చైతన్య కదూ, న్యూస్ పేపర్లో చూశాడు సరే... కానీ పోస్టర్ లో.
ఎలా వుంటాడు అతడు? తనని ఇంత ప్రభావితం చేసిన ఆ నటుడు ఎంత అద్భుతమైన అందంతో, అపరాజితమైన మొగతనంలో విలసిల్లుతూ వుండి వుంటాడు? ఒకప్పుడు తను అతడి ఫాన్. మతిపోతే, గతం మర్చిపోయి, అతడినే తనుగా వూహించుకునేటంత వీరాభిమానిగా తనని చేసిన ఆ హీరో ఎలా వుంటాడు? న్యూస్ పేపర్ లో చూపించిన ఫోటో సంతృప్తికరంగా లేదు. ఎలా ఆ వాల్ పోస్టర్ చూడటం?
అతడు కిటికీలోంచి ముందుకు వంగి చూడటానికి ప్రయత్నం చేశాడు. కొమ్మలు మరింత అడ్డు వచ్చాయి.
అతడిలో పట్టుదల ఎక్కువైంది.
గదిలో చుట్టూ చూశాడు.
అతడి దృష్టి గాజుగ్లాసు మీద పడింది.
వెళ్ళి గది తలుపు వేసి వచ్చాడు. గ్లాసు అడుగు బ్రద్ధలు కొట్టి దాని క్రింద భాగాన్ని 'లెన్స్' గా తయారు చేశాడు. న్యూస్ పేపర్ గుండ్రంగా మడిచి, దాన్నొక రూళ్ళకర్రగా చేసి, మరోగాజు ముక్క రెండోవైపు అమర్చాడు. ఒక చిన్నసైజు అశాస్త్రీయమైన టెలిస్కోప్ తయారయింది. అయిదు నిమిషాల అడ్జెస్ట్ మెంట్ తరువాత దూరపు దృశ్యాలని స్పష్టంగా కనిపింపచేసే ఫోకస్ వచ్చింది. దాంతో వాల్ పోస్టర్ ని చూశాడు.
చెట్ల అవతల్నించి దృశ్యం మరింత స్పష్టంగా కనిపించింది.
అతడి నుదుట చెమట పట్టింది.
"అతడే ఆమె సైన్యం" అన్న అక్షరాల మీద నిలువెత్తు ఫోజుతో నిలబడ్డ చైతన్య.
- తనే.
4
అతడు చాలాసేపు ఆ కిటికీ దగ్గర అలాగే నిలబడి వుండిపోయాడు.
వీళ్ళంతా ఎవరు?
తనని ఎందుకిలా మోసం చేశారు?
తన భార్యగా నటించిన స్త్రీ ఎవరు? ఆస్పత్రి సూపర్నెండెంట్ తో సహా ఎందుకింత నాటకం ఆడుతున్నారు?
అతడికి మళ్ళీ ఇంకో అనుమానం కలిగింది.
ఇది కూడా భ్రమేనేమో. డాక్టర్ చెప్పినట్టు పారనాయిడ్ మనస్తత్వంలో ఇదీ ఒక భాగమేమో.
అతడు ఆ రకమయిన ఆలోచనల్లో వుండగా తలుపు చప్పుడైంది. సూపర్నెండెంట్ లోపలికి వచ్చాడు. "కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సుబ్బారావ్! మీరు మీ గతం గుర్తించడం మొదలుపెట్టారట కదా-"
"అవును. ఆ నర్సు- ఆ అమ్మాయి పేరేమిటి?"
"ప్రనూష"
"ఆ ప్రనూష సంఘటనతో నాకు నిజంగా పిచ్చెక్కిందని అర్ధమయింది."
"దాన్ని పిచ్చి అనకండి. గతం మర్చిపోయారంతే! పిచ్చి అంటే ఇన్ సేనిటీ. మీది లాస్ ఆఫ్ రిమెంబర్స్."
"మీ డాక్టర్లు ప్రతిదానికి ఒక కొత్త పేరు పెడతారు. లేకపోతే వైద్యశాస్త్రమే వుండదు కదా."
అదో పెద్ద జోకయినట్టు డాక్టరు నవ్వేడు.
"నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చా?"
"నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు సుబ్బారావ్. కనీసం ఇంకో వారం రోజులు ట్రీట్ చేసి వదిలేస్తాం."
"నాకీ రూమ్ లో బోర్ కొడుతోంది. కనీసం వరండాల్లో అయినా తిరగొచ్చా?"
"హాయిగా తిరగొచ్చు. కానీ రకరకాల పిచ్చివాళ్ళుంటారు. వీలైనంత వరకూ తిరగకపోవటమే మంచిది."
