"ఎందుకు లేదు, బోలెడు వుంది. అంతా చూసినట్టే చెప్పేస్తుందేమిటీ పోకిరి పిల్ల అని అనుకుంటున్నావ్ కదూ? ఒక అపరిచితురాలైన, అందమైన ఆడపిల్ల ఫోన్స్ చేస్తుంటే అంతరంగంలో అలజడి లేకుండా వుంటుందా? ఎం.బి.ఏ.లో మెడల్ సాధించుకున్న తనకే పజిల్ విసిరేవాళ్ళా- అనే కొద్దిపాటి అహం నీలో వుంటుంది. దానికి పజిల్ ని సాల్వ్ చేయలేని నిస్సహాయత తోడవ్వనే అవుతుంది. అప్పుడు దాహమవక ఏమవుతుంది? దాహమైతే నీళ్ళు తాగుతారు. ఇది చూసే చెప్పక్కరలేదు. దీన్ని వూహించడానికి జంగ్, ఫ్రాయిడ్ థియరీలు అక్కర్లేదు. ఏమంటావ్?" చిలిపిగా నవ్వుతూ అందా అమ్మాయి.
"నువ్వనుకున్నట్టుగానే నువ్వు పోకిరి పిల్లవే. అవునూ ఇంతకీ నీ పేరేంటి?"
"అదిగో చూశావా ఆసక్తి మొదలైంది. నేను పోకిరి పిల్లనని నువ్వనుంటే బాగుండేదోయ్. ఈ లోపు నువ్వు ఏ పిచ్చిమాటతో నన్ను సంబోధిస్తావోనని నా గురించి నేనే అనుకున్నాను. పేరు కావాలా? నాది? ఈ నల్లపిల్ల పేరు నీకెందుకు?"
"వాట్...నువ్వు నల్లగా వుంటావా?"
"అవును..."
"ఆడవాళ్ళెవరయినా అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే చెప్పుకుంటారు. నువ్వేమిటి నల్లగా వుంటానని అనేశావ్?"
"నలుపులో సయితం అందాన్ని వీక్షించగల మగాడే నిజమైన రసహృదయుడు నా దృష్టిలో."
మొత్తానికి ఈ పిల్ల అందమైన నల్లపిల్ల. ఒక క్లూ దొరికిందను కున్నాడు శ్రీధర్.
"పేరు చెప్పడానికి భయమా?" అడిగాడు శ్రీధర్ కవ్విస్తున్నట్టుగా.
"భయమా? నిన్ను చూశా? నీ మొహం, నాకు భయమేమిటి?" నవ్వుతూనే అంది.
నీ మొహం అని ఆ అమ్మాయి అనడంతో శ్రీధర్ కి కోపం వచ్చింది.
ఇకపై ఆమె మాటల్ని వినిపించుకోదలచుకోక చెప్పాడు కోపంగా. "ఇదిగో... నువ్వే నా దగ్గరుంటే... నిన్నేం చేస్తానో..." నిగ్రహించుకుని ఆగిపోయాడు శ్రీధర్ కాసేపు.
"ఏం చేస్తావ్... ఏం చేయలేవు. నువ్వేదయినా చేస్తే చూడాలని నాకూ వుంది."
కిల కిల నవ్వుతూ మాట్లాడిన తీరు అది.
ఆమెతో పెట్టుకోవడం తనకు అనవసరమనుకుని ఫోన్ పెట్టేయబోయాడు.
"ఏంటి... పెట్టేస్తున్నావా? సరే నేనే చేస్తాలే...రేపు మళ్ళీ..."
అవతల్నుంచి ఫోన్ పెట్టేసిన చప్పుడుతోపాటు చిలిపి నవ్వు వినిపించింది.
చతికిలపడ్డాడు పక్కనున్న సోఫామీద శ్రీధర్. కానీ చివరగా వినిపించిన ఆ మందహాసం మధురంగా తోచింది.
ఒకవైపు మనసైన జవరాలు అపర్ణ అందకపోవడం... మరో వైపు ఆసక్తిని రేపుతున్న అపరిచితురాలి పజిల్... తాతయ్య తనని హైదరాబాద్ పంపించడం వెనకున్న ఆంతర్యం... మధ్య జయారెడ్డి రంగప్రవేశం... అన్నీ తనని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.
శ్రీధర్ కి నిద్ర పట్టడంలేదు. సమయం రాత్రి రెండవుతోంది... అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. నిద్ర పట్టనపుడు, విసుగు చెందినపుడు మధురమైన సంగీతాన్ని ఆస్వాదించడం, డైరీ రాయడం చేస్తుంటాడు శ్రీధర్.
