Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 8


    మాలతి ఆమె ప్రక్కకు వెళ్ళి కూర్చుంది. "లైటర్స్ టైప్ చెయ్యటం ఇవాళ కార్యక్రమంలో ఒక భాగం. అవునుగానీ ఇంతసేపటివరకు రాకపోతే ఏమనుకున్నావు?" అనడిగింది.

    భానుమతి స్నేహితురాలి చేతిని తన చేతిలోకి తీసుకుని వ్రేళ్ళతో మృదువుగా నిమురుతూ అంది "ఏ రాజకుమరుడో ఎత్తుకుపోయాడనుకున్నాను."

    "ఫో! ఆడదాని ఆలస్యానికి కారణాలు ఎత్తుకుపోబడటం లాంటివేనా? వేరే వుండవా?"

    "ఉన్నా, వేరే వాటిని గురించి ఆలోచించే ఓపిక వుండదు జనానికి. నేను కూడా జనంలో ఒక భాగాన్ని."

    "నువ్వు జనంలో ఒకదానివేం కాదు. అవసరమైనప్పుడు అబద్దాలు మాత్రం ఆడుతూవుంటావు. అసలేం జరిగిందంటే....."

    "ఏదో జరిగేవుంటుందని నీ మొహం చెబుతూనే వుంది. కానీ ఇప్పుడు వినే ఓపిక లేదు. ముందు అన్నం తినాలి. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా."

    "ఉహుఁ  స్నానంచెయ్యాలి. అప్పటి దాకా వుండగలవా?"

    "ఉండగలను. కబుర్లు చెబుతూ కూర్చుంటే కడుపు నిండిపోతుంది గానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి కరకరలాడుతూ కొనసాగుతూనే వుంటుంది. ఆకలిని వీలయినంతసేపు అలా వుంచెయ్యటంలో అందమూ వుంది. మరి వెళ్ళిరా..."

    మాలతి లేచి టవలూ, అల్మైరానుంచి చీరె వగైరాలు తీసుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయింది.

    పది నిముషాల తరువాత ఆమె ఫ్రెష్ గా తయారై నవనవలాడుతూ తిరిగి వచ్చేసరికి భానుమతి ఇంకా అదే భంగిమలో పడుకుని వుంది.

    "రా భోం చేద్దాం."

    ఇద్దరూ నేలమీద ఒకరికెదురుగా ఒకరు కూర్చుని స్టెయిన్ లెస్ స్టీలు కంచాలు ముందు పెట్టుకుని కారియర్ విప్పారు. అందులోని భోజనపదాద్దాలు వడ్డించుకున్నాక  భానుమతి ప్రక్కనే చిన్న రేక్ మీదనున్న సీసాలో వున్న ఆవకాయను చెంచాతో తీసుకుంది.

    "నీక్కూడా కావాలా?"

    మాలతి వద్దన్నట్లు తలాడించింది.

    "నిజానికి నేను ఉప్పు, కారం ఎక్కువ తినకూడదు. మా ఆయనకు దూరంగా వున్నాను కాబట్టి. అందులో కొన్నాళ్ళు కాపురంకూడా వెలగబెట్టిన దాన్ని. కానీ అదేం ఖర్మమో! కారంవైపే నా మనసు ఉరకలు వేస్తుంది. నీకు తెలుసుగా పచ్చిమిరపకాయ బజ్జిలన్నా నాకెంత ఇష్టమో?"

    మాలతికి ఆకలిగా లేదు. తినాలని అసలు లేదు. అయినా భానుమతికి కంపెనీ ఇవ్వకపోతే బాగుండదని అన్నం కలుపుకుని కొంచెం కొంచెం తింటోంది.

    "ఇప్పుడు చెప్పు. వింటానికి అభ్యంతరంలేదు. నీ ఆలస్యానికి కారణాలు..?"

    మాలతి మెల్లమెల్లగా జరిగినదంతా పూసగ్రుచ్చినట్లుగా చెప్పేసింది. అలా చెబుతుంటే గడిచేదంతా సినిమారీల్  లా కాళ్ళముందు తిరుగుతున్నట్లయి ఆమెకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎంత స్తబ్దుగా వుందామనుకున్నా, ఈ స్తబ్దతాపూరితమైన తెరలను తొలగించుకుని వింత తొంగిచూస్తూనే వుంటుంది.

