Previous Page Next Page 
అష్టావక్ర పేజి 9


    "అయితే మనం తొందరపడాలి".

    "మళ్ళీ మనం బస్తా వెళ్ళాలి రాకేష్! మంత్రగాళ్ళు తమ రహస్యాల్ని తమతోపాటే నిక్షిప్తం చేయటం కోసం మరణానికి కొన్నాళ్ళ ముందు తాము నిద్రించే ప్రదేశంలో తల ఆన్చేచోట పాతి పెడతారు. విషాచి నివసించిన చోటు ఇప్పుడెలా వున్నదో మనకి తెలీదు. బిస్తాకూడా పూర్వపు బిస్తాలా లేదిప్పుడు. వీధి పంపుల నుంచీ లాంతర్ల వరకూ నాగరికత పాకింది. అక్కడ దేవతోపాసకులు మాత్రం ఊరినుంచి విడివడి, శ్మశానానికి ఇవతలి దిక్కుగా వచ్చి, రహస్యంగా ఉపాసనలు చేస్తున్నారు. వారిని కలుసుకుని, వారిద్వారా విషాచి ఎక్కడ నివసించేవాడో, ఆ ప్రదేశాన్ని పట్టుకోవాలి. ఈపాటికే నాగరికత పేరుతో ఎవరైనా అక్కడ పునాదులు తవ్వి ఆ రహస్యం శిథిలమైవుంటే మనం చేసేది ఏమీలేదు..."

    ....ఆ సాయంత్రమే వారు బిస్తా వెళ్ళారు.


                    *    *    *    *


    మహాదష్ట చెప్పినమాట నిజమే! బిస్తా మారిపోయింది. అయితే శ్మశాణానికి ఇవతలి పక్క మాత్రం ఆ గుడిసెలు అలాగే వున్నాయి.

    దాదాపు అరగంట వెతికాక ఒక వ్యక్తి వీళ్ళకి కొంత సమాచారం అందజేసాడు. అది పట్టుకుని బిస్తాకి అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న నారాయణ్ గడ్ చేరుకున్నారు. అక్కడ దొరికాడు వారికో వృద్ధుడు.

    రామ్ సాహూ!

    అరవై ఏళ్ళకు పైగా వుంటాయి అతడికి. పాన్ ఎక్కువ వేసుకోవడం వల్ల గారపట్టిన పళ్ళతో విశాలంగా నవ్వుతూ, "ఎందుకు మీకు విషాచి నివసించిన ప్రదేశం?" అన్నాడు.

    "కుట్టి సైతాన్ ని సమ్మేవాళ్ళం. కొన్ని పూజలు చేయాలి అక్కడ. విషాచి ఆత్మశాంతికోసం".

    అతడు మరింత బిగ్గరగా నవ్వి "మంత్రగాళ్ళ ఆత్మకి శాంతి వుండదు. అవి భ్రమిస్తూనే వుంటాయి" అన్నాడు. రాకేష్ ఏదో అనబోతూ వుండగా, మహాదష్ట కల్పించుకుని "ఏదో మా అవసరం మాది" అంటూ కొంత డబ్బు అతడి చేతిలో పెట్టాడు. డబ్బు చూడగానే ముసలాగి మొహంలో ఆనందం కనిపించింది.

    "నాకు తెలుసు మీరెందుకు వచ్చారో, మాంత్రికుడి, పక్క తవ్వి తంత్ర రహస్యాలు సంగ్రహించటానికి అవునా!" అని అడిగాడు.

    రాకేష్ అబ్బురపడ్డాడు. మహాదష్ట మాత్రం మాట్లాడలేదు.

    "ఇంకానా?"

    "దానికిది సరిపోదు. ఇంకా కావాలి".

    "బిస్తా మంత్రగాళ్ళ ఆచారం ప్రకారం ఎవరికీ ఇది చెప్పకూడదు. చెప్పిన వాళ్ళు రక్తం కక్కుకుని చస్తారు...."

    "కానీ ఇప్పుడెవరూ దీన్ని నమ్మటంలేదు. చివరికి మీ బిస్తా ప్రజలు కూడా....

    "అందుకే మరికాస్త డబ్బు ఇస్తే...." నసిగాడు.

    రాకేష్ ఏదో అనబోయి మహాదష్ట మొహం చూసి, మరికాస్త డబ్బుతీసి సాహూ చేతిలో పెట్టాడు.

