Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 8


    అతి ప్రమాదకరమైన, అత్యంత ముఖ్యమైన విషయాలని పంపుతున్నప్పుడు సి.బి.ఐ. ఏజెంట్లు ఆ విధంగా కోడ్ రాస్తారు.

    మొత్తం రెండు పేజీల సమాచారం అది. మామూలుగా చదివిన వాళ్ళకి అదొక వ్యాపార సంబంధమైన మెసేజ్ లా వుంటుంది. దాన్ని డీకోడ్ చేసి, కావలసిన సమాచారం రాబడితే కేవలం ఒకే ఒక వాక్యం మిగులుతుంది.

    "August 15- confirmed".

    ఒక లేడీ ఏజెంట్ పంపించిన సమాచారం అది!

    సి.బి.ఐ. చీఫ్ ఆ కాగితంవైపే కన్నార్పకుండా చాలాసేపు చూస్తూ వుండిపోయాడు.

    ఆ కాగితంలో వున్న విషయం కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు సీక్రెట్ ఏజెంట్లు ఆ సమాచారాన్ని డిపార్ట్ మెంట్ కి పంపించారు.

    ఆగస్టు 15వ తారీఖున భారతదేశంలో ఒక పెద్ద ప్రమాదం జరగబోతోంది. అంతవరకే తెలుసు.

    ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిమీద, ఎందుకు చేస్తున్నారో తెలీదు.

    గడువు కూడా ఎక్కువ లేదు.

    సి.బి.ఐ. చీఫ్ విసుగ్గా పచార్లు చేయసాగాడు.

    సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లని స్వీకరించడం ప్రారంభించాక సి.బి.ఐ. పని రెట్టింపైంది. జడ్జీలు, ఛర్నాకోలతో కొట్టినట్టు డిపార్ట్ మెంట్ అధికార్లని ఆఘమేఘాలమీద పరుగెత్తిస్తున్నారు. ఉన్న బలగం తక్కువ. పని మాత్రం రోజురోజుకీ పెరిగి పోతోంది. ప్రభుత్వోద్యోలకి ఇళ్ళ కేటాయింపులో జరిగిన అవకతవకలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలో, దేశానికి జరిగే ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియని పరిస్థితి!... 'ఏం చెయ్యాలో మీరే చెప్పండి' అని తనే ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో పడేద్దామా అనుకున్నాడు.

    సిగరెట్ కోసం జేబు తడుముకుంటే చిన్న కాగితం దొరికింది. తీసి చూసాడు. బృహస్పతి అడ్రసు- కూతురిచ్చింది!

    "నువ్వు ఒకసారి అతడ్ని చూడు నాన్న! తప్పకుండా నా సెలక్షన్ ని మెచ్చుకుంటావు" అంటూ అడ్రసు ఇచ్చి పంపించింది.

    చూసాడు. మెచ్చుకోలు కాదు కదా, ఇప్పుడు కూతురి తెలివి తేటల్నే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది! అల్లుడి సిద్ధాంతాలూ, థియరీలూ అతడ్ని మరింత అయోమయంలో పడవేసాయి. విసుగ్గా నుదురు కొట్టుకొన్నాడు. అప్పుడొచ్చింది ఫ్లాష్ లాంటి ఆలోచన!

    ఈ పని బృహస్పతికి అప్పగిస్తే!

    తనో గొప్ప మహామేధావి ననుకునే ఆ కుర్రవాడికి ఈ పని అంటగడితే గర్వం అణుగుతుంది. కొన్నాళ్ళపాటు తనో జేమ్స్ బాండ్ ననుకుంటూ దేశం అంతా తిరుగుతాడు. ఈలోగా కూతురి పెళ్ళి ఇంకెవరితోనయినా చెయ్యవచ్చు. ఈ ఆలోచన రాగానే ఆయన హుషారుగా లేచాడు. ఆ తర్వాత అరగంటకి ఆయన బృహస్పతి కలుసుకున్నాడు. 


