అధ్యాయం - 2
నాలుగేళ్ళు గడిచాయి. కాలనీ మధ్య నాటిన మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. కాలనీలో వున్న అమ్మాయిలు కూడా బాల్యంనుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో వున్నారు.
"ఊరికే బయట అలా గ్రౌండ్ లో తిరగకండి. ఇంట్లోనే వుండండి" అని తల్లులు ఆంక్షపెట్టడం మొదలయింది. అలా ఎందుకు చెబుతున్నారో అర్థంకాని వయసు పిల్లలది. "ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అమ్మ ఎందుకు అలా అరుస్తోంది. తిరిగితే ఏమవుతుంది" అని మనసులో తిట్టుకుంటున్నారు.
వాళ్ళ కర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఆలోచన చాలామంది తల్లిదండ్రులకి లేదు. ప్రీతమ్ కి కానీ, అతని చెల్లెలు వరూధినికి కానీ అలాంటి బాధల్లేవు. వాళ్ళ స్వేచ్ఛను అరికట్టాలన్న ప్రయత్నం రుక్మిణి కానీ, కృష్ణమూర్తి కానీ ఎప్పుడూ చేయలేదు.
"వరూధిని లేమ్మా! స్కూలుకి ఆలస్యమవుతోంది" నాయనమ్మ నాలుగోసారి వచ్చి లేపింది. వరూధిని బద్దకంగా కదిలింది. నిజానికి ఆమె నిద్రపోవడంలేదు. గతరాత్రి చూసి వచ్చిన సినిమా తాలూకు లవ్ సీన్స్ పునశ్చరణ చేసుకుంటోంది.
"నువ్వెళ్ళు నానమ్మా. నేను లేస్టాలే" అంది విసుగ్గా దుప్పటిలోంచి.
"టైమ్ ఏడయిపోయింది. ఇక నీ యిష్టం మళ్ళీ వురుకులూ, పరుగులూ పెడతావు" అని హెచ్చరించి వెళ్ళిపోయింది. అనసూయమ్మ.
"ఛ! మంచి కలల్లో వుండగా పాడుచేస్తుంది నానమ్మ" అని మళ్ళీ కళ్ళు మూసుకుని దిండు గుండెలకి ఆన్చుకుని బోర్లా పడుకుంది వరూధిని. గతరాత్రి సినిమా చూసి వచ్చిన దగ్గరనుంచి ఆమె ఈ లోకంలో లేదు. ఆమెకి ఆ హీరో అంటే ఎంతో ఇష్టం.
"వరూధిని ఇంకా లేవలేదా" ఈసారి తల్లి అరిచిన లేచి బాత్ రూంలోకి పరిగెత్తింది.
అద్దంలో ఎదురుగా ప్రతిబింబం, రేగిపోయి మొహాన పరుచుకున్న నల్లటిజుట్టు. కళ్ళకిందకి జారిన కాటుక, పక్కకి కదిలిపోయిన బొట్టు.....ఎంత అందంగా వుంది! ఆ హీరోయిన్ కంటె తనే బాగుంది.
వరూధినికి తనకు తానే ముద్దొచ్చింది. టవల్ తీసి నైటీమీద పైటలా పరచుకొని , మిగతా సగం తలమీద ముసుగులా వేసుకొని చూసింది. ఆ ఫోజు మరీ బావుంది. గతరాత్రి సినిమాలో చూసిన పాటను సన్నగా విజిలేయసాగింది.
"వరూధిని లా విజిలేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అసలు నువ్వు ఆడపిల్లవేనా" పక్కరూంలోంచి అనసూయమ్మ కంఠం వినిపించింది. వరూధిని వళ్ళు మండింది. "ఏం వేస్తే తప్పేమిటి" అని గట్టిగా అరుద్డామనుకొని మళ్ళీ ఎందుకనో మానేసింది. ప్రీతమ్ పొద్దున లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునేవరకూ యింట్లో గట్టిగా విజిల్ వేసుకుంటూనే తిరుగుతాడు. అతనిని ఎవరూ ఏమీ అనరు. కానీ తనని మాత్రం ఈ నాయనమ్మ ఎప్పుడూ వేయికళ్ళతో పరిశీలిస్తూ హెచ్చరిస్తుంటుంది. ఆ విషయంలో తల్లే నయం. ఎప్పుడూ తననే సపోర్ట్ చేస్తుంది.
