Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 9


    మెట్లెక్కి తన ఫ్లాట్ ముందుకొచ్చేసరికి అప్పటి వరకున్న నీరసం రెట్టింపయింది.

 

    ఫ్లాట్ తాళం తీయబోతుండగా కాళ్ళకేదో తగలటంతో సడన్ గా క్రిందికి చూశాడు.

 

    క్రింద హాట్ కేరియర్...

 

    దాన్ని చూస్తూనే అమితమైన ఆశ్చర్యానికి గురయ్యాడు.

 

    చుట్టుపక్కల ఫ్లాట్స్ లో వున్న వాళ్ళెవరో తన పరిస్థితి గమనించి అది ఏర్పాటు చేసుంటారని అనుకుంటూ, దాన్ని తీసుకుని లోపలకెళ్ళి... తలుపేసుకుని డ్రాయింగ్ హాల్లోకొచ్చి, హాట్ కేరియన్ ని టీపాయ్ మీద పెట్టి, విండో దగ్గరకెళ్ళి, కర్టెన్ తొలగించి వచ్చి, కేరియర్ మీద పడి పోయాడు.

 

    ములక్కాయలతో చేసిన బిర్యాని....

 

    ములక్కాయల కూర....

 

    ములక్కాయల పులుసు....

 

    అన్నీ ములక్కాయలతోనేనా? అని ఆశ్చర్యపడేంత ఓపిక కూడా లేక గబగబా తినటం మొదలెట్టాడు.

 

    ఐదు నిమిషాల్లో తినటం పూర్తిచేసి చెయ్యి కడుక్కొని వచ్చి, సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు.

 

    సరిగ్గా అప్పుడే ఫోన్ రింగయింది.

 

    అది వింటూనే ఎలర్ట్ అయి, వేగంగా రిసీవర్ ని అందుకున్నాడు శ్రీధర్.

 

    "వాటీజ్ దిస్ అపర్ణా! ఏమైపోయావు?" కసురుకుంటూ అన్నాడు శ్రీధర్.

 

    నిశ్శబ్దం....

 

    "నీ ఫోన్ కోసం ఆకలి కూడా మర్చిపోయి ఎదురుచూశాను."

 

    అయినా ఫోన్ లో నిశ్శబ్దమే సమాధానమైంది.

 

    "మాట్లాడవా?" కోపంగా అన్నాడు శ్రీధర్.

 

    "ప్రతిచిన్న విషయానికి అబద్దాలాడటం మంచిది కాదబ్బాయి.... ఆకలెప్పుడు మర్చిపోయావు? ఇప్పుడేకదా పీకలదాకా మెక్కావు?" అదే కంఠం.... ఫోన్ తీగె వెంట తేనెని ప్రవహింపచేసే మృదుమధురమయిన కంఠం.

 

    ఛ... ఛ... తిరిగి అపర్ణే అనుకుని ఫూలిష్ గా మాట్లాడేశాడు.

 

    అవును... ఈ అమ్మాయికి తను యిప్పుడే భోంచేసినట్టు ఎలా తెలిసింది?

 

    "చూడు మిసెస్ జయారెడ్డి ... ఈ పద్ధతేం బాగాలేదు. గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేననుకున్నావా? ఎనీవే.... మంచి భోజనం, హాట్ కేరియర్ లో పెట్టి నా ఫ్లాట్ ముందుంచినందుకు థ్యాంక్స్" అన్నాడు శ్రీధర్ మృదువుగానే.

 

    "దిసీజ్ టూ మచ్" అందామె ఫోన్ లో ఆ వైపునుంచి.

 

    "ఏదీ?"

 

    "నా పేరు మార్చటం."

 

    "పేరు మార్చానా? నేనా?"

 

    "దిసీజ్ త్రీమచ్."

 

    "ఏది?" కన్ ఫ్యూజవుతూ అడిగాడు శ్రీధర్.

 

    "నీ ఆకలి తీర్చింది ఒకరయితే... థ్యాంక్స్ మరొకరికి చెప్పటం."

 

    "అంటే మీరు జయారెడ్డి కాదా? భోజనం పంపింది జయారెడ్డి కాదా?"

