Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 8


    "ఈమధ్య మీరు సమితికి రావటం మానేశారు?" అని ప్రశ్నించాడు సోమయాజులు, పునాదిని ప్రారంభిస్తూ.
    "ఆడవాళ్లం చూడండి, అనేక యిబ్బందులుంటాయి" అంది మాలతి చిరునవ్వు ముఖంతో.
    "ఏదీ, అందులో ఓ రెండు చెప్పి మాకు శ్రవణానందం కలుగజేయండి" అన్నాడు వైకుంఠం అనే గుమాస్తా. ఈ భూమ్మీద హాస్యప్రియులమనుకునే లక్షోప లక్షలలో ఆ అల్పజీవి ఒక్కడు.
    "రెండేం ఖర్మ, యివరై చెబుతాను. ఇంట్లో వంటా వార్పూ, పూజలూ, పునస్కారాలూ, పెద్దల భయం, ప్రైవేట్ గా ఎమ్మేకి కట్టటం, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ వెంటబడుతుంటే వదిలించుకోవటం..."
    "ఇదికాకుండా ఆడవాళ్లకి సహజంగా వుండే నీరసం.." అని వైకుంఠం అందుకున్నాడు.
    "నీరసం మనజోలికి అట్టే రాదులెండి. రానివ్వను నేను."
    "ఆ ప్రకారం మాకంటే మీరే రైటన్నమాట. అవునవును, అబలలకాలం ఏనాడో గతించిపోయిందిగా."
    ఈ విధంగా హాస్యపరిహాసాలు కాసేపు సాగాక సోమయాజులు "చూడమ్మాయీ!" అంటూ వ్యవహారంలోకి వచ్చాడు. "ఈనాడు కాలం మారిందని ఒప్పుకుంటావా?"
    మాలతి ఒప్పుకుంది.
    "ఉద్యోగాల్లోనైతేనేమి, వృత్తుల్లోనైతేనేమి స్త్రీలు ముందంజ వేశారు. స్త్రీలు ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. బస్సు కండక్టర్లుగా పనిచేస్తున్నారు. కళారాదనలో, కళాసాధనలో పైకి వచ్చారు. అలాంటప్పుడు మన సమితి ప్రదర్శిస్తున్న నాటకంలో స్త్రీపాత్ర నువ్వు పోషించటానికి అభ్యంతరం ఏముంది? నీవంటి కళాస్వరూపిణి యిలాంటి ఉత్తమ కార్యాలకు పూనుకోవాలి."
    "నాటకంలో పాత్ర ధరించటమా? అమ్మో!" అని హడలిపోయింది మాలతి.
    "అదేమిటమ్మా! నువ్వు అలా కంగారుపడితే ఎలా? నీకు విద్య వుంది. టాలెంట్ వుంది. స్వేచ్చవుంది."
    కాని మాలతికి ఈ పొగడ్తలు ప్రోత్సాహాన్ని కలిగించలేదు. "మీకందరికీ ఓ నమస్కారం పెడతాను. నన్ను యిలాంటి వ్యవహారాల్లోకి దింపబోకండి. నాదారిన నన్ను ఉద్యోగం చేసుకోనివ్వండి" అంది బ్రతిమాలుతూ.
    ఆమె యిలా బ్రతిమాలుతుందని తెలుసుగనక వాళ్లు అదేమీ పాటించక ఆమెని బలవంతపెట్టారు, వేధించారు, పీడించారు.
    "బాబోయ్! నాకు అనుభవం లేదండోయ్" అని గోలపెట్టింది మాలతి.
    "అనుభవమనేది వేరే ఎక్కడ్నుంచోరాదు. ఒకసారి అడుగుపెడితే అదే ఛంగుమని గంతులువేస్తూ దుముకుతుంది."
    "మా యింట్లో యిలాంటి వాటికీ అంగీకరించరండీ"
    "మేం చెప్తాం, మేం ఒప్పిస్తాం"
    మాలతి పెట్టిన ఘోషలన్నీ వ్యర్ధమైపోయాయి. ఆమె తండ్రిహృదయం ఆమెకు తెలుసు. కూతుళ్ళని చూసి మురిసిపోయే ఆ వ్యక్తి. తను చాలా ఆదర్శపురుషుడిననీ, కుమార్తెల భవిష్యత్తుకోసం సర్వ స్వాతంత్ర్యమూ యిస్తున్నాననీ తలపోసే ఆ మనిషి బయటకు గంభీరంగా కనిపించినా, నాలుగు ముఖప్రీతిమాటలు చెప్పేసరికి కరిగిపోయి ఒప్పేసుకుంటాడని ఆమెకు తెలుసు.
