Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 8

   

    దారికి అడ్డంగా వస్తున్న రిక్షావాళ్ళనీ, రోడ్డుమధ్యగా నిలబడి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నంత తేలిగ్గా, కులాసాగా మాట్లాడుకుంటూన్న మనుషుల్ని, నిగనిగలాడే కార్లమీద గీతల్నో, నొక్కులనో పెట్టక మానమన్నట్లు మీదిమీదికి వస్తున్న ఎడ్లులాగే టైరుబళ్లనూ, సెంటర్లలో, లేక ఎక్కడపడితే అక్కడ లేకపోతే తమకు మంచి బిజినెస్ జరుగుతుందన్న చోట నిర్లక్ష్యంగా ఆపేసిన సిటీబస్సులనీ, రోడ్డుమధ్యగా ఆపేసి తమగురించి ట్రాఫిక్ ఆగిపోయినా సంబంధం లేదన్నట్లు లోడు దింపుకోవటమో, లేక నింపుకోవటమో చేస్తున్న లారీలనూ కష్టంమీద తప్పించుకుంటూ ముందుకు పోతున్నది కారు. సమయం చూసుకుని వీలయినప్పుడు రావ్ డ్రైవింగ్ చేసిపారేస్తున్నాడు డ్రైవరు.
   
    రంగారావుగారు నిర్మొహమాటంగా మాట్లాడటంలో ప్రసిద్దులు. ఇంట్లోనూ, బయటా, భార్యాపిల్లలతోనూ, బంధుమిత్రులతోనూ నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు.
   
    "నెమ్మదిగా పోనియ్యి, అయిదునిముషాలు ఆలస్యంగా పోయినంతమాత్రాన కొంప మునిగిపోయిందేం లేదు" అన్నాడు.
   
    "ఆ మాత్రం జోరు చూపించకపోతే ఈ ఊళ్ళో డ్రైవ్ చెయ్యలేం అయ్యా!" అన్నాడు డ్రైవరు.
   
    "ఈ కారు నీదా? నాదా?" అన్నాడు రంగారావుగారు.
   
    డ్రైవరు తెల్లబోయాడు.
   
    "నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నా ఇష్టప్రకారం డ్రైవ్ చెయ్యి. నీ ఇష్టప్రకారం కాదు. నాకు డ్రైవింగ్ వచ్చు, నా ముగ్గురు కొడుకులకూ డ్రైవింగ్ వచ్చు. మాకు డ్రైవర్ అవసరంలేకుండానే మేమే కారు డ్రైవ్ చేసుకోగలం. మాకు పనులమీద తీరదుకాబట్టి మీలాంటి వాళ్ళని పెట్టుకోవటంగానీ......."
   
    ఈ మాటలు ఇదివరకు పనిచేసిన ఎంతోమంది డ్రైవర్లతో తండ్రి అనగా కుమార్ విన్నాడు. అనటమేగానీ తన కొడుకుల్ని డ్రైవ్ చెయ్యమనటంగానీ, డ్రైవర్ రానప్పుడు కారు కొడుకుల్ని బయటకు తియ్యమనటంగానీ ఎప్పుడూ చూడలేదు.
   
    అసలీ కారు - ఈ కారంటే ఈ కారని కాదు - తండ్రి కారు ఆయనకెలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో తెలియదుకానీ తన జీవితానికి మాత్రం ఓ భూతంలాగానే పరిణమించింది.
   
    తను స్కూలుఫైనలు చదువుతున్నప్పుడుగావును, తండ్రి మొట్టమొదటిసారిగా కారుకొన్నాడు. అంతకుముందాయన జట్కాబళ్లమీదా, రిక్షాలమీదా తిరుగుతూ వుండేవాడు.
   
