7
ఆకాశం రెండుగా విచ్చుకుని పగిలిన శబ్దం ఉరుమైన వేళ. ఎండ వేడికి పారిపోయిన మేఘాలు పగతీర్చుకుంటున్నట్టు ఒక దాన్నొకటి ఢీకొని మెరుపుల్ని సృష్టిస్తున్న సమయాన -
హోరుమన్న గాలి శబ్దం కృష్టాపురాన్ని చుట్టుముట్టి వూపేస్తూంది.
అదే గ్రామంలో చెరువు ప్రక్కవీధిలో చిన్న పెంకుటింట్లో పెట్రోమాక్సులైటు సాయంతో ఒక పేషంటుతో నానా అవస్థ పడుతున్నాడు డాక్టర్ రంగాప్రసాద్.
రంగప్రసాద్ ఎమ్.ఎస్.
నిజానికి అతడు చదివిన చదువుకి ఆ ఊళ్ళో ప్రాక్టీసు ఏమాత్రం లాభకరం కాదు. కానీ ఒక మంచి ఆశయాన్ని వంటపట్టించుకుని, పల్లె ప్రజలకి సాయం చేద్దామన్న సదుద్దేశ్యంతో ఆ గ్రామంలో ప్రాక్టీసు పెట్టాడు. పక్క ఊళ్ళ నుంచి ప్రజలు వస్తారు. ఏదో సరిపోతుంది....
వచ్చింది ఒక కూలీ. పెళ్ళయి ఆర్నెల్లయింది. నాలుగో నెల. కడుపునొప్పి. బ్లీడింగ్ లతో దాదాపు అపస్మారక స్థితిలో చేతులమీద తీసుకొచ్చారు. చూడగానే అబార్షన్ కేసు అని తేలిపోయింది. ఎవాపోర్టన్ ఇచ్చాడు. నొప్పి తగ్గింది. కానీ స్రావం అలాగే వుంది. క్లాట్స్ పడుతున్నాయి. అయిదు... పది నిముషాలు... అరగంట...
చాలా చిన్న కేసు అనుకున్నది చూస్తూ వుండగానే ప్రమాదకరంగా తయారయింది. అతడికేం చెయ్యాలో పాలుపోలేదు. పేషెంటు తాలూకు వాళ్ళు చెప్పింది నాలుగో నెల అయినప్పటికీ- అది ఆరో నెల అయి వుంటుందనుకున్నాడు.
చివరికి హిస్టరాటమీ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడు. పక్కన నర్సు ఆశ్చర్యంగా చూసింది. బలవంతపు అబార్షన్స్ లో ఎంతో అవసరమైతే తప్ప (కడుపు కోసి) చెయ్యని ఆపరేషన్. ఇంత చిన్న కేసుకి అతడా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని....
ఏ క్షణాన అతడి మనసు చెప్పిందో గానీ, అది సత్ఫలితాన్నే ఇచ్చింది. తల్లి బ్రతికింది.
మరో అరగంట తరువాత ఆపరేషన్ పూర్తయింది. మొహం కడుక్కుని, టీ తాగుతూ మెడికల్ జర్నల్ తిరగేస్తున్నాడన్న మాటేగానీ, డాక్టర్ రంగాప్రసాద్ ఆలోచనలు ఎక్కడో వున్నాయి.
చీలిన కడుపు చర్మపు అడుగునుంచి తన వ్రేళ్ళు బయటకు తీసిన చిన్న కోతిపిల్ల ఆకారంలో సజీవంగా వున్న ఆకృతి-
అదే అతడిని అయోమయంలో పెట్తూంది!
నాలుగు నెలల్లో ఫీటస్ ఆ విధంగా ఎలా అభివృద్ధి చెందింది? పెళ్ళికి ముందే ఆమెకి ఎవరితోనైనా సంబంధం వుందా? ఎందుకో అది నిజమనిపించటం లేదు... బయల్వెడలిన పిండం చివర చిన్న తోక- అదీ అతడిని కలవర పెట్టింది!
తల విదిలించి, మళ్ళీ పుస్తకం చదవటంలో మునిగిపోయాడు.
