"అదేమిటిలా అంటున్నారు?" అన్నాడు చిన్నబుచ్చుకుని.
"సారీ! అదికాదండీ, మీకు తన్నులాటలు యిష్టంలేదేమోననుకున్నాను" అంది మాలతి నవ్వుకుని.
"ఇష్టం లేదనుకోండి. అయినా అవసరం వచ్చినప్పుడు కొన్ని కొన్ని తప్పించుకోలేముగా" అన్నాడు. ఆమె నమ్మదని తెలిసినా, తను నిజాయితీగానే చెబుతున్నట్లు కనబడాలి గనక.
ఇంకో విశేషం. ఇలాంటి సంభాషణలు, సంక్షోభంతో కూడిన సంఘటనలూ అతని హృదయక్షేత్రంలో ఎంత దృఢంగా ముద్రవేసుకుపోతాయంటే, అవి బహుశా అతని జీవితకాలంలో ఎప్పటికీ చెరిగిపోవు. కాని తను వాటిని తలచుకుని బాధపడుతున్నట్లు ఏమాత్రం కనబడడు. అసలు గుర్తులేనట్లే ప్రవర్తిస్తాడు.
అప్పుడప్పుడు అతడు ఆమెతో వారియింటికి పోవటమూ తటస్థించింది. మాలతి తండ్రి పశుపతి, మొదట్లో ఆయన్ని చూస్తే మృత్యుంజయరావుకి భయంగా వుండేది. తన రాకకు అర్ధంగానీ, అపార్థంగానీ చేసుకుంటాడేమోనని. ఆయన అలాంటిదేమీ చేయకపోగా నాటకాలగురించీ, సాహిత్యాన్ని గురించీ, రాజకీయాలగురించీ ఉత్సాహంతోనూ, విసుగులేకుండానూ మాట్లాడటం అతనికి ధైర్యాన్ని కలిగించింది. ప్రపంచంలో ఏ విషయాన్ని గురించయినా సరే ప్రసంగం రానివ్వండి, అది ఆయన తన పరిధిలోకి తీసుకుని స్వంత అనుభవాన్నొకటి జోడించి విడిచిపెట్టేవారు. తను చిన్నప్పుడు నటించేవాడట. ఎక్కువగా ఆడవేషాలు వేసేవాడట. కొన్ని కొన్ని చిన్నచిన్న విషయాలపట్ల మనుషులు అంత లోతుగా, నిజాయితీగా ఆలోచించటం అతనికి విస్మయాన్ని కలిగించేది. ఒకసారి ఒక నాటకంలో నటిస్తున్నాడట. "ఈ సంభాషణ యిట్లా చెబితే జనం మెచ్చరు" అన్నాడట దర్శకుడు. "కాదు, ఇలాగే చెప్పి మెప్పిస్తాను చూడు" అన్నాడు ఈయన. ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది. కొన్నాళ్ళపాటు మాట్లాడుకోవటం మానేశారు. తర్వాత నాటక ప్రదర్శన జరిగింది. పశుపతిగారు తను అనుకున్న ఫక్కీలోనే ఆ సంభాషణ చెప్పాడు. ప్రేక్షకులు చేసిన సంతోషధ్వనులతో హాలు దద్దరిల్లిపోయింది. తర్వాత దర్శకుడు వచ్చి ఆనందభాష్పాలు కారుస్తూ ఈయన్ని కావలించుకున్నాడట. ఆయన తరచు "అభిప్రాయ భేదం" అనేపదం ఉపయోగిస్తూ వుండేవాడు. "ఆ సందర్భంలో అతనికీ, నాకూ అభిప్రాయభేదం వచ్చింది" అంటూండేవాడు ఎవరెవరి గురించో తన పరిచయాలు ప్రస్తావిస్తూ.
ఆయనకూ, తనకూ ఎప్పుడైనా అభిప్రాయభేదం వస్తుందేమోనని అప్పుడప్పుడూ మృత్యుంజయరావు హడలిపోయేవాడు. కని మళ్ళీ అంతలోనే సర్దుకునేవాడు. ఆఁ, తనకసలు అభిప్రాయాలే లేవు. ఇహ తేడాలు ఎలా వస్తాయి?