"...... నీవంటే నాకు ఇదయ్యో. పందెం నీ అంతుచూస్తా పదయ్యో" విజిలేసుకుంటూ వంటింట్లోకి వచ్చి కాఫీ తాగటం మొదలుపెట్టింది. తాగటం పూర్తిచేసి తన గదిలో కొస్తూ చూసిందతడ్ని. పేపర్ అడ్డం పెట్టుకుని దొంగచూపులు చూస్తున్నాడు.
వరూధిని గుండె ఝల్లుమంది దాదాపు పరిగెడుతున్నట్లు తన గదిలోకి నడిచింది. అతడు వరసకి మామయ్య అవుతాడు. ఊరినుంచి వచ్చిరెండ్రోజులే అయింది. వచ్చినప్పటినుంచీ ఇలాగే చూస్తున్నాడు. రాత్రి సినిమాకి అతను కూడా వచ్చాడు.
ఆ హీరో అంత బాగా కాకపోయినా మనిషి బావుంటాడు. పేరు కూడా రజనీకాంత్ అట. వీటన్నింటికన్నా ముఖ్యంగా తనని ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాడు. అదీ వరూధినికి తృప్తినిచ్చిన విషయం.
అల్మారా దగ్గర ఏదో పనున్నట్టు గదికి అడ్డంగా నడుస్తూ మళ్లీ ద్వారంలో నుంచి హాల్లో కూర్చున్న అతడిని చూసింది. తనను చూడటానికే ఆమె అలా నడిచిందని గమనించినట్లు సన్నగా నవ్వాడు. సోఫాలో వెనక్కివాలి ఈసారి పక్కనుంచి చూస్తున్నాడు. మళ్ళీ ఏదో పనున్నట్లు వంటింటిలోకి వెళ్ళింది. ఆమె తెలియకుండానే నడకలో వయ్యారం చోటు చేసుకుంది.
టైమ్ అవుంతుండంతో గబ గబ స్నానం ముగించి స్కూల్ యూనిఫాం వేసుకుంది. నైటీలోకంటే యూనిఫాంలో తనింకా బావుంటుంది. బ్యాగ్ తీసుకొని హడావుడిగా బయటకెళ్తోంటే సడన్ గా అడ్డొచ్చాడు రజనీకాంత్. తూలి పడబోతున్న ఆమెను పట్టుకొని ఆపాడు.
వరూధిని వళ్ళు ఝుల్లుమంది. ఏదో సినిమాలో యిలాగే జరుగుతుంది.
'..... అబ్బ ఆ స్పర్శ ఎంత బావుంది. వంట్లో కరెంట్ ప్రవహిస్తున్నట్టుంది' అనుకుంది. ఊహించుకోవటంలో కంటే ప్రాక్టికల్ గా వుండే ఆనందం మొట్టమొదటిసారి తెలిసింది. "సారీ" అని వదిలేశాడు. వరూధిని బయటికి పరిగెత్తింది. మధ్యాహ్నం వరకూ స్కూల్లో ఆమెకి అతడి గురించిన ఆలోచనలే. మూడింటికి ఆమె స్కూల్ నుంచి వచ్చేసరికి అతను లేడు. దిగులుగా అనిపించింది. యూనిఫాం తీసేసి తన కిష్టమైన ఎరుపు రంగు చుడీదార్ వేసుకుంది. అద్దంలో చూసి తల సవరించుకుంటుంటే తలుపు దగ్గర అలికిడయింది. తల తిప్పిచూస్తే రజనీకాంత్. అతడి మొహం దిగులుగా వుంది.
"ఈ రాత్రే వెళ్ళిపోవాలట. మానాన్న టిక్కెట్లకోసం వెళ్లాడు" అన్నాడు.
"ఊ.........." అంది దిగులుగా. చేతికందిన ఆనందం జారిపోతున్న బాధ.
"ఇవ్వాళకూడా నిన్ను సినిమాకి తీసుకెళదామనుకున్నాను. నీకు ఆ హీరో అంటే చాలా ఇష్టమట కదా!"
వరూధిని కళ్ళు తడి అయ్యాయి. తనకో హీరో ఇష్టమంటే అతని పట్ల అసూయపడకుండా ఆ సినిమాకి తీసుకెళతాననటం ఎంత త్యాగం! అంటే ఇతను తనని ప్రేమిస్తున్నాడన్నమాట. తనకోసం త్యాగం కూడా చేయదలుచుకున్నాడు. తనెంత అదృష్టవంతురాలు.
