Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 9


    ఇలా దడదడ లాడించేవాడు సోమయాజులు. మాలతి చిరునవ్వును దాచుకుంటూ అతను చెప్పినట్లే చేయటానికి ప్రయత్నించేది. ఎప్పుడైనా సోమయాజులు లేని సమయం కనిపెట్టి తురంగరావు "ముసలాడు చాదస్తంతో చంపుతున్నాడు. ఎందుకులే బాధపడతాడని వూరుకుంటున్నాగానీ లేకపోతే...?" అనేవాడు.
    మాలతి ఈ విషయాలన్నీ మృత్యుంజయరావుతో కలిసి రాత్రిళ్ళు నడుస్తూ యింటికి వెడుతున్నప్పుడు ముచ్చటించి ఫకాల్న నవ్వుతూ వుండేది.
    ఆమె చాలా నిశితబుద్ధి అని గ్రహించాడు మృత్యుంజయరావు. "మీరు ప్రాంప్టింగ్ ఎందుకు తీసుకున్నారు? ఓ కేరెక్టర్ ఎందుకు తీసుకోలేదు?" అని ప్రశ్నించింది హఠాత్తుగా మాలతి ఒకరోజు.
    మృత్యుంజయరావు తడబడ్డాడు. ఏం చెబుతాడు సమాధానం 'నేను అందంగా వుండను కాబట్టి' అంటాడా?" 
    "నేను అసహ్యంగా వుంటాను కాబట్టి" అంటాడా? లేకపోతే...
    కాదు, కాదు. తనగురించి తను ఏమనుకుంటున్నాడో అసలు లోకానికి తెలియకూడదు. తెలిస్తే తను భరించలేడు.
    "నాకు నటించటంరాదని వాళ్ళు అంటారు" అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ.
    "అక్కడ ఒక్కళ్ళకైనా తెలుసునా ఏమిటి నటనగురించి?" అంది ఎగతాళిగా మాలతి, అని మృదువుగా నవ్వింది.
    "మీరు అంత తొందరగా వేషం వేయటానికి ఒప్పుకుంటారని అనుకోలేదు" అన్నాడు భయంభయంగా.
    "ఒప్పుకుందామని నేనూ అనుకోలేదు. కాలేజీలో చదవేరోజుల్లో చాలా చేసేదాన్ని. నాటకాల్లో పాత్రలు ధరించేదాన్ని. భరతనాట్యాలిచ్చేదాన్ని. సంగీతపు పోటీలలో పాల్గొనేదాన్ని. ఉద్యోగంలో చేరాను. ఇహ అన్నిటికీ స్వస్తే అనుకున్నాను. మా నాన్నగారి బలవంతంవల్ల అంగీకరించాల్సి వచ్చింది" అంది మాలతి.
    "మీ నాన్నగారు ఆదర్శపురుషులనుకుంటాను."
    "అంత పెద్దమాటలు వాడకండి" అంది వారిస్తున్నట్లుగా ఆమె. "కూతుళ్ళని యిలాంటి వ్యవహారాల్లో ప్రోత్సహించటాన్ని ఆదర్శం అనుకోను నేను. పైత్యమంటారు. మీరన్న ఆదర్శపురుషులున్న కుటుంబాలు లోకంలో అనేకుల అవసరాలు తీర్చటానికి పనికివస్తూ వుంటాయి. మానాన్న నేను వేషం వెయ్యటానికి అంగీకరించాడనుకోండి. అభ్యుదయవాది అని పొగుడ్తారు మొహం యెదుట. చాటుకు వెళ్ళి వెర్రివెధవ అని బిరుదు యిస్తారు. మానాన్న ఆదర్శవాదో, అవివేకో, పైత్యపుమనిషో ముందు ముందుగాని యింకా స్పష్టంగా తెలుసుకోలేను."
    మృత్యుంజయరావు ఈ సంభాషణకు బెదిరి యిహ ఆ సంభాషణకి స్వస్తిచెప్పి వూరుకున్నాడు.
    వెన్నెలరాత్రుళ్ళు ఒక నవనాగరీకమైన యువతితో, నిండు యవ్వనంతో వున్న ఓ సుందరాంగితో జనసమ్మర్ధమైన వీధుల్లో, నిర్మానుష్యమైన వీధుల్లో నడిచిపోవటం అతనికి ఉల్లాసాన్ని కలుగజేసేది. నిండు యవ్వనంలో వున్న సుందరాంగి... ఈ ఆలోచన తనకే వచ్చిందా? అతనికి ఆనందం కలిగింది. ధైర్యంచేసి ఆమెకి తెలియకుండా చాలాసార్లు పరీక్షగా చూసేవాడు. దీపాల్లాంటి కళ్ళు, నవ్వులో, పలువరుసలో నవ్వినప్పుడు కనిపించే లేత చిగుళ్ళలో, నొక్కునొక్కుల జుత్తులో, స్ఫటికంలాంటి సన్నని చెంపల్లో, నీలిచారలు గీత గీసినట్లుండే కంఠంలో, మెడప్రక్కల కావాలన్నట్లు కొంచెం వొంగి, విల్లులా అమరిన లేభుజములలో, సుకుమారమైన వక్షస్థలంలో, కోమల హస్తాలలో, చేతివేళ్ళలో, తెల్లగా మెరిసేపాదాలలో, అడుగుతీసి అడుగువేయటంలో అతనికి అందం కనిపించింది, ఆనందం కనిపించింది, యవ్వనం కనిపించింది.
