Previous Page Next Page 
ధ్యేయం పేజి 8


    "మీ అబ్బాయికి \అమ్మాయికి ఇష్టమైన రంగేది?"

    చచ్చు ప్రశ్న. వాడికున్నన్ని బట్టలు ఈ కాలనీలో ఏ పిల్లలకీ వుండవు. దాదాపు అన్ని రంగుల బట్టలూ వున్నాయి కాబట్టి వాడికన్ని రంగులూ ఇష్టమే' అని వ్రాశాడు.

    'పిల్లవాడికి ఇష్టమైన పుస్తకం?"

    "ఎన్ సైక్లోపీడియా, బ్రిటానికా" అని వ్రాస్తున్నప్పుడు మాత్రం గర్వంగా ఫీలయ్యాడు. ఆ సమాధానం మాత్రం కరెక్టుగా వ్రాసినట్టు అతనికి నమ్మకం కుదిరింది.

    మొత్తం ఇరవై ప్రశ్నలలో పదిహేనింటికి అతను సరిగ్గా ఆన్సర్ చెయ్యలేకపోయాడు. కాగితాలన్నీ కౌసల్య పోగుచేసి తీసికెళ్ళింది.

    భోజనాల దగ్గర ఏర్పాట్లు చేస్తున్న దశరధ్, కొడుకు దగ్గరకొచ్చే సరికి తలత్రిప్పి చూశాడు. రామూ మొహంలో సంతోషంలేదు.

    "ఏం జరిగింది బాబూ, కారమ్స్ ఫైనల్లో పోయిందా?" అని అడిగాడు.

    "లేదు పప్పా. గెలిచాను. చెస్ కూడా ఫైనల్ ఆడాలి" అన్నాడు.

    మరింకేం. ఆడు. అదీ గెలుస్తావ్" అన్నాడు దశరధ్.

    "అదికాదు పప్పా, ఎవ్వరికీ ఆడటం సరిగ్గా రాదు. ఈజీగా గెలుస్తున్నాను. అదే బాధగా వుంది" అన్నాడు రాము.

    "ఆటలెవరికీ సరిగ్గా  రావనుకుంటాను. ఏం చేస్తాం" అన్నాడు దశరధ్.

    "అవినాష్ రాలేదు వాడైతే బాగా ఆడతాడు. వాడితో పోటీపడి గెలిస్తే బావుంటుంది".

    "అరే, ఎందుకు రాలేదు? వాళ్ళమ్మనడిగావా?"

    "అడిగాను, వాళ్ళే వద్దని చెప్పారట. ఇంట్లో చదువుకుంటూ కూర్చున్నాడంట".

    "అలాగా, అయితే నేనడుగుతానులే వుండు" అంటూ అవినాష్ తల్లి దగ్గరకెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. మొహం అదోలా పెట్టి కొడుకుని పిలిపించటానికి ఒప్పుకున్నాడు శంకరం. రామూ ఉత్సాహంగా పరిగెత్తుకు వెళ్ళాడు.

    "ఇంటికి తాళం జాగ్రత్తగా వేయండి" అని వెనకాల నుంచి అరిచింది పార్వతి.

    ఆ తరువాత వంటపనులు చూస్తున్నాడన్న మాటేగాని దశరధ్ శంకరం కుటుంబం గురించే ఆలోచించసాగాడు. అవినాష్ కి నిజంగా మంచి తెలివి తేటలున్నాయి. చెస్ బాగా ఆడతాడు. డిసెంబర్ ముప్పయ్ ఒకటవ తేదీ రాత్రి ఇలా పిల్లలు, పెద్దలు అందరూ ఒకచోట చేరినపుడు కూడా ఒక పిల్లవాడిని ఇంట్లో వుంచి చదువుకోమంటే అతని మానసిక స్థితి ఎలా వుంటుంది? అని బాధపడ్డాడు.

    ఈ లోపులో అతడి దృష్టి ప్రీతమ్ మీద పడింది. ప్రీతమ్ సునీత పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. సునీత  విరగబడి నవ్వుతోంది. దశరధ్ కళ్ళు తిప్పుకున్నాడు. ఇంతలో దూరంనుంచి రామూ పరిగెత్తుకు రావటం కనిపించింది. "పప్పా .....పప్పా" అని అరుస్తున్నాడు.