 

    "చాలా గొప్ప అందగాడివనుకుంటున్నావా?"

 

    "నేనా? ఎందుకలా అడిగారు?"

 

    "ఒకసారి అపర్ణ అని మరోసారి జయారెడ్డి అని పదేపదే ఆడపేర్లు ఉచ్ఛరిస్తుంటేను..." అంటూ ఆమె చిన్నగా నవ్వింది.

 

    పిచ్చిపట్టినట్టయిపోయింది శ్రీధర్ కి. ఈమె ఎట్టి పరిస్థితుల్లోనూ జయారెడ్డి కాదు. మరెవరు ?

 

    "ఇంతకీ 12155 అర్థం తెలుసుకున్నావా?" తిరిగి అదే పజిల్ కవ్వింపుగా.

 

    "ట్రైచేశా...ఇంకా... చేస్తున్నా...నో...నో...చేయలేదు..." టక్కున చెప్పిన శ్రీధర్ నాలిక్కరుచుకున్నాడు.

 

    తనకు తెలీకుండానే యీ అమ్మాయి తనమీద కమాండ్ సాధిస్తుందేమోనన్న ఉక్రోషం ఒకింత తొంగిచూసింది అతనిలో.

 

    "అంటే... దారిలోకొచ్చేస్తున్నావన్నమాట."

 

    "ఎందుకలా అనుకుంటున్నావ్...?" తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు.

 

    "మాటల్లో తడబడ్డావంటే బుట్టలో పడ్డట్టే."

 

    "ఏంటి అంతా నీ యిష్టమేనా? ముక్కూ మొహం తెలియని నీ బుట్టలో పడ్డానికి నేనేమంత అమాయకుడ్ని కాను."

 

    "అమాయకుడివి కాదనేగా పజిల్ విసిరాను. అమేయ అపార మేధావివే అయితే '12155' ని పరిష్కరించు చూద్దాం?"

 

    ఈసారి శ్రీధర్ అహం దెబ్బతింది. అతని ఉనికినే ప్రశ్నించేట్టుందా మాట.

 

    ఎవరీ అపరిచితురాలు?

 

    12155తో తననెందుకలా పరాజితుడ్ని చేస్తోంది? రెణ్నిమిషాలు మాట్లాడలేదు శ్రీధర్.

 

    అప్పటికే ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. దాహమనిపించి పక్కనే వున్న వాటర్ బాటిల్ అందుకుని గటగటా తాగేశాడు.

 

    "నీళ్ళు తాగావా? పాపం జీవుడికి గుండె హీటెక్కినట్టుంది..." అందామె కిలకిలా నవ్వుతూ.

 

    ముందొక్క క్షణం షాక్ తిన్నాడు శ్రీధర్.

 

    అంతా ఎదురుగా వుండి చూస్తున్నట్టే చెబుతున్న ఆ అపరిచితురాలు ఒక పెద్ద పజిలయిపోయింది. చుట్టపక్కల ఎక్కడన్నా నక్కి తనని గమనిస్తుందోమోనన్న అనుమానం వచ్చింది.

 

    వెంటనే లేచి సిటౌట్ లోకొచ్చి నలువేపులా చూశాడు. అంతా నీరవ నిశ్శబ్దం...

 

    ఎక్కడా ఒక మనిషి అలికిడి కూడా లేదు. క్రిందికి చూశాడు- సుమారు రెండెకరాల వైశాల్యం వున్న గ్రౌండ్ నిర్మానుష్యంగా వుంది. ఏ ఒక్క అపార్ట్ మెంట్ విండో ఓపెన్ చేసి లేదు. ఏ అపార్ట్ మెంట్ లోను లైట్ వెలుగుతున్నట్టు లేదు.

 

    మరెలా చూసినట్టే చెప్పగలుగుతోంది?

 

    "ఏంటోయ్ ఆలోచిస్తున్నావ్...?" అడిగిందామె ఫోన్ కి ఆ వేపునుంచి.

 

    "ఏం లేదు" అన్నాడు శ్రీధర్ తడబాటును కప్పిపుచ్చుకుంటూ.

 Previous Page Next Page