    సాహూ మొహం వికసించింది. "ఈ రాత్రికే వెళదాం. నడిరాత్రి దాటిన తర్వాతే తవ్వాలి...."

    "మాకు తెలుసు" క్లుప్తంగా అన్నాడు.


                    *    *    *    *


    రాత్రి పదకొండు కావస్తూండగా వాళ్ళు ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు.

    మహాదష్ట కంకరరాళ్ళమీద కూర్చుని హోమం తయారుచేశాడు. రాకేష్ కాస్త దూరంగా నిలబడి అటువైపు ఎవరైనా వస్తున్నారా అని గమనించసాగాడు. పౌర్ణమి వెళ్ళిపోయి చాలాకాలం అవటంవల్ల అక్కడంతా చీకటిగా వుంది. మంట వెలుగులో వాళ్ళ మొహాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. గాలిలో మాటలు తేలి వస్తున్నాయి. రామ్ సాహూ ఏదో లొడలొడా వాగుతున్నాడు. మహాదష్ట మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు.

    తంతు పూర్తయ్యేసరికి పన్నెండయింది. మంట ఆరగానే రాకేష్ కూడా వచ్చి వాళ్ళతో చేరాడు. తవ్వేటప్పుడు ఎవరైనా చూసినా అంత ప్రమాదం లేదు.

    గునపంతో మొదటిపోటు భూమిలోకి పొడిచాడు రాకేష్. అతని దెబ్బ పడగానే భూమి అంతా కంపించినట్టయింది. అసలతడి దెబ్బకి అంతగా భూమి కదలాల్సిన పనిలేదు. కానీ గాఢనిద్రలో వున్న గర్భిణీ స్త్రీ కడుపుమీద ఎవరో కొట్టినట్టు వణికింది భూమి. దూరంగా ఎక్కడనుంచో ఒక తోడేలు అరుపు వికృతంగా వినపడింది.... ఇటువేపే వస్తున్నట్టు. వెనుకే ఒక మంద దాన్ని అనుసరిస్తున్నట్టు... రాకేష్ వణికేడు. మందలు మందలుగా తోడేళ్ళు కదులుతాయని, అప్పుడే వాటంతటి ప్రమాదకరమైన జంతువు మరొకటి వుండదని... అంతలో అదంతా తన భ్రమ ఏమో అనిపించింది. ఏది ఏమైనా గునపం ఎత్తిన చెయ్యి అలానే వుండిపోయింది.

    అంతలో రెండో దెబ్బ మహాదష్ట వేశాడు.

    రామ్ సాహూ అంతా చూస్తున్నాడు. విషాచిలాటి మాంత్రికుడి స్థలం తవ్వటం ఘోరమైన నరబలిని కోరుతుందని నిశ్చయంగా అతనికి తెలుసు అందుకే దూరంగా వున్నాడు ఈ పనికి. వాళ్ళిద్దర్లో ఎవరు దీనికి బలి అవుతారా అని చూస్తున్నాడు.

    వాళ్ళు తవ్వుతూంటే కరెంటు స్థంభం వూగుతుంది. అసలా అనుభవమే చిత్రంగా వుంది. భూమిలో ఒక్కోపోటు పొడుస్తున్నకొద్దీ ప్రకృతి కదిలిపోవటం....

    దాదాపు రెండు గంటలు తవ్విన తరువాత బయటపడిందో పెట్టె!

    "పెట్టె మూత తెరువు రాకేష్!" ఆజ్ఞాపించాడు మహాదష్ట. రాకేష్ పెట్టె తెరవబోతూ వుంటే అకస్మాత్తుగా "ఆగు" అన్న కంఠం వినిపించింది. దానితోపాటే అతి దగ్గిరగా ఒక తోడేలు ఏడుస్తున్నశబ్దం... ఇద్దరూ చప్పున అటు చూశారు.

    రామ్ సాహూ దగ్గిరకొస్తూ, "ఇది బిస్తా గ్రామస్థుల ఆస్థి. దీన్ని మీరు తీసుకెళ్ళటానికి వీల్లేదు" అన్నాడు.

    రాకేష్ చెయ్యి గునపం మీద బిగుసుకుంది. మహాదష్ట మాత్రం అదే నిశ్చలమైన కంఠంతో, "దీనికోసం నీకు కావలసినంత డబ్బు ఇచ్చాం రామ్ సాహూ" అన్నాడు. "డబ్బుకోసం తమ వంశీకుడి రహస్యం బయటపెట్టినవాడు మంత్రోచ్చాటనకు అనర్హుడు. ఆస్థి గురించీ, వారసత్వం గురించీ మాట్లాడే హక్కు నీకు లేదు" అన్నాడు తాపీగా.