    "ఏమిటి రామూ? ఎందుకలా భయపడుతున్నావ్?" దశరధ్ కంగారుగా అడిగాడు.

    "పప్పా! మరేమో అవినాష్....... చచ్చిపోయాడు".

    "అవినాష్ చచ్చిపోవడమేమిటి? ఏం మాట్లాడుతున్నావ్?" గట్టిగా అరిచాడు దశరధ్. అందరూ దగ్గిరకి వచ్చేశారు.

    "అవును పప్పా! అవినాష్ చచ్చిపోయాడు" ఏడుస్తున్నాడు రాము.

    క్షణంలో అక్కడ పరిస్థితి మారిపోయింది. దాదాపు అందరూ శంకరం ఇంటివైపు పరిగెత్తారు. ముందు గదిలోనే ఒకమూల కుప్పలా పడివున్నాడు అవినాష్. గదంతా చిందర వందరగా వుంది.

    శంకరం, అతని భార్యా పెద్దగా ఏడుస్తున్నారు. పిల్లలందరూ బిక్కమొహాలు వేసుకున్నారు. జరిగిన దుర్ఘటన తాలూకు తీవ్రత వాళ్ళకింకా అర్థంకాలేదు.

    ఒక మూల పడివున్న టిక్ 20 బాటిల్ చూడగానే జరిగింది అర్థమైంది దశరధ్ కి.

    అతడు చుట్టూ వున్న వాళ్ళను దాటి ముందుకెళ్ళాడు. అవినాష్ ని  మెల్లగా లేవనెత్తి సరిగా పడుకోబెట్టాడు. అవినాష్ లో ఎక్కడా చలనం లేదు. చెయ్యిపట్టుకుని నాడి చూశాడు. బలహీనంగా ఎక్కడో అతి మెల్లిగా కొట్టుకుంటూంది. దశరధ్ మొహం కాస్త వికసించింది. "ప్రాణం వున్నదింకా? త్వరగా కారు తీసుకురండి. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి" అన్నాడు.

    "నా కారు పంక్చరయింది" అన్నాడు శంకరం బిక్కమొహంతో.

    "నేనిస్తాను" అనలేదు విశ్వేశ్వర్ కేసులు, పోలీసులు, ఆసుప్రతి జంఝూటం అంతా అతనికిష్టం లేదని అతని మొహమే చెబుతోంది. దశరధ్ అతని మీద నుంచి చూపు తిప్పుకున్నాడు. అంతలో పక్కనుంచి "నా కారు తీసుకెళ్ళండి బాబూ" అన్న స్వరం వినపడింది. అది కిరాణాకొట్టు యజమానిది. పార్వతి ఎప్పుడూ అసహ్యించుకొనే కిరాణా కొట్టు యజమాని అతను. దశరధ్ ఎందుకో అప్రయత్నంగా పార్వతివైపు చూశాడు. కొడుకు పరిస్థితి చూసి ఆమె కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తోంది.

    పదిహేను నిమిషాల్లో అవినాష్ ని ఆస్పత్రిలో చేర్పించటం జరిగింది.

    దశరధ్, శంకరం, ఆస్పత్రి కెళ్ళారు.

    అవినాష్ కి అలా అయిందన్న బాధకన్నా ప్రోగ్రాం అప్ సెట్ అయిందన్న బాధ చాలామందిలో కనిపిస్తోంది. శ్రీ లక్ష్మి ధాత్రిని తీసుకొని రుస రుస లాడుతూ  ఇంటి కెళ్ళిపోయింది. "ఎందుకొచ్చిన ప్రోగ్రాంలు ఇవి? వద్దంటే విన్నారా!" అని దూరం నుంచి ఎవరో అనుకుంటూ వెళ్ళటం వినబడింది.

    కౌసల్య పిల్లల్ని పరికించి చూసింది. వాళ్ళ భోజనం టైందాటింది. ఎవరింట్లోనూ వండలేదు. ఇప్పుడు వీళ్ళని పస్తు పడుకోబెట్టడం న్యాయంకాదు. అక్కడున్న చాలామంది యిళ్ళకి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నారు.

