తుఫాను వచ్చి వెలిసినట్టయింది. కానీ దానితీవ్రత తాలూకు ఛాయలు మాత్రం ఆమెని వదల్లేదు. తను చెప్పినదంతా నిజమని తెలుసు. ఒకే టైమ్ లో రెండు వేరు వేరు ప్రదేశాల్లోకి వరుస నెంబర్లున్న దొంగనోట్లు ఎలా వచ్చాయో ఆమెకి అర్ధంకాలేదు.
ఆమె సందేహాన్ని నివృత్తి చేయడానికి అన్నట్లు రైలు స్టేషన్ లో ఆగింది. ఆ యువకుడు నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చాడు. పక్కన కుర్రవాడు లేడు. నోట్లు ఆమెకి అందిస్తూ "తీసుకోండి మేడమ్!" అన్నాడు.
"ఏం జరిగింది?" అని అడిగింది ఆమె విస్మయంగా.
"అతడో గొప్ప మోసగాడు మేడమ్! చాలా తెలివితేటలతో ప్లాన్ వేశాడు. షాపులో పుస్తకాలు కొనుక్కొని మూడు నోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత షాపువాడు అదే నోట్లని మీ కివ్వడం గమనించాడు. కంపార్ట్ మెంట్ లో మిమ్మల్ని చూసేసరికి అతడి వక్రబుద్ధి వేయితలలు వేసింది. తర్వాత జరిగిందంతా మీకు తెలిసినదే!"
హేమంత సంధ్య టెన్షన్ అంతా ఒక్కసారిగా ఎవరో చేత్తో తీసేసినట్లు అనిపించింది. గొప్ప ప్రమాదం నుంచి బయటపడిన ఫీలింగ్....! ఆ రిలాక్సేషన్ ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు.
"అయితే అవి దొంగనోట్లు కావా?"
"కావు" అన్నాడు ఆ యువకుడు. "....అతడ్ని చూడగానే ఎందుకో అబద్ధం చెప్తున్నాడనిపించింది. అవి దొంగనోట్లని బెదిరించేసరికి నిజం మొత్తం ఒప్పుకున్నాడు. ఇలాంటి మోసం చేయడం మొదటిసారి అనుకుంటాను. దాదాపు ఏడ్చేసాడు. డబ్బు తీసుకుని అతడ్ని వదిలేసాను."
"అరెస్ట్ చేసి తీసుకెళ్ళవలసింది" అన్నదామె కసిగా.
"తీసుకు వెళ్ళేవాడినే. నిజంగా ఇన్ స్పెక్టర్ నయి ఉంటే!"
"మైగాడ్! మీరు ఇన్ స్పెక్టర్ కాదా?" అన్నదామె తల మునకలయ్యేంతటి ఆశ్చర్యంతో.
"కాదు మేడమ్! చాలా సాధారణ పౌరుణ్ణి. నిజం కక్కించడానికి అతడికన్నా పెద్ద నాటకం ఆడాల్సి వచ్చింది."
హేమంత కళ్ళు విప్పారితం చేసుకుని విభ్రాంతిగా అతడి వైపు చూస్తూ వుండిపోయింది.
అతడు సన్నగా నవ్వాడు. "... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి మేడమ్! నేనిలా నాటకం ఆడకపోయి వుంటే, ఈ పాటికి అతడు మీ దగ్గర మూడు వందలూ తీసుకుని ఉడాయించేవాడు."
"మూడు వందల సంగతి సరే! అవమానం?.... ఇంతమంది ముందు జరిగిన ఈ అవమానాన్ని భరించలేక నేనేం చేసేదాన్నో నాకే తెలియదు. ఈ స్టేషన్ లో రైలాగగానే ఈ విషయం అసలు మా నాన్నగారికి ఫోన్ చేసి చెబ్దామనుకున్నాను. అంత భయం వేసింది."
"మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?"