బయట ఇంకా వర్షం కురుస్తూనే వుంది, చూరుమీద నుంచి కురిసే ధారల్ని చూస్తూ ఒక రైతు కళ్ళని సగంచేసి చుట్ట తాగుతూ తదాత్మ్యతని అనుభవిస్తున్నాడు. అరగంట క్రితం అతడు పంపిన వార్త అలలు అలలుగా వెళ్తూ ఉస్సోక్ సభ్యుల్ని చేరుతుంది.
"అష్టావక్రుడి ఆగమనానికి మొదటి సూచనగా ప్రథమ గర్భుడు ఉద్భవించాడు" అన్న వార్త అది.
* * * *
"అతడు అందగాడు కాదు నాన్నా. డబ్బున్న వాడు కూడా కాదు. బహుశా ఆ రెండే నన్ను అతడికి దగ్గిర చేసినవేమో! రాకేష్ దగ్గిర నేను ఎప్పుడూ ఫ్రీగా ఫీలవలేదు నాన్నా. ఒక అస్పష్టమైన దూరం. బహుశా అది నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సేమో- అది అలానే వుండిపోయింది. అందుకే నాతో సమాన స్థాయిలో వున్న అతడిని వివాహం చేసుకుందామనుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించు".
"నేను కాదంటే-"
"క్షమించు నాన్నా. నా నిర్ణయం మీద నాకు నమ్మకం వుంది".
"గౌరీ! ఏ క్షణమైతే నువ్వు నన్ను కాదని నీ స్వంతగా నిర్ణయాలు తీసుకున్నావో ఆ క్షణం నుంచే ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఈ క్షణం నుంచీ నువ్వు నా కూతురివి కావు, నేను నీ తండ్రిని కాను".
"నాన్నా!"
"లేకపోతే ఏమిటమ్మా ఆ డైలాగులు. ఆ....శీ....ర్వ....దిం....చు!... క్ష....మిం....చు- ఇలాగా మాట్లాడవలసింది? 'నేను ఒక అబ్బాయిని చేసుకుంటున్నాను. నీకా విషయం చెప్తున్నాను' అనాలి అంతే. దట్సాల్. నేను సిద్ధార్థని చూసే అవసరం కూడా లేదు. నా కూతురి నిర్ణయంమీద నాకు ఆ మాత్రం నమ్మకం వుంది. ముహూర్తం కూడా మార్చనక్కర్లేదు".
అతడి అభిమానానికి ఆమె కదిలిపోయింది. కళ్ళనిండా నీళ్ళతో "థాంక్స్ నాన్నా" అంది.
"పోతే రాకేష్ కి ఈ విషయం ఎలా చెపుతావో అది నీకే వదిలిపెడుతున్నాను. చాలా ఆశలు పెంచుకున్నాడు అతడు నీ మీద! నువ్వే నచ్చచెప్పాలి. పెద్ద షాక్ అతడికి".
ఆమె తల వంచుకుని "అలాగే నాన్నా" అంది.
* * * *
"నువ్వు లేని నేను బ్రతకలేను గౌరీ! విషం తాగి చచ్చిపోతాను. ప్రేమ విఫలమైన ప్రేమికులంతా ఏం చేశారు? చచ్చిపోయారు లేక త్రాగుబోతులయ్యారు. నేనూ ఏదో ఒక దారి వెతుక్కుంటాను....."
"రాకేష్!"
"అంటానని ఎందుకు అనుకున్నావ్ గౌరీ! నీకు నిజమైన స్నేహితుడిగా నువ్వేం చేసినా నా కిష్టమే. సిద్ధార్థ చాలా మంచివాడు. నీ నిర్ణయం మంచిదే".
ఆమె అతడి దగ్గిరగా వచ్చింది. "నువ్వు బాధపడటంలేదు కదూ" అని అడిగింది.
