లోపలకు వచ్చాక తండ్రి 'చూశావా, అప్పుడే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో? అంటే నీకర్ధమయిందా? నువ్వు ఇంట్లో టిఫిన్ తింటున్న టైముకి అప్పుడే నీకోసం కొంతమంది ఇక్కడ కాచుకుకూర్చున్నారన్నమాట' అన్నాడు.
కుమార్ మనసు కలుక్కుమంది. తండ్రిచేసే పరిశీలనలో కొన్ని నిజాలు వున్నా వికృతంగా ధ్వనిస్తాయి అతనికి. నిజమయినంత మాత్రంచేత అన్నీ బయటకు చెప్పాలని లేదు. చెప్పకపోవటంలో వున్న మాధుర్యం చెప్పటంలో లేదు.
తండ్రీ కొడుకులు మాట్లాడుకోవాల్సిన విషయాలు, ఆ పద్దతులు వేరు. అలాగే ఇద్దరు స్నేహితులు, స్నేహితురాండ్రు, భార్యాభర్తలు, తల్లీ కొడుకులు, తల్లీ కూతుళ్ళు, అన్నదమ్ములు - మాట్లాడుకునే విషయాలూ, పద్ధతులూ వేరు వేరుగానే వుంటాయి. అవి అతిక్రమిస్తే మామూలుతనం లోపించినట్లుగా వుంటుంది.
అతను సెన్సిటివ్. అందుకని తండ్రి కారుడోర్ గురించి అన్నమాట చిన్నది అయినా, అతన్లో ఇంకా కంపరం రేపుతూనే వుంది.
ప్రతి చిన్నవిషయమూ ఆయనలా ఎందుకు పట్టించుకుంటాడో అర్ధంకాదు కుమార్ కు. కొడుకుకూడా సంపాదనాపరుడయాక, తనంతటి వాడయాక కొడుకులోని కొన్ని విషయాలు తనకు ఇష్టంలేనివిగా కనిపించినా వాటిని బయటకు వ్యక్తపరచకూడదు - అతని దృష్టిలో, వ్యక్తపరచి సాధించేది లేదు.
అతనికి టెలిఫోన్ రిసీవర్ కుడిచేత్తో చెవిదగ్గర పెట్టుకుని ఎడమచేత్తో డయల్ చెయ్యటం అలవాటు;. ఒక్కొక్కసారి టేబిల్ మీది ఏ బాల్ పెన్నో తీసి దాంతోనే డయల్ రింగు త్రిప్పేస్తాడు.
నిజానికి అందులో వ్యాఖ్యానించడానికేమీ లేదు. కానీ రంగారావుగారి దృష్టిలో అది పడగానే 'అలా చేయటం పద్దతికాదు' అన్నాడు. కుమార్ వినీ విననట్లు ఊరుకున్నాడు.
మరోసారి ఎడంచేత్తో డయల్ చేస్తుంటే ఆయనచూసి 'నువ్వు లెఫ్ట్ హేండర్ వి కాదుకదా? ఎందుకు ఎడంచేత్తో త్రిప్పుతావు?" అని అడిగాడు.
కుమార్ కి తిక్కరేగింది. "నేనేచేత్తో త్రిప్పితే మీకెందుకు?" అని ఎదిరిద్దామనుకున్నాడు.
కానీ తమాయించుకుని 'దానివల్ల నష్టమేముంది?' అన్నాడు పొడిగా.
"నష్టమేంకాదు. ఎడంచేత్తోనేకాదు, ఎడమ కాలితోకూడా త్రిప్పవచ్చు. కాలితోనే కాదు-ఇంకా దేనితోనైనా త్రిప్పవచ్చు. కానీ చూడటానికి అసహ్యంగా వుంటుంది.. అందుకని...ఆఁ సరే, ఇందాక ఏమిటి చెబుతున్నావు, చెప్పు?"
కుమార్ చెప్పదలుచుకున్నది ఎప్పుడో మరచిపోయాడు. మరచిపోక పోయినా అప్ సెట్ అయిపోయివున్న అతని నోట్లోంచి అప్పటికింక మాటలు ఊడిపడవు.
మరోసారి కుమార్ ఎవరో పేషెంటుతో 'మీ పాపకి అజీర్ణంగా వుందికదా? అది తగ్గేవరకూ పాలు చిక్కగా ఇవ్వకండి. లైట్ మిల్క్ ఇవ్వండి' అన్నాడు.
ఆ ప్రక్కనే వున్న రంగారావుగారి చెవుల్లో ఆ మాటలుపడ్డాయి. ఆ పేషెంటు వెళ్ళిపోగానే ఆయన 'కుమార్! ఒకసారి... మాట.....' అని లోపలి గదిలోకి తీసుకెళ్ళాడు.
"ఏంలేదు, ఇప్పుడు చెప్పకపోతే తర్వాత మరచిపోతానేమోనని ఇప్పుడే పిలిచాను. ఇంతకుముందు నువ్వు ఆ పేషెంటుతో మాట్లాడుతుంటే విన్నాను. లైట్ కాఫీ, లైట్ టీ అంటాముగానీ లైట్ మిల్క్ అనము. డైల్యూటెడ్ మిల్క్ అనాలి. ఏంలేదు, ఇప్పుడే నిన్ను కరెక్టు చేయకపోతే చాలామందితో ఇలాగే మాట్లాడే ప్రమాదముంది కదా అని....."