"కనీసం ఒక అరగంట అయినా మీతో తిరగనివ్వండి డాక్టర్. లేకపోతే నిజంగానే ఈ గదిలో పిచ్చేక్కేట్టే వుంది నాకు."
మళ్లీ బిగ్గరగా నవ్వి "ఓకే నాతో రండి" అని కదిలాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. విశాలమైన కారిడార్. అంతకుముందు చూసిందే మెట్లు దిగి క్రిందికి వచ్చారు. చెట్లు అలాగే వున్నాయి. అదే గేటు- అదే దారి- అతడు చాలా క్యాజువల్ గా నడుస్తున్నట్టు వున్నాడేగానీ, చూపులు మాత్రం నిశితంగా పరిశీలిస్తున్నాయి.
చివరికి కావల్సింది దొరికింది.
గోడమీద -
ఎర్రగా-
మరక!
ప్రనూష (తన పేరు అక్షౌహిణి అని అబద్ధం చెప్పిన అమ్మాయి) గోడ ఎక్కుతూ పడిపోయింది అక్కడే!
అది రక్తం మారక కాదు. అయితే ఈ పాటికి ఎండి జిగురు వర్ణంలోకి మారిపోయి వుండేది. రంగు కలిపి నాటకం ఆడారు. ప్రనూష, గార్డులు, డాక్టర్లు అందరూ కలిసి నాటకం ఆడారన్నది నిర్వివాదాంశం.
అతడు మొహంలోకి ఏ భావాలూ బయటకు కనపడనివ్వలేదు. డాక్టర్ తో కలసి వెనక్కి తిరిగి వచ్చాడు. రూమ్ లోకి వెళ్ళబోతూంటే డాక్టర్ ని ఆపి "ఇంకో వారంరోజులు నేనిక్కడే వుండాలంటే..." అని ఆగి కాస్త తటపటాయించి, "నా భార్యని నాతో వుంచుకోవచ్చా?" అన్నాడు.
ఈసారి డాక్టరు నవ్వలేదు. కాస్త సంశయించాడు.
అతడు నొక్కి చెపుతున్నట్టు "నా భార్యతో నేనుండటానికి మీకేమిటి అభ్యంతరం డాక్టర్? అదీగాక ఈ వారంరోజులూ నా గతం గురించి తెలుసుకునే అవకాశం కూడా వుంటుంది కదా" అన్నాడు.
"సరే అయితే" అన్నాడు సూపర్నెండెంట్. అతడి మొహం కాస్త అప్రసన్నంగా వుంది.
* * * *
రాత్రి ఎనిమిదింటికి వచ్చింది ఆమె. అతడు నవ్వి "ఇంకా వారంరోజులు వుండాలట, ఇక్కడ నాకేమో ఒంటరిగా బోర్ కొడుతోంది. అదీగాక నీ నుంచి నా గతం గురించి తెలుసుకుంటే మరింత తొందరగా బాగుపడతానని డాక్టర్లు చెప్పారు. అందుకే రాత్రికి నిన్ను పంపమని చెప్పాను. నీకేమీ అభ్యంతరం లేదు కదా" అన్నాడు.
"అయ్యో నాకేమిటండీ అభ్యంతరం? భర్త దగ్గరికి రావటానికి భార్య కెందుకు అభ్యంతరం?"
అతడు ఆమెవైపు సూటిగా చూశాడు. ఆమె కళ్ళల్లో అదోలాటి అమాయకత్వం, దీనత్వం ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఆ దీనత్వం దిగులువల్ల వచ్చింది కాదు. కారణం తెలీదు. ప్రనూషది ప్రళయకాల ఝంఝామారుతంలాంటి అందమయితే లక్ష్మిది సెలయేటి పాయలాటి అందం.
ఇద్దరూ కలిసి భోజనం చేశారు.
బాగా చీకటి పడింది.
"మన పెళ్ళి ఎప్పుడైంది?"
"ఎనిమిది సంవత్సరాల క్రితం."
"నా తల్లిదండ్రులు?"
"ఇటీవల నాన్నగారు పోయారు. అమ్మగారు మీ చిన్నప్పుడే పోయారు."
"నాకు అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు?"
"ఎవరూ లేరు"
"ఒక్కడే కొడుకునా? ఇంకా ఎవరో వున్నట్టు గుర్తే."
ఆమె తడబడి- "ఒక చెల్లెలు వుండేది- పోయింది."
"ఎంతకాలమైంది?"
"ఆరేళ్ళు -వినాయకచవితి రోజు."
"అప్పటికే తనకి పెళ్ళయిందా?"
"లేదండీ! అప్పటికి తన వయసెంతనీ? పధ్నాలుగు"
ఇటుకలు కట్టినట్టు ఆమె ఆడుతున్న అబద్ధాలు వింటూంటే అతడి కోపం కట్టలు తెగుతోంది.
