వాడు నన్ను పాడుచేశాడు గానీ నేను చెడిపోలేదు. అర్ధమయిందా? ఎందుకంటే ఆ ముసలి......
"ఛీ! చెప్పొద్దు......"
"ఆల్ రైట్! కానీ ఇవన్నీ మా ఆయనకు చెప్పాను."
మాలతికి ఏడుపొస్తోంది. "ఎందుకు చెప్పావే? ఎందుకలా జీవితాన్ని కాల్చేసుకున్నావే?"
భానుమతి మళ్ళీ నవ్వింది "చెప్పకపోతే ఏం చెయ్యను? చెప్పేదాకా ప్రాణాలు తోడేస్తే. సరే, అంతా విన్నాక అతని ముఖ భంగిమలు మారిపోయాయి. ఉలకడు, పలకడు. బిగుసుకుపోయాడు. అంత భరించలేనివాడివి ఎందుకడిగావన్నాను. నా జీవితంలోకి నువ్వు ప్రవేశించికముండు అన్ని సంవత్సరాల కాలపరిమితిలోను, అందులో అనాధను కదా! శరణాలయంలో పెరిగినదాన్ని కదా, ఏ సంఘటన అంటూ జరగకుండా ఎలా వుంటుందనీ, అప్పటికీ తనకి నిమిత్తంలేని నా గతజీవితాన్ని గురించి అంత నిశితంగా ఎందుకు ఆలోచించలేదని తరచి తరచి అడిగాను. అతను మరీ నన్ను అంటరానిదాన్నన్నట్లు చూస్తోంటే "అయితే నన్ను పెళ్ళాడేముందు పాతికేళ్ళు నీదార్న నువ్వు బతికావు. ఈ పాతికేళ్ళ కాలంలోనూ నీకు ఏ అనుభవాలూ లేవా? చెడు ఆలోచనలు లేకుండానే బ్రతికావా? కనీసం స్పందనలకైనా గురి కాలేదా? అలా కాకుండా వుండటం సాధ్యమా? అని నిలదీసి అడిగాను. అలా అడగటంవల్ల ఫలితముంటుందని అనుకోలేదు. కానీ కసికొద్దీ అడిగేశాను. చెంప పగలగొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు."
"తర్వాత ఎలా సంపాదించాడో గానీ స్టేట్సులో ట్రెయినింగ్ అంటూ అతనికి అవకాశం వచ్చింది. నేను విదేశాలకు పోతున్నాను అని చెప్పాడు.
నన్నెలాగూ తీసుకువెళ్లడని తెలుసు. అడిగి లాభమేముందని మెదలకుండా ఊరుకున్నాను."
"మధ్యలో మూడు నాలుగు ఉత్తరాలొచ్చాయి. నేనూ రాశాను. ఇవాళ్టి ఉత్తరంలో తేల్చి రాసేశాడు - తను నాతో తెగతెంపులు చేసేసుకున్నానని."
చివరకు ఇలాంటిదే ఏదో జరిగినట్లు చెబుతుందని మాలతి ఊహిస్తూనే వుంది. ఆమె గుండె వెయ్యి వక్కలవుతూ పోయినట్లనిపించింది.
"లైటు తేసెయ్యి ప్లీజ్! పడుకుందాం" అంది నూతిలోనుంచి గొణిగినట్లు.
భానుమతి లేచి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ప్రక్కమీదకు చేరింది. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోకుండా ఊరుకున్నారు . చివరకు తనే అడిగింది "నువ్వు ఏడుస్తున్నావా?"
మాలతి నుండి ఏ సమాధానం రాలేదు.
భానుమతి ఆమెకేసి తిరిగి వీపుమీద చెయ్యివేసి నిమురుతూ అంది "నువ్వింకా కలల్లోనే వున్నావే. ఈ దశలోనే కళ్లకు అన్నీ సున్నితంగానే కనిపిస్తూ వుంటాయి. వాస్తవ ప్రపంచంలోని యదార్ధాలు నమ్మబుద్ధి కాదు. కళ్ళెదుట కనిపిస్తున్నా అర్ధం చేసుకునేందుకు మనసు నిరాకరిస్తూ వుంటుంది.
నిజానికి ఆవసరం రాకపోతే అర్ధం చేసుకోవాల్సిన అగత్యమూ లేదు. సాఫీగా సాగిపోతున్నంత వరకూ అటువైపు దృష్టి మళ్ళించాల్సిన అవకాశం వుండదు."
మాలతి అప్పటికి ఏమీ మాట్లాడలేదు.
"పడుకో మాలతి! ఒక్కరోజు నిద్రపాడుచేసుకున్నందువల్ల ఈ సమస్యలు పరిష్కారం కావు. అందులో నువ్వు ప్రొద్దుటే లేవాలి. చక్కగా అలంకరించుకోవాలి. ఆఫీసుకు వెళ్ళాలి. మరి అక్కడ మేనేజరు చంద్రశేఖరంగారు -"
మాలతి గిలిగింతలు పెట్టే దశలో లేదు. ఆ చీకట్లో ఆమె మనస్సు చీకటి కంటే కూడా నల్లగా విహరిస్తోంది. ఆ నలుపు హృదయ విదారకంగా వుంది.
