Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 9


    "సి.బి.ఐ. సేవలో ఛస్తే 'పరమవీరచక్ర' ఇవ్వరు" కసిగా అన్నాడు రాఘవరావు. "... 'అంతేకాదు. ఇప్పుడు నీ అసలు సంగతి తెలిసిన తర్వాత ఇంతసేపు నీతో మాట్లాడటమే నాకు సిగ్గుగా ఉంది. ఇక్కడి జరిగిందంతా నా కూతురికి చెప్తే, నీ మొహం కూడా చూడదన్న విశ్వాసం నాకుంది" అంటూ విసురుగా అక్కడ్నించి బయటికి నడిచాడు.

    "అయితే మీ సి.బి.ఐ. ద్వారా చేయించవలసిన పని నాకు అప్పగించారా?" వెంటపడుతూ అడిగాడు బృహస్పతి.

    కారు తలుపు తీయబోతూ ఆయన ఆగి, బృహస్పతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "సి.బి.ఐ. అంటే దేశానికీ, దేశ రక్షణకీ ప్రాణాలైనా సరే అర్పించడం కోసం సిద్ధపడ్డవాళ్ళు పనిచేసే డిపార్ట్ మెంట్! అంతేగానీ నీలాంటి లుచ్చాలూ, మోసగాళ్ళూ, క్రిమినల్సూ పనిచేయడం కోసం కాదు."

    బృహస్పతి మొహం జేవురించింది. పళ్ళ బిగువున ఆవేశాన్ని అణిచిపెట్టి తనని తను కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. ".... ఒక మంత్రిగారి లుచ్చా పనులన్నీ బహిరంగంగా వెల్లడి చేసినందుకు ఆయన అనుచరులు వచ్చి మా ఇంటిని విధ్వంసం చేసారు. డిపార్ట్ మెంట్ ని మోసం చేసి, వేలకివేలు లంచం సంపాదించిన ఇన్ స్పెక్టర్ కి, తగిన గుణపాఠం చెప్పేటందుకు అవినీతి శాఖాధికారి వేషం వేసిన నేను క్రిమినల్ ని అయ్యాను.... సరేసార్! అయిందేదో అయింది. మీరు వెళ్ళండి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. సంవత్సరం తిరిగేసరికల్లా రాజకీయాల్లో చేరి నేను మినిష్టర్ ని అవుతాను."

    "వ్వాట్?" కీచుగా అరిచాడు రాఘవరావు. సరళరేఖ నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని నవ్వుతోంది. బృహస్పతి దాన్ని పట్టించుకోలేదు.

    "అవును సర్" అన్నాడు. ".... ఇది నా తెలివితేటలకీ, మీ మూర్ఖత్వానికీ మధ్య ఒక సవాల్. నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా నా మంచికే అనుకుంటున్నాను. ఈ ఆడ పోలీసు లంచాలు పట్టి, ఆ డబ్బుతో భర్తని ఎం.పి. చేసి, వాడు చచ్చాక తను ఎం.పి. అవ్వాలనుకుంటోంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో బ్రోకరుగా పనిచేసి జ్యోతిష్యాలు చెప్పే హరిస్వామి అండతో మినిష్టరు అయ్యాడు రాంభరత్. వీళ్ళందరినీ చూసి నేనింతకాలం తప్పు అభిప్రాయంలో ఉండిపోతూ వచ్చాను. భగవంతుడు మనిషికి తెలివితేటలిచ్చింది కేవలం అవతలి వారిని మోసం చేయడం కోసమేనని అనుకుంటూ వచ్చాను. అలాంటి అవసరం లేకపోవటంవల్లే నా తెలివితేటల్ని ఎప్పుడూ ఉపయోగించకుండా స్తబ్దుగా ఉండిపోయాను. నా నిరాసక్తతని మీరు చేతకానితనంగా అనుకున్నారు. ఇప్పుడు నాకో కొత్త విషయం అర్ధమైంది. మనిషికి కేవలం తెలివితేటలుంటే లాభంలేదు. తనకా తెలివితేటలున్నాయని నిరంతరం ప్రదర్శించుకుంటూ ఉండాలి. దానికి యోగ్యతా పత్రంగా డబ్బో, పడవో ఉండాలి. ఈ ఆలోచన ప్రస్తుతం నా దృక్పథాన్ని మార్చేస్తోంది. ఇక నుంచీ ఆ దృక్పథంతోనే బ్రతుకుతాను. మంత్రిగానే తిరిగి ఈ ఊళ్ళోకి అడుగుపెడతాను. అల్లుడి హోదాలో, అప్పుడు మీకు పదవీ విరమణ కాలపరిమితి పెంచుతాను కూడా!" అంటూ ఆ చివరి వాక్యం ఆయనకీ అర్ధమయ్యేలోగా అక్కడినుంచి కదిలి వెళ్లిపోయాడు.