5
ఈ సమయంలో జగతి యిక్కడికి కాలుపెట్టింది. ఓ కొత్త వాతావరణంలో పడి, నూతన అనుభవాలతో తనని తాను సముదాయించుకోవటానికి ప్రయత్నిస్తున్న మృత్యుంజయరావుని తనని తనకు గుర్తుచేసి అతనిలోని అవలక్షణాలను వేలెత్తి చూపించింది.
జగతి సౌందర్యవతి. ఆ అహంభావం ఆమెకి చాలావుంది. ఆమె సౌందర్యంలో ప్రశాంతతకన్నా కాల్చేగుణం వున్నది. ఆమె ఓ నిప్పు, మరిగే నీళ్ళు, కాలిన యినుము, భగ్గునమండే భాస్వరము.
"జయా!" అంది ఆమె ఆ సాయంత్రం. "ఈ దగ్గరలో మఠంలో స్వాములారు భాష్యం చెబుతున్నారటనే."
అతను తల వూపాడు.
"స్వాములారి ఉపన్యాసం విని చాలాకాలమయిందిరా. వాళ్ళ కాషాయ బట్టలూ, దొంగమాటలూ, మధ్యమధ్య యింగ్లీషూ, పచ్చని శరీరకాంతీ విచిత్రంగా వుంటాయి నాకు. మాటలు వింటూంటే భలే గమ్మత్తుగా వుంటాయిలే. అక్కడికి పోయిరమ్మంటావా?"
జగతిలో యిది మరో విశిష్టత. ఉన్నట్లుండి తను చేయబోతున్న పనినే చేయనా అని అడుగుతుంది. తనకి యిష్టంలేని వ్యక్తినైనాసరే.
"అలాగే"
ఇంతలో యింటి యజమానురాలయిన చిలకమ్మగారు అలంకరణ పూర్తి చేసుకుని అరుగుమీదికి వచ్చి "జగతీ! ఓ జగతీ! ఇహ బయల్దేరుదామా?" అన్నది పిలుస్తూ.
"వస్తారా జయా! బజారునుంచి వంటసామాను తీసుకురావటం మరిచిపోవుగా?" జగతి చకచకా బయటకు వెళ్ళింది. అతను గదిగుమ్మం దగ్గర నిలబడి ఒకరి ప్రక్కన ఒకరు నడుస్తూ పోతున్న ఆ యిద్దరు స్త్రీలనూ తిలకించసాగాడు. ఆవిడ తన సోదరి అంత పొడవులేదు. వయసుకూడా కొంచెం దాటటంవల్ల బాగా వళ్లుకూడా వచ్చింది. లావుపాటి మనిషిక్రిందే జమ. బహుశా కాలంనాడు జగతి అందగత్తె అయివుండాలి. ఇప్పటికి ఆమె గుండ్రని ముఖంలో సౌందర్యరేఖలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ వుంటాయి. కాంతి నశించని శరీరం. వీళ్ళిద్దరికీ అప్పుడే యింత పొత్తు ఎలా కలిగిందా అని అతను విస్మయచిత్తుడయాడు.
జగతి తనకి బజారుపని ఒకటి పురమాయించింది. రిహార్సల్సుకి పోయే టైము అయింది ఒకప్రక్క. తనపని ప్రాంప్టింగ్ కాబట్టి రిహార్సల్సుకి ఒకపూట మానివేసినా కొంప మునిగిపోయేది లేదుగాని, మాలతిని యింటికి దిగబెట్టే బాధ్యత మరెవరైనా స్వీకరిస్తే? అతనికి యిష్టంలేదు. ఇష్టంలేదు అంటే చాలదు. అతను భరించలేడు. అదిగాక ఒకరోజు తను తీసుకుపోయి దింపే అలవాటు తప్పిపోతే, రేపటినుంచీ ఆ కొత్తవాడే ఈ డ్యూటీని కొనసాగించివేయవచ్చు. ఎన్ని సమస్యలూ.