"సి.బి.ఐ. చీఫ్- ఢిల్లీలో! బైదిబై నా పేరు సంధ్య.... హేమంత సంధ్య అంటూ వివరాలు చెప్పింది.
అతడో క్షణం మాట్లాడకుండా ఆగి, తర్వాత నెమ్మదిగా అన్నాడు. "హే...మం...త...సం...ధ్య.... చాలా అద్భుతమైన పేరు- అని అనను."
ఆమె తెల్లబోయి చూసింది.
"ఎందుకంటే ఆ పేరు మీరు చెప్పగానే ఈ పాటికే ఆ మాట చాలామంది అని వుంటారు. బైదిబై... నా పేరు బృహస్పతి.... వెళ్ళొస్తానండీ. నేను దిగాల్సింది ఈ స్టేషన్ లోనే. రైలు కదులుతోంది" అంటూ దిగిపోయాడు.
హేమంతని చూస్తూ ప్లాట్ ఫామ్ మీదనుంచి చెయ్యూపాడు. ఆమె కూడా అప్రయత్నంగా చెయ్యూపింది. క్రమక్రమంగా అతడు కనుమరుగయ్యాడు. ఆమె సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. పెదవులపై అస్పష్టమైన చిరునవ్వు కదలాడుతోంది.
రైలు వేగం పుంజుకుంది.
ఇక్కడ ఫ్లాట్ ఫామ్ మీద దిగిపోయిన బృహస్పతి, రెండు చేతులూ జేబుల్లో పెట్టుకుని ఎగ్జిట్ ద్వారం వైపు నడవసాగాడు.
అప్పటివరకూ దొంగలా నాటకం ఆడిన రావు పరుగెత్తుకుంటూ అతడి దగ్గరికి వచ్చాడు.
"నువ్వేమిటో, నీ నాటకం ఏమిటో నాకు తెలీదు కానీ గురూ- ఏ మాత్రం ఇది ఫెయిలైనా ఆ కంపార్ట్ మెంట్ లోని జనం. సున్నంలోకి మిగలకుండా ఎముకలు చితక్కొట్టేవారు ఆ అమ్మాయి పుస్తకాల షాపువాడి దగ్గర మూడు వందనోట్లు తీసుకోవడం చూసిన నువ్వు, క్షణాల్లో ఇంత అద్భుతమైన ప్లాన్ వేసినందుకు అభినందించకుండా ఉండలేననుకో! కానీ నువ్వింత శ్రమ తీసుకుని నన్నింత రిస్క్ లో ఎందుకు పెట్టావో మాత్రం అర్ధం కావడంలేదు. ఏదో సరదాగా అమ్మాయిలకి బీట్ కొట్టడం కోసం ప్లాట్ ఫామ్ మీదకొచ్చిన మనం, ఆ అమ్మాయితో పాటు ట్రైన్ ఎక్కడం ఏమిటీ? ఇక్కడివరకూ ప్రయాణం చేయడం ఏమిటీ? మళ్ళీ ఇప్పుడు తిరిగి మన ఊరు వెళ్ళడం ఏమిటీ?"
"పిచ్చివాడా! దాన్నే 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అంటారు" గంభీరంగా అన్నాడు బృహస్పతి.
ఇదెప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంగతి.
* * *
ఆ సంఘటన జరిగిన నాలుగు రోజులకి హేమంత సంధ్య తన స్నేహితురాళ్ళతో కలిసి కాలేజీనుంచి హాస్టల్ కి వెడుతుండగా దారిలో ఎదురుపడ్డాడు బృహస్పతి. ఆ అమ్మాయి అతడిని చూసి పలకరింపుగా నవ్వింది. "ఇదేమిటి? ఇక్కడ దర్శనమిచ్చారు? కొంపదీసి మీరూ ఈ ఊళ్ళోనే ఉంటారా?"
