Previous Page Next Page 
అష్టావక్ర పేజి 10


    పెట్టెలోంచి ఒక్కొక్కటీ తీసి పక్కన పెడుతున్నాడు మహాదష్ట. అన్నీ శిథిలమయిపోయిన తాళపత్ర గ్రంథాలు! కాలగతిలో పొడిగా మారుతున్నవి. గునపం దెబ్బకి నుసి అయినవి కొన్ని.

    రాకేష్ గుండె వేగంగా కొట్టుకుంటూంది.

    చివరికి ఒక పత్రం తీసి, అదే అన్నట్లు చదవసాగాడు మహాదష్ట.

    పూర్తిగా చదివి, దాన్ని వళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.

    రాకేష్ టెన్షన్ మరింత ఎక్కువైంది. "ఏమైంది" అని అడిగాడు.

    "రాకేష్!" అతడి కంఠంఉద్విగ్నంగా పలికింది.... "అష్టావక్ర జననం సహజమనీ, కేవలం దానికోసం ఎదురు చూడటమే ఉస్సోక్ చేయవలసిన పని అనీ ఇంతకాలం అనుకుంటూ వచ్చాం! ఏ ముహూర్తాన నీ మనసులో 'కుట్టి' ఈ ఆలోచన కల్పించి మనల్ని బిస్తా వరకూ తోసిందో తెలీదుకానీ, మనం చెయ్యవలసిన పని చాలా వుంది. ఆ అమ్మాయి పేరేమిటి అన్నావ్?"

    "....కేదారగౌరి".

    "ఆఁ! ఆ కేదారగౌరి పట్ల చేయవలసిన పనులు కొన్ని వున్నాయి. నల్ల వుప్పి, కోలాకుపున్న, చేదుపొల్లి, నావిలవరగోకి మొదలైన దశ మూలముల స్పృశించిన ఉంగరాన్ని ఆమె వెలికి తొడగాలి. మిగతా విషయాలు తరువాత చెపుతాను...."

    అంటూ మహాదష్ట కళ్ళు మూసుకున్నాడు.


                                             *    *    *    *


    కేదారగౌరికి పెళ్ళి కళ వచ్చేసింది. పసుపురాసిన మొహానికి పసిడి వెన్నెల సిగ్గు పల్చటి జలతారు పై వస్త్రమైంది. రాకేష్ ని చూస్తూ "ఇంత హడావుడి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావ్ బావా?" అని అడిగింది.

    రాకేష్ నవ్వి "ఎక్కడికీ లేదు" అన్నాడు.

    ఆమె దగ్గరికి వచ్చి, "ఎక్కడికీ లేదంటా వేమిటి? జేబులో రైల్వేటిక్కెట్టు పెట్టుకుని....." అంది.

    రాకేష్ గతుక్కుమని, అంతలోనే సర్దుకుంటూ జేబులోంచి టిక్కెట్టు తీసి. వేస్ట్ బాస్కెట్ లోకి విసిరేస్తూ, "ఎవరో స్నేహితుడి పెళ్ళివుంటేనూ" అన్నాడు ఆ విషయాన్ని అక్కడితో త్రుంచేస్తూ.

    కానీ టిక్కెట్టు వెళ్ళి బాస్కెట్ లో పడకుండా పక్కన పడింది. గౌరి వంగి దాన్ని పక్కన పడేస్తూ, దానిమీద ఊరు పేరు చూసి "ఒరిస్సాలో వున్న అంత ఫ్రెండ్ ఎవరబ్బా" అంది. ఇద్దరూ ఒకటే కాలేజి కాబట్టి దాదాపు అందరూ ఒకరి కొకరు తెలుసు.

    అతడి మొహంలో బాధని కప్పిపుచ్చుతూన్న భావం కనపడింది. "గౌరీ....." అన్నాడు. "నిజం చెప్పనా!"

    అతడిలో వచ్చిన మార్పుకి ఆమె విస్తుబోయి, "చెప్పు" అంది.... "ఏమిటి?"