                                                       6


    హేమంత సంధ్య చక్కటి అమ్మాయి. కొంతమంది అమ్మాయిలు అందంగా వుంటారు. కానీ చక్కగా వుండరు. మరి కొంతమంది గ్రేస్ ఫుల్ గా, హుందాగా వుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. అయినా చక్కగా వుండరు. మరికొంతమంది తుళ్ళుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, జాలీగా... ఇంకొంతమంది కళ్ళలో విజ్ఞానం తొణికిసలాడుతుండగా, రిజర్వ్ డ్ గా ఉంటారు. వీళ్ళలో కూడా చాలామంది చక్కగా వుండకపోవచ్చు.

    చక్కదనం అనేది విడిగా ఒక ఏంటిటీ. స్వచ్చమైన నీటికి రంగూ, రుచీ, వాసన లేనట్టే చక్కదనానికి కూడా నిర్వచనం లేదు. పొడుగు, వెడల్పులూ, ఎత్తుపల్లాలూ, కళ్ళల్లో కాంతులూ, అల్లరి నవ్వులూ- ఇవేవీ చక్కదనానికి కొలమానాలు కావు. ఎక్కడో, ఏదో వుంటుంది చక్కదనాన్ని నిర్దేశించేది.

    హేమంత సంధ్య.

    హేమంతమంటే చలికాలం. సంధ్య అంటే సాయంకాలం. చలికాల సాయంత్రపు చక్కదనానికి ఏ అందం కొలమానం అవుతుంది? తూర్పునుంచి పరుగెత్తుకొస్తున్న చలి సైన్యానికి భయపడి, పడమటి సూర్యుడు పైకెత్తిన తెల్లజెండాలా ఆకాశంనుంచి మంచు కురవడం ప్రారంభమవుతూంటుంది. 'తొలి పురుష స్పర్శే అవసరం లేదు. నేను కూడా పెదవులని వణికించగలను' అంటుంది శీతల పవనం.  

    హేమంతమంటే నీహారము వన విహారం చేసే కాలము. దాన్ని సరిగ్గా వర్ణించలేని వాల్మీకి కూడా 'మంచులో తడవడం చేత సూర్యకిరణాలు కూడా చల్లదనాన్ని సంతరించుకున్నాయి' అని వ్రాసి ఊరుకున్నాడు. హేమంత సంధ్య చక్కదనం అలాంటిది. చూడగానే అద్భుతమైన అందంగా తోచదు. మెరుగు పెట్టే కొద్దీ వన్నె పెరిగినట్టు, స్నేహం పెరిగేకొద్దీ ఆమె అందం బహిర్గతమవుతూంటుంది. అది భౌతికమైనదే కాదు- అంతర్గతమైనది కూడా! ముఖవర్చస్సే కాదు- వ్యక్తిత్వ పరమైనది కూడా!

    అటువంటి హేమంత సంధ్య జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన కార్తీకమాసపు సాయం సంజెలో జరిగింది. దీపావళి శలవుల తర్వాత ఆ అమ్మాయి కాలేజీకి తిరిగి వస్తుండగా జరిగిందా సంఘటన! రైలు వేగంగా కదులుతోంది. అంతకుముందే రైల్వేస్టేషన్ లో కొన్న జవహర్ లాల్ నెహ్రూ తాలూకు పుస్తకంలో లీనమైవుంది హేమంత. ఆమె ఎదురుగా ఒక కుర్రవాడు కూచుని వున్నాడు. పుస్తకంలో లీనమై వున్నా, అతడి చూపుల స్పర్శ ఆమెని యిబ్బంది పెడుతోంది.

