ఎఫ్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
    
    "బొంబాయి డైయింగ్ అధినేత సస్లీ వాదియాను ఎసాసినేట్ చేసే ప్రయత్నం జరగలేదా? అదే అతని బిల్డింగ్ మెయిన్ గేటు ముందే హత్య చేసేందుకు ప్లాన్ చేసారు. ఎవరు చేసారు? ఎందుకు చేసారన్న మీమాంస మనకనవసరం. బట్.... ప్రొఫెషనల్, ట్రైన్డ్ కిల్లర్స్ ఇక్కడ కూడా ఉన్నారు. పెద్ద మొత్తాలిచ్చి వాళ్ళను హైర్ చేసుకోవచ్చనేది విశదమయింది కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి.
    
    రేపోసారి మాస్టర్ భద్రతా ఏర్పాట్లను పరీక్షించాలనుకుంటున్నాను. బీ ప్రిపేర్ ఫర్ దట్ రేపు మాస్టర్ ప్రోగ్రామ్స్ ఏమిటి?" మిల్లర్ బేస్ వాయిస్ లో అడిగాడు.
    
    "ఉదయం నుంచి సాయంత్రం ఆరువరకు నో ప్రోగ్రామ్స్ హీవిల్ బి ఆన్ ది ఎస్టేట్ సరీగ్గా ఆరుకు మాస్టర్ తన తల్లిగారిని, మేనకోడలు సోహ్నీని తీసుకొని జుహులో ఉన్న ఇస్కాన్ కి వెళతారు. అక్కడున్న హరేకృష్ణ మఠంలో మేడమ్ యశోధగారు ప్రార్ధనలు జరిపి తిరిగి బయలుదేరతారు...." ఎల్ క్రితం రాత్రి తన కందిన ప్రోగ్రామ్ షీట్ లోని వివరాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు.
    
    "హరేకృష్ణ కు మేడమ్ యశోధరగారు, పాపవెళితే సరిపోదా?" మిల్లర్ చిరాకు పడ్డాడు.
    
    "మాస్టర్ ఉద్దేశం కూడా అదే కాని మేడమ్ గారు ఒప్పుకోలేదు" బి నెమ్మదిగా అన్నాడు.
    
    మిల్లర్ తిరిగి ఆలోచనల్లో పడ్డాడు.
    
                                                    *    *    *    *    *
    
    "ఎప్పుడు?"
    
    "సరీగ్గా రేపు సాయంత్రం ఆరుగంటలకు మాస్టర్ తన తల్లితో, మేనకోడలుతో విక్రోలి ఎస్టేట్ నుంచే బయలుదేరి జుహూలో వున్న హరేకృష్ణ మఠానికి 6.30కి చేరుకుంటాడు. ఏడువరకు ఇస్కాన్ లో పూజలు చేస్తారు. తిరిగి ఏడుకి బయలుదేరి ఏడున్నరకి ఎస్టేట్ కి చేరుకుంటారు."
    
    లీలా కంపెనిస్కీ హోటల్ సూట్ లో కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ అది.
    
    "వీలుపడుతుందా?"
    
    "చెప్పలేం- మాస్టర్ బ్రెయిన్, మిల్లర్ తెలివితేటల్ని లెక్కించటం అంత తేలికయిన విషయం కాదు."
    
    "అలా అని నిరుత్సాహపడితే మనకు కోటిరూపాయలెలా దక్కుతాయి?"
    
    "ఎమౌంట్ పెద్దదే... మనం చేయవల్సిన పని కూడా అంతకంటే పెద్దది, ప్రమాదకరమయింది."
    
    "మిల్లర్, మాస్టరు చుట్టూ పన్నే రక్షణవలయం ఎంతో పటిష్టంగా, పకడ్బందీగా ఉంటుంది. అది తరుచూ తన స్వరూపాన్ని మార్చుకుంటూ పోతుంది. రేపటి మాస్టర్ ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేయబడిందో ఆఖరి నిమిషం వరకు సెక్యూరిటీ కమెండోస్ ఎల్, ఆర్, ఎఫ్, బి, లకు కూడా తెలియదు. మిల్లర్ తెలీనివ్వడు.
    
    మిల్లర్ అసాధారణమయిన మేధస్సున్నవాడు.
    
    అతి ప్రమాదకరమయినవాడు.
    
    ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టగల తెలివితేటలు అతని సొత్తు.
    
    అతన్ని సెక్యూరిటీ చీఫ్ గా పెట్టుకోవాలని ఎందరో ప్రపంచస్థాయి భాగ్యవంతులు ప్రయత్నించి విఫలమయ్యారు.
    
    నీతి, నిజాయితీ అతని నరనరాన ప్రవహిస్తుంటాయి.
    
    విశ్వాసం అతని మారు పేరు.
    
    అతని రక్షణ ఏర్పాట్లను ఔరంగాబాద్ లోని దౌలతాబాద్ కోటతో పోలుస్తుంటారు.

 Previous Page Next Page