    అంతావిని భానుమతికూడా ఆశ్చర్యపడింది. "స్వేచ్ఛ, స్వేచ్ఛ అని మానవుడు గింజుకుంటాడు గానీ ఈ చరాచర ప్రపంచంలో తల్లి, తండ్రి, భార్య, మొగుడు, స్నేహం - వీటి పేరిట ఏదో ఒకరుపంలో పంజరంలో ఎలా బంధించబడుతూ వుంటుందో చూశావా? జీవితాలను నలగగొట్టేయడానికి ఈ శక్తి నీడ నిరంతరం ప్రసరిస్తూనే వుంటుంది" అన్నది.

    "అదంతా నాకుతెలీదు. అతన్లో ఏదో అజ్ఞాత వ్యధ వున్నట్లుగా నాకనిపించింది. ఆ బంగళా, అందులో తల్లి పేరుతో వున్న భయంకరమైన స్త్రీ మూర్తీ, యజమానికోసం సర్వం అర్పించడానికి సిద్ధపడినట్లుగా వున్న పసివాడూ- ఎంత వద్దనుకున్నా అదే పదే పదే గుర్తొస్తున్నాయి."

    "అందరిలో ఎవరు ఎక్కువగా గుర్తొస్తున్నారట?" అనడిగింది భానుమతి  చిన్న చిరునవ్వుతో.

    "ఆ ఎక్కువతక్కువలు నాకు తెలీదు. అలాంటి తేడాలు కూడా వున్నాయని అనుకోను."

    "లేకపోతే మంచిదే" అని భానుమతి ఊరుకుంది.

    భోజనాలు పూర్తయినాయి. ఆకలి తీరిందేమో భానుమతి ముఖంలో ఓ రకం తృప్తి కనిపిచింది.

    కంచాలు అక్కడ్నుంచి తీసేసి, ఆ జాగా శుభ్రంచేసి ఇద్దరూ పక్కలేసుకున్నారు. వాళ్లకు మంచాలు లేవు. చాపలు పరచుకుని వాటిమీద పరుపులు వేసుకుని పడుకోవటం అలవాటు.

    పడుకోవటంలోకూడా ఇద్దరికీ కొన్ని అలవాట్లు వున్నాయి. మాలతి ఒక ప్రక్కకి ఒదిగి, కొద్దిగా ముడుచుకుని పడుకుంటుంది. భానుమతి తెల్లవార్లూ అటూఇటూ కదులుతూ మాలతిని చేతుల్తో పొడుస్తూ, కాళ్ళతో తంతూ నానా రభసా చేస్తూ వుంటుంది. మాలతికి ఒక దిండువుంటే చాలు, భానుమతికి రెండు దిళ్ళున్నా చాలవు.  అయినా కొంతసేపటికి  తల నేలమీదే వుంటుంది.

    "ఇప్పుడు చెప్పు?" అంది మాలతి హాయిగా ప్రక్కమీద ఇమిడిపోయి.

    "దేన్నిగురించి?"

    "నువ్వు ఇన్నాళ్ళూ దాచిన రహస్యంగురించి."

    "నా పెళ్ళిగురించా అడుగుతున్నావు? నా జీవితంలో రహస్యాలంటూ ఏమీ లేవు. చెప్పవలసిన అవసరం రాకా, దానిమీద బుద్ధిపోకా చెప్పలేదంతే.... నా గతజీవితంలో ఆనందమోహన్ ఆనేవాడు కొన్నాళ్ళపాటు ప్రముఖపాత్ర నిర్వహించారు. అదీ మొగుడిపాత్ర...."

    చాలా తేలిగ్గా, సునాయాసంగా చెప్పింది. మనిషిలో ఏమీ గగుర్పాటు కనిపించలేదు. కానీ మాలతిమాత్రం భయంతో వణికిపోయినట్లయియింది. ముఖం నల్లబడిపోయింది.

    "అదేమిటి? అలా అయిపోయావేం?" అన్నది  భానుమతి ఆమె వంటిమీద చెయ్యివేసి నిమురుతూ.

    "అదికాదు..... అంత ముఖ్యమైన విషయాన్ని అంత నిర్లక్ష్యంగా తేసేశావేం?" మాలతి గొంతు సహజంగా రాలేదు.

    "ఆ అనుభవాన్ని దాటేశాను గనుక. అంటే - అంత ముఖ్యమైన విషయమూ ఒకనాటి అనుభవం గనుక."

    "భానూ?"

    "భయపడకే మాలతీ! జరిగిపోయాక కొన్ని అల్పమైన విషయాలు అమూల్యమైనవిగానూ, గొప్పవని అనుకున్నవి సామాన్యమైనవిగానూ వస్తూ వుంటాయి. ఇంకో సంగతి తెలుసా? మేమిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం."

    మాలతికి ఇది మరీ చోద్యమనిపించింది.                                                                  

 Previous Page Next Page