అతడు ముందు వరండాలోకి వచ్చాడు.
మొట్టమొదటిసారి అతడికి పక్కగదులు చూసే అవకాశం కలిగింది. కేవలం గుమ్మం దగ్గర స్క్రీన్ లు వున్నాయంతే! లోపల మంచాలూ కుర్చీలూ ఏమీ లేవు. గదులన్నీ ఖాళీగానే వున్నాయి.
ప్రనూష తననెంత మోసం చేయనీ, ఎన్ని బాధలు పెట్టనీ ఆ క్షణం మాత్రం ఆమె తెలివితేటల్ని మెచ్చుకోకుండా వుండలేక పోయాడు. కేవలం పదిమంది మనుష్యులతో, నాలుగు స్టెతస్కోప్ లతో, గుమ్మం కర్టెన్లతో, ఒక పెద్ద ఆస్పత్రి వాతావరణం సృష్టించింది. తనకి నిజంగానే మతిభ్రమించిందేమో అన్నంత అనుమానం కలిగించింది. హేట్సాఫ్ టు హర్.
కానీ ఇదంతా ఎందుకు?
అతడికి వాళ్ళమీద వైరభావంకన్నా, ఇదంతా ఎందుకు చేశారో అన్న అనుమానమే ఎక్కువ వుంది.
మనిషి పనిచేసే ప్రొఫెషన్ యొక్క ప్రభావం అతని మనస్తత్వం మీద ఎక్కువ వుంటుంది. చైతన్య చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఎన్నో కథలు అతని చుట్టూ అల్లబడ్డాయి. హీరోలు పోలీసుల్ని ఆశ్రయించరు. వీలైనంతవరకు ఒంటరిగానే పోరాడతారు. విలన్ని చావబాదాక హీరోయిన్ తమ్ముడో, కమేడియనో పోలీసుల్ని పిలుచుకు రావటం జరుగుతూ వుంటుంది. ఈ రకమైన మనస్తత్వమే బహుశ అతడిని అంతర్లీనంగా ఆ పనికి ప్రేరేపించి వుంటుంది.
ఆ గదిలో వుండి అవతలివాళ్ళకి తను పారిపోయానన్న భ్రమ కలిగించటం నిజంగా అతడి తెలివితేటలకి ఉదాహరణ.
అందరూ క్రిందికి వెళ్ళారని నిశ్చయించుకున్నాక అతడు బయటకి వచ్చాడు. జనం వ్యానులో ఎక్కి వెళ్ళిపోతున్నారు. బయట మరో రెండు కార్లున్నాయి.
చైతన్య చెట్ల చాటునుంచి ఒక కారు వెనక్కి చేరుకున్నాడు. అదెవరిదో తెలీదు. వెనుక సీటు క్రింద కూర్చుని- ఎవరైనా తలుపు తెరుస్తే అటాక్ చెయ్యటానికి సిద్ధంగా వున్నాడు. మరో అయిదు నిముషాల తరువాత కారు కదిలింది. ముందు సీట్లో ఎవరో డ్రైవ్ చేస్తున్నారు.
చైతన్య లేచే ప్రయత్నమేమీ చేయలేదు. అతను బయట పడాలనుకుంటే ఆ క్షణమే డ్రైవరు మీద అటాక్ చేసి బయటకు రావొచ్చు కానీ అతడి ఉద్దేశ్యం అదికాదు.
కారు ఆగిన కొద్ది నిమిషాలకి అతను తలెత్తి చూశాడు. ఒక పాడుబడిన బిల్డింగ్ ముందు వుంది అది. అతను తలుపు తెరుచుకుని బయటకి వచ్చాడు. నిర్మానుష్యంగా వుంది. అతడు బిల్డింగ్ వైపు వెళ్లి కిటికీలోంచి చూశాడు.
డాక్టర్ పాల్ జోసెఫ్ ఎవరితోనో వైర్ లెస్ లో మాట్లాడుతున్నాడు.
"అవును. ఆపరేషన్ ఫెయిల్ అయింది. అతను తప్పించుకున్నాడు. ప్రనూష వెళ్ళిపోయింది" అంటున్నాడు.
చైతన్య నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. బయట కనబడినంత పాడుబడినదిగా లేదు ఆ బిల్డింగ్ లోపల. అతడి దృష్టి కుడివైపు గదిమీద పడింది.
