Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 9


    "ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలుసుకున్నామని అడక్కు. అదంతా మామూలు ప్రేమకథే. నా చిన్నతనమంతా అనాధాశ్రమంలోనే గడిచింది. నా తల్లితండ్రులు ఎవరో నేనెరుగను. జ్ఞానం వచ్చాక ఒక అనాథ శరణాలయంలో వున్నట్లు తెలుసుకున్నాను. అక్కడ చదువుతోపాటు అప్పడాలు ఒత్తించడం, ఒడియాలు పెట్టించడం ,ఊరగాయలు చెయ్యటం నేర్పుతూ వుండేవారు. వాటిమీద వచ్చే ఆదాయంతో ఆ శరణాలయం నడవాలనే ప్రయత్నం జరుగుతూ వుండేది. సరే ఆ సోదంతా ఎందుకులే? నాకు వయసొచ్చాక, కాలేజీలో చదువుతుండగా కాలేజీ            స్టూడెంట్లంతా కలిసి ఢిల్లీ ఎక్స్ కర్షన్ వేసుకున్నాం. అక్కడ కనిపించాడతను ఢిల్లీ ఎర్రకోటను చిత్రంగా చూస్తూ తిరిగుతున్నప్పుడు. ఆగ్రా వెళ్ళాక ఫతేపూర్ సిక్రీలో, తాజ్ మహల్ ఛాయల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాడు. పలకరించేవాడు, కవ్వించేవాడు. బహుశా ఆ ప్రణయసౌధాల వాతావరణ ప్రభావంతో నేనూ పులకరించినట్లున్నారు. తర్వాత కొన్నాళ్ళకే జరిగిపోయింది మా పెళ్ళి."

    అనుభూతులకు దూరంగా, నిస్సంకోచంగాను,  నిర్గుణంగానూ చెప్పబడుతూన్న ఈ యదార్ద జివితగాధను మాలతి ఆసక్తిగా ఆలకిస్తోంది.

    "అతని ఉద్యోగరీత్యా- అతను స్టాటిస్టికల్ ఆఫీసర్.  ఊళ్ళూ, రాష్ట్రాలుకూడా  మారుతూ వుండేవాళ్ళం. మొదట అందరు దంపతుల్లాగే చాలా సరదాగా, అద్భుతంగా గడిచిపోయింది కాలం. అతనో గొప్ప హీరో అని నేనూ, నేనో రమణీయ కదానాయికనని అతనూ అనుకుంటూ వుండేవాళ్ళం. కాలం సాగి, ఆవేశాలు చల్లారుతూ వస్తోన్న రోజుల్లో పడేసరికి ఒకరి గొప్పతనం ఒకరికి కనిపించడానికి బదులు ఒకరి లోపాలు మరొకరికి గోచరించసాగాయి. ఉహుఁ అదికాదు సామాన్యమైన విషయాలు లోపాలుగా కనిపించసాగాయి. ఒకరినొకరు విమర్శించుకోవటం,అకారణంగా మానసికంగా హింసించుకోవటం మొదలయాయి. సంసార జీవితంలో ప్రేమించుకోవటంతోబాటు ఆసహ్యించుకోవటం  కూడా ఒక భాగమని నేనర్ధం చేసుకున్నాను.  గిల్లికజ్జాలు చిలికిచిలికి గాలివానలా ఎడాపెడా చోటు చేసుకుంటూండేవి. పరస్త్రీలను చూసినప్పుడు అతను చలించటం, వ్యామోహితుడవుతూ వుండటం అదీ గమనించాను."

    "అలాంటి రోజుల్లో ఓసారో సంఘటన జరిగింది. మా దాంపత్యం చూడటానికి నేను నా మొదటి దశ జీవితాన్నంతా గడిపిన అనాధ శరణాలయం యజమాని గోవిందరావుగారు మా ఇంటికి వచ్చారు."
         
    ఆయనకి డెబ్భై అయిదేళ్ళుంటాయి. అప్పటికి చూపుకూడా సరిగా ఆనటం లేదు. ఆయన్ని మా ఇంట్లో భోజనానికి ఉండమన్నాను.

    "భోంచేశాక ఆయన చేతిమీద నీళ్ళు పోస్తూ వుండగా, ఆ ముసలాడు కాసిని నీళ్ళు నా ముఖంమీద జల్లి,  ఏదో పరిహారం విసుర్తూ ఎడంచేత్తో నా బుగ్గగిల్లాడు. అది వెనకనుంచి ఇతను చూశాడు. ఆ తరువాత ముసలాడు వెళ్ళిపోయాడు."

    "ఇహ అప్పటినుంచీ వేధించటం మొదలుపెట్టాడు. ఆ గోవిందరావుకీ, నీకూ సంబంధమేమిటో, ఎంత చనువు లేకపోతే వాడలాంటి సరసమాడతాడు? నిజం చెప్పు? నిజం చెప్పమని....."

    "ఏం చెయ్యాలి?" అతను అగ్నిహోత్రంలా దహించుకుపోతున్నాడు, శివాలెత్తి పోతున్నాడు. హింసించి పారేస్తున్నాడు. ఆ భాద భరించలేక ఒకసారి నిజం చెప్పేశాను.

    అతన్ని ఎదిరించానని చెబుతుందనుకుంటున్నా మాలతి "నిజం చెప్పేశాను" అనేమాట వినబడేసరికి విద్యుద్ఘాతం తగిలినట్లు వణికింది.