                    *    *    *


    "చెయ్యనుగాక చెయ్యను. చచ్చినా చెయ్యను" అన్నాడు బృహస్పతి.

    "ఏం? ఎందుకని?"

    "మీరందరూ ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుని ఎ.సి. రూముల్లో కూచుంటారా? మీ పని నేను చేసి పెట్టాలా? ఇదేమైనా సినిమా కథ అనుకున్నారా?"

    "నువ్వు చాలా గొప్ప తెలివైన వాడిననుకుంటుంటావు కదా! అది నిరూపించుకోవడానికి ఈ పని చెయ్."

    "ఓసారి నిరూపించుకున్నాను కదా!"

    "నేను పక్కనుండబట్టి ఆ లిక్కర్ స్మగుల్డ్ చెయ్యగలిగావ్. అది పెద్ద విశేషమేమీ కాదు."

    "మీరు లేకపోతే మరోరెండు కార్లు అద్దెకు తీసుకునే వాడిని. ఒక దానిమీద లైట్, హారన్ ఏర్పాటు చేసి ఉండేవాడిని. చెక్ పోస్ట్ దగ్గరికి నా మనుషులనే ఇద్దరిని పోలీసు వేషంలో పంపించి ఉండేవాడిని. వస్తున్నది గవర్నర్ గారి కారని ఆ పోలీసులతో, చెక్ పోస్ట్ దగ్గర చెప్పించేవాడిని. అంత సింఫుల్ గా వ్యవహారం అయిపోయి వుండేది."

    సి.బి.ఐ. చీఫ్ నివ్వెరపోయి చూసాడు. అంత ఇరిటేషన్ లో కూడా బృహస్పతి తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. "సరే పద!" అన్నాడు.

    "ఎక్కడికి?"

    "మీ ఇంటికి."

    "ఎందుకు?"

    "అదేమిటయ్యా? మీ పెద్దవాళ్ళని ఒక్కసారయినా చూడనక్కరలేదా?"

    "గుడ్! ఉన్నతమైన పొజిషన్ లో వుండి, ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం దేశానికి గొప్ప శుభసూచకం" నెమ్మదిగా తనలో తనే అనుకుంటున్నట్లు అన్నాడు.

    "ఏమిటి నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్?"

    "ఏంలేదు సర్! అసలేనిర్ణయమూ తీసుకోని మన దేశ మాజీ ప్రధాని గుర్తొచ్చారు. పదండి" అంటూ బయలుదేర దీసాడు.

    ఇద్దరూ ఇంటికొచ్చేసరికి అక్కడో గొప్ప సీన్ జరుగుతోంది. కుటుంబ సభ్యులందరూ ముందు గదిలో సమావేశమై ఉన్నారు. కుర్చీలో ఠీవిగా సరళరేఖ కూర్చుని వుంది. పక్కనే హనుమంతరావు వణుకుతూ నిలబడి ఉన్నాడు. అప్పుడే పట్టుబడిన దొంగలా వుంది అతడి ముఖకవళిక.   

    ఆ దృశ్యం చూడగానే సగం సీన్ అర్ధమైపోయింది. "అడుగో వచ్చాడు" అంది సరళరేఖ.

    బృహస్పతి అన్నాడు "ఒరేయ్! నా కడుపునా చెడబుట్టావురా! అర్ధరాత్రి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి దాచుకున్న డబ్బంతా కొల్లగొట్టి తీసుకొస్తావా? నీ కసలు బుద్ధుందా? మనిషివి పుట్టినందుకు కాస్త సిగ్గుండాలి- అని తిట్టకండి నాన్నా. అసలు జరిగిందంతా వింటే...."

    "వినక్కర్లేదురా! అంతా అర్ధమైంది. నీలాంటి కొడుకున్నందుకు మేము విచారించని క్షణం లేదు. ఈ క్షణమే మూటాముల్లె సర్దుకుని ఇంట్లోంచి బయటికి నడు" అన్నాడు తండ్రి.