    ఆకుపచ్చరంగు పోర్టీ అపెక్టు కారది. చాలా చిన్నది. కొన్నరోజు మాత్రం భార్యనూ, పిల్లలనూ అందులో ఎక్కించుకుని త్రిప్పాడు. గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించాడు. పూజారి మూడు నిమ్మకాయలు మంత్రించి కారుముందు తీగతో కట్టించాడు.
   
    అంతే, ఆ తర్వాత తనుగానీ, ఇంట్లో మిగతావాళ్ళుగానీ కారు ఎక్కడం గగనమైపోయింది. తండ్రితో ఎక్కడికైనా పోయినప్పుడు తప్ప, తల్లికూడా బజారు పనిమీద వెళ్ళినప్పుడు రిక్షాలమీద వెడుతుండేది. కారు తండ్రి ఒక్కడే ప్రాణప్రదంగా వాడుకునేవాడు.
   
    తనకు కారు ఎక్కాలనీ, అందులో తిరగాలనీ మహా మోజుగా వుండేది.
   
    షెడ్ లో వున్నప్పుడు కారులో ఎక్కికూర్చుని, ఆ సోఫాల మెత్తదనాన్ని అనుభవిస్తూ, అందులోవున్న మీటల్ని ఆసక్తిగా చూస్తూ మధురానుభూతి ననుభవిస్తూ వుండేవాడు.
   
    ఒకసారి తండ్రి అతన్ని పిలిచాడు 'ఏమిటీ? చీటికీమాటికీ వెళ్ళి కారులో కూర్చుంటున్నావు? ఏం చేస్తున్నావక్కడ?'
   
    కుమార్ కు భయంతో నోట మాటరాలేదు. కొయ్యబారిపోయి చూస్తున్నాడు.
   
    "చెప్పు, మాట్లాడవేం? అందులో స్విచ్చులూ అవీ లాగి పాడుచేస్తున్నావా?" కుమార్ లేదన్నట్లు తల ఊపాడు.
   
    "పధ్నాలుగువేలు పోసి కొన్న కారది. ఆషామాషీగా వచ్చింది కాదు. ఇహమీదట ఎప్పుడయినా పనిలేకుండా కారులోఎక్కినట్లు తెలిసిందా ఊరుకోను."
   
    అతన్ని కారు అప్పట్నుంచీ భయపెట్టటం మొదలుపెట్టింది.
   
    స్నేహితులు ఎప్పుడూ రాపాడుతూ వుండేవాళ్ళు. కారుంచుకుని స్కూలుకు నడిచివస్తావేమనీ, కారులో తమనెప్పుడూ ఎక్కించుకుని త్రిప్పవేమనీ వేపుకు తినేవాళ్ళు, వాళ్ళందరికి డొంక తిరుగుడు సమాధానాలు చెప్పలేక తలప్రాణం తోకకు వచ్చేది.
   
    ఓ ఆదివారం తల్లి బజారుకు వెళ్ళి కూరలు తీసుకురమ్మంది. డబ్బులూ, సంచీ పట్టుకుని బయటకు వస్తూండగా గేటుముందు అందంగా మెరుస్తూన్న కారు కనిపించింది. కారెక్కాలన్న ప్రలోభాన్ని నిగ్రహించుకోలేకపోయాడు.
   
    అప్పట్లో తమ డిస్పెన్సరీ, ఇల్లూ కలిసేవుండేవి. మేడమీద కాపురం, క్రింద డిస్పెన్సరీ.
   
    తను లోపలికి తొంగిచూసేసరికి తండ్రి ఎవర్నో పరీక్షచేస్తూ కనిపించాడు. ఆయన ఇవతలకొచ్చేవరకూ ఆగి భయంభయంగా, పూడుకుపోయిన గొంతుతో "అమ్మ కూరలు తీసుకురమ్మన్నదండీ.....కారులో వెళ్ళొస్తాను" అన్నాడు.
   
    ఆయన ఏమనుకున్నారో ఒక్కక్షణం పాటు కొడుకు ముఖంలోకి చూసి 'వెళ్లిరా' అన్నాడు.
   