కిటికీలోంచి కుర్రవాడు కనపడుతున్నాడు. బహుశ లక్ష్మి తమ్ముడయి వుంటాడు. గుమ్మం బయట తాళం వేసి వుంది.
చైతన్యకి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో పదిమందికి తక్కువ కాకుండా కాపలాదారులు, అనుచరులు వుంటారు. కానీ ఇక్కడ అలాటి ఆర్భాటాలూ ఏవీ కనబడటం లేదు. జోసెఫ్ వైర్ లెస్ ఆఫ్ చేసి, మెడదగ్గర వూపిరి వెచ్చగా తగలడంతో వెనుదిరిగాడు.
అంత దగ్గరగా, అంత అకస్మాత్తుగా, అనూహ్యమైన రీతిలో చైతన్యని చూసి అదిరిపడ్డాడు జోసెఫ్ పాల్.
"చెప్పండి సూపర్నెండెంట్ గారూ! ఏమిటిదంతా?" తాపీగా అడిగాడు చైతన్య. జోసెఫ్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.
"చెప్పండి. ఇంత నాటకం ఎందుకాడారు? నా మీద మానసికంగా ఇంత వత్తిడి తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నించారు?"
సమాధానం చెప్పకుండా జోసెఫ్ గాలిలా కదిలాడు. ఊహించని వేగంతో చైతన్య మీదకు వచ్చాడు. ఇంకెవరైనా అయితే ఆ అనూహ్యమైన వేగానికి క్రిందపడి పోవాల్సిందే. అయితే చైతన్యకి డూప్ లేకుండా ఫైట్స్ లో తప్పించుకోవడం అలవాటే, సెకండ్ కి ఇరవై నాలుగు ఫ్రేములు తిరిగే కెమెరాకి అందకుండా మొహం తిప్పుకోగలగాలి. అలాగే, ట్రిక్స్ ఏమీ లేకుండా సమ్మర్ సాల్ట్ చెయ్యగలిగి వుండాలి. లేకపోతే ప్రేక్షకులు గ్రహించే స్థితిలో వున్నారు. రోజుకి రెండు గంటలు ఇవి ప్రాక్టీసు చేస్తాడు చైతన్య. జోసెఫ్ నుంచి తప్పించుకోగలగటం అతడికి పెద్ద సమస్య కాలేదు.
అయితే జోసెఫ్ పాల్ అంత తొందరగా ఓడిపోలేదు. చైతన్య మెడమీద కిక్ ఇచ్చాడు. అంత టెన్షన్ లోనూ చైతన్యకి ఆశ్చర్యం వేసింది. "ఇతడు వృత్తిరీత్యా డాక్టర్ కాదు నిశ్చయంగా" అనుకున్నాడు. రెండు నిమిషాలపాటు ఇద్దరిమధ్యా ద్వంద్వ యుద్ధం సాగింది. చివరికి చైతన్య అతడికి లొంగదీసుకున్నాడు. చేతులు వెనక్కి విరిచి పట్టుకుని "ఇప్పుడు చెప్పు" అన్నాడు.
"అతడిని విడిచిపెట్టు చైతన్యా! లేకపోతే ఈ కుర్రాడి ప్రాణాలు దక్కవు" అని దూరంనుంచి వినిపించింది.
లక్ష్మి తమ్ముడి మెడచుట్టూ చేతులువేసి ఒక రౌడీ నిలబడి వున్నాడు. ఆ కుర్రవాడు గింజుకుంటూ ఏడుస్తున్నాడు. జోసెఫ్ తో జరిగే ఘర్షణలో ఆ రౌడీ ఎప్పుడు తలుపుతీసి కుర్రవాడిని బయటకు తీసుకువచ్చాడో చైతన్య చూసుకోలేదు.
వాళ్ళమధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కదిలాయి.
"వదుల్తావా? ఈ కుర్రవాడిని చంపెయ్యమంటావా?"
చైతన్య జోసెఫ్ డొక్కలో గుచ్చాడు. "నువ్వా కుర్రాడిని చంపేస్తే ఇక్కడ నీ బాస్ వీపులో ఆరు గుళ్ళు దూసుకుపోతాయి. కుర్రవాడిని వదులు."
అటు జోసెఫ్, ఇటు అనుచరులు నిర్విణ్ణులయ్యారు.
"రెండు క్షణాలు టైమ్ ఇస్తున్నాను మా బాస్ ని వదిలెయ్యి."