    రాఘవరావుకి ఇదేదో నాటకంలో సంఘటనలా కనబడుతోంది. అయోమయంగా అందరివైపూ చూడసాగాడు.

    "చూడు నాన్నా! పెద్ద మనిషి పక్కనున్నారు. ఆయన ముందు ఈ అమ్మాయి పరువు తీయకు" అన్నాడు బృహస్పతి.

    "అమ్మాయిది కాదురా! పోయింది మన పరువు!"

    "అసలేం జరిగింది?" అన్నాడు రాఘవరావు కల్పించుకుంటూ.

    "మీరెవరు?" అనడిగాడు తండ్రి ఆయనవైపు అనుమానంగా చూస్తూ.

    "నేను సి.బి.ఐ. చీఫ్ ని" అన్నాడాయన - 'బాండ్ .... జేమ్స్ బాండ్' అన్న లెవెల్ లో.

    సరళరేఖ ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి ఆ విసురుకి పడబోయి, నిలదొక్కుకుని సెల్యూట్ చేసింది.

    "ఏం బాబూ! మిమ్మల్ని కూడా మావాడేమైనా మోసం చేసాడా?" భయపడుతూ అడిగాడు తండ్రి.

    "ఇంకా చెయ్యలేదు. ఆయన కూతురు మీద ఒట్టు!" కేవలం సరళరేఖకి మాత్రం వినబడేలా అన్నాడు బృహస్పతి. ఈలోగా ఇన్ స్పెక్టర్ జరిగినదంతా ఆయనకి చెప్పింది. ".... సర్! వీడిపేరు హనుమంతరావు. అవినీతి నిరోధక శాఖాధికారి వేషం వేసుకునొచ్చి, మా ఇంటిమీద రైడ్ చేశారు వీళ్ళిద్దరూ."

    "అసలేం జరిగిందంటే...." బృహస్పతి మాటలు పూర్తికాకుండానే తండ్రి విసురుగా ముందుకొచ్చి "అవసరం లేదురా! ఇంకేం చెప్పనవసరంలేదు. ముందు ఇంట్లోంచి బయటికి నడు. నువ్వు ఇంకొక్కమాట మాట్లాడితే ఈ ఇంటి దూలానికే ఉరేసుకు చస్తాను. మాట్లాడితే ఒట్టే!" అని అరిచాడు.

    అరనిముషం పాటు అక్కడ గాఢమైన నిశ్శబ్దం రాజ్యమేలింది.

    తండ్రి సంగతి అతడికి బాగా తెలుసు. తల వంచుకుని, వెనుదిరిగి నెమ్మదిగా అక్కడినుంచి బయటకొచ్చాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడాలో, బృహస్పతితో కలిసి బయటికి నడవాలో అర్ధంకాలేదు రాఘవరావుకి.

    "ఇదిగోనమ్మా! మొన్నరాత్రి మావాడు తెచ్చిన డబ్బు" అంటూ తల్లి లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అందించింది.

    "నా మంగళసూత్రం?" అంది సరళరేఖ.

    బృహస్పతి బయటికి వెడుతున్న వాడల్లా ఆగి- "నీ మంగళసూత్రం ఏమిటి? స్టువర్ట్ పురం దొంగ మంగళసూత్రం!" అన్నాడు.

    ఈలోగా హనుమంతరావు అతడి దగ్గిరకొచ్చి "సారీ గురూ! ఎలా గుర్తుపట్టిందో తెలీదు కానీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి, కాస్త బెదిరించేసరికి నీ గురించి అంతా చెప్పేసాను. నన్ను క్షమించు" అన్నాడు.

    "ఏం చెప్పావ్?"