    మరో ఐదు నిముషాలు గడిచాయి. అతడు లేచి టాయిలెట్ వేపు వెళ్ళి తిరిగి వస్తుండగా, అదే సమయానికి ఆమె తన పర్స్ లో తాళం తీసి సూట్ కేస్ తెరిచింది. టవల్ తీసుకుని, తాళంవేసి, దాన్ని పర్స్ లో వేసుకోబోతుండగా, అతడు దగ్గిరగా వచ్చి నిలబడి "మేడమ్! ఆ మూడువందల రూపాయలూ నావి" అన్నాడు.

    హేమంత సంధ్య బిత్తరపోయి "ఏ మూడు వందలు?" అంది.

    "అదే మేడమ్! ఇప్పుడు మీకు నా సీట్ దగ్గర దొరికినవి."

    "మీ సీట్ దగ్గర నాకు మూడువందలు దొరకడమేమిటి?" అన్నదామె మొహం చిట్లించి.

    "ఇప్పుడేకదా మేడమ్, మీరు పర్స్ లో పెట్టుకున్నారు!"

    నాన్సెన్స్, ఏం మాట్లాడుతున్నారు మీరు?" ఇంగ్లీష్ లో తీవ్రంగా అంది.

    అతడు జేబులోంచి నోట్లు బయటికి తీసాడు. వందరూపాయల కొత్త నోట్లు. వాటిని లెక్కపెట్టి "చూసారా! ఏడున్నాయి. మొత్తం పదుండాలి. నేను అక్కడికి వెళ్ళి కాఫీ తాగుదామని డబ్బులు తీస్తే మూడు నోట్లు తక్కువున్నాయి. సీట్ దగ్గర పడిపోయి ఉంటాయనుకున్నాను. నా అనుమానం నిజమైంది. వస్తూంటే మీరు వంగి ఆ డబ్బు తీసి పర్స్ లో పెట్టుకోవడం కళ్ళారా చూశాను. ఆ నోట్లు నావే! ఇచ్చెయ్యండి...."

    హేమంత మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. ఆవేశంతో పెదవులు కంపించసాగాయి. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను డబ్బుతీసి పర్స్ లో పెట్టుకున్నానా? అది నువ్వు చూసావా?" అంది కోపంగా.

    "అవును మేడమ్! చూసాను కాబట్టే అడుగుతున్నాను."

    ఈ సంభాషణ చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారు. ఇద్దరు ముగ్గురు ఆసక్తిగా దగ్గిరకొచ్చి "ఏం జరిగింది?" అని ప్రశ్నించారు కూడా.

    అతడు జరిగినదంతా మధ్యవర్తులకి వివరిస్తున్నట్టు తిరిగి చెప్పాడు.

    "అతడు చెపుతున్నదంతా ఆబద్ధం" అందామె. అప్పటికే రోషంతో ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరగసాగాయి.

    ఒక మధ్యవర్తి కల్పించుకుని "ఆమె తనకి తెలీదంటోంది కదయ్యా" అన్నాడు.

    "నేను కళ్ళారా చూసానని చెప్తున్నాను కదండీ! పర్స్ తీసి చూపించమనండి- మొత్తం అన్నీ కొత్తనోట్లు"

    హేమంత విసురుగా పర్స్ తాలూకు జిప్ లాగి లోపలినుంచి నోట్లు బయటికి తీసింది- 'కావాలంటే చూసుకో" అన్నట్టు.

    "అవిగో, అవి నావే!" అన్నాడతను ఆత్రంతో కూడిన ఆనందంతో.

    అందరూ 'ఇప్పుడేం చెప్తావ్' అన్నట్టు ఆమెవేపు చూసారు. భూమి గిర్రున తిరుగుతున్నట్లనిపించింది ఆమెకి. వెళ్తున్న రైలు అకస్మాత్తుగా తిరగబడిన భావం నిలువెత్తునా వణికించింది. చేతిలో నోట్లవైపూ, పర్స్ వైపూ మార్చి మార్చి చూసుకుంది. ఒక్కసారిగా భరించలేనంత నిస్సత్తువ ఆవహించింది.

    "ఇవి.... ఇవి..... " అంది కంపిస్తున్న గొంతుతో "....ముందు రైల్వే స్టేషన్ లో ఈ పుస్తకం కొనడానికి 500 రూపాయల నోటిస్తే ఆ షాపువాడిచ్చిన మూడు వందరూపాయల నోట్లు" అంది సంజాయిషీ చెపుతున్నట్టు.