కుమార్ నిరుత్తరుడై నిలబడిపోయాడు.
కుమార్ తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు. అతని గదీ, అతని తండ్రి గదీ వేరు వేరుగా వుంటాయి. ఎవరి గదుల్లో వారు కూర్చుంటారు.
కాంపౌండరు వచ్చి 'పేషెంట్లను పిలువమంటారా?' అన్నాడు.
"పిలు" అన్నాడు కుమార్.
కాంపౌండరు వెళ్ళి బయట హాల్లో కూర్చున్న వాళ్ళలో ఎవర్నో పిలిచాడు. ఒక నిముషం గడిచాక బలహీనంగా కనిపిస్తూన్న ఓ నడివయసు మనిషి లోపలకు వచ్చాడు.
"కూర్చోండి" అన్నాడు కుమార్.
ఆ మనిషి ఎదురుగుండా వున్న కుర్చీలో కూర్చుని కుమార్ వంక అనుమానంగా చూస్తున్నాడు.
"చెప్పండి?" అన్నాడు కుమార్.
"మీరు.....రంగారావుగారేనా?" అనడిగాడు వచ్చినాయన.
కుమార్ కి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది.
"కాదు, వారబ్బాయిని" అన్నాడు. 'వారబ్బాయిని' అంటూంటే అతని గొంతు ఆ మాట అనటం ఇష్టం లేదన్నట్లుగా ధ్వనించింది.
"నాకు వారు కావాలండీ, మీరుకాదు" అన్నాడాయన ముఖంమీద కొట్టినట్లుగా.
కుమార్ ఒక్కక్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత కాంపౌండర్ని పిలిచి 'ఈయనకి నాన్నగారు కావాలిట. అక్కడికి తీసుకువెళ్ళు' అన్నాడు.
కాంపౌండరు రంగారావుగారు వున్న గదిలోకి వెళ్ళి చూసివచ్చి 'పెద్ద డాక్టరుగారు ఎవరితోనో మాట్లాడుతున్నారండీ' అన్నాడు.
"అయితే అంతవరకూ ఈయన్ని బయటహాల్లో కూర్చోమను. ఇంకొకర్ని పిలువు" అన్నాడు.
వచ్చిన పేషెంటు కుమార్ వైపు ఓసారి అదోలా చూసి బయటకు వెళ్ళిపోయి కూర్చున్నాడు.
ఈసారి ఓ యువకుడు లోపలికి వచ్చాడు.
"కూర్చోండి" అన్నాడు కుమార్.
"నేను మీ నాన్నగారికోసం వచ్చానండీ!" అన్నాడా యువకుడు.
కుమార్ కి ముఖం ఎర్రబడిపోయింది. ఆవేశాన్నణచుకుని "ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు. అయాక పిలుస్తారు. మీరు అప్పటిదాకా దయవుంచి బయట కూర్చోండి" అన్నాడు.
"అలాగేనండి" అని ఆ యువకుడు బయటికి వెళ్ళిపోయాడు.
కాంపౌండర్ని పిలిచి కుమార్ చడామడా తిట్టాడు. 'నువ్వు పనిలోచేరి అయిదారు నెలలైంది. ఏ పేషెంటు ఎవరికోసం వస్తాడో కనుక్కోలేవు. నీ తెలివి తక్కువతనంవల్ల నా పొజిషన్ ఆక్వర్డ్ చేసేస్తున్నావు. చచ్చిపోయిన కాంపౌండర్ నరసింహానికి ఆ ఒడుపులన్నీ తెలుసు. ఎవరికేం కావాలో, ఎవరికెలా సమాధానం చెప్పాలో అన్నీ తెలుసు. మీరూ వున్నారు ఎందుకు? ఉండటానికి ముగ్గురు వున్నారు. ఒక్కడికీ ఒడుపు తెలీదు. వెళ్లు, వెళ్ళి నేను చూసేవాళ్ళు అటు ఆడవాళ్ళలోగానీ, ఇటు మగవాళ్ళలోగానీ వుంటే తీసుకురా.
కాంపౌండరు తన గారపళ్ళు బయటపెట్టి ఒకసారి నవ్వి యజమాని చెప్పిన పని నిర్వర్తించడానికి వెళ్ళాడు.
బయటినుంచి అతనిగొంతు స్పష్టంగా వినిపిస్తోంది.
"మీరెవరికోసమండీ? పెద్ద డాక్టరుగారికోసమా....మీరండీ? మీరూ పెద్ద డాక్టరుగారి కోసమే?...."
తర్వాత అతను ఆడవాళ్ళ హాల్లోంచి "ఏమ్మా! మీరు పెద్ద డాక్టరుగారితో చూపించుకుంటారా? చిన్న డాక్టరుగారితో చూపించుకుంటారా? పెద్ద డాక్టరు గారితోనా?....ఏమండీ మామ్మగారూ! మీరూ?....పెద్ద డాక్టరుగారే చూడాలంటారా?...."