    రామ్ సాహూ గట్టిగా ఏదో అరిచాడు. దూరంగా ఏవో ఆకారాలు పొదల్లో అస్పష్టంగా తచ్చాడటం కనిపించింది. రాకేష్ వళ్ళు జలదరించింది. కొద్ది క్షణాల్లో దాదాపు పదిమంది యువకులు పొదల్లోంచి బయటకు వచ్చి వలయంగా నిలబడ్డారు. బిస్తా గ్రామస్తుల్లా వున్నారు వాళ్ళు.

    రామ్ సాహూ అడుగు ముందుకేసి వెకిలిగా నవ్వేడు. "ఇంతకాలం ఎవరొచ్చి ఈ పని చేస్తారా అని వేచి వున్నాం. ఇది తవ్విన పాపం రక్తం కక్కుకునే బలి కోరుతుందని తెలుసు మాకు! ఇది మాకు అప్పగించి ప్రాణాల్తో వెళ్ళు. బిస్తా గణాధిపతులమైన మాకే దీని వారసత్వం మీద హక్కు వుంది-" అన్నాడు బిగ్గరగా.

    చాలాకాలం తరువాత మహాదష్ట మొహంలో చిరునవ్వు వెలిసింది. బహుశా కాద్రా, విషాచిల వారసులమని చెప్పుకుంటున్న ఈ కుక్క గొడుగుల్ని చూసేమో! ఉన్నట్టుండి విపరీతంగా గాలి వీచసాగింది.

    మహాదష్ట మొహం కఠినంగా మారింది. కటువుగా "రామ్ సాహూ" అన్నాడు. "....మీ వాళ్ళని తీసుకుని వెనక్కి వెళ్ళు. ఆఖరిసారి చెపుతున్నాను".

    రామ్ సాహూ పెట్టె అందుకోబోయాడు.

    "పెట్టె అక్కడ వదులు".

    అతడు వినలేదు. వంగేడు.

    "రా...మ్...సా...హూ" మహాదష్ట గొంతుకి ఆ అడవి కంపించింది. "ఇంతవరకూ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను! విషాచి, కాద్రా, దార్కాల తరంలో ఆఖరివాడిని నేను!! నా నుంచే ఈ కార్యం జరగాలి!!! అష్టావక్రుడు ఉద్భవించే యోగం వున్నది. మూర్ఖుడా! దీనికి అడ్డురాకు..."

    అతడు వినలేదు. పెట్టె చేతిలోకి తీసుకుని వెనుదిరిగాడు. ఏం చెయ్యాలా అన్నట్టు రాకేష్ మహాదష్టవైపు చూసేడు. మహాదష్ట నిశ్చలంగా వున్నాడు. ఏమీ సూచన ఇవ్వలేదు. రాకేష్ గునపంతో అతడిని ఎదుర్కొన్నాడు. దూరంగా వున్న యువకులు తొందర తొందరగా దగ్గరకు రాసాగారు. తమ ప్రాణాలు ఎలాగూ పోతాయని రాకేష్ కి నిశ్చయమయిపోయింది.

    రాకేష్ కన్నా రామ్ సాహూ బలవంతుడు. దానికితోడు వెనుకనున్న జనం అతడికి మానసికంగా బాలమిచ్చారు. అతడు పెట్టెని గునపానికి అడ్డుగా పెట్టాడు. అసలే పాతపెట్టె శిథిలమయివుంది. దాంతో గునపం ఆ పెట్టెలోకి నిలువునా లోపలికి దూసుకుపోయింది. రామ్ సాహూ గట్టిగా లాగేసరికి గునపం రాకేష్ చేతిలోంచి బయటకు విడివడి, పెట్టెతో సహా అతడి చేతిలోకి వచ్చేసింది. రామ్ సాహూ నోటిమీద నవ్వు మరింత ఎక్కువైంది.పెట్టెతోసహా గునపాన్ని దూరంగా విసిరేసేడు.