అతడు నవ్వేడు. "బాధా- ఎందుకు బాధ? నువ్వు ఆనందంగా వుంటే నాకు బాధ ఎందుకు?" అన్నాడు. ఆమె మొహం విప్పారింది. తేలికైన మనసుతో-
"నాకు తెలుసు రాకేష్. నేను నీకు ఏవిధంగా జోడీని కానని. నీ అందం ముందు ఈ కుంటిపిల్ల ఏమాత్రం సరిపోదు. గంతకు తగ్గబొంతలా...." అంది.
"ష్, ఆ మాటనకు. పోతే రోజూ నిన్ను చూస్తూ, నిన్ను నా భార్యగా వూహించుకోవటం వల్ల అంత తొందరగా ఈ వార్తని జీర్ణించుకోలేకపోయాను. పోతే, ఈ ఇంటినుంచి వెళ్ళిపోవటానికి నాకు కొద్దిగా టైమిస్తావా?" అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా "అదేమిటి" అంది. "ఇంటినుంచి వెళ్ళిపోవటం ఏమిటి?"
"ఈ ఇంటితో ఇక నాకేమీ సంబంధం లేదు అన్న విషయం నాకు తెలుసు. కానీ చెప్పానుగా, మనసు సర్దుకోవడానికి కొంతకాలం పడుతుందని.... కనీసం మీ పెళ్ళయ్యేవరకన్నా నన్ను మీతో వుండనివ్వు".
ఆమెకి దుఃఖం వచ్చింది.
"అంత మాటంటే నా మీద ఒట్టే-" అందామె బలవంతాన ఏడుపు ఆపుకుంటూ. "- నేను నీ మనసు బాధ పెట్టివుంటే నన్ను తిట్టు. అంతే గానీ ఇలా మనసు తూట్లుపడేలా మాట్లాడక. వెళ్ళిపోతాట్ట. వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు మాతోనే వుంటావ్. నాకన్నా అందమైన దాన్నీ, మంచిదాన్నీ చేసుకుంటావు. ఏదీ, అలా అని మాటివ్వు-" అంటూ చేయి సాచింది.
అతడు నెమ్మదిగా దగ్గిరకి వచ్చాడు. ఆమె మొహంలోకి సూటిగా చూశాడు. చేతిలో చెయ్యి వేసి "ఉంటాను. సరేనా" అన్నాడు.
ఆమె మొహం విప్పారింది.
* * * *
ఇది జరిగిన రెండు గంటలకి అతడు మహాదష్ట ముందు నిల్చున్నాడు. పూర్వపు రాకేష్ లా లేడు. అతడి మొహంలో వికృతంగా రాక్షసత్వం-కొట్టొచ్చినట్టు కనబడుతూంది.
"ఇంతకు ఇంతా పగ తీర్చుకోవాలి! ఆరు మూడైనా మూడు ఆరైనా సరే ఈ కార్యం నెరవేరాలి" అరిచాడు.
ఆ గదంతా ధూపం నిండి వుంది. ఏదో కాలిన వాసన వేస్తూంది. అప్పుడే అష్టదేవతార్చన జరిగినట్టుంది. రెడ్ స్కెలిటన్ గా అతడికి ప్రవేశం చాలా సులభంగా దొరికింది. దాదాపు పిచ్చెక్కిన వాడిలా అరిచాడు.
"ఈ రాకేష్ జీవితంలో అనుకున్నది కాకపోవటం ఇదే మొదటిసారి... ఇదే చివరిసారి కూడా కావాలి! ఈ రాకేష్ తల్చుకుంటే దేనికైనా వెనుదియ్యడనేది ప్రపంచానికి అర్ధం కావాలి... ఇంతవరకూ వూరించి, పెళ్ళి శుభలేఖలు అచ్చయ్యే సమయంలో కాదంటుందా! చేతికి అందాల్సిన కోట్ల ఆస్థి చివరి క్షణంలో చేజారిపోతుందా? దేన్ని చూసుకుని ఆ కేదారగౌరి ఇంత మిడిసిపాటు పడుతుందో? ఆ ఒద్దికా నెమ్మదీ భయంవల్ల దూదిపింజెల్లా ఎగిరిపోవాలి! అనుక్షణం ఆమె భయంతో వణికిపోవాలి!!! తొమ్మిది నెలలపాటూ నానా కష్టాలు అనుభవించి, తొమ్మిది నెలలు పూర్తయ్యాక- భర్తతోపాటూ పురిట్లోనే చావాలి!