    ఆమె ప్రక్కన తను... అతను భయకంపితుడయ్యాడు.
    ఆమెది నాసిక. అంత అందమైన అవయవాన్ని ముక్కు అనే బండపేరుతో పిలవకూడదు. తనది ముక్కు.
    అహ! ఆలోచించకూడదు. ఈ సామరస్యం తీసుకురాకూడదు.
    మనసుని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అటే... అటే... ఆ పోలికలోకే తీసుకుపోతున్నది కోతిబుద్ధి.
    ఆమెవి అధరాలు, తనవి పెదాలు.
    ఆమెది ముఖము, తనది మొహం.
    ఆమెది శరీరము, తనది చర్మము.
    ఆమెవి ముంగురులు, తనవి వెంట్రుకలు.
    ఆమె ప్రక్కన తను.. ఈ ఉల్లాసంలో ప్రతి రెండుక్షణాలకూ మధ్య ఓ తృటికాలం శిక్షగా తయారయి, అదిగో వాడు చూస్తున్నాడు, వాడిచూపులు వికృతంగా వున్నాయి, వాడింకా చూస్తున్నాడేమో తలత్రిప్పి చూద్దామా? చూశాడు. అదిగో వాడింకా చూస్తూనే వున్నాడు. ప్రక్కవాడితో ఏమిటో చెబుతున్నాడు. అతను ఏమి చెబుతున్నాడో, ఇదిగో వీడెవడో నవ్వుతున్నాడు. నవ్వుతే ఫర్వాలేదుగాని, మాలతి గమనిస్తే అవహేళనగా వుంటుంది.
    అందుకని ఓ పద్ధతి ఆలోచించాడు మృత్యుంజయరావు. అలాంటి వికృత సందర్భాలు ఎదురైనప్పుడు ఆమెదృష్టిని మరోదిక్కుకు మళ్ళించటానికి ప్రయత్నించేవాడు. కాని దృష్టి మరల్చటానికి ఎప్పుడూ సాకులేం దొరుకుతాయి?
    "అదిగో ఆ కుక్క చూశారా?" అన్నాడు ఓసారి.
    "ఏముందా కుక్కలో?" అన్నది మాలతి విస్మయంగా.
    "అది ఏ జాతి కుక్కంటారు?" అన్నాడు సంభాషణ పొడిగించాలి గనుక.
    "భలేవారే. అది వొట్టి ఊరకుక్కండీ మహానుభావా"
    "అంతేనంటారా? చీకట్లో జాతికుక్కేమోనని పొరబడ్డాను సుమండీ"
    ఒకవేళ అప్పటికీ అవతలివాళ్ళు యింకా పరిహాసదృష్టితో చూస్తూ, వారిని మాలతి గమనించే ప్రమాదమున్నదని అనిపిస్తే...
    "మీకు కుక్కల్ని పెంచటమంటే సరదాయేనా?" అని అడిగేవాడు.
    "అబ్బో! చాలా యిష్టం. ఇదివరకు మోతీ అని ఓ కుక్కపిల్లను పెంచాం. ఎంత ముద్దొచ్చేదనుకున్నారు?"
    "సాధారణంగా అందరూ కుక్కపిల్లలకు మోతీ, జాకీ, జిమ్మీ ఈ పేర్లే పెడతారు. చిత్రంగా వుంటుంది. ఏం?"
    మాలతి తల వూపుతుంది.
    అదిగో. ఆ అమ్మాయెవరో తనని చూసి పకపక నవ్వుతోంది. "అయితేనూ, ఆ మోతీ యిప్పుడు పెద్దదై వుంటుంది. ఏమంటారు?" అన్నాడు గబగబా.
    "లేదండీ. చచ్చిపోయింది. అవునుగాని ఆ అమ్మాయి..."
    "అరెరే చచ్చిపోయిందా? ఎలా చచ్చిపోయింది?"
    "దాన్నేదో పిచ్చికుక్క కరిచిందిలెండి. దీనిక్కూడా పిచ్చి ఎక్కింది. ఆ పిచ్చిలో నన్నుకూడా కరిచింది. విరుగుడుకని పధ్నాలుగు యింజక్షన్లు చేయించుకున్నాను ఏం చూసుకుని దానికా మిడిసిపాటు? ఎందుకలా నవ్వు?"
    "అబ్బా! పధ్నాలుగు యింజక్షనులే. మీకు బాగా నెప్పిచేసి వుండాలి."
    "డర్టీక్రూక్. అడిగేస్తాను నిలేసి, ఏం కనిపించింది అంత నవ్వు రావటానికి" అంది మాలతి యిహ వినిపించుకోకుండా కోపంతో ఎర్రబడ్డ ముఖంతో.
