Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 10


    విశాఖకు వస్తున్న ఓ పాసింజర్ రైల్లో అవినాష్ కూర్చున్నాడు.

 

    అతనిప్పుడు చాలా చాలా ప్రశాంతంగా ఉన్నాడు.

 

    జీవితంలో మొట్టమొదటిసారిగా అంత డబ్బు అతని చేతిలో ఉంది.

 

    తర్వాత అవినాష్ ముంతాజ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ అవినాష్ ని ముంతాజ్ జ్ఞాపకాలు ఎప్పుడూ వేధిస్తున్నాయి.

 

    అప్పటికి సమయం....

 

    తెల్లవారు జాము అయిదుగంటలైంది.

 

    అవినాష్ కి మరి నిద్రపట్టలేదు. లేచి బట్టలేసుకుని రూంకి తాళం వేసి జంక్షన్లోని హోటల్ వేపు నడిచాడు.

 

    కాఫీ తాగుతూ అవినాష్ దృఢంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇరవై వేలకోసం ముంతాజ్ ని చంపాడు. కొన్ని లక్షల రూపాయలకోసం-

 

    రోష్ణీని ప్రేమిస్తాడు. పెళ్ళాడతాడు.

 

    కానీ....

 

    గౌతమి, గౌతమికి పుట్టేబిడ్డ.

 

    అవసరమైతే ఇద్దర్నీ తను చంపేస్తాడు.

 

    అవును.

 

    ఇద్దర్నీ చంపేస్తాడు.

 

    అప్పటికి పూర్తిగా తెల్లవారింది.


                                       4


    సింహాచలం ఆర్టీసి బస్టాండులో కిళ్ళీబడ్డీ పక్కన నిలబడి చాలాసేపటినుంచి ఎదురు చూస్తున్నాడు అవినాష్.

 

    అతనక్కడికి వచ్చి అరగంటకు పైగా అయింది.

 

    రెండుసార్లు చేతివాచీని చూసుకున్నాడు.

 

    సరిగ్గా పదిగంటలకు వస్తానన్న రోష్ణీ పదిన్నరయినా రాలేదు.

 

    ఏం చేయాలో తోచక పక్కనున్న హోటల్లోకెళ్ళి కాసేపు కాఫీ తాగుతూ కాలక్షేపం చేశాడు.

 

    అప్పుడు అతనికో విషయం జ్ఞాపకానికొచ్చింది.

 

    రోష్ణీని మూడునెలలక్రితం మొట్టమొదటిసారి చూసింది సింహాచలం బస్టాండులోనే.

 

    ఆ రోజు ఆ పరిచయం ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది అవినాష్ కి.

 

    అవినాష్ వంట్లోకి ఒక్కసారి తియ్యని పూలసొగసు ప్రవహించి నట్టయింది.

 

    ఆ రోజు-

 

    కాలేజీ వాళ్ళంతా పిక్నిక్ కి వచ్చారు. ఓ ఇరవై మంది స్టూడెంట్లు, తనుకాక, ఇంకో నలుగురు లెక్చరర్లు, కో ఎడ్యుకేషన్ కావడం వల్ల స్టూడెంట్లలో ఓ పదిమంది అమ్మాయిలుకూడా ఉన్నారు.

 

    ఆ అమ్మాయిల్లో ఓ అమ్మాయితో పాటు వచ్చింది రోష్ణీ. రోష్ణీని మొట్టమొదట ఆ అమ్మాయ్ తీసుకొచ్చి పరిచయం చేసింది అవినాష్ కి.

 

    "మా బయాలజీ లెక్చరర్...అవినాష్ గారు..."

 

    "మా ఫ్రెండు రోష్ణీ...ఉమెన్స్ కాలేజీలో బి.ఎ. చదువుతోంది..." చెప్పిందా అమ్మాయి.

 

    అవినాష్ ఆ అమ్మాయిని విష్ చేస్తూ ఆ కళ్ళవేపు చూశాడు. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అవినాష్ కళ్ళవేపు సూటిగా చూసింది.

 

    ఆ చూపులు అవినాష్ గుండెలో గుచ్చుకున్నట్టయాయి. సింహాచలం దేవస్థానం గులాబీ తోటలో పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేశారు.

 

    అందరూ అక్కడికి నడిచారు.

 

    కాఫీ టిఫిన్లయాక, కొంతమంది కేరమ్స్ ఆటలో కూర్చున్నారు.

 

    మరికొంతమంది 'సైట్ సీయింగ్' కి వెళ్ళారు. ఇంకొంత మంది ఆ పక్కనున్న కొండల్లోకెళ్ళారు. ఆడపిల్లల వెనక వచ్చిన ఇద్దరు లేడీ లెక్చరర్లు వెళ్ళారు.

 

    అవినాష్ ఎక్కడకూ కదల్లేదు.

 

    ఏదో నవలని పట్టుకుని కూర్చున్నాడు.

 

    అక్కడకు కొంచెం దూరంలో అమ్మాయిలు నలుగురు కేరమ్స్ ఆడుతున్నారు.

 

    వాళ్ళ నవ్వులు, జోకులు, వాళ్ళకు కొంచెం దూరంలో వంటవాళ్ళ హడావుడి, ఆపైన వంటల వాసనల ఘుమఘుమలు అన్నీ పసందుగా ఉన్నాయి.

 

    అక్కడకు కొంచెం దూరంలో ఓ మండపం ఉంది. ఓ గంట గడిచింది.

 

    ఆ సమయంలో ఓ అమ్మాయి అవినాష్ దగ్గరగా వచ్చి-

 

    "సార్! మీకు కేరమ్స్ వచ్చా" అని అడిగింది.

 

    "ఏం" తలెత్తి అడిగాడు.

 

    "నేనలా తోటలో కెళ్తాను...అక్కడ హేండ్ ఖాళీ...మీరాడితే ఆడండి..." అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

 

    తలతిప్పి కేరమ్స్ బోర్డ్ దగ్గరున్న వ్యక్తుల వేపు చూశాడు.

 

     ముగ్గురమ్మాయిల్లో ఒకమ్మాయి రోష్ణి.

 

    లేచి, నెమ్మదిగా నడుస్తూ అక్కడకెళ్ళి కూర్చున్నాడు.

 

    "గేమ్ ఆడదాం...సర్..." ఓ అమ్మాయి అంది. ఆ అమ్మాయి పేరు గీత.

 

    "ఉత్తినే గేమ్ ఆడితే ఏం మజా..." రోష్ణి ఫ్రెండ్ లలిత అంది.

 

    "మరి...బెట్ కడదాం...ఓ.కె..." రోష్ణి అంది.

 

    "ఏవిటి బెట్..." అడిగాడు అవినాష్.

 

    "ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఓడిపోయిన వాళ్ళని సినిమాకు కెళ్ళాలి..." గీత ఉత్సాహంగా అంది.

 

    "ఉత్తి సినిమా ఒక్కటేనా...హోటల్ కి కూడా..." రోష్ణి అంది.

 

    "ఎస్. అలాగే...ఏం సార్...అలాగేనా..." లలిత అంది.

 

    అవినాష్ తలూపాడు.

 

    రోష్ణి ఏం మాట్లాడలేదు.

 

    రోష్ణి, అవినాష్ ఒక పార్టీ. గీత, లలిత ఒక పార్టీ.

 

    ఆట జోరుగా సాగుతోంది.

 

    కాలేజీ రోజుల్లో అవినాష్ కేరమ్స్ బాగా ఆడేవాడు. మళ్ళీ ఇప్పుడే అయినా బాగానే ఆడుతున్నాడు.

 Previous Page Next Page