    "నువ్వేమీ అనకూడదు. బాధపడకూడదు".

    "అదేమిటి బావా- అసలు విషయం ఏమిటి?"

    "ముందు ప్రామిస్ చెయ్యి.... ప్రామిస్!"

    "ప్రామిస్".

    రాకేష్ భారంగా శ్వాస వదులుతూ చెప్పాడు- "నేను వుండలేక పోయాను గౌరీ ఇక్కడ. చెప్తే చాలా నవ్వుగా వుంటుంది. కానీ నువ్వు అర్ధం చేసుకోగలవు. నాకా నమ్మకం వుంది. ఈ రంగులేస్తున్న బంగళా, ఈ పెళ్ళి పందిరీ.... ఎంత మామూలుగా వుందామానుకున్నా వుండలేక పోయాను. దాంతో కొన్నాళ్ళపాటు ఎక్కడున్నా తిరిగి రావాలనిపించింది. పూరీ వెళ్ళాను... కోణార్క్ వెళ్ళాను.... గుడిలో భగవంతుణ్ణి చూసినా, గుడి బయట గోడల్ని చూసినా నువ్వే గుర్తు రాసాగావు. దూరం వెళ్ళి సాధించేదేమీ లేదని తిరిగి వచ్చేశాను...." అంటూ ఆగి అన్నాడు. "అయినా ఇదంతా నా స్వవిషయం. దీని గురించి మర్చిపో. దీన్ని నీకు చెప్పటం కూడా తప్పే...."

    ఆమె కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. తనవల్ల అతడి కెంత బాధ అనుకుంది.

    అసలు విషయం ఆమెకి తెలీదు.


                                             *    *    *    *


    కనురెప్పపాటులో జరిగిపోయింది.

    కృష్ణాపురం ఊరిని ఆనుకునే వున్న హరిజనవాడలో....

    రాత్రి రెండుగంటల ప్రాంతంలో- ఒక పూరిగుడిసెలో...

    గాఢ నిద్రలోంచి మేల్కొంది గంగి. దానికి ఇరవై రెండేళ్ళుంటాయి. పెళ్ళయి నాలుగేళ్ళయింది. మొన్న మొన్నటిదాకా కడుపు పండలేదు. మొగుడొదిలేస్తా నన్నాడు. అమ్మోరికి బలిచ్చింది. అదృష్టం బావుంది. ఇప్పుడు ఎనిమిదో నెల. అది లేవటం చూసి "ఏమైందే" అని అడిగాడు దాని మొగుడు.

    "ఏంలే. కడుపు కాస్త నొస్తూంది" అంటూ పక్కమీద నుంచి లేచి బయటికి వచ్చింది. తలుపు దగ్గిరగా వేసి పాక వెనుక కట్టివున్న తడికల దగ్గిరగా వెళ్ళింది. వర్షం అప్పుడే ఆగింది. చల్లటిగాలి రివ్వున వీస్తూంది. "పాడు వర్షం" అంటూ గొణుక్కుంది.

    మూడువైపులా తడికలున్నాయి. నాలుగో-వైపు అడవిలో పెరిగిన మొక్కలు.... గాలికి అవి భయం గొలిపేలా వూగుతున్నాయి. నేలంతా చిత్తడిగా వుంది. అడుగేస్తూవుంటే అదోలాటి శబ్దం వస్తూంది. అయినా అలవాటయిన ప్రదేశం అవటంవల్ల ఆమె మామూలుగానే లోపలికి వెళ్ళింది. అయిదు నిమిషాల తరువాత బయటికి వస్తూ ఏదో అనుమానం వచ్చి ఆగింది.

    అప్పటివరకూ గట్టిగా శబ్దం చేస్తున్న కీచురాయి కూడా చప్పుడు ఆపటంతో ఒక్కసారిగా గోలగా వున్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా నిశ్శబ్దమయి, ఏదో భయంతో గంగి వళ్ళు జలదరించింది.