ఆలోచనల్లో అతను దగ్గరగా వచ్చి నిలబడటం గమనించలేదు. ఆ చేరువ ఆమెకి ఇబ్బందిగానూ, ఇష్టంగానూ వుంది.
"వరూధిని, నువ్వు చాలా బాగుంటావ్" అన్నాడు మెల్లగా. వరూధిని సిగ్గుతో తల దించుకుంది? ".......నువ్వంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు చేతిలో చేతిని తీసుకుంటూ.
ఆమెకి అంతకుముందు చూసిన సినిమా గుర్తొచ్చింది. హీరో అడగ్గానే హీరోయిన్ ఒప్పుకోగూడదు. ముందు "నో" అనాలి. కొంతకాలం బతిమాలించుకొని, అతను కాళ్ళా వేళ్ళా పడ్డాక ఏదో ఒక ఉదాత్త సంఘటన జరిగాక అప్పుడు తన అంగీకారం తెలపాలి! ఇదంతా కాకపోతే, కనీసం అతను ప్రపోజ్ చేసి తను 'నో' అన్నాక, కొంతకాలం తనవైపు దీనంగా, తన అంగీకారం కోసం దూరంనుంచి మౌనంగా చూస్తూ నిలబడాలి. అప్పుడు తనకి జాలేసి "యస్" అనాలి.
కానీ వరూధిని అంతకాలం ఆగలేకపోయింది. అసలు "నో" అనడానికి ఆమె మనసు అంగీకరించటంలేదు. ఆమె అలాగే నిలబడి వుంది. అతడు చేతిని తన చేతిలోకి మళ్ళీ తీసుకొని గట్టిగా నొక్కుతూ "ఐ లవ్ యూ" అన్నాడు.
"నన్ను ప్రేమిస్తున్నావా?" అడిగింది అమాయకంగా.
"ఊ! చాలా గాఢంగా! అసలు నిన్ను వదిలి వెళ్ళాలనిలేదు" అన్నాడు.
"మరి వుండిపోవచ్చుగా?"
"మా నాన్న ఊరుకోడు. కాలేజీ కూడా తెరిచాడు".
వరూధిని మాట్లాడలేదు. అతడి స్పర్శ ఆమెని వివశురాల్ని చేస్తూంది.
"మరి నీ గుర్తుగా నాకేమిస్తావ్?" అని అడిగాడు.
"నా దగ్గిరేముంది ఇవ్వడానికి".
"ఒక ముద్దిస్తావా." మెల్లగా అడిగాడు. వరూధిని "నో" అందామనుకుంది. అనేలోపుగానే అతను దగ్గరగా వచ్చాడు. అతడి శ్వాస ఆమె బుగ్గలమీద వెచ్చగా తగుల్తూంది. వరూధిని కళ్ళు గట్టిగా మూసుకుంది.
'ముద్దు! ఎలా వుంటుంది? ఇవ్వనంటే బాధపడతాడేమో, ఏం చెప్పాలి' అనుకునేలోపుగానే అతడి పెదవులు ఆమె బుగ్గని స్పృశించాయి. ఆమె అప్రయత్నంగానే దూరంగా జరిగింది. అతడు కూడా మొహం వెనక్కి తీసుకొని "ఏం కోపమొచ్చిందా? నీకిష్టం లేకపోతే వద్దులే. బలవంతంచేయను" అన్నాడు.
అతని త్యాగానికి ఆమె కదిలిపోయింది. "నాకు సిగ్గేస్తోంది బాబూ" అని రెండు చేతుల్లో మొహం దాచుకొంది. గతరాత్రి సినిమాలో హీరోయిన్ అలాగే చేసింది.
అతడు రెండు చేతులని తన చేతులతో పట్టుకొని దూరంగా విడదీశాడు. మొహంమీదకు వంగి పెదాలమీద ముద్దుపెట్టుకున్నాడు. అదేదో మత్తు. ఏం జరుగుతుందో తెలియటంలేదు. తీయటి స్పర్శ శరీరమంతా ప్రవహిస్తున్నట్టు గమ్మత్తుగా వుంది. అతడు ఈసారి ఆమె భుజాల చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కొని పెదాలమీద మళ్ళీ గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి అతడి నాలుక ఆమె కింద పెదవిని నెమ్మదిగా స్పృశించింది. అతడి చెయ్యి ఆమె భుజం చుట్టూ తిరిగి ముందుకొచ్చింది.
"ఎవరదీ?" అనసూయమ్మ స్వరం విని చటుక్కున వదిలేశాడు. గబ గబా పక్కరూంలోకి వెళ్ళిపోయాడు.