    అంతపనీ జరిగింది. దేశానికి యువకులు వెన్నెముకవంటివారని ఆయనకూడా బల్లగుద్ది వాదించి, కూతుర్ని కళాసమితివారి కళాసేవకు అప్పచెప్పారు.
    ఇహ పాత్రధారుల నియామకం విషయంలో హోరాహోరీగా యుద్ధాలు చెలరేగాయి. ఆ యుద్ధాల ఫలితంగా కాస్త కలతలు చెలరేగినా చివరకు శేఖరం నాయకుడి పాత్రకు నియోగించబడ్డాడు.
    సేఖరం స్ఫురద్రూపి. ఒడ్డూ, పొడుగూ వున్నవాడు. ఎర్రగా, బుర్రగా వుంటాడు. మాట్లాడేటప్పుడు హావభావ ప్రదర్శనచేస్తూ, అవసరాన్నిబట్టి చేతులూపుతూ, భుజాలెగరేస్తూ, భంగిమలు మారుస్తూ ఎదుటవార్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ వుంటాడు. ఉచ్ఛారణ విషయంలో, పట్టుపట్టి మాట్లాడటంలో చాలా మెలకువగా వుంటాడు. ధైర్యసాహసాలూ, అవసరం వస్తే ఎవర్నయినా తన్నగల సామర్ధ్యమూ వున్నట్లు కనబరుస్తాడు. హీరోవేషం అతను దక్కించుకున్నాడు. మిగతా పాత్రలు అంతా ఎగబడి పంచుకున్నారు. దర్శకత్వం దగ్గర పెద్ద తర్జన భర్జన వచ్చింది. నువ్వా, నేనా అని సోమయాజులూ, తురంగరావూ పోటీపడ్డారు. చివరకు బలాబలాలు ఎటూ తేలక తురంగరావు దర్శకత్వానికనీ, సోమయాజులు పర్యవేక్షణకనీ భాగించబడ్డారు. వాల్ పోస్టరు మీద తనపేరు అందరికన్నా పెద్దసైజులో వేయించుకో వచ్చునని తలిచి సోమయాజులు తృప్తిపడ్డారు. నాటక ప్రదర్శనరోజున నాటక రచయితను యీ వూరు తీసుకొచ్చి సన్మానమో, సన్మానంలాంటిదో చేయాలని తురంగరావు ప్రతిపాదించాడు. అయితే అది వీగిపోయింది. అతను ముఖం చిన్నబుచ్చుకున్నా, చేసేదిలేక మరో సందర్భం చూసుకోవచ్చునని తనని తాను సముదాయించుకున్నాడు.
    "మరి మృత్యుంజయరావు విషయమో?" అన్నాడు సోమయాజులు.
    అతని గుండె గబగబ కొట్టుకుంది. ముఖం నల్లబడి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఇలాంటి సూచన రాకూడదనే అతడు భగవంతుడ్ని ధ్యానిస్తున్నాడు.
    ఇప్పుడేం చెయ్యాలి? మెల్లిగా అక్కడ్నుంచి జారిపోదామనుకున్నాడు గుట్టుచప్పుడు కాకుండా. కాని కాళ్ళు వణుకుతున్నాయి. ముఖాన పోసే చెమట పట్టించేస్తుంది.
    అందుకని పరధ్యానంగా వున్నట్లు ముఖం ప్రక్కకి త్రిప్పి శూన్యంలోకి చూడసాగాడు.
    ఈ ప్రతిపాదనకు అందరూ ఎందుకింత నిశ్శబ్దంగా వున్నారు? వారిలో వారు నవ్వుకుంటున్నారా? ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని సైగలు చేసుకుంటున్నారా? తను తేలిపోకూడదు. తనకేమీ వినబడనట్లుగా నటించాలి.
    కాసేపటికి...
    "పోర్షన్లు అన్నీ నిండిపోయాయే" ఓ కంఠం వెలిబుచ్చింది.
    "అయితేనేం? మృత్యుంజయరావు నిర్వహించవలసిన బాధ్యత చాలా వుంది" మరోగొంతు.