    "ఎవరదీ" అంది అనుమానంగా ఆగి చీకట్లోకి చూస్తూ...... ఎట్నుంచీ శబ్దంలేదు.

    ఆమె సర్దుకుని మరో అడుగు వెయ్యబోతూవుంటే దూరంగా తుప్పకదిలి అందులోంచి ఒక ఆకారం బయటికి వచ్చింది. గంగి శిలాప్రతిమలా నిలబడిపోయింది.

    దాదాపు మూడు అడుగుల ఎత్తున్న జాగిలం అది.

    చీకట్లో దాని కళ్ళు మెరుస్తున్నాయి. నోటినుంచి నాలుక బయటకు వేలాడుతోంది. దానికి ఇటుపక్క అటుపక్క రెండు కోరపళ్ళు. అది కదల్లేదు. అయినా కూడా ఆ భంగిమ అతి భయానకంగా వుంది.

    మొగుణ్ణి పిలుద్దామా అనుకుంది. మళ్ళీ అంతలోనే ఎందుకనుకుంది. ఆ ప్రాంతంలో దాన్ని చూడటం కొత్తే. ఇంతకుముందెప్పుడూ చూడలేదు. అయినా తనింటి ఎనకాల తనకి భయమేమిటి? ఆమె పాకవైపు మరో అడుగువేసింది.

    సరీగ్గా అప్పుడు పడింది వెనుకనుంచి వేటు.

    శబ్దం లేకుండా, అరుపుల్లేకుండా బట్టలమూట పడినట్టూ గంగి శరీరం నేలమీదకు జారిపోయింది. ఆయుధం అదే విసురులో వెళ్ళి జాగిలంముందు పడింది. ఎవరైనా శిక్షణ ఇచ్చినట్టు అందుకుందో లేక ఏదైనా శక్తి ఆవహించిందో తెలీదుకానీ, అది ఆ ఆయుధాన్ని అందుకుని వెనక్కి పరుగుతీసింది.

    లోపల గంగి మొగుడు ఎప్పుడో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ప్రొద్దున్నకి గానీ తెలీదు గంగి మరణం విషయం.

    అప్పటివరకూ చినుకులు పడుతూనే వున్నాయి-

    ఆ మృత శరీరం తడుస్తూనే వుంది.

    అష్టావక్రుడి ముందు జన్మించవలసిన ఏడుగురు శిశువుల్లో రెండోవాడు, తల్లి గర్భంలోనే ఎందుకు చంపబడ్డాడో ఉస్సోక్ సభ్యులెవరికీ తెలియదు. చివరికి రెడ్ స్కెలిటన్స్ కి కూడా.

    కేవలం మహాదష్టకి తెలుసు!


                                                         8


    సిద్ధార్థ!

    అయిదడుగుల రెండంగుళాల ఎత్తు, మెరుపులేని మొహం, నిస్తేజమైన కళ్ళు..... ఇవన్నీ చూసి అతడిపట్ల ఎవరైనా తేలికైన అభిప్రాయం ఏర్పర్చుకుంటే అది పొరపాటే! తన అందహీనత వల్ల అతడు ఎవరితోనూ కలిసేవాడు కాదు కానీ వయసుతోపాటు అతడు ఒక మానసిక దృఢత్వాన్ని సంతరించుకోవటానికి కారణం 'రాముడు'.

    చిన్నప్పుడు అతడి తల్లి అతడికి రామకథని పాటలుగా వల్లించి చెప్పే తరుణంలో అతడు రాముడిపట్ల ఒక రకమైన అబ్ సెషన్ ని పెంచుకున్నాడు. పెరిగి పెద్దవుతున్నకొద్దీ తనకి మిగతా వారికన్నా ఏదో 'తక్కువ' వుందని అర్ధం చేసుకున్నాడు. చుట్టూ వున్నవాళ్ళు దాన్ని పెంచసాగారు. అక్కడనుంచి అతడిలో స్కిజాయిడ్ మనస్తత్వం పెరగసాగింది. ఇంట్రావర్ట్ అవసాగాడు. అదృష్టవశాత్తూ ఆ వయసులోనే అతడు గుడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు.