    అతను ఏనుగెక్కినంత సంతోషంతో గబగబ బయలుదేరి వచ్చి కారెక్కాడు.
   
    యజమాని దగ్గరలేనప్పుడు డ్రైవర్లు యజమాన్ల పిల్లల్ని తృణీకారంగా చూస్తారు. ఒట్టి పుణ్యానికి ఏ పరాయివాడి పిల్లల్నో తీసుకువెడుతున్నట్లుగా విసుగు, నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. పైగా అది ముట్టుకోవద్దనీ, ఇది ముట్టుకోవద్దనీ, తలుపు గట్టిగా వెయ్యొద్దనీ గదమాయిస్తూ వారికి తామే యజమాన్లమయినట్లుగా ప్రవర్తిస్తారు.
   
    కుమార్ కి కూడా డ్రైవర్నిచూస్తే తండ్రి తర్వాత ఆ డ్రైవరె యజమాని అన్న భవం కలుగుతూ వుండేది.
   
    మధ్యమధ్య డ్రైవరుచేత చివాట్లు తింటూ కూరలు కొని సంచినిండా పట్టుకొచ్చాడు.
   
    పన్నెండుగంటల వేళ తనకిష్టమైన గోంగూరపచ్చడి, వేడివేడి అన్నంలో కలుపుకుని భోజనంచేస్తుండగా తండ్రి పైకివచ్చాడు. వస్తూనే దుశ్సాసనుడిలా విజ్రుంబించాడు.
   
    "ఏరా! కూరలు తేవడానికి నీకు కారు కావల్సివచ్చిందా? పేషెంట్లతో వున్నప్పుడు అడిగితే, వాళ్ళందరిముందూ ఏమనటం బాగుండదని వేసుకెళ్ళమన్నాను. అసలు కూరలు తేవడానికి కారెందుకు? అదేమయినా గొప్పనుకున్నావా? లేకపోతే షోకా? నీ వయస్సులో నేనేమన్నా కారుల్లో తిరిగానా? డాక్టరునయాక పాతికేళ్ళు ప్రాక్టీసుచేశాక ఇప్పుడు తిరుగుతున్నాను కార్లలో ఏం? కారులో తిరగందే తోచదా? నడిచిపోయి వచ్చేదానివి. మూడురూపాయల కూరాలకి కారులో వెళ్ళివస్తే పెట్రోలు ఎంత కాలుతుందో తెలుసా? అసలు కారెందుకు కావాల్సివచ్చింది చెప్పు.....?" అంటూ తగులుకున్నాడు.
   
    అన్నం తింటున్న కుమార్ చెయ్యి అలాగే నిలిచిపోయింది.
   
    ఆయన బట్టలు మార్చుకువచ్చి ప్రక్కనే కంచం పెట్టించుకుని కూర్చుని మళ్ళీ మొదలుపెట్టాడు. రంగారావుగారిలో ఓ విచిత్రమైన గుణంవుంది. చాలామందికి కోపం వచ్చినప్పుడు తిండిధ్యాస మరచిపోవటమో, తినే తిండి ఆపేసి కంచం విసిరికొట్టి లేచిపోవటమో, తినకుండా భీష్మించటమో-ఇవన్నీ చేస్తారు. రంగారావుగారికి కోపం ఎక్కువైనప్పుడు ఆకలికూడా ఎక్కువవుతుంది. పెళ్ళాంమీద కోపంవచ్చి తిడుతున్నప్పుడు కూడా 'వెధవమొహం వేసుకుని అలా నిలబడక అన్నం తగలెయ్యి, ఆ కూర కొంచెం అఘోరించు, పులుసు పోసి చావు' అంటూ ఒళ్ళు తూట్లుపడేటట్లు తిట్లప్రవాహం కురిపిస్తూనే అధరువులన్నీ మరీ మరీ అడిగి వేయించుకు తింటూ వుంటారు.

 Previous Page Next Page