    "ఏమిటి?"

    "ప్రాంప్టర్ పనికి ఎవరూ నియామకం కాలేదుగా"
    "అవునవును. అసలు మరిచిపోయాం. ఎంత ముఖ్యం? యెంత ముఖ్యం? అసలు నాటకం సక్సెస్ అంతా మృత్యుంజయరావుమీదే ఆధారపడివుంది" అని అందరూ అలాంటి బాధ్యత అతను స్వీకరిస్తున్నందుకు అభినందించారు. మెచ్చుకున్నారు. పొగిడారు.
    మృత్యంజయరావు ప్రాంప్టర్ గా నియమితుడయ్యాడు.
    అదిమొదలు రోజూ రిహార్సల్సు జరగటం మొదలుపెట్టాయి. ఆఫీసు అయిపోయిన తర్వాత సాయంత్రం అయిదుగంటలవేళ ఆరంభమయేవి. విజ్ఞాన కళాసమితి కార్యాలయపు వాతావరణం వివిధ సభ్యుల మనస్సుల తాలూకు చిత్ర విచిత్రపు ఆలోచనలతో నిండిపోయి ఉక్కిరి బిక్కిరవుతోంది. రిహార్సల్సు తొమ్మిదిగంటలదాకా సాగేవి. ఈలోగా కాఫీలు, టిఫిన్లు సిగెరెట్లు, దండిగా అమరుతూ వుండేవి. రాత్రి తొమ్మిది గంటలవేళ మాలతి వంటరిగా అరమైలు దూరంలోవున్న యింటికి వెళ్ళవలసివచ్చేది. ఎవరినన్నా సాయం పంపిస్తానని సోమయాజులు బలవంతం చేశాడు. మొదట్లో మాలతి నిరాకరించిందిగాని, నాలుగయిదురోజులు గడిచాక వంటరిగా పోవటానికి భయంగావుందని చెప్పి ఎవర్నయినా తోడు పంపమని అర్థించింది. ఈ అర్థింపు వినగానే కళాసమితి వాతావరణం మరోసారి విద్యుత్ ప్రసారవేగంతో వివిధ ఉపాయాలతో నిండిపోయింది. సోమయాజులు మొదట తానే వెడదామనుకున్నాడుగాని, తాను పెద్దవాడు కాబట్టి తేలిపోకూడదని బింకం ప్రదర్శించాడు. అయితే ఇటువంటి రిస్క్ తో కూడినటువంటి బాధ్యతను యితరులమీద వొదిలిపెట్టటం అతనికి సుతరామూ యిష్టంలేదు. అమ్మో! ఈ కుర్రవాళ్ళు అసాధ్యులు, వ్యవహారం ఎంతవరకైనా నడిపించగల సమర్థులు. కొంతమందికి పెళ్ళయింది అనుకో. అయినా పెళ్ళయిన వాళ్ళనుకూడా నమ్మటానికి వీలులేదు. ఆ మాటకొస్తే ఈ విషయంలో బ్రహ్మచారులే కాస్త నయం. ఎందుకంటే పెళ్ళయినవాడికి ఆడదంటే అసలు బెరుకుపోతుంది. స్త్రీ యొక్క ఆంతర్యం, మనస్తత్వం చాలావరకూ అర్ధం చేసుకుంటాడు. అదీగాక వివాహితుడు అనేముద్ర వున్నవాడు కాబట్టి చాలా తేలికగా ఎటువంటి చొరవ తీసుకోవటానికి కూడ వెనుదియ్యడు. బ్రహ్మచారి అలాకాదు. ఆ అమ్మాయికి తనంటే మంచి యింప్రెషన్ కలగాలని తనకి ఉన్నతాసయాలున్నట్లూ, తను చాలా మృదువైన మనిషినన్నట్లూ ప్రవర్తిస్తాడు. స్త్రీగురించి చాలా వున్నతంగా ఊహిస్తూ, ఆరాధిస్తూ వుంటాడు. అందుకని ఈ పనికి మృత్యుంజయరావుని వినియోగించటం శ్రేయస్కరమని ఆయనకు తట్టింది. "ఇంకేం? మన మృత్యుంజయరావు వున్నాడుగా. అతనికేం బాదరబందీలు లేవు. అక్కడ్నుంచి అతనింటికి దగ్గరతోవ వుందికూడానూ" అనేశాడు. తన ఈ మాటలవెనక అంతరం వున్నట్లు కనిపించనీయకుండా, అప్పటికప్పుడు తనకా ఆలోచన వచ్చినట్లు స్ఫురింపజేస్తూ. 