    గుడి అతడి 'మెలాంకలీ'ని పోగొట్టింది.

    పెద్ద పెద్ద సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులూ ఎన్నో ఇంగ్లీషుపదాలని ఏరి కూర్చి చేస్తున్న ట్రీట్ మెంటుని అతడి తల్లి- తెలిసో, తెలియకో, చిన్నప్పుడే గుడికి తీసుకువెళ్ళటం ద్వారా- చేసింది. అలా చేయకపోయివుంటే అతడి జీవితం ఏవిధంగా మారివుండేదో!

    ఒక్కసారి అతడు దేముణ్ని- ముఖ్యంగా రాముడిని తన 'ఐడియల్హీ'గా చేసుకున్నాక- స్కిజాయిడ్స్ కి సహజంగా వుండే రిజర్వ్ డ్ ప్రవర్తనని వదిలేసేడని కాదు. గాంభీర్యతని తోడు తెచ్చుకున్నాడు. తనలో తానే అంతర్గతంగా పెరగసాగాడు. దీనికి తోడ్పడింది అతడి భక్తిభావం. చిన్నప్పటినుంచీ అతడితోపాటు అది లతలా పెరగసాగింది.    

    ఈ స్ఫూర్తి అతడికి రెండు విధాలుగా సాయపడింది. ఒకటి - అపురూపమైన జ్ఞాపకశక్తి. రెండు - మెరుపుకన్నా వేగమైన చురుకుదనం. ఈ రెండూ అలవడినవి. క్లాసులో వెనుక బెంచీలో ఎవరితోనూ కలవకుండా కూర్చునే అతడు, అవసరమొస్తే ఎంత ఫాస్ట్ గానైనా రియాక్ట్ అవగలడని, కేదారగౌరి కాలిని జలగ పట్టుకున్నప్పుడు అతడు ప్రవర్తించిన విధానమే నిరూపించింది. ఇంకొకరెవరైనా అయితే ఎంత గొడవైనా చేసి వుండేవారు.

    ఈ చర్చే ఒకసారి కేదారగౌరితో వచ్చింది.

    కృష్ణాపురంలోనే- రావే ప్రోగ్రాం చివరిరోజుల్లో.

    కొండ పక్కనుంచి నడుస్తూ వుండగా "పైకి వెళదామా" అని అడిగాడు.

    "పైన ఏముంది?" అంది.

    "గుడి.... చాలా బావుంటుంది".

    ఆమె నవ్వి "బావుందంటే వస్తాను గానీ, ఆ విగ్రహానికి మాత్రం నమస్కారం పెట్టను" అంది.

    "తనమీద తాను నమ్మకం పెంచుకోవటానికి ఒకరికి 'దేముడు' అన్న భావం సాయపడితే అందులో తప్పేముంది?"

    చాలా క్లిష్టమైన చర్చ అది. ఆమెకి ఇష్టం లేకపోయింది. ఆమె సిద్దాంతాలు ఆమెవి! చాలా స్ట్రాంగ్ కన్విక్షన్స్ వున్న అమ్మాయి ఆమె. అతడూ అంతే.

    "ఈ ఒక్క విషయమూ మనం ఎప్పుడూ మాట్లాడుకోకుందా వదిలేద్దామా" అంది. ఆమె అభిప్రాయం అర్ధమై అతడూ నవ్వుతూ, 'సరే' అని తలూపాడు.

    కానీ చాలా కొద్దికాలం తరువాతే వారు దాని గురించి మాట్లాడుకోవలసి వచ్చింది. చర్చించుకోవలసి వచ్చింది. ఘర్షణ పడవలసి వచ్చింది.


                    *    *    *    *


    అలికిడి అవటంతో తలెత్తి చూశాడు. ఎవరో ఒక జంట గుడిలోంచి బయటకు వస్తున్నారు. 

 Previous Page Next Page