అమెరికాలో అపర్ణతో కలిసి చదువుకునేటపుడు రాసుకున్న డైరీ తెరిచి చదవసాగాడు.డైరీ చదువుతున్నంత సేపూ అపర్ణ గురించి ఆలోచన మరింత తీవ్రం కాసాగాయి. సమీపంలో లేనిప్రియురాలి గురించి బాధపడుతున్నాడతను.
ప్రేమించిన వ్యక్తి దూరం కాబోతోందని తెలిసినప్పుడు, దగ్గర లేనపుడు ప్రేమ, బాధ మరింత అధికం కావడం సహజం.
మనిషి జీవితానికి ప్రేమ అవసరమని అపర్ణ తెలుసుకునే రోజు కోసం నిరీక్షిస్తున్నాడతడు.
అపర్ణ జ్ఞాపకాల డైరీ చదవడం ఆపేసి, ఒక నిర్ణయానికొచ్చాడు శ్రీధర్.
రేపు రాబోయే పర్ణ ఫోన్ కాల్ కై ఎదురుచూస్తూ తన ప్రేమ గురించి గట్టిగా ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాడు.
టేప్ రికార్డర్ ఆన్ చేసి, మృదు మధురమైన సంగీతాన్ని వింటూ నిద్రలోకి జారుకున్నాడు ఆ రాత్రికి.
* * * *
సమయం ఉదయం ఎనిమిది గంటలు....
చక్కగా ఫ్రెష్ అప్ అయ్యాడు శ్రీధర్. బ్రేక్ ఫాస్ట్ గా రెండు అరటిపళ్ళుతిని, గ్లాసుడు పాలు తాగి, డోర్ లాక్ చేసి బయటికొచ్చాడు.
లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కొచ్చాడు. కొంచెం దూరం నడిచి, రోడ్డు మీద కెళ్ళి ఆటోఎక్కి "సికిందరాబాద్ పదా...." అన్నాడు.
మరో అరగంటలో సికిందరాబాద్ లోని గన్ రాక ఎన్ క్లేవ్ ఈస్ట్ వెస్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ ముందాగింది ఆటో.
మీటర్ చూసి ఆటోవాడికి డబ్బులిచ్చి, ఆఫీసువేపు నడిచాడు శ్రీధర్.
జంట నగరాలలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలలో ఈస్ట్ వెస్ట్ ఒకటి. సుమారు రెండువేలమందికి పైగా సిబ్బందిని కలిగివున్న సంస్థ అది. దేశవ్యాప్తంగా దానికి అనేక బ్రాంచీలున్నాయి. అందులో శ్రీధర్ ఒక ఎగ్జిక్యూటివ్.
ఫ్రంట్ డోర్ తీసుకుని, లోపలికి నడిచి, ఎం.డి. ఛాంబర్ లో కెళ్ళి, అయిదు నిమిషాల తర్వాత ఒక ఫైల్ తో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు... ఫైల్ తెరచి, డాక్యుమెంట్స్ పరిశీలించడంలో నిమగ్నమయ్యాడు.
"హల్లో" అన్న పిలుపుకి తలెత్తి చూశాడు శ్రీధర్. ఎదురుగా యోగి నవ్వుతూ కనిపించాడు.
యోగి ఎప్పుడూ ఫన్నీగా వుంటాడు. జోకులేస్తూ, నవ్వుతూ నవ్విస్తూ వుంటాడు... అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడుతుంటాడతడు. అదే ఆఫీసులో పనిచేస్తున్న మేరీ అంటే అతని కెంతో ఇష్టం. మేరీతో మాట్లాడాలని, షికార్లు తిరగాలని ఆరాటపడుతుంటాడు.
"ఏంట్రోయ్... కళ్ళంత ఎర్రగా వున్నాయ్. రాత్రి నిద్దర్లేదా ఏంటి? బహుశా అపర్ణ ఫోన్ చేసిందనుకుంటా..." అన్నాడు యోగి.
"ఎక్కడి ఫోన్ రా బాబూ - నిన్నా లేదు-మొన్నా లేదు- టెన్షన్ తో ఛస్తున్నాను-" బదులిచ్చాడు శ్రీధర్.
"ఇంతకీ పియర్స్ రాలేదా?" అడిగాడు యోగి.
"పియర్స్ ఎవరు?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్.