"నువ్వు కాదు, రెండు క్షణాలు టైమ్ నేనిస్తున్నాను" చైతన్య అన్నాడు. "చూడూ... ఆ కుర్రాడు ఎవరో నాకు తెలీదు. నాకేమీ కాడు కూడా. అతనికోసం నీ బాస్ ని వదలటం అసంభవం. చెప్పు... వదుల్తావా? ట్రిగ్గర్ నొక్కమంటావా?"
జోసెఫ్ కల్పించుకుని "వదిలెయ్" అన్నాడు కంగారుగా.
అనుచరుడు వదిలెయ్యగానే కుర్రవాడు కారు దగ్గరికి పరిగెత్తాడు. అతడు చైతన్య దగ్గిరకు వచ్చివుంటే బావుండేది. అతడిని సురక్షిత స్థానంలో వుంచి చైతన్య వాళ్ళని అటాక్ చేసి వుండే వాడు. ఇప్పుడిక ఏం చేసినా, జోసెఫ్ డొక్కలో గుచ్చింది దువ్వెన అని తెలిసిపోతుంది.
చైతన్య కూడా జోసెఫ్ ని షీల్డ్ గా చేసుకుని కారు దగ్గిరకు వెళ్ళాడు.
6
అంత గొప్ప ఆహ్వానాన్ని అతడు జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు, అనుభవించలేదు.
అతడు డైరెక్టుగా స్టూడియోకి వెళ్ళాడు. శ్మశాన నిశ్శబ్దంతో పడివున్న స్టూడియో అతడి రాకతో చైతన్య వంతం అయింది. ఆనకట్ట తెగిన నదీప్రవాహం అయింది. కన్నీళ్ళూ, కౌగిలింతలూ... అతడు విచలితుడయ్యాడు. అందరూ ప్రొఫెషనల్సే. కానీ వారి మనసుల్లో తను ఇంతటి స్థానం సంపాదించుకున్నాడని తెలీదు. తప్పిపోయాడనుకున్న కుటుంబసభ్యుడు తిరిగి వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఫీలవటం....
ఆ ఆర్ధ్రతకి అతడి మనసు ద్రవించింది.
తల్లి అతడిని చూసి పక్కమీదనుంచి లేచి వచ్చింది. అతడిని చేతులమధ్య తీసుకుని, అతడి చేతులమధ్య స్పృహ తప్పిపోయింది. అతడి చిన్నతనంనుంచీ వాళ్ళిద్దరే ఒకరికొకరిగా బ్రతికారు. తండ్రి లేడు. ఆమెకి అతడంటే ప్రాణం. అతడు తప్పిపోయాడని, జాడ తెలియడంలేదనీ తెలిసిన క్షణంనుంచీ ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు.
రెండు రోజులపాటు హడావుడి. పోలీసులు దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించి వెళ్ళారు. అతడు చాలా విషయాలు చెప్పలేదు. అవసరమయినంతవరకే చెప్పాడు. పోలీసులు లక్ష్మిని కూడా ప్రశ్నించారు. కానీ ఏ వివరాలూ తెలియలేదు.
పేపర్లలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. గత కొన్ని రోజుల్నుంచి సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన సుఖాంతమైనందుకు ఎడిటోరియల్స్ కూడా వ్రాయబడ్డాయి. తను లేని రోజుల్లో పత్రికల్లో పడిన రకరకాల వార్తలు చదివాడు. చాలా రకాలుగా సర్క్యులేషన్ పెంచుకోవటానికి దాదాపు అన్ని పత్రికలూ ట్రై చేశాయి. అతడి దృష్టి ఒక పత్రికలో ఫోటోమీద పడింది. తన తల్లి ఫోటో అది. తను లేనప్పుడు ఆవిడ నిస్త్రాణగా ఎలా పడివున్నదీ వేశారు. అతడి కళ్ళల్లో తడి కదలాడింది. తనని బంధించినప్పుడూ, హింసించినప్పుడు కోపం రాలేదు. ఇప్పుడొస్తూంది. అతడు వివరాలన్నీ పోలీసులకు చెప్పనిది అందుకే. ఈ విషయం తనే స్వయంగా తేల్చుకోవాలి. ముఖ్యంగా, సెక్రట్రియేట్ లో సుబ్బారావు అనేవాడు ఎవరూ లేడని తెలిసిన తర్వాత అతడిది ప్రాక్టికల్ జోక్ అనేది అర్ధమైంది. ప్రనూష మీద అతడికి కోపం రావటంలేదు. ఒక కోటీశ్వరురాలు తనమీద అంత పెద్ద నాటకం ఎందుకు ఆడించిందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ అవుతూంది. వాళ్ళు తననుంచి ఎక్కువ ఆశించలేదు అన్పిస్తోంది. తను తప్పించుకుపోయాడని తెలిశాక వాళ్ళు ఆ హాస్పిటల్ ని ఖాళీచేసి అక్కడ్నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలా అని ఆలోచించారే తప్ప తనని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఆస్పత్రి బిల్డింగ్ నెలరోజులపాటే అద్దెకి తీసుకున్నారంతే-
ఒకటి మాత్రం నిజం!
