ఆమె చాలాసేపు ఏడుస్తూ వుండిపోయింది. అతడు ఆమెని అలాగే వదిలేశాడు. ఆమె వీళ్ళ మనిషి కాదని తెలుస్తూనే వుంది. లేకపోతే ఇంత తొందరగా బెదిరిపోయి దారికిరాదు. అతడి అంచనా నిజమయింది.
"నేను వీళ్ల మనిషిని కాను" అంది ఆమె నెమ్మదిగా.
"అసలెవరు వీళ్ళు?"
"నాకు తెలీదు. సినిమాల్లో చిన్న వేషాలు వేసుకునేదాన్ని నేను. మీతో వేషం అనగానే పొంగిపోయాను. ఆ ముందురోజే మా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారు. షూటింగ్ టైంలో మీకు నిజంగానే యాక్సిడెంట్ జరుగుతుందనీ, అంబులెన్స్ లో వీళ్ళొచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారనీ నాకు ముందే తెలుసు. మీకు షూటింగ్ లోనే జాగ్రత్తగా వుండమని చెపుదామనుకున్నాను. కానీ నా తమ్ముడి ప్రాణాలకు ప్రమాదమని చెప్పలేదు."
"సుబ్బారావ్ అనే వాడెవడూ లేడా?"
"లేడు."
"అతడే ఆమె సైన్యం సినిమా ప్రకటన పేపర్ లో పడింది, అందులో నా ఫోటో లేదే."
"మీ కోసం డమ్మీ పేపరు తయారు చేశారు వాళ్ళు,"
"ఇంత బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చదువుకున్నావు?"
"బి.ఏ. పాసయ్యాను చైతన్యగారూ. మాది పెద్ద కుటుంబం. సినిమాల్లో వేషాలేసి పోషిస్తూ వుంటాను".
"నీ తమ్ముడి జాడ తెలీదా?"
"తెలీదు. ముందు లక్ష'రూపాయలిస్తామని ఆశ పెట్టారు. నేను వినలేదు. దాంతో మా తమ్ముడిని కిడ్నాప్ చేసారు."
"ఈ గ్యాంగ్ మూలస్థంభం ఎవరో తెలుసా నీకు?"
"తెలుసు."
"ఎవరు?"
"ప్రనూష"
చైతన్య అదిరిపడ్డాడు.
"నువ్వు చెప్పేది నర్సు ప్రనూష గురించే?"
"ఆమె నర్సు కాదు. నా దగ్గరికి కాడిలాక్ కారులో వచ్చింది."
"విదేశీ గూఢచారిణా?"
"ఏమో, నాకు తెలీదు."
"ఒక సినీయాక్టర్ని ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయడంలో ఆమె ఉద్దేశ్యం ఏమై వుంటుంది?" సాలోచనగా అన్నాడు.
ఆమె జవాబు చెప్పలేదు.
"ఈ హాస్పిటల్ సూపర్నెండెంట్ ఎవరు?"
"ఆమె మనిషే."
"పోలీస్ ఇన్ స్పెక్టర్? ఆ గుండాలు?"
"అంతా వాళ్ళే"
"ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ అన్నమాట"
అతడు కొద్దిసేపు మౌనంగా వుండి "ఏ ధైర్యంతో నా భార్యగా ఈ రాత్రి లోపలికి వచ్చావ్?" అని అడిగాడు.
"నాకేమీ కాదని వాళ్ళు చెప్పారు. నా ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పమన్నారు. మీ వెన్నెముకకి దెబ్బ తగిలిందని చెప్పమన్నారు. నా తమ్ముడి కోసం నేనిదంతా చేయక తప్పలేదు చైతన్యగారూ! నన్ను క్షమించండి."
"ఓ.కే. అయిందేదో అయిపోయింది. నాకిదంతా చెప్పినందుకు కృతజ్ఞతగా నీ తమ్ముడిని ఆ గ్యాంగ్ బారినుండి రక్షించి నీ కప్పగిస్తాను. ఆ ప్రనూష అంతు తేలుస్తాను. ఈ రాత్రికి హాయిగా నిద్రపో."
పది నిమిషాల్లో అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇన్నాళ్ళ టెన్షన్ లేకపోవడంతో హాయిగా నిద్రపట్టింది.
5
అప్పటికి చైతన్య కనపడక పదిరోజులు దాటింది.
మొత్తం సినీరంగమంతా పారలైజ్ అయిపోయింది. చైతన్యకి సంబంధించిన నిర్మాతలూ, టెక్నీషియన్సే కాకుండా పరిశ్రమలో అందరూ దిగ్భ్రాంతిలో వుండిపోయారు. సాధారణంగా ఏ సమస్య అయినా రోజులు గడిచేకొద్దీ చల్లబడుతుంది. కానీ చైతన్య అదృశ్యమైన విషయం రోజు రోజుకీ తీవ్రమవసాగింది.