    "ఆబద్ధం!" అన్నాడు ఆ కుర్రవాడు. "....నా దగ్గరున్న ఏడు నోట్లూ వరుస నంబర్లున్నవి. ఆమెని కూడా చూపించమనండి."

    అప్పటికే ఆమె గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది.

    "ఇవన్నీ వరుస నెంబర్లే" అన్నాడు ఇద్దరి దగ్గరా నోట్లు తీసుకున్న వ్యక్తి.

    అందరూ ఆమెవేపు అదోలా చూస్తున్నారు. "బాగా డబ్బున్న అమ్మాయిలా వుందే! ఇదేం పోయేకాలం?" సన్నగా అంటున్నారు ఎవరో. "....చదువుకున్న దానిలాగే వుంది. ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం" ఇంకెవరో అందించారు.

    కదులుతున్న రైల్లోంచి దూకేద్దామన్నంత ఆక్రోశం కలిగింది. ఇంకో క్షణం ఆలస్యం అయివుంటే ఆ పనే చేసేది!

    అంతలో మరోవ్యక్తి అక్కడికొచ్చాడు. అమ్మాయిలు ఓరగానూ, అబ్బాయిలు ఈర్ష్యగానూ చూసే అందం అతడిది. అతడి కళ్ళు విశాలంగా వున్నా, వాటినిండా అల్లరి చోటుచేసుకోవడంతో చురుగ్గా మెరుస్తున్నాయి. అతడి జుట్టు ఉంగరాలు తిరిగినా, కురచ చెయ్యడంతో తుమ్మెదరెక్కల్లా వుంది. మనిషి బలంగా వున్నాడు. కానీ అణువణువునా అదోలాంటి నిర్లక్ష్యం తొణికిస లాడుతుంది.

    "ఎక్స్ క్యూజ్ మీ...." అంటూ మధ్యవర్తి చేతిలోంచి మొత్తం పదినోట్లు తీసుకున్నాడు. "ఈ ఏడు నోట్లూ మీవా?"

    "కాదు, మొత్తం పదినోట్లూ నావే!" అన్నాడు జీన్ పాంట్ కుర్రవాడు.

    "మీరేం చెప్తారు?" అడిగాడు అమ్మాయిని.

    "పుస్తకాల షాపువాడు ఇచ్చిన నోట్లవి" అంది హేమంత.

    అతడు జేబులోంచి ఒక కార్డుతీసి చూపించి "నేను క్రైమ్ బాంచ్ ఇన్ స్పెక్టరుని" అంటూ విజిటింగ్ కార్డ్ లోపల పెట్టేసుకుని, ఆ కుర్రవాడితో "నువ్వెక్కడ పనిచేస్తావ్? ఈ నోట్లెక్కడివి?" అనడిగాడు.

    "గోవిందా మోటార్ వర్క్స్ లో పనిచేస్తాను. నిన్నే జీతం ఇచ్చారు. ఆ నోట్లే ఇవి" అన్నాడు ఆ కుర్రవాడు.

    "ఇవి దొంగనోట్లు" అన్నాడు ఆ యువకుడు.

    అప్పటివరకూ సినిమా దృశ్యంలా చూస్తున్న వాళ్ళందరూ, మరింత కుతూహలంగా గమనించసాగారు.

    "మీరిద్దరూ చెప్పేది నిజమైన పక్షంలో 'గోవిందా ఆటోమొబైల్స్' వాడినీ, రైల్వే స్టేషన్ లో పుస్తకాల షాపువాడినీ ఇంటరాగేట్ చెయ్యాలి. లేక ఇతడు చెప్పేది నిజమైన పక్షంలో మొత్తం దొంగనోట్లన్నీ ఇతడివే కాబట్టి- ఇతడ్ని కస్టడీలోకి తీసుకుని 'గోవిందా ఆటోమొబైల్స్'కి తీసుకెళ్ళాలి. ఏ విషయమూ వచ్చే స్టేషన్ లో నిర్ణయిద్దాం. మిస్టర్! నువ్వు నాతో రా. నా పక్కనే కూచుందువు గాని" అని దాదాపు కదలడానికి వీల్లేనంత బలంగా అతడి భుజాలచుట్టూ చేయివేసి అతడ్ని తనతోపాటు తీసుకెళ్ళాడు.

 Previous Page Next Page