    కౌసల్య కొందరు పెద్దపిల్లల్ని పిలిచింది. "అవినాష్ కి ఏం కాదు. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు ఆస్పత్రినుంచి ఫోన్ చేశారు. మనందరం కలిసి చిన్నపిల్లలకి భోజనాలు పెడదాం. అన్నీ సిద్ధం చేయండి" అని చెప్పింది. అందరూ హుషారుగా ముందుకొచ్చి పనులు మొదలుపెట్టారు.

    భోజనం చేసేముందు అవినాష్ కి నయం కావాలని పిల్లలచేత ప్రార్ధనలు చేయించింది కౌసల్య.


                         *    *    *

    "వాడు బతికి బయటపడితే నీ కొండకు వస్తాం, తలనీలాలు సమర్పించు కుంటాం. వాడ్ని బతికించు తండ్రీ" పార్వతి ఆపరేషన్ ధీయేటర్ బయట నిలబడి మొక్కుకుంటోంది.

    వరండాలో నిలబడి వున్నారు దశరధ్, శంకరంలు. శంకరంలో మునుపటి ఉత్సాహం లేదు "ఒకసారి పనిష్ మెంటిస్తే దారికి వస్తాడనుకున్నాను. కానీ ఇలా చేస్తాడనుకోలేదు" అన్నాడు.

    "జరిగిపోయినదానికి ఇప్పుడు విచారించి లాభంలేదు. మీరు ఇంట్లో తిట్టి, అక్కడ టీచర్ తిట్టి.... ఇలా రెండువైపుల నుంచీ వచ్చిన తాకిడికి తట్టుకోలేకపోయినట్లున్నాడు" అన్నాడు దశరధ్. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చాడు. "నేను చేయగలిగిందంతా చేశాను. మరో రెండు గంటలు గడిస్తేకానీ చెప్పలేను" అన్నాడు.

    ముగ్గురూ గదిలోకి వెళ్ళారు. గదిలో అవినాష్ బెడ్ మీద వున్నాడు. ఆక్సిజన్ పెట్టారు. మనిషి ఎగిరెగిరి పడుతున్నాడు. చచ్చిపోయాడనుకున్నవాడు ప్రాణంతో వున్నాడని తెలియగానే ఏదో సంతోషం, ఆశ. కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుకోవడం కళ్ళారా చూస్తే తట్టుకోవడం కష్టం.

    ఆస్పత్రి చాలా ఎత్తుగా కొండమీద వుంది. అందులో వాళ్ళున్నది మూడో అంతస్తు కాబట్టి అక్కడి నుంచి సిటీ అంతా కనిపిస్తుంది. దశరధ్ కిటికీలోంచి బయటికి రోడ్లన్నీ సందడిగా వున్నాయి. ఔట్లు పేలుతున్నాయి. రాత్రి పన్నెండు గంటలు అవుతుండే  సరికి అందరిలోనూ ఉత్సాహం. బాణాసంచా కాలుస్తున్నారు. తారాజువ్వలు పైకెగురుతున్నాయి.

    దగ్గరలో వున్న చర్చిలో గంటలు మోగసాగాయి. రాత్రి పన్నెండు గంటలయినట్టు కింద ఎవరో "హేపీ న్యూ ఇయర్" అని గట్టిగా అరుస్తున్నారు. కాలం ఆగదు. సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు, నిమిషాలు అని తనని తాను  విభజించుకోదు. క్షణం అడుగులో అడుగులేసుకుంటూ నిరంతర స్రవంతిలో కదిలిపోతూనే వుంటుంది. మైలురాళ్ళలాగ సంవత్సరాలు వెనక్కి దొర్లుతూనే వుంటాయి. ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలూ అన్నీ మనుషులు నిర్మించుకునేవే. కాలానికి అదంతా అనవసరం. చేసిన ఘోరాల్నీ, నేరాల్నీ కాలం మీదకి నెట్టి తృప్తిపడేది మనిషే,

    .....గదిలో అలజడి వినిపించి లోపలికెళ్ళాడు దశరధ్. అవినాష్ చిన్నగా మెదుల్తున్నాడు. ఆక్సిజన్ ట్యూబ్ లయబద్దంగా కదులుతోంది. "హి ఈజ్ అవుటాఫ్ డేంజర్" అన్నాడు డాక్టర్ సంతోషంగా.

 Previous Page Next Page