షూటింగ్ జరుగుతూ వుండగా హీరో తలమీద దెబ్బ తగిలింది. అయిదు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. మిగతావారి నెవరినీ ఎక్కించుకోకుండా కేవలం చైతన్యనే తీసుకెళ్ళారు. నిర్మాతతో సహా మిగతా అందరూ ఆస్పత్రికి వెళ్ళేసరికి, అంబులెన్స్ ఎంతసేపటికీ రాలేదు. గంట గడిచి రెండు గంటలయ్యాయి. మిగతా ఆస్పత్రుల్లో ప్రయత్నించారు. అంబులెన్స్ కి ఆక్సిడెంట్ జరిగిందేమో అని వాకబు చేశారు. ఫలితం లేదు.
అంబులెన్స్ జాడ తెలీలేదు.
మరుసటి రోజునుంచీ అది సెన్సేషనల్ వార్త అయింది. అభిమాన సంఘాల వాళ్ళ అలజడి, కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అయోమయం, ఆగిపోయిన షూటింగ్ లు...
ఇవన్నీ ఒకవైపు-
చైతన్య తల్లి పరిస్థితి మరోవైపు.
అతడి జాడ తెలియడం లేదనగానే ఆవిడ స్పృహ తప్పిపోయింది. కొడుకంటే ఆమెకు ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. పాతిక సంవత్సరాల క్రితం కాశ్మీర్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చింది తల్లి. ఆమె భర్త యుద్ధానికి సంబంధించిన రాడార్ శాఖలో పనిచేసేవాడు. యుద్ధంలో ఆయన మరణించిన తర్వాత వచ్చే పింఛను డబ్బులతో కొడుకుని చదివించింది. వాళ్ళుండే చోటుకి ఒకసారి అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం ఒక సినిమా కంపెనీ వచ్చింది. షూటింగ్ మధ్యలో ఒక కుర్రాడు కావల్సి వచ్చాడు. ఆ వేషానికి చైతన్యని తీసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఒక మంచి దర్శకుడి దృష్టి చైతన్యమీద పడింది. తన తర్వాత చిత్రంలో వేషం కోసం చైతన్య తల్లిని కలుసుకున్నాడు. తల్లికి ఇష్టంలేదు. కానీ దర్శకుడూ నిర్మాత కలిసి ఒప్పించారు. ఆ చిత్రం కేవలం చైతన్య వల్లే బాగా ఆడింది.
పధ్నాలుగో ఏడునుంచి చైతన్యకి సినిమా ఛాన్సులు రావటం మానేశాయి. సాధారణంగా ఆ వయసులో అది సహజమే! తిరిగి ఇరవై రెండో ఏట అతను మళ్ళీ రంగప్రవేశం చేశాడు. రొమాంటిక్ సబ్జెక్ట్ అది. పదిహేనేళ్ళ అమ్మాయితో రొమాంటిక్ స్టోరీ! ఇరవై అయిదు వారాలు ఆడింది.
అతడికి విపరీతంగా ఛాన్సులు రావటం మొదలుపెట్టాయి. అయితే తొందర్లోనే అతడొక విషయం తెలుసుకున్నాడు.
ప్రేక్షకుల టేస్టు మారుతుంది. కేవలం రొమాంటిక్ హీరోగా నిలదొక్కుకోవటం కష్టం.
అతడు ఫైట్స్ లోనూ, డాన్స్ లోనూ ఏకాగ్రత చూపించటం ప్రారంభించాడు. అది బాగా లాభించింది. చిత్ర పరిశ్రమకి థర్డ్ డైమెన్షన్ లభించినట్టయింది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఫైట్స్ చేసేటప్పుడు మొహంలో ఎక్స్ ప్రెషన్... ఆ కసి, క్రౌర్యం- యువకులని ఉర్రూత లూగించింది.
ఏ రంగంలో అయినా- ముందువాడిని అనుసరించేవాడు, రెండోవాడిగానే మిగిలిపోతాడు. కొత్త పంథా వెతికేవాడే ముందుంటాడు. ఒకసారి ముందుకు వచ్చాక, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి కృషి అవసరం. ఈ రెండు లక్షణాలు చైతన్యలో పుష్కలంగా వున్నాయి. అతడి విజయాన్ని గెలవగలిగేది ఒక్కటే! అతడి వయసు! అంతవరకూ అతడు నిర్విరామంగా పనిచేస్తూ వుంటాడనేది నిర్వివాదాంశం.
ఈ విజయం వెనుక వున్న స్త్రీ అతడి తల్లి! పైకి చాలా మామూలుగా కనపడే వ్యక్తిత్వం ఆమెది. కానీ చాలా లోతయినది, క్లిష్టమైనది. కష్టాల్ని పళ్ళబిగువున అదిమిపెట్టి కోట్లు సంపాదించాక కూడా అలాగే వున్నది ఆమె వ్యక్తిత్వం. ప్రేమ ఎంత గొప్పదో, జీవితంలో ఎంత కష్టపడిందో, ఎంత పోగొట్టుకున్నదో తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒకరు- ఆమె కొడుకు!
