"నువ్వు, నేను కల్సుంటామని నేనెప్పుడూ అనుకోలేదు..."
ఆ మాటకు చిన్నారి ముంతాజ్ గుండెలో ఆనందసముద్రాలు ఎగిసాయి.
అతని చేతుల్ని పట్టుకుని, అతని పెదవుల్ని ముద్దు పెట్టుకుంటూ...
"ఐ లవ్ యూ... డియర్..." అంది.
"భువనేశ్వర్ లో దిగ్గానే, నాకు తెల్సిన ఓ ఫ్రెండున్నాడు. ముందు వాడింటికెళ్దాం... మర్నాడు మనం వాడు సాక్షిగా పెళ్ళి చేసుకుందాం... ఆ తర్వాత..."
అవినాష్ నోటంట వస్తున్న మాట ఒక్కొక్కటి ఆమెలో అంతులేని సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఆమె మనసు ఓ చిన్న సంసారంలోకి గమ్మత్తైన అనుభవాలలోకి వెళ్ళిపోతోంది.
మూడు గంటల కాలం కబుర్లతో గడిచిపోయింది.
అప్పటికి సమయం సరిగ్గా నాలుగ్గంటలైంది.
రాయగడ స్టేషన్ ని విడచి రైలు పరుగెడుతోంది.
అప్పుడు నెమ్మదిగా లేచాడు అవినాష్.
కంపార్ట్ మెంట్లో అటూ ఇటూ చూస్తూ తలుపు దగ్గర కొచ్చాడు.
గెడ తీసి తలుపు లోనికి లాగాడు. తలుపు తెరుచుకుంది. దాంతో పాటు లోనికి రివ్వున గాలి తెరలు ప్రవేశించాయి.
సిగరెట్ వెలిగించుకుంటూ అక్కడ నిలబడ్డాడు.
వంతెన మీదకు రైలొచ్చింది.
విశాలమైన, పొడవాటి ఆ వంతెన మీద రైలు పది నిమిషాల సేపు వెళ్తుంది.
ఎక్స్ ప్రెస్ రైలు పట్టాల చప్పుడు పెనురొదలా ఉంది.
కంపార్ట్ మెంట్లో మనుషుల శబ్దం లేదు.
రైల్లోని దీపాలతో, రైలు కింద జలపాతపు వేగంతో ప్రవహిస్తున్న నీళ్ళు ప్రతిఫలిస్తున్నాయి.
సరిగ్గా-
అదే సమయంలో-
"ఏం చేస్తున్నావ్..." అంటూ అక్కడ కొచ్చింది ముంతాజ్.
ముంతాజ్ అక్కడకు తన మట్టుకు తనే వస్తుందని ముందుగానే ఊహించాడు అవినాష్.
ఆ తలుపు పక్కనున్న 'ఐరెన్ రాడ్' పట్టుకుని నిలబడింది ముంతాజ్.
"అబ్బా... ఎంత లోతో... పట్టపగలైతే... కళ్ళు తిరుగుతాయి." అంది ముంతాజ్.
ముంతాజ్ రెండో చేతిని అవినాష్ భుజాల మీద వేసింది.
అదే సమయంలో-
"నన్ను కిందకు తోసేసే దానిలా ఉన్నావ్..."
ఆ అమ్మాయి ముఖం వేపు చూస్తూ అన్నాడు అవినాష్.
"ప్రేమించిన ఆడపిల్ల లెప్పుడూ అలాంటి వెధవ పనులు చెయ్యరు. మీ మగవాళ్ళే చెయ్యాలి... మగవాళ్ళంటే... నువ్వు కాదులే... ఉంటారుగా..." ఏదో అనబోయింది ముంతాజ్.
రైలు పట్టాల శబ్దం... తీవ్రంగా ఉంది.
అప్పుడే ఆ సమయంలో రైలు కూత ఆ నిశ్శబ్దంలో కొండల్లో ప్రతిధ్వనించింది.
వంద మైళ్ళ పరుగుతో కోణార్క్ ఎక్స్ ప్రెస్.
రైలు పట్టాల టకటకల పెనురణధ్వనిని తలుపుకు చెవి ఆనించి వింటోంది ముంతాజ్.
ఓరకంట చూశాడు అవినాష్.
ఒకటి... రెండు... మూడు... నాలుగు... అయిదు... ఆరు...
అవినాష్ గుండెల్లో వేగం హెచ్చింది.
నరాల్లో రక్తం ప్రవహిస్తోంది.
అతని ముఖంలో చటుక్కున క్రూరత్వం విషంలా ఎగ బ్రాకింది.
అతని రెండు చేతులూ ముందుకు కదిలాయి.
అంతే....
ఒక పెనుకేక ఆ పెను చీకటిలో విహ్వలంగా వినిపించింది.
అంత ఎత్తునుంచి కిందకుపడ్డ చిన్నారి ముంతాజ్ మరో రెండు నిమిషాల్లో పెనువేగంతో ప్రవహిస్తున్న నీళ్ళలో...
అంతా ఒక నిమిషంలో జరిగిపోయింది.
రైలు పట్టాల ధ్వనిలో ఆ కేక కల్సిపోయింది.
ప్రేమకోసం ఒక కనకాంబరపు పువ్వులాంటి వయసు పెనురాక్షసపు పులి గోళ్ళకు చిక్కిపోయింది.
చటుక్కున తలుపేసేసి కంపార్టుమెంట్లో నాలుగువేపులా చూశాడు.
నిద్రలో లోకం హాయిగా వుంది.
ఫేంటు జేబులోని రుమాలు తీసి నుదురుకు పట్టిన చెమట తుడుసుకుని, తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు.
సిగరెట్ తాగుతూ పదినిమిషాలు కూర్చున్నాడు.
ఆ తర్వాత....
ముంతాజ్ తెచ్చిన సూట్ కేసు విప్పాడు. విప్పగానే నీలిబల్బు వెలుగులో ఇరవై వందరూపాయల కట్టలు కన్పించాయి. ఆ డబ్బు తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు.
ఆ సూట్ కేసుని అందులో ఉన్న మిగతా వస్తువులతో పాటు కంపార్ట్ మెంట్ గ్లాస్ డోరు పైకెత్తి బయటకు విసిరేశాడు. ఇప్పుడు అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది.
అరగంట గడిచింది.
ఏదో స్టేషన్లో రైలాగింది. ఆ ఆగిన ఒక్క నిమిషంలోనే ఆ స్టేషన్లో దిగిపోయాడు.
ఆ తర్వాత ఓ అరగంట తర్వాత....