నెలరోజుల తర్వాత తనని ఎక్కడికో తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్నారు వాళ్ళు.
లేదా తాను చైతన్య అనే విషయం పూర్తిగా మర్చిపోయేలా చేసి, పిచ్చివాడిగా మార్చి పంపించి వుండేవారు. తన రంగంలోవున్న ప్రత్యర్ధులు చేసిన పనా ఇది? అదృష్టవశాత్తు సినిమారంగంలో అంత దారుణాలు చెలరేగటంలేదు.
అయినా ప్రనూషని చూస్తూంటే అంత దారుణమైన ఆలోచన వున్న అమ్మాయిలా అనిపించలేదు. లక్ష్మి తమ్ముడిని కిడ్నాప్ చేసి వుంచిన చోట కూడా వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేదు. కొన్ని విషయాల్లో ఎంత పకడ్బందీగా ప్రవర్తించారో, మరికొన్ని విషయాల్లో అంతే తేలిగ్గా వున్నారు.
...రోజులు గడుస్తున్నాయి. క్రమక్రమంగా ఈ విషయం అందరూ మర్చిపోతున్నారు. అతడు మర్చిపోలేదు. తనకి జరిగిన విషయాలని అంత తొందరగా మర్చిపోయే స్వభావంకాదు అతడిది.
ఒకరోజు లక్ష్మి వచ్చింది. ఆ రోజు ఎవరో ఆమెకి పోస్ట్ లో డ్రాఫ్ట్ పంపారు పాతికవేలకి! చిన్న థాంక్స్ కార్డుకూడా వుంది. లక్ష్మి తనకది చూపించగానే, 'ఇదేదో విదేశీ వ్యవహారం కాదు ముందు వూహించినట్టు ప్రాక్టికల్ జోకే! తన ఫాన్ ఎవరో లక్షలు ఖర్చుపెట్టి వేసిన ప్రాక్టికల్ జోక్!' అనుకున్నాడు.
"పాతికవేలు వచ్చాయిగా, బీ. హాపీ" అన్నాడు నవ్వుతూ.
ఆమె నొచ్చుకుంటూ "నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను" అంది- దానికి ఈ పాతికవేలు బహుమతి కాదు అన్న నిష్ఠూరంతో.
అంతలో అతడి తల్లి వచ్చింది. లక్ష్మిని ఆమెకు పరిచయం చేశాడు "అమ్మా ఈ అమ్మాయే లక్ష్మి, నన్ను అయోమయంలో పడేసిన వాళ్ళల్లో మొదటిది."
లక్ష్మి విషణ్ణవదనంతో "నా తమ్ముడు" అంటూ ఏదో అనబోయింది. అతడు బిగ్గరగా నవ్వి "నేను చెపుతున్నది నీ నటన గురించి" అంటూ తల్లివైపు తిరిగి, "ఎలా వుందమ్మా- వచ్చే సినిమాలో నా హీరోయిన్?" అని అడిగాడు.
లక్ష్మికి ముందు అర్ధంకాలేదు. అర్ధమవగానే, మల్లెపూల పరిమళం చుట్టుముట్టినట్టయింది.
"నిజమా?" అంది తను వింటున్నది అబద్ధమేమో అన్న అనుమానంతో.
"నిజమే. ఈ రోజే ప్రొడ్యూసర్ తో మాట్లాడాను. జూన్ లో సినిమా ప్రారంభమవుతుంది. బహుశా నీ దగ్గరికి రేపొస్తారు వాళ్ళు" అన్నాడు.