    ఈ మాటలకి మిగతావారంతా ముఖాలు ముడుచుకున్నారు. యే విధంగా అభ్యంతరం చెబుదామా అని ఉపాయాలు పన్నుతున్నారు. కాని యింతలో మాలతే జోక్యం కలిగించుకుని "అవునవును. మృత్యుంజయరావుగారు వున్నారుగా" అని ఉత్సాహం కనపర్చటంతో వారి నోరులు తెరవటానికి వీలులేకపోయింది.
    నాటకం రిహార్సల్సులో ఎవరిమట్టుకు వారు తమ ఆధిక్యత ప్రదర్శించటానికి ప్రయత్నించటంలో చాలా కాలయాపన జరుగుతూ వుండేది. తురంగరావు దర్శకత్వం కొట్టేశానని సంబరపడ్డాడు గాని అతనికి ఎలా దర్శకత్వం చెయ్యాలో తెలియట్లేదు. నటన అనేదాన్ని గురించి తనకేమీ తెలియదని అతనికి కరాఖండిగా తెలిసివచ్చింది. మిగతా యాక్టర్లు అతన్ని అడిగేవారు కాదుగాని మాలతిమాత్రం అతన్ని తరుచు ప్రశ్నిస్తూ వుండేది. "తురంగరావుగారూ! మొట్టమొదట సెట్ లోకి వచ్చినప్పుడు ఎలా నడుస్తూ రావాలి? ఈ డైలాగు ఎలా చెప్పాలి? ఇక్కడ స్క్రిప్టులో నవ్వాలి అని వుంది. ఏ విధంగా నవ్వమంటారు? ఇది ఏమిటో సంభాషణ అర్ధంకావటంలేదు. కాస్త విపులీకరించి చెప్పండి. ఈ సీను అభినయిస్తూ వున్నప్పుడు ముఖం ఏవిధంగా పెట్టాలి?" ఇలాగా యెన్నో ప్రశ్నలు. ఒకసారి 'తురంగరావుగారూ' అని, మరోసారి 'డైరెక్టరుగారూ!' అని సంబోధించేది. ఏదో మాలతి తమ అందరి బలవంతంమీద నాటకంలో వెయ్యటానికి అంగీకరించిందని అనుకున్నారు. ఆమె ఇంత నిజాయితీగా, సిన్సియర్ గా బాధ్యత తీసుకుంటూందని తెలియగానే తురంగరావు గాభరా పడ్డాడు. అతనికి ఎంత చిన్న విషయాన్నైనా సరే, నిజాయితీగా తీసుకునేవాళ్ళంటే భయం. వాళ్ళముందు నిలబడితే దడుపుగా వుంటుంది. అయితే విగ్రహపుష్ఠి వున్నవాడు కాబట్టి గాంభీర్యం సడలకుండా గుట్టురట్టు చేసుకోకుండా అప్పటికప్పుడు ఏదో తనకు నచ్చినట్లు చూపించటం, లేకపోతే ఆమె చేసిందే అలాకాదు, యిలా అని తిరిగి అదే చేసి చూపిస్తూ రసభంగం కాకుండా కాపాడుకొస్తున్నాడు. సోమయాజులు అతన్లోని ఈ బలహీనత గ్రహించి తను విజృంభింపసాగారు. "ఇదిగో, చూశావా అమ్మాయీ! ఈ డైలాగు అలా కదలకుండా, మెదలకుండా నిల్చుని చెబితే విట్టు పేలదు. దానికి తగిన మూమెంట్స్... ఇదిగో యిలా.. ఇలా (చేసి చూపించాడు, నటులంతా నవ్వుకున్నారు) ఇవ్వాలి. ఇదిగోనోయ్ శేఖరం, నువ్వు అక్కడ నిల్చుని ఉపన్యాసం ఇస్తే లాభంలేదు. స్టేజిమధ్యకు నడుచుకుంటూ వచ్చి అక్కడ బరస్టు అవాలి. కమాన్ స్టార్ట్." 

 Previous Page Next Page