అంటే.... అష్టావక్రుడు ఆమె కడుపున జన్మించాలి..
ఆమెను చంపి అష్టావక్రుడు ఈ భూమ్మీదకు రావాలి!
రాగానే ఆమె భర్తను చంపాలి!!
రాకేష్ కి జరిగిన అన్యాయానికి ఉస్సోక్ ఈ విధంగా సాయం చేయాలి! ఇదే నా కోర్కె... ఇదే నా కోర్కె!!"
అతడి కంఠం గది గోడలమధ్య ప్రతిధ్వనిస్తూంది.
రాకేష్ ఆవేశంతో రొప్పుతున్నాడు. అతడి మొహం వికృతంగా వుంది. ఆ క్షణం అతడిని చూసిన వారెవరూ అతడొ కాలేజి స్టూడెంటు అనుకోరు. క్షుద్రగణాధిపతుల అనుంగు సహచరుడైన రెడ్ స్కెలిటన్ లాగానే వున్నాడు.
"అష్టావక్రుడి జన్మం కోసమే ఉస్సోక్ వేచి వుంది రాకేష్! అంతే తప్ప కావల్సిన చోటున గర్భాన్ని పండించేట్టు చేయటం ఉస్సోక్ కి తెలీదు"
"కాష్మోరా అనుచరులకి తెలియని అంశం అంటూ ఏదైనా వుంటుందని నేననుకోను..."
"కానీ నీ కోరిక చాలా పెద్దది!"
"నాకు తెలుసు. కానీ నా పగ ఎలాటిదో కూడా ఉస్సోక్ కి తెలుసు".
మహాదష్ట అతడివైపు సాలోచనగా చూశాడు. అతడి పట్టుదల సడలదని నిశ్చయించుకున్నాక, తల వూపుతూ "సరే రాకేష్! కృష్ణాపురపు పైరుల్లో భస్మాన్ని చల్లి ఉస్సోక్ కి ఉపకారం చేసిన కారణంగా నీకు మేము ఈ తిరుగు సాయం చేస్తాము. కానీ ఉన్నమాట చెప్పనీ! మనకి కావలసిన గర్భాన అష్టావక్రుడిని ప్రతిష్టాపించటం ఎలాగో నాకు తెలీదు. అది తెలిసిన వాడొకడే వున్నాడు....."
"ఎవరు?"
"విషాచి".
రాకేష్ ఛివుక్కున తలెత్తి చూశాడు. మహాదష్ట చెప్పటం కొనసాగించాడు. "కాలగర్భాన కలిసిపోయిన మహా మాంత్రికుడు విషాచి! అతడికే తెలుసు ఈ రహస్యం. ఆఖరుకి దార్కాకి కూడా తెలీదు. కాద్రా, దార్కా, విషాచి ముగ్గురూ ఒకే ఆశయం గురించి మరణించారు- కాష్మోరా ఒక పాపని బలి తీసుకుని, విజృంభించి, విశ్వవాప్తమవకుండా శ్రీధర్ అనేవాడు బీజాక్షరాలు రాసిన కర్రతో కొట్టి చంపాడు".*
-రెండోసారి మన వంశీకుడే దార్కా తనే కాష్మోరాని బంధనం చేసి తత్పలితంగా రక్తం కక్కుకుని మరణించాడు.**
-ఇపుడీ మూడోసారి కాష్మోరా ఆగమనాన్ని ఎవరూ అరికట్టలేరు. అప్పుడే మొదటి గర్భుడు ఉద్భవించాడు కూడా".
"నిజమా? ఎక్కడ" అని అడిగాడు రాకేష్ విస్మయంగా.
"ఈ ఊరిలోనే. డాక్టర్ రంగప్రసాద్ ఆస్పత్రిలో".
_____________________________________________________________
* తులసిదళం చదవండి
* * తులసిదళం చదవండి