    అతను భయపడిపోయాడు. మాలతి ఆ అమ్మాయిని పట్టుకు ఎక్కడ దులిపేస్తోందోనని... అప్పుడు అసలు విషయం బయటపడిపోతుంది. బండారం బట్టబయలయిపోతుంది.
    "భలేవారేనండీ మాలతిగారూ! చంపేశారు. అసలుసంగతి మీరు చూళ్ళేదు. నేను గమనించాగా. మనవెనుక ఒకాయన అరటిపండుతొక్క తొక్కి జారి పడబోయి, సంబాళించుకున్నాడు. అదిచూసి నవ్వుతోంది ఆ అమ్మాయి. అంతేగాని మరేంలేదు. హహ్హహ్హ, భలే సందేహం వచ్చిందే మీకు?"
    ఆమె అతనివంక ఓసారి విస్తుపోయి చూసింది. మరేం మాట్లాడలేదు.
    ఆమెతో కలిసి నడిచిపోతున్నప్పుడు అతనికి తరచు యింకో విషయం స్ఫురిస్తూ వుండేది. ఎంతసేపూ తను సంభాషణని పొడిగా, రసహీనంగా వున్న విషయాలపై కొనసాగిస్తున్నాడుగాని, యిదే శేఖరమైతే ఏంచేసి వుండేవాడు? తన వాక్చాతుర్యాన్ని గుమ్మరించేవాడు. ఆమెని నవ్వించేవాడు. కవ్వించేవాడు. భుజానికి భుజం ఆనించేవాడు. ఆమె సిగలోని మల్లెల సౌరభాన్ని ఆఘ్రాణించేవాడు.
    పోనీ తనుకూడ శేఖరంలా చెయ్యటానికి 'ట్రై' చేద్దామా ఏమిటి? ఆలోచనలో వుండగానే ఆమె ఆతృతగా "అదిగో చూడండి, చూడండి" అని యించుమించు కేకపెట్టినంతపని చేసింది.
    "ఏమిటి?" అన్నాడతను ఈ లోకంలోకి వచ్చిపడి.
    "అక్కడ కిళ్ళీదుకాణం దగ్గర నిలబడి కోరచూపులు చూడటంలేదూ? వాడే. మొదటిరోజుల్లో రిహార్సల్సునుండి వంటరిగా వస్తుంటే ఏదో తుంటరి వాగుడు వాగాడు. మొహం వాచేటట్లు చివాట్లు పెట్టాను. అప్పటికి దబాయించేశాను కానీ, కారువెధవ ఏం అఘాయిత్యం చేస్తాడోనని తర్వాత భయంవేసింది. చెప్పొద్దూ! అందుకే సాయంకోరాను" అని విశదం చేసింది మాలతి.
    మృత్యుంజయరావు అతనివంక పరిశీలనగా చూశాడు. నేరో ప్యాంటూ, హవాయి షర్టూ వేసుకుని పొట్టి క్రాఫింగ్ ని ముందు ఓ కెరటంలా లేచేలా దువ్వి, ఎత్తుగా బలిష్టంగా పెరిగిన ఆ వ్యక్తి సిగరెట్టు కాలుస్తూ తమవంక కోరచూపులు చూస్తూ కనబడ్డాడు. అతనిచూపు తనచూపుతో కలవగానే మృత్యుంజయరావు వళ్ళు ఒక్కసారి ఝల్లుమన్నట్లయింది. తనా? తను వయసులో వున్న ఒక స్త్రీకి సాయంవచ్చే మొగాడా? ఇప్పుడా రౌడీ మాలతిని ఏడిపిస్తే తను ఏం చేస్తాడు? ఏడిపించటమే కాదు జడ పుచ్చుకుని లాగాడనుకో. అప్పుడేం చేస్తాడు? జడేకాదు, చెయ్చే పుచ్చుకుని బరబర యీడ్చుకుపోయినా తను ఏం చెయ్యగలడు? తిడతాడా? తిట్టటానికి తగినన్ని పదాలేవీ తనదగ్గర? వున్నా ఆ సమయంలో స్ఫురిస్తాయా? పోనీ కలబడతాడా? కలబడటానికి అటువంటి సందర్భంలో తనకి భయమేగాని ఆవేశం కలుగుతుందంటావా? ఒకవేళ సాహసించి కలబడినా అతన్ని తన్ని, చితగొట్టి, అతని బారినుండి మాలతిని రక్షించగలడా? ఆ రౌడీ, ఆ దృఢకాయుడు తనని ఒక్కతన్ను తంతే...
    కాని బయటికి "అలాగా?" అన్నాడు. "నాలుగు  తంతేసరి" అన్నాడు. మహా సాహసంగా. అతని మాటలు అతనికే అబ్బురాన్ని కలిగించాయి.
    "ఏమిటి? మీరు? మీరు తంతారా?" మాలతి గట్టిగా నవ్వుతోంది.
    అతనికి వళ్ళంతా జర్రులు పాకినట్లయింది. 'ఇదేం కర్మ! డబ్బాలు కొట్టటం కూడా తనకి యిమడవా ఏమిటి?"  

 Previous Page Next Page