Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 9

   

     పైగా ఏదన్నా విషయం మొదలుపెడితే దాని ఆరా తేల్చుకుంటున్నట్లుగా, ఒకటే తోముడు. కుమార్ ప్రక్కన కంచం పెట్టించుకుని కూర్చుని, ఆయనకి కూడా ఇష్టమైన గోంగూరపచ్చడి మూడుసార్లు వేయించుకుని తింటూ 'కూరగాయలూ, కారూ' అనే అంశంమీద తరచితరచి తిట్టాడు. కుమార్ కి మాత్రం మొదటిసారి కలుపుకున్న గోంగూరపచ్చడి ముద్ద చేతిలో అలాగే మిగిలిపోయింది.
   
    మరోసారి బంధువుల ఇంట్లో పెళ్ళికని అతని తల్లి పిల్లలతో బందరు బయల్దేరింది. ఆవిడకి కారెక్కాలన్న మనసు లేనేలేదు. రైల్లోగానీ, బస్సులోగానీ పోదామనుకుంది. రంగారావుగారు తన ప్రాక్టీస్ పోతుందని రానన్నాడు. ఎ కళనున్నాడో గానీ కారేసుకెళ్ళండన్నాడు. ఆయన వేసుకెళ్ళమన్నప్పుడు వద్దంటే అది అహంభావమవుతుంది. ఆయనకు వల్లమాలిన కోపం వస్తుంది. అందుకని తల్లి ఏమీ అనలేక పిల్లలతోబాటు కారెక్కి కూర్చుంది.
   
    ఆయన కారు కదలబోతుండగా డోర్ దగ్గరకు వచ్చి నిలబడి "ఇదిగో అక్కడ పెళ్ళిలో కారు వాళ్ళూ, వీళ్ళూ అడిగారని నీ సొంతకారులా అందరినీ ఎక్కిస్తే ఊరుకోను తెలిసిందా? పెళ్ళికొడుకుని తిప్పతానికని, దానికనీ అడుగుతుంటారు. కొంతమందికి కారు కనిపిస్తే ఒళ్లూపైనా తెలీదు. లేని పనులుకూడా పుట్టుకువస్తాయి. అర్ధంలేని మొహమాటాలకి పోయి అడ్డమైన వాళ్ళనీ కారులో ఎక్కించబోక. ఈ కారు నాదికాదు మా ఆయనదని చెప్పు. తెలిసిందా?" అంటూ పదేపదే హెచ్చరించాడు.
   
    పెళ్ళిలో తల్లి అనుభవించిన చిత్రవధ పిల్లలు కళ్ళారా చూశారు. పెళ్ళివాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా 'ఎందుకూ? మన శారదమ్మ కారు వుందిగా' అంటూ రావటం, ఆవిడ తప్పించుకోవటానికి సమాధానాలు చెప్పలేక సతమతమయిపోవటం - ఆ రెండురోజులూ పరమయాతనగా గడిచిపోయాయి.
   
    ఒకసారి తను సాయంత్రం అయిదు గంటలకు స్కూల్ నుంచి వచ్చి గదిలో వంటరిగా కూర్చుని తల్లిపెట్టిన టిఫిన్ తింటున్నాడు. ఇంతలో తండ్రి క్రిందనుంచి అతన్ని కేకేయడం వినిపించింది. టిఫిన్ తినడం ఆపి గబగబ క్రిందికి వెళ్ళాడు.

    "బయటికి పోదాం రా. కారెక్కు" అన్నాడు తండ్రి.
   
    అతను టిఫిన్ తింటూ మధ్యలో వచ్చాడేమో బాగా ఆకలిగా వుంది.
   
    "ఎక్కడికండీ?" అన్నాడు బిక్కచచ్చిపోయి.
   
    "ఎక్కడికయితేనేం, నోరుమూసుకుని ఎక్కు" అని తండ్రి గద్దించాడు.
   
    కుమార్ మారుమాట చెప్పకుండా కారు వెనుకసీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. రంగారావుగారు వచ్చి హుందాగా స్టీరింగ్ ముందు కూర్చుని కారుని ముందుకు దూకించాడు.
   