"లేదండీ! నాది టూరింగ్ జాబ్". హేమంత అతడిని తన స్నేహితురాళ్ళకి పరిచయం చేసింది... అతడిని చూడటంతోనే సగంమంది అమ్మాయిలు అనిమిషులయ్యారు. భౌతికమైన అందం మీద నమ్మకంలేని మిగతా సగం మంది అమ్మాయిలూ, అతడెవరో తెలిసేసరికి అప్రతిభులయ్యారు.
"మీ గురించి మా హేమంత చెప్పిందండీ! అబ్బ!! క్షణాల్లో ఎంత ప్లాన్ వేసారండీ!!! మీరే గానీ అలా చెయ్యకపోయి వుంటే మా హేమంత పరిస్థితి ఏమై ఉండేదో? రండి, అలా హోటల్లో కూర్చుని కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం" అంది ఒక అమ్మాయి ఎగ్జయిట్ అయిపోతూ.
బృహస్పతి మనసులో జేబు తడుముకున్నాడు. దేవుడిమీద భారం వేసి, వాళ్ళతోపాటు హోటల్ కి కదిలాడు.
ఆరుగురు అమ్మాయిలూ విచ్చిన పువ్వుల్లా వున్నారు.
"మీది టూరింగ్ జాబ్ అన్నారు. ఏం జాబ్?" అడిగింది హేమంత.
"మా కంపెనీ పేరు 'పెర్వర్షన్ అండ్ కో'."
"వ్వాట్?" దాదాపు అందరూ కీచుగా అరిచారు.
"అవునండీ! 'PERSONALITY VERIFICATION AND CLASSIFICATION'. దాన్నే సింపుల్ గా 'పెర్వర్షన్' అంటాం" అని క్షణం ఆగి, నెమ్మదిగా ".... మీరు మాకు ఏమైనా సహాయపడతారా?" అని అడిగాడు.
"ఏ విధమైన సాయం?"
అతడు గంభీరంగా "నాకు చాలా క్లిష్టమైన పని అప్పగించాడు మా మేనేజింగ్ డైరెక్టర్. ఎలా పూర్తిచేయాలో అర్ధం కావడంలేదు. టైమ్ కూడా ఎక్కువగా లేదు" అన్నాడు రవ్వంత విచారం మిళితమైన స్వరంతో.
వెయిటర్ ఐస్ క్రీమ్ లు తీసుకొచ్చి బల్లమీద సర్దాడు.
"ఏం పనది?" అనడిగింది ఓ అమ్మాయి.
"పెళ్ళికాని అమ్మాయిల్లో సెక్స్ కోరికలు."
అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అప్పటివరకూ నవ్వుతున్నవాళ్ళు అకస్మాత్తుగా గంభీరవదనులయ్యారు. కాస్త అనుభవం వున్న ఒక అమ్మాయి మాత్రం సన్నగా విజిల్ వేయబోయి, బయట పడిపోతానని గ్రహించి, తనుకూడా గంభీరతని సంతరించుకుంది.
"మీరు నాకు నిజంగా సహాయం చేయగలరా?" అభ్యర్ధిస్తున్నట్లు అడిగాడు.
"వాట్ డూ యూ మీన్?" అంది కోపంగా హేమంత. అతనామె నోట్ పుస్తకం తీసుకుని (అటూ ఇటూ పేజీలు తిరగేస్తూ) సంభాషణ కొనసాగించాడు.
"ఒక డాటా ఫార్మ్ ఇస్తాను. అందులో కొన్ని ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానాలు రాసి నాకివ్వాలి."
"ఎటువంటి ప్రశ్నలు?" అనుమానంగా అడిగింది ఓ కళ్ళజోడు అమ్మాయి.
"ఇబ్బందికరమైన ప్రశ్నలు. నిజంగానే చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు. అయితే కొన్ని వాస్తవాలు బయటికి తీసుకురావాలంటే ఇలాంటి శోధన తప్పదు. ఈ పుస్తకం కానీ బయటికి వస్తే మార్కెట్ లో సంచలనం రేగుతుంది. దాదాపు వెయ్యిమంది పెళ్ళికాని అమ్మాయిల దగ్గరనుంచి గణాంకాలు సేకరించాలన్నది మా లక్ష్యం. ఆ బాధ్యత నాకు అప్పజెప్పారు."