వరూధిని భయంతో వణికిపోయింది. నానమ్మ చూసేసింది. ఇప్పుడెలా?
తనేం చెప్పాలో ఇంకా తెలుసుకునే లోపుగానే అనసూయమ్మ గదిలోకొచ్చింది. ఆవిడ చూపులు గదినంతా పరికించి చూస్తున్నాయి. రజనీకాంత్ ఎప్పుడో బైటకి చెక్కేశాడు.
"ఎవరే ఇప్పుడు నీ గదిలోంచి వెళ్ళింది. ప్రీతమ్ కాదుగా" అనుమానంగా అడిగింది. అప్పుడు గమనించింది వరూధిని, ఆవిడ కళ్ళకి కళ్ళజోడు లేకపోవటం. కళ్ళజోడు లేకుండా అనసూయమ్మ ఏమీ చూడలేదు. ప్రస్తుతం దానికోసమే వెతుకుతోంది. వరూధిని టేబుల్ మీదున్న కళ్ళజోడు తీసి ఆవిడికి అందించింది.
నాయనమ్మ చూడలేదని నిర్థారణ కాగానే వరూధిని ధైర్యం వచ్చింది.
"ఎవరొస్తారు నా గదిలోకి. రజని వచ్చి అన్నయ్య వున్నాడా?" అని అడిగి వెళ్ళిపోయాడు అంది. అతనిపట్ల తనకెలాంటి ఇంట్రెస్ట్ లేనట్లు.
"రజనీయా? సరిగాకనిపించలేదులే. అయినా పెద్దదానివవుతున్నావ్. పరాయి మగపిల్లలకి దూరంగా వుండాలి" అని చెప్పి వెళ్ళిపోయిందావిడ.
పరాయి మగవాళ్ళకెందుకు దూరంగా వుండాలో సన్నిహితంగా వుంటే వచ్చే ప్రమాదమేమితో ఆవిడ ఎప్పుడూ విడమర్చి చెప్పలేదు. ఆవిడేకాదు, ఈ ప్రపంచంలో ఏ తల్లీ, ఏ తండ్రీ, ఏ అమ్మమ్మా, ఏ నాయనమ్మా విడమర్చి చెప్పరు.
విడమర్చి చెప్పకపోవటం చిన్నపిల్లల దురదృష్టం.
రుక్మిణి అయితే ఆ విషయాలు కూతురితో మాట్లాడదు. స్వేచ్ఛగా వదిలేస్తే కూతురే అన్నీ తెలుసుకుంటుందని అనుకుంటుందామె. అయితే ఆ వయసు రాకముందే చిన్నపిల్లల్లో కుతూహలం, మానసిక ఒంటరితనం వుంటాయని రుక్మిణిలాంటి తల్లులు తెలుసుకోలేరు.
'అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి తిరిగితే ఏం నష్టమో?! పెద్దళ్ళకి మరీ ఛాదస్తం' అని నవ్వుకుంది వరూధిని.
స్త్రీ, పురుషుల సంబంధం అంటే కేవలం ప్రేమ. ఈ ప్రేమలో ఆనందం, కోపం, అలక, విరహం (దీని అర్థం వరూధినికి సరిగా తెలీదు) ఇవన్నీ ప్రసర్శించుకోవాలి. అప్పుడే ఈ ప్రేమ గాఢతరమౌతుందని చూసిన సినిమాల ద్వారా అంచనా కొచ్చింది వరూధిని
ప్రేమలో పడ్డ ఈ రెండు రోజులుగా ఎంత ఎక్సైటింగ్ గా వుందో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. ప్రతిక్షణం అవే ఆలోచనలు. ఆ దొంగ చూపులు...... మూగ సంభాషణలు............ రహస్య సమావేశాలు.......... ఇవన్నీ జీవితాంతం పదిలపరచుకోవల్సిన అందమైన అనుభవాలుగా ఆమెకు తోస్తున్నాయి. ఇంతకాలం తన జీవితం ఎంత నిరర్ధకంగా వుందో ఆమెకు అర్థమవుతోంది. అంతేకాదు, ఆ కాలనీలో వున్న ఆడపిల్లలందరికన్నా ఎంతో ఎత్తుకి ఎదిగిపోయానన్న భావన ఆమె మనసులో చోటు చేసుకుంటోంది మిగతా వాళ్ళందరిపట్ల ఒక రకమైన జాలి కూడా ఏర్పడింది.