అందుకని బజారుపని మరునాటి ఉదయం చూసుకోవచ్చు లెమ్మనుకుని కళాసమితి కార్యాలయానికి బయలుదేరాడు. గది తాళంవేసి, తాళంచెవి మధ్యభాగం హాల్లో యీజీచైర్ లో కూర్చుని పిల్లల పత్రిక చదువుకుంటూన్న యింటియజమాని శ్రీకంఠంగారికి యిచ్చి తన అక్కగారు వొస్తే అందజెయ్యమని కోరాడు.
ఆయన తాళంచెవి అందుకుని బల్లమీదపెట్టి "రిహార్సల్స్ ఎంతవరకూ వచ్చాయి మీవి?" అని అడిగాడు చిరునవ్వు ముఖంతో.
"పోర్షన్లు వచ్చేశాయి. బాగానే చేస్తున్నారుగానీ యింకా పరిపక్వత రాలేదు. కొన్నాళ్ళు పడుతుందండీ. మీరు తప్పకుండా రావాలి ఆనాటికి" అన్నాడు మృత్యుంజయరావు.
"అలాగే తప్పకుండానూ, కాని వెధవది ఈ హార్టుకంప్లెయింటు..." అంటూ ఆయన ఆర్దోక్తిలో ఆగాడు.
మృత్యుంజయరావు కదిలాడు. నిజమే, ఆయన హార్టు పేషెంటు. ఇప్పటివరకూ రెండుసార్లు మైల్డ్ ఎటాక్స్ వచ్చాయి. అందుకని సాధారణంగా ఎక్కడికీ బయటికి కదలడు. అధవా ఎక్కడికైనా పోయినా రిక్షాలో పోతాడు.
వాళ్ళకి పాపం పిల్లలులేరు. రెండులక్షలకు పైగా ఆస్తివుంటుంది. ఆ యింట్లో ఆ భార్యాభర్తలతోపాటు యజమానురాలి తమ్ముడి కొడుకు పదేళ్ళవాడు వుంటూంటాడు. చిలకమ్మగారికి ఆ పిల్లవాడంటే వల్లమాలిన ప్రేమ. శ్రీకంఠంగారికి మహా అసహ్యం. అవసరం వుంటేనేగాని మాట్లాడడు. మాట్లాడినా కసిరినట్లుగా మాట్లాడతాడు. యజమానురాలి తమ్ముడూ, మరదలూ, ముసలితండ్రికూడా యీ ఊళ్ళోనే దగ్గర్లో యింకో పెంకుటింట్లో వుంటారు. వాళ్ళందరికీ ఒకకాలు అక్కడా, మరోకాలు యిక్కడా వుంటుంది. "అందర్నీ తెచ్చుకుని యింట్లోనే పెట్టుకుందాం, మనకిమాత్రం ఎవరున్నారు?" అని ఆవిడ అప్పుడప్పుడూ పోరుతూ వుంటుంది. 'నేను బ్రతికుండగా అది జరగదు' అంటాడాయన కరాఖండిగా. ఒకటి రెండుసార్లు మృత్యుంజయరావుతో చెప్పించిందావిడ పతికి. ఇంటి యజమానురాలు కదా అని ఆవిడ మాట కాదనలేక ఆయనముందు ప్రస్తావించాడొకసారి. ఆయన వినీ విననట్లు ఊరుకున్నాడు. గట్టిగా అడిగితే 'నీకెందుకయ్యా?' అంటాడేమోనని తిరిగి ఎప్పుడూ ఆ ప్రమేయం తేలేదు.