    కుమార్ కి అర్ధమయింది - తననెందుకు రమ్మన్నాడో! ఆరోజు డ్రైవరు రాలేదు. ఆయన కేసులు చూడటానికి వెడుతున్నాడు. కారుకు ఎవరూ కాపలా లేకుండా రోడ్డుమీద వదిలిపెట్టి పోవటం ఆయనకు ఇష్టంలేదు. అందుకని కాపలాగా తనని తీసుకెళుతున్నాడు.
   
    అట్లాంటి కారణానికి తనని తీసుకువెళ్ళటం కుమార్ కి చాలా అసభ్యమని పించింది. కోపాన్నీ, దుఃఖాన్నీ దిగమ్రింగి ఊరుకున్నాడు.
   
    "అవునూ, ఎక్కమనగానే కారెక్కకుండా ఎక్కడికో ఏమిటో అని ఈ అజలన్నీ ఎందుకు, ఇవన్నీ నీకు చెప్పాలా?" అన్నాడు తండ్రి దారిలో.
   
    "నేను టిఫిన్ చేస్తూ మధ్యలో వచ్చాను" అని చెప్పాలని నోటిదాకా వచ్చింది. కానీ అహంలాంటిదేదో అడ్డువచ్చి జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు.
   
    కాలేజీ చదువులోకి వచ్చాక ఈ కారుసమస్య అతన్ని మరింత పీడించసాగింది. అతని స్నేహితుల్లో కారున్న కొందరు దర్జాగా కారులో వస్తూండేవారు కాలేజీకి. కొందరు తామే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవారుకూడా. కుమార్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాడు. దానికతనికేమీ బాధలేదు. తన తండ్రి డాక్టరు కాబట్టి కారుతో ఆయనకెప్పుడూ అవసరం వుంటుందని అతనికి తెలుసు. కానీ కాలేజీలో సభలూ, సమావేశాలూ జరిగినప్పుడు ఒకోసారి కాలేజీ లెక్చరర్లు కూడా అతన్ని పిలిచి, మీకు కారుందికదా! ఈరోజు స్పీకర్ని స్టేషన్ నుంచి ఇక్కడకు తీసుకురావాలి అనో, ఫలానావారిని కారులో పంపిస్తే బాగుంటుందనో చెప్పి కారు తెమ్మని అడిగేవాళ్ళు అతనికి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లు వుండేది. తనకి తండ్రి కారివ్వడు అని చెప్పడానికి మొహమాటపడి ఆ రోజు డ్రైవరురాలేదు అనో, కారు షెడ్ కి వెళ్ళిందనో కుంటిసాకులు చెప్పి తప్పించుకునేవాడు.
   
    కారుకి ఓ రిక్షావాడు అడ్డుగా వచ్చాడు. డ్రైవరు చాకచక్యంగా తప్పించాడు గానీ లేకపోతే చిన్న యాక్సిడెంటు అయేది.
   
    "ఏరా కళ్ళు కనబడటంలేదా?" అని ఉరిమాడు డ్రైవరు రిక్షావాడ్ని.
   
    "నీకు కనబడటంలేదా?" అని రిక్షావాడు బదులుగా ఉరిమాడు.
   
    "కారు మెయిన్ రోడ్డుమీదినుంచి వస్తుంటే సైడురోడ్డుమీదనుంచి వచ్చే రిక్షా ఆగక్కరలేదా?"
   
    "నీది కారైతే ఎవడికి గొప్ప? గాడిదగుడ్డు" అని రిక్షావాడు నిర్లక్ష్యంగా త్రొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
   
    రంగారావుగారు కొడుకుతో అన్నాడు. "చూశావా వాడి పొగరు? వాడ్ని అడిగేవాడు లేడు. వాడితో దెబ్బలాటకి దిగామనుకో, మన పరువే పోతుంది. కారులో తిరిగేవాడిమీద అక్కసుకొద్దీ మాట్లాడినట్లుగా మాట్లాడతారు చుట్టూ మూగినవాళ్ళు.
   
    తండ్రి అన్నదాంట్లో నిజం లేకపోలేదు. కానీ ప్రతిరోజూ కారులో పోతున్నప్పుడు ఇలాంటి తంతులు ఎన్నో జరగటం, ఆయన ఇలాంటి సంభాషణే చెయ్యటం వినిపించి అతనికి ఓ రకమైన ఎలర్జీ పట్టుకుంది. ఆయన ఇటువంటి సంఘటనల గురించి వ్యాఖ్యానించకుండా పట్టించుకోనట్లు ఊరుకుంటే బాగుండునని అతనికనిపిస్తుంది. అలా ఊరుకుంటే అతనికిష్టం.
   