4
మాలతి బాల్యమంతా పౌరాణిక యుగంలో గడచినట్లుగానే గడిచింది. ఆమె తండ్రి చిత్తశుద్ధితో కూడిన హరికధా విద్వాంసుడు. ఆయన జీవితమంతా రామాయణాన్నే అధ్యయనం చేసి ఆ గాథల్నే కమనీయంగా చెబుతుండేవాడు. ఇంట్లోకూడా నిత్యం దైవపూజ ఆధ్యాత్మిక గ్రంధాలపఠనం జరుగుతూ యుండేది. తల్లిని చిన్నతనంలోనే పోగొట్టుకున్న తన ఏకైక పుత్రిక మాలతిని తనలాగే హరికథా భాగవతారిణిలా చెయ్యాలని ఆయన ఉవ్విళ్ళూరుతుండేవాడు. ఆ ఆశయంతోనే ఆమె పదేళ్ళ వయస్సులో వుండగా "సీతాపహరణం" ఘట్టం మీద మూడునాలుగు ప్రదర్శనలు ఇప్పించారు. చిన్నపిల్ల బాగా చెబుతుందని ముచ్చటపడి ఇతర ప్రాంతాలనుంచి ఎవరెవరో వచ్చి ఆ అమ్మాయి హరికథని తమ ఊళ్ళో పెట్టించమని అడగసాగారు. ఎవరూ అభ్యంతరం చెప్పకుండా వుంటే ఆమెజీవితం భాగవతారిణిగా ఎలా చలామణి అయివుండేదో గానీ, ఆమె నాయనమ్మ ఈ సందర్భంలో తన తీవ్ర అసమ్మతి తెలియజేసింది. ఒక్కగానొక్క సంతానం, మంచి సంబంధం చూసి చేస్తే చక్కా కాపురం చేసుకుంటూంటే ముద్దూ ముచ్చటా వుంటుంది గానీ ఇలా వీధినపడి తైతక్కలాటంతో తాడూ బొంగురం లేకుండా అయే అవకాశం వుందని గోలపెట్టింది. తల్లి మాట కాదనలేని భాగవతార్ గారు ఆమె మాటల్ని మన్నించి మాలతిని ఆ జివితంనుంచి తప్పించేశారు. ఆమె మామూలుగా స్కూలుకు పోయివస్తూ ఉండేది. ఇలా రెండుమూడు ఏళ్లయినా గడవకముందే ఆమె తండ్రికి గుండెపోటు రాగా, దాక్టర్లు ఇహ హరికథా విన్యాసాలు మాని విశ్రాంతి తీసుకొమ్మని సలహా ఇచ్చారు."నాకేమయినా చింతలేదు గానీ ఈ లక్ష్యాన్ని మాత్రం వదులుకోను" అని ఆయన ఎవరెన్ని చెప్పినా వినకుండా, ఇనుమడించిన భక్తితో హారికథలను చెబుతూ, ఎక్కువకాలం గడవకముందే ఒకరోజు ప్రదర్శన ఇస్తూనే వేదికమీదే రామనామ జపంచేస్తూ కన్నుమూశాడు. అప్పట్నుంచి మాలతికి ఆమె నాయనమ్మే రాక్షకురాలయింది. యుక్త వయసు రాకుండానే మనవరాలికి పెళ్ళి చెయ్యాలని ఎంత కొట్టుకుపోయినా, కాలం కలిసిరాకపోగా, విధి లేక కాలేజి చదువుకి కూడా పంపించాల్సి వచ్చింది. తండ్రి సంపాదించిపోయిన ఆస్ధి ఎన్నోరోజులు మిగలదని గ్రహించిన మాలతి ముందాలోచనతో టైపూ షార్టు హేండు కూడా నేర్చుకుంది. ఆమె చదువుపూర్తి ఆయీ అవని స్ధితిలో నాయనమ్మనికుడా పోగొట్టుకుని యిహ బ్రతకడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తెలుసుకుని ఉద్యోగన్వేషణలో పడింది.
* * *
"సార్ పిలుస్తున్నారు" అని చెప్పాడు దస్తగిరి వచ్చి.
భానుమతి మాలతి ముఖంలోకి చూస్తూ చిలిపిగా నవ్వింది. మాలతికూడా నవ్వి సీటులోంచి లేచి షార్టు హేండు బుక్కు తీసుకుని లోపలకు వెళ్ళింది.
సాధారణంగా చంద్రశేఖరం ముఖంలోకి చూస్తూ మాట్లాడడుకానీ "కూర్చోండి" అన్నాడు ఈవేళ ఆమె కళ్ళలోకి చూస్తూ.