    అది వెళ్ళి ఎలక్ట్రిక్ స్థంభం మొదట్లో పడింది. ఆ పడటం మామూలుగా పడలేదు. షడ్విధశక్తి సంపన్నమైన వత్తిడిని ఆ పెట్టెలో కూరి పెట్టినట్టు అమితమైన వేగంతో ఒక విస్పోటనంలా వెళ్ళి ఆ స్థంభాన్ని తాకింది. అప్పటివరకూ భూదేవి గర్భం నుంచి బయట పడటానికా అన్నట్టు గాలికి వూగుతున్న ఎలక్ట్రిక్ పోల్ తుఫానుకి తాటిచెట్టు కూలినట్టు ముందుకు కూలింది. రాకేష్ దిగ్భ్రాంతుడై తన కళ్ళని తానే నమ్మలేనట్టు చూస్తూ వుండిపోయాడు. అన్ని తీగెలు అన్ని వైపుల్నుంచి బంధించి వుంచినా కూడా వీటన్నిటికన్నా అమితమైన శక్తి ఏదో బలంగా తోసినట్టు, ఆ బంధాల్ని అన్నిటినీ తెంచుకుని ముందుకు కూలింది ఆ స్థంభం.

    క్షణం ఆలస్యంగా దాన్ని చూశాడు రామ్ సాహూ. భయంతో వాడు పెట్టబోయిన కేక గొంతులోనుంచి పూర్తిగా బయటకు రాలేదు. గొడ్డలి వచ్చి పడినట్టు అమితమైన వేగంతో, కనురెప్ప పాటులో వేగంగా వచ్చి అతడి మెడమీద ఆ స్థంభం పడింది! మెడనుంచి వెన్నెముక పూర్తిగా పచ్చడి అయిపోయింది. తల తెగి, విషాచి పెట్టె కోసం తవ్విన గోతిలో బంతిలా వెళ్ళిపడింది. ఫౌంటెన్ నుంచి జారినట్టు రక్తం జివ్వున జిమ్మి ఆ ప్రదేశాన్ని అభిషిక్తం చేస్తూ బలి తీర్చింది.

    దూరం నుంచి చూస్తూన్న వాళ్ళు కూడా క్షణం పాటూ నిర్వీర్యులయ్యారు ఈ దృశ్యం చూసి. కానీ అంతలోనే సర్దుకుని వేగంగా ముందుకు రాసాగారు.

    అంతలో వినపడింది ఆ అరుపు! దగ్గిర్నుంచి- గుండె పక్కనుంచి శరీరాల్ని జలదరింపజేసేలా... చెవి పక్కనుంచి గాలిలా దూసుకుపోయింది ఆ అరుపు.

    అడవి నుంచి దారి తప్పిన తోడేళ్ళు గుంపు కోపంతో, అసహనంతో అరుస్తూ వరద పొంగులా ముందుకు దూకి- మనుషుల్ని చూసి మరింత పెట్రేగి నాలుగుకాళ్ళమీద గాలిలోకి ఎగిరాయి.

    క్షణంలో అక్కడ నిశ్శబ్దం- అరుపులతోనూ, రోదనలతోనూ చెదిరిపోయింది. హాహాకారాలు మిన్నుముట్టాయి. గోళ్ళతో ఛాతీని చీల్చే తోడేలొకటి- కళ్ళలోకి కోరాలని గుచ్చే తోడేలొకటి....

    రాకేష్ భయభ్రాంతుడై అక్కడనుంచి పారిపోయే ఉద్దేశ్యంతో మహాదష్టవైపు చూసేడు. ఆ దృశ్యం అతడిని మరింత కంపించేటట్టు చేసింది. రక్తం పక్కన మహాదష్ట శిలాప్రతిమలా నిలబడి వున్నాడు. అతడి కనుగుడ్లు వెనక్కి తిరిగిపోయి, తెల్లటిసొన కనబడుతోంది. నాలుక నుదుటికి ఆని అక్కడ ఖేచరి విన్యాసం చేస్తోంది.

    రాకేష్ కి గుర్తొచ్చాయి.... ఆకాశం నుంచి వచ్చిన మెరుపు వెనుక వినవచ్చిన మాటలు....

    -రాజులకి రాజు, క్షుద్ర గణాధిపతి అయిన కాష్మోరా అంశతో పుట్టే వారసుడికి- మొసళ్ళు, తోడేళ్ళు, నక్కలు సాయం చేస్తాయి. వాటి అండతో అతడు రాజ్యమేలుతాడు.

    అప్పుడే వాటి ప్రభావం మొదలైందన్న మాట!

                                           *    *    *    *

 Previous Page Next Page