* * * *
హాస్పిటల్ సూపర్నెండెంట్ పాల్ మొహంలో అంత కౄరత్వం ఎప్పుడూ కనపడలేదు. మొహం వికృతంగా మారింది. ఆమె రెక్క పట్టుకుని విసురుగా లాగుతూ "ఎక్కడకు వెళ్ళాడు? ఎప్పుడు పోయాడు?" అని అరిచాడు.
లక్ష్మి బెదిరి "నేను నిదురపోయాను" అంది. అంతలో అక్కడికి ప్రనూష వచ్చింది. పాల్ ఆమెకి పరిస్థితి చెప్పాడు. ఇప్పుడు అతను సూపర్నెండెంట్ లా, ఆమె నర్సులా లేరు. ఒక అధికారిణి ముందు చేతులు కట్టుకుని మాట్లాడే సేవకుడిలా వున్నాడు పాల్. విషయం తెలుసుకున్న ప్రనూష పాల్ లా కంగారుపడలేదు.
"మనం ఇంతమంది కాపలా కాస్తుండగా ఎలా తప్పించుకోగలడు పాల్? మన ప్రహరీ గోడలు చాలా ఎత్తయినవి. మన కుక్కలు చాలా చురుకైనవి" అంది ఇంగ్లీషులో.
"ఈ కాంపౌండ్ లోనే అతను ఎక్కడో వుండి వుంటాడు."
"వెతికించండి మరి! మొత్తం అందరినీ ఈ పనిలో ప్రవేశపెట్టండి."
పాల్ జోసఫ్ హడావుడిగా బయటకు వెళ్ళాడు. బయట కలకలం మొదలైంది. లోపల లక్ష్మి ప్రనూషని అడిగింది- "ఇకనైనా నా తమ్ముడిని వదిలిపెడతారా?"
"తమ్ముడేమిటి?"
లక్ష్మి మొహం వెలవెలబోయింది. "నా తమ్ముడిని కిడ్నాప్ చేసి నన్ను బలవంతంగా ఇందులోకి దించి ఇప్పుడు నాకేమీ తెలియదని బుకాయిస్తున్నారా?" రోదించడం మొదలుపెట్టింది.
అంతలో జోసెఫ్ తిరిగివచ్చాడు. అతడి చేతిలో చిన్నగుడ్డ ముక్క వుంది. చైతన్య పడుకునే బెడ్ షీట్ తాలూకు ముక్క అది. "ఈ గుడ్డల్ని తాడులా కట్టి గోడదూకి పారిపోయినట్టున్నాడు మేడమ్! ఈ ముక్క చెట్టు దగ్గర కనబడింది" అన్నాడు.
"గోడ దగ్గర చెట్లేవీ లేవే! ఎలా దూకాడు?" అంది ప్రనూష.
"అవన్నీ ఆలోచిస్తూ వుంటే మనకి ప్రమాదం. అతనీపాటికే పోలీసుల్ని తీసుకొస్తూ వుండి వుంటాడు."
"అవును. మనం తొందరగా ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి. సామానులు వదిలెయ్యండి" అంటూ అక్కణ్ణుంచి బయటకు వెళ్ళింది. లక్ష్మి ఆమెతోపాటే తన తమ్ముడి గురించి అడుగుతూ అనుసరించింది. జోసఫ్ కూడా ఆమె సూచనలు అమలు జరపటానికి పరుగెత్తాడు. ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, మంచం అడుగునుంచి లేచాడు చైతన్య. అతను అప్పటివరకూ అక్కడే, ఆ గదిలోనే వున్నాడు. ఆ గదిలో వెతకాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.
ప్రనూష కొచ్చిన అనుమానం కరక్టే. ఎటువంటి తాడు సాయంతోనైనా ప్రహరీ గోడ దూకి బయటకి వెళ్ళడం దుర్లభం. ఆ విషయం చైతన్యకి తెలుసు. అసలు అతడా ప్రయత్నమేమీ చేయలేదు కూడా! అర్దరాత్రి లక్ష్మి నిద్రపోయాక చిన్న బెడ్ షీట్ ముక్క కత్తిరించి చెట్టు మొదట్లో పారేసి వచ్చి దాక్కున్నాడు. మిగతా అంతా అతను అనుకున్నట్టే జరిగింది.
బయట హడావుడి ఎక్కువైంది.
చైతన్య కిటికీలోంచి బయటకు చూశాడు. అతడికి కొద్దిగా ఆశ్చర్యం కూడా కలిగింది. బయట ఎంతోమంది జనం వుంటారనుకున్నాడు. గార్డులతో కూడా కలిపి పదిమందికన్నా ఎక్కువలేరు. కొందరు వ్యాన్ ఎక్కుతున్నారు. ప్రనూష కారు దగ్గర వుంది. వీళ్ళంతా తనకోసమే- తన ఒక్కడికోసమే ఇంత నాటకం ఆడారంటే అతడికి ఆశ్చర్యంగా వుంది. తను వెళ్ళి పోయాడని తెలియగానే అందరూ ఖాళీ చేస్తున్నారంటే కేవలం తనకోసమే ఈ ఆస్పత్రి నాటకం...