    ఓ సినిమాహాలు దగ్గర ఆరోజే విడుదలయిన మార్నింగ్ షో చూడ్డానికని జనం క్యూలో నిలబడి టిక్కెట్లు ఎప్పుడిస్తారా అని ఆత్రంగా నిరీక్షిస్తున్నారు.
   
    "ప్రెషస్ టైమ్ ని వీళ్ళెలా దుర్వినియోగం చేస్తారో చూస్తూంటే నాకాశ్చర్యంగా వుంటుంది. మన పన్లు మనం చేసుకునేందుకు టైం సరిపోకుండా వుంటే వీళ్ళకి సినిమాలు చూడటానికి టైమెక్కడ్నుంచి వచ్చిందో నాకర్ధంకాదు."
   
    రోడ్డుమీద కనిపించిన ప్రతి దృశ్యాన్నిగురించీ కామెంటుచేయటం ఆయన కలవాటు. ఇదీ పాత డైలాగే విని విని తల బొప్పికట్టింది కుమార్ కి.
   
    కానీ అల అని వినిపించుకోనట్లు ఊరుకుంటే కుదరదు. ఈ మాటలు ఏ స్నేహితుడో వల్లిస్తుంటే నోర్ముయ్యరా బాబూ!" అని గదమాయించవచ్చు. తండ్రిముందు కొడుకు అంటే లెక్కచేయనట్లు ముఖంపెట్టవచ్చు. కానీ కొడుకు ముందు తండ్రిఅనటం కాబట్టి వినిపించుకోనట్లు నిరక్ష్యం ప్రదర్శిస్తే అవిధేయథా అవుతుంది. తల ఊపటమో, చిరునవ్వు నవ్వటమో, ఊ, ఆ లాంటివి అంటూ వుండటమో చేస్తూ వుండాలి.
   
    అవన్నీ కుమార్ చేస్తూనే వున్నాడు. తన తండ్రిచేసే వ్యాఖ్యానాలు ఒక్కొక్కటీ ఇదివరకు ముప్పై నలభై సార్లయినా వినివుంటాడు. అయినా ఆవేళ మొదటిసారి వింటున్నట్లు భంగిమలు ప్రదర్శించటానికి ప్రయత్నిస్తున్నాడు.
   
    ఒకచోట గారడీవాడు ఏదో గారడి చేస్తుంటే చుట్టూ అరవై డెబ్బైమంది జనం వలయంలా ఏర్పడి వినోదం చూస్తున్నారు.
   
    "మనదేశంలో ఎంతమంది సోమరిపోతులున్నారో చూడు. బ్రిడ్జిమీదనుంచి కాలువలోకి పిల్లలు దూకి ఈత కొడుతుంటే అది చూడటానికి పోగవుతారు. ఎవరో పిచ్చివాడు రోడ్డుమీద బొమ్మలు వేస్తుంటే అది విడ్డూరంగా చూస్తూ పదిమందీ గుమిగూడతారు. ఎవరో గ్రుడ్డివాడు బుల్ బుల్ మీద పాట వాయిస్తుంటే విచిత్రంగా చూస్తూ నలుగురూ చుట్టుముడతారు. వీళ్ళకి టైమెలా వుంటుందో, ఆ అబిరుచి ఏమిటో వాళ్ళకే తెలియాలి. లేజీ ఫెలోస్...."
   
    కుమార్ తల ఊపుతున్నాడు.
   
    కారు డిస్పెన్సరీ దగ్గరకు వచ్చి ఆగింది. తండ్రి అటువైపునుంచి దిగాడు. కుమార్ ఇటువైపునించి దిగి తలుపువేశాడు.
   
    "డోర్ అంత గట్టిగా వెయ్యకూడదు. త్వరగా పాడయిపోతాయి. ఊరికినే ప్రెస్ చేస్తే చాలు" అన్నారు రంగారావుగారు.
   
    కుమార్ మనస్సు చివుక్కుమంది. మాట్లాడకుండా లోపలకు నడిచాడు.
   
    అప్పటికే ఏడెనిమిది మంది పేషెంట్సు వరకూ వెయిట్ చేస్తున్నారు.

 Previous Page Next Page