"ఏదీ ఆ ప్రశ్నాపత్రం?"
"వద్దు. దాన్ని చూస్తే మీ మొహం ఎర్రబడుతుంది. 'ఛీ' అంటారు. నా మొహం మీద విసిరేస్తారు."
అమ్మాయిల్లో ఉత్సుకత పెరిగింది. కానీ బయటపడితే బాగోదని గుంభనంగా వుండిపోయారు.
"అంత ఇబ్బందికరమైన ప్రశ్నాపత్రాన్నిచ్చి మీరు అమ్మాయిలతో ఎలా పూర్తి చేయిస్తారు?" అంది ఓ అమ్మాయి.
"ఆయనకున్న తెలివితేటల కిదో పెద్ద సమస్య కాకపోవచ్చు! ఈపాటికే ఏదో ఆలోచించే వుంటారు. అవునా...?" అంది కళ్ళజోడు అమ్మాయి.
"అవును. ఆలోచించే వుంచాను."
"ఏమిటి?" అందరూ ఒకేసారి అడిగారు.
"గ్రూప్ రైటింగ్" గంభీరంగా అన్నాడు బృహస్పతి.
"అంటే?"
"ఒకేసారి ముప్పై మంది అమ్మాయిలకి ఈ పత్రాలిస్తాను. చదవగానే, మరి ఆలోచించకుండా చకచకా జవాబులు రాయాలి. అప్పుడే సమాధానాలు నిజాయితీగా వస్తాయి. అయితే చివరలో సంతకం పెట్టక్కర్లేదు పేరుకూడా రాయక్కర్లేదు. మాకు కావలసింది ఇన్ఫర్మేషన్ మాత్రమే! అన్ని కాగితాలూ కలగా పులగం చేసి కలిపేస్తాం కాబట్టి, ఎవరు ఏది రాసారో మాకు తెలీదు. కాబట్టి మీరందరూ నిర్భయంగా మీ మీ భావాల్ని వెల్లడించవచ్చు."
కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు.
"ఈ ఆలోచన బాగానే ఉన్నట్టుంది" అంది ఓ అమ్మాయి నిశ్శబ్దాన్ని చీలుస్తూ.
"థాంక్స్! అయితే మీరు నాకు సహాయం చేస్తున్నట్లేగా" విప్పారిన మొహంతో అన్నాడు బృహస్పతి.
"ఇంతకీ ఏదా ప్రశ్నాపత్రం?"
"అమ్మో! అది చూపిస్తే మీరు రాత్రంతా చర్చించుకుని, ఏకగ్రీవంగా తిరస్కరిస్తారు. రేపు మీ కాలేజీకి వచ్చి ఇస్తాను. నా తరఫున మీ స్నేహితురాళ్ళని అభ్యర్థించండి. ఈ మాత్రం సహాయం చేస్తే నేను మీకు రుణపడి వుంటాను" అంటూ లేచి వాళ్ళ దగ్గరనుండి శలవు తీసుకున్నాడు.
మరుసటిరోజు అతడు కాలేజీ దగ్గరికి వెళ్ళేసరికి ప్లే గ్రౌండ్ లోనే మిగతా అమ్మాయిలతో కలిసి హేమంత ఎదురుచూస్తోంది. అతడిని చూసి నవ్వుతూ.... "మీరు ఒక సంచలనంలా వున్నారండీ! మీరు ఊహించినట్టు మావాళ్ళు ఏమీ ఇబ్బందిపడడం లేదు. నిజానికి ఉవ్విళ్ళూరుతున్నారు.... రాత్రంతా మా హాస్టల్ లో ఇదే డిస్కషన్స్! ఒంటిగంటవరకూ ఎవరూ నిద్రపోలేదు. అసలు ఇలాంటి సర్వేలు కూడా వుంటాయా?"