యజమానురాలి తమ్ముడు పిచ్చివాడు. అతనూ, అతని అర్ధాంగీ ఒకగదిలో ఎప్పుడూ పడుకోరు. ఆ పిచ్చివాడెప్పుడూ యీ యింటి అరుగుమీదో, ఎదురింటి అరుగులమీదో పడివుండి బీడీలు తగలేస్తూ వుంటాడు. ఒంటిమీద బట్ట సరిగ్గా వుండదు. అతనుగానీ ముసిలాడుగానీ యీ యింటిగదుల్లో యధేచ్చగా సంచరించటానికి వీలులేదు. శ్రీకంఠంగారు కసురుకుంటారు అల్లుడు చిరాకు మనిషని ముసిలాడు యెంతసేపూ బైటో, పెరట్లోనో తారట్లాడుతాడుగాని ఎదురుగుండా తిష్టవేయడు. పండుగో, పబ్బమో వచ్చి ఎప్పుడైనా వాళ్ళంతా యిక్కడే నిద్ర చెయ్యటం జరిగితే ముసిలాడు, పిచ్చివాడు మృత్యుంజయరావు గదికి ఎదురుగా వసారాకి అవతలవైపు వున్నగదిలో పండుకుంటారు. చిలకమ్మాగారు మరదల్ని లోపల పడుకోబెట్టుకుంటుంది.
పిచ్చివాడు, మృత్యుంజయరావు ఆ యింట్లో ఎప్పుడైనా తారసపడినప్పుడు "మేష్టారూ! యీ యింట్లోకి కొత్తగా వచ్చారా?" అని అడుగుతాడు. ఈ ప్రశ్న అతను యీ యింట్లో చేరిన రెండేళ్ళలో యాభయిసార్లన్నా అడిగించుకుని వుంటాడు.
అతనికి పిచ్చివాడంటే భయం. అవునని ప్రక్కనుంచి మెల్లగా జారుకుంటాడు.
మృత్యుంజయరావు కకళాసమితి కార్యాలయానికి వెళ్ళేసరికి సభ్యులంతా అప్పటికే చేరుకుని వున్నారు. మాలతితప్ప. మాలతి ఆనాడు ఓ అరగంట ఆలస్యంగా వస్తానని ముందుగానే సంజాయిషీ చెప్పుకుందిట.
అక్కడ ఆమె అందచందాలని గురించి వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి.
"నువ్వు ఎన్నయినా చెప్పు. ఆమె అందగత్తె" అంటున్నాడు ఒకడు.
"వయసులోవున్న పందిపిల్లకూడా అందంగా వుంటుంది" అన్నాడు వైకుంఠం.
అతని ఉపమానానికి కొందరు ఛీ, ఛీ అని ఏవగించుకున్నారు. కొందరు బాగుందన్నారు.
మీరంతా ఆమెముందు నిలబడేసరికి పెద్ద సంస్కర్తలలా మాట్లాడతారే. ఇవి మీ అసలు రూపాలా?' అని ప్రశ్నిద్దానుకున్నాడు మృత్యుంజయరావు. కాని ప్రశ్నించలేదు.
సంజీవరావు అతనివంక క్రీగంటచూస్తూ "అలాగనకోయి వైకుంఠం! మృత్యుంజయరావుకి కోపం రాగలదు" అన్నాడు.
"ఎందుకేం? అతనేం తాళిగట్టిన మొగుడా?" అని లేచాడు వైకుంఠం.
"తాళిగట్టటానికి మొగుడే కావాలేమిటోయ్. అయినా మొగుడు కావటం ఎంతసేపు?" అన్నాడింకో ప్రసాదరావు.
"ఏమిటి? మాలతీ, మృత్యుంజయరావూ పెళ్ళి చేసుకుంటున్నారా?" అని వెంటనే మరో కూర్మారావు ఆతృత వెలిబుచ్చాడు.
"ఇదీ కళ" అంది మృత్యుంజయరావు అంతరంగం.. కాని దానికి నోరు రాలేదు.
"మృత్యుంజయరావుని ప్రేమించే ఆడదెవరయ్యా మహానుభావా?"
"అదిగో, వస్తున్నారు అసలు విషయం గురించి" గుండె విజృంభించటం మొదలుపెట్టింది.