"అమ్మ పోవటం నాకు గుర్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రోజే తెలిసింది ఆ మరణవార్త. నువ్వేమో చిన్నప్పుడే పోయిందంటున్నావు."
"లేదండీ! చిన్నప్పుడే పోయారు. మీకు ఆరేళ్ళ వయస్సులో....."
అతడు పక్కమీద వాలుతూ "ఈ రోజుకి ఈ 'గతచింతన' చాల్లే, పడుకుందాం రా" అన్నాడు.
"నేను క్రింద పడుకుంటాను" ఆమె బెదురుగా అంది.
"అదేం?"
"మొన్నటి యాక్సిడెంట్ లో మీ వెన్నెముకకి దెబ్బ తగిలింది. కొంతకాలం దూరంగా వుండమన్నారు డాక్టర్లు"
"సుమంగళి సిన్మాలోలా రాత్రిళ్ళు చన్నీళ్ళు స్నానాలు చేస్తూ వుండాలన్నమాట నువ్వు. పాపం చాలా కష్టం వచ్చిందే. అయినా ఈ దెబ్బలేంటో? అన్నీ నా ముఖ్యమైన భాగాలమీదే తగిలినట్టున్నాయి. మెదడు, వెన్నెముక, వగైరా. అన్నట్టు నా ఇంకే అంగాలు ఈ ఆక్సిడెంట్ లో పాడయ్యాయో చెప్పగలవా?"
ఆమె మాట్లాడలేదు.
"గుడ్ నైట్! పడుకో".
ఆమె క్రింద పక్క వేసుకుని పడుకుంది.
రాత్రి ఒంటిగంట అవుతూ వుండగా పక్కన ఎవరో కదుల్తున్నట్లు అనిపించి ఆమెకి మెలకువ వచ్చింది.
"నేనే" అన్నాడు.
"ఏమిటిది వదులు- వదలండీ."
"ఇప్పుడే బాత్ రూమ్ కెళ్ళి ఒళ్ళంతా పరీక్షించుకున్నాను. అన్నీ బాగానే వున్నాయి. నువ్విక సుమంగళిలోలా బ్రతకనవసరం లేదు." ఆమె అతడి చేతుల మధ్య గింజుకుంటూంది.
అతడామె కుచ్చిళ్ళమీద చెయ్యి వేశాడు.
ఆమె అరవబోయింది.
అతడి పెదవులు ఆమె నోటిని నొక్కిపట్టాయి.
ఆసత్రి నిద్రపోతోంది.
అతడామె కుచ్చిళ్ళు లాగేశాడు. ఆమె రోదిస్తూంది, అతడు పట్టించుకోలేదు. అతడి చేతులు ఆమె పొత్తికడుపుని నిమిరాయి.
అంతే!
క్షణాల్లో అతడు మామూలు మనిషి అయ్యాడు. మొహం దూరంగా జరిగింది. లేచి వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. అతడిలో వచ్చిన ఆకస్మికమైన మార్పుని చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
అతడు తాపీగా "ఇప్పుడు చెప్పు" అన్నాడు.
ఆమె నిరత్తురాలై చూసింది.
"నీకు పిల్లల్లేరని నీ కడుపు చూస్తేనే తెలిసింది. కథలు కూడా సరిగ్గా అల్లలేవని నీ మాటలద్వారా అర్ధమైంది. నీ లెక్క ప్రకారం నా తల్లి చచ్చిపోయిన ఆరేడేళ్ళకు నా చెల్లి పుట్టింది అవునా?" ఆమె బిత్తరపోయింది. అతడు నవ్వేడు.
"నేను చైతన్యని అని నాకు ఋజువుల్తోసహా తెలిసింది. నన్నెందుకు సాలెగూడులోకి ఇరికించారు? ఈ నాటకంలో నా పాత్ర ఎంతవరకు-"
ఆమె జవాబు చెప్పలేదు.
"చూడూ- నువ్వు కాస్తో కూస్తో చదువుకున్నదానిలా కనపడుతున్నావు. నేను స్పృశించగానే నువ్వు తడబాటు పడిన విధానం చూస్తుంటే నీకింతవరకు పురుష స్పర్శలేదని అర్ధమైంది. మొత్తం కథంతా చెపుతావో ఈ రాత్రి శీలం పోగొట్టుకుంటావో నీ ఇష్టం. ఈ గదిలో నిన్ను నేనేం చేసినా ఎవరూ పట్టించుకోవాలి. అవకాశం దొరికినా నేను నిన్నేమీ చేయటం లేదు. ఆ కృతజ్ఞత నీకుంటే, నీ పవిత్రత మీద నీకు విలువుంటే- నిజం చెప్పు. అసలీ సుబ్బారావెవరు? నా భార్యగా నువ్వెందుకు నటిస్తున్నావు?"