    "నీకు రెగ్యులర్ గా డ్రింక్ చేయటం అలవాటు లేదనీ, ప్రొహిబిషన్ వచ్చాకే ఆ యావ ఎక్కువైందనీ చెప్పాను."

    రాఘవరావు ఉలిక్కిపడి కాబోయే అల్లుడి (?) వైపు చూసి "ఏమిటీ? నీకు తాగుడు అలవాటుందా?" అని అడిగాడు.

    "అబ్బే, ఎప్పుడూ లేదండి. పేకాటలో డబ్బులే పోయినప్పుడు మాత్రమే!" అన్నాడు హనుమంతరావు.

    రాఘవరావు తూలి పడబోయి తమాయించుకుని, "నీకు పేకాట అలవాటు కూడా వుందా?" అని అడిగాడు.

    "రాత్రి మాట్కాలో డబ్బులు వస్తే పగలు పేకాట ఆడమండి. ఆ డబ్బుల్తో రేసులకి వెళ్తాం" వినయంగా హనుమంతరావు చెప్పాడు.

    బృహస్పతి కంగారుగా "ఒరేయ్! కొంప ముంచుతున్నావురా. నువ్వు మాట్లాడేదేమిటో అర్ధమవుతోందా?" అంటున్నా వినిపించుకోకుండా హనుమంతరావు సి.బి.ఐ. చీఫ్ వైపు తిరిగి "సారీ! ఒకటి మాత్రం నిజం. ఏమాట కామాటే చెప్పుకోవాలి. సాయంత్రం అవగానే ప్రతిరోజూ మేమందరం రైల్వే ప్లాట్ ఫాం మీదకి చేరి అమ్మాయిలకి బీటు కొడతాం. బృహస్పతికి మాత్రం ఆ ఇంట్రెస్ట్ లేదు. కేవలం సిగరెట్లు తాగడానికే వస్తాడు" అన్నాడు నిజాయితీగా.

    బృహస్పతి తల్లి ఒక్కసారిగా బావురుమంది. తండ్రి నోటమాట రానట్టు, చేష్టలుడిగి నిలబడ్డాడు.

    "సర్, ఏదొక కేసు బుక్ చేసి పోలీస్ స్టేషన్ లాకప్ లో తోసెయ్యమంటారా?" అనుమతి కోసం అడిగింది సరళరేఖ సి.బి.ఐ. చీఫ్ ని.

    బృహస్పతి ఆ మాటలని పెద్దగా పట్టించుకోకుండా, రాఘవరావువైపు తిరిగి "పదండి సర్! పోదాం!" అన్నాడు.

    జరిగిన సంఘటనతో దాదాపు మతిపోయిన సి.బి.ఐ. చీఫ్ ఈ చివరి మాటకి మరింత షాక్ తిని "నువ్వెక్కడికి నాతో?" అనడిగాడు.

    "బయటికెళ్ళి కార్లో మాట్లాడుకుందాం."

    ఆయన బెదిరిపోయి "మళ్ళీ కర్ణాటకయేనా?" అనడిగాడు.

    "కాదండీ! కార్లో చెప్తాగా" అని తల్లి దగ్గరగా వెళ్ళి "అమ్మా!" అన్నాడు. "కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక దృశ్యాన్ని ఊహిస్తున్నాను. కొడుకు మరణంతో నువ్వు యాభై సంవత్సరాలు పైబడ్డ వృద్ధురాలివైపోతావు. నీ చేయి పట్టుకుని నాన్న స్టేజి ఎక్కిస్తాడు. నా తరుఫున 'పరమవీరచక్ర' తీసుకోవడానికి మీరిద్దరూ వెళ్తారన్న మాట! దేశాన్ని విపత్కర పరిస్థితినుంచి రక్షించి సి.బి.ఐ. సేవలో వీరమరణం పొందినందుకు 'పరమ వీరచక్ర' నీ కొడుక్కి ఇచ్చిన సందర్భంలో...." 

 Previous Page Next Page