    "అంటే?"

    భానుమతి చిన్నగా నవ్వింది. "మా ఇద్దరిమధ్యా ఏం జరిగిందో అది చెప్పాను."

    మాలతి తన చెవులను నమ్మలేకపోతుంది. ఆ మాటలు వినిపించకుండా ఆ సంఘటన అంతటితో అంతమైపోతే బాగుండుననుకుంటోంది.

    "అవును నాకు పధ్నాలుగేళ్ళప్పుడు నిచ్చెనేసుకుని అటకెక్కి కావలసిన అప్పడాలో, ఒడియాలో సరిగ్గా గుర్తులేదు. నిచ్చెన దిగుతున్నాను. నిచ్చెన స్థిరంగా లేదు. కదులుతున్నదేమో, పడిపోతుందేమోనన్న భయంతో నెమ్మదిగా, జాగ్రత్తగా దిగుతున్నాను. దాదాపు క్రిందవరకూ వచ్చాక వెనకనుంచి ఓ చెయ్యి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. తల త్రిప్పి చూసేసరికి గోవిందరావుగారు "భయం లేదు, పడకుండా పట్టుకుంటాలే" అంటున్నాడు. "నేనేం పడటంలేదు" అని విడిపించు కొబోయాను. అయినా ఆ చెయ్యి నన్ను వదలటంలేదు. పైగా మరింత గట్టిగా, అసహ్యంగా బిగుసుకుంటోంది. ముసలాడు నన్ను చుట్టుకు పోతున్నాడు. తెలివి తెచ్చుకుని చేతిలోని ఆ అప్పడాలు ఏవో ముఖంమీద కొట్టి, బలమంతా ఉపయోగించి దూరంగా తోసిపారేసి నా గదిలోకి వెళ్ళి పోయాను. ఏడుపొచ్చింది. మళ్ళీ చిన్నప్పటినుంచీ అలవాటయిన అహం అడ్డొచ్చి నిగ్రహించుకుంటున్నాను. కాసేపటికి హుంకరించుకుంటూ గోవిందరావు, ఆ ముసలినక్క అక్కడికి వచ్చాడు. "నా ఆధీనంలో వుంటూ నన్నే ఎదిరిస్తావా? ఎంత ధైర్యం? ఈ శరణాలయం నాది, నిన్ను నేను పోషిస్తున్నాను. నిన్ను నా ఇష్టమొచ్చిన రీతిలో మలుచుకోటానికి నాకు హక్కుంది" అంటూ ఏమేమో వదరుతున్నాడు. ఆ ముసలాడి జీవంలేని గాజుముక్కల్లాంటి కళ్లూ, కట్టుడుపళ్ళూ, వెధవ ఒళ్ళూ చూసి కంపరంపుట్టి అక్కడ వుండలేననుకుని పారిపోయి వచ్చేశాను. వచ్చేశానేగానీ చిన్నపిల్లని, ఎక్కడకు పోగలను? అడుగు తీసి అడుగువేస్తోంటే పదిమంది వికృతచూపులు నామీద పడేవి. ఎంత ఒదిగి ఒదిగి నడుస్తున్నా ప్రతివాడూ నన్ను రాచుకుంటూ పోయేవాడు. ఒకడు సైకిల్ మీద వెడుతూ "దాదా! ఒక్కదానివే ఎక్కడికి పోతున్నావు? సైకిలెక్కు, మీ ఇంటి దగ్గర దించేస్తాను" అంటూ నిజంగా అంతపనీ చెయ్యబోయాడు. కాలేజీ స్టూడెంట్లు నా ప్రక్కనుంచి పోతూ జడలాగి, భుజంగిల్లి పోయేవారు. రోజులు గడుస్తూన్నకొద్దీ నాకు ఆకలి వెయ్యసాగింది. ఆకలి భరించలేక ఏడుపు వస్తోంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఆకలిబాధ ఎంత భయంకరమైనదో  అర్ధం చేసుకున్నాను. చీకటి పడేసరికి నా పరిస్థితి మరీ పతనమైంది. కిళ్లీ కొట్టువాడూ, మిఠాయి కొట్టువాడూ, సోడాబండివాడూ అంతా కోరచూపులు చూసేవాళ్ళే. ఏవో వ్యంగోక్తులు విసిరేవాళ్ళే. ఇంతలో ఎవరో నలుగురు రౌడీలు మీద మీదకు వచ్చారు. వాళ్ళ వాలకంచూస్తే అమాంతంగా నన్ను ఎత్తుకుపోయేటట్లు కనిపించింది. హడలిపోయి రోడ్డుమీద ఇంచుమించు పరిగెత్తినంత పని చేసి విధిలేక మళ్ళీ శరణాలయానికే తిరిగి వచ్చాను. తర్వాత....

    "తర్వాత అర్దమయింది. యిహ చెప్పొద్దు ప్లీజ్!" అంది మాలతి జాలిగా.

    "చెప్పనులే" అంది భానుమతి నవ్వుతూ. నా కాలేజీ చదువుకూ, నా పెళ్ళికీ ఆ ముసలాడే కారణమయ్యాడు. కానీ ఒక్కవిషయం నువ్వు వినాలి